చదరంగంలో పావు

వంశీ కలుగోట్ల // ... చదరంగంలో పావు //
ముందు మాట:   
ఈ రచనలోని పాత్రలు, అంశాలు కేవలం కల్పితాలు మాత్రమే ఎవరిని ఉద్దేశించినవీ కావు. ప్రతి రాజకీయ పార్టీ రైతులు అంటే కేవలం ఎలక్షన్స్ టైం లో పనికొచ్చే పావులుగానే పరిగణిస్తోంది. రాజకీయ చదరంగంలో పావుగా మారిపోయిన/మిగిలిపోయిన రైతు వ్యధని వ్యక్తీకరించటానికి చేసిన చిన్న ప్రయత్నం ఇది. అంశం పెద్దది, కానీ చిన్న కథగా ముగించాలని ముందే నిర్ణయించుకోవడంతో పరిధిమేరకు కుదించుకోవాల్సివచ్చింది. 
**********************************************************************************

            సంకురేత్తిరి పండగొత్తన్నాది, ఊరంతా సంబరంగా ఉంది. కూతుళ్ళని, అల్లుళ్ళని పిల్సుకుని పండగ మస్తుగా సేస్కోనీకి అందరు తయారవుతున్నారు. ఊరందరూ ఈసారి పెద్దరెడ్డి ఎడ్లు పందెంలో గెలస్తయా లేదా అని పందాలు కాసుకుంటన్నారు. మా ఇంట్ల మాత్రం పండగలెక్క లేదు ... ఉన్న ఒక్క కూతుర్ని పిలవాలంటే అల్లుడు ఏమడుగుతడో అని భయం. పిలవకపోతే పిల్ల బాధపడతని దుఖం. అందుకే ఈ మద్దెన పండగలు, పబ్బాలోత్తన్నాయంటే సంబరానికంటే ఎక్కువ భయమైతాంది.మూడేళ్ళ కాట్నించి సంవత్సరం తిరిగే నాటికి అప్పు పెరుగుతాంది గాని పంట దిగుబడికి గిట్టుబాటయ్యే ధర రావట్లేదు. శెట్టి కాడ కొత్త అప్పు తీస్కుందమంటే 'ఇంతకు ముంగల దీస్కున్న దానికి వడ్డీ కట్టనీకే కింద మీద బడ్తన్నవ్ కొత్త అప్పెందుకురా' అంటూ ఈసడించుకుంటడు. బాంకుల అప్పు తీస్కున్డమంటే ఆల్లు కూడ పాత అప్పు దీరిస్తే గాని కొత్తది ఇయ్యమంటరు. యాడ సచ్చేదిరా దేముడా అనిపిస్తాది. అప్పులిమ్మని సెట్టికి, బాంకులోల్లకి; వాన కురిపించమని దేమునికీ మొక్కీ మొక్కీ సేతులు పడిపోతాన్నాయి తప్ప ఉపయోగం కన్పిస్తలెదు.
ఇట్టాంటి సమయంలోనే ఎలచ్చన్లు ఒచ్చినయ్. ఆ పార్టీ ఆయన, ఈ పార్టీ ఆయన కాట్నించి మా పెద్దరెడ్డి వరకు అందరు రైతులకు అది సేత్తం ఇది సేత్తం అని జెప్పిన్రు. బ్యాంకు అప్పులు మాఫ్ చేస్తమని చెప్పిన్రు. యే మూలనో కూసింత ఆశ కలిగింది. మొత్తానికి ఎలెచ్చన్లు అయిపోయి రైతుల అప్పులు మాఫ్ జేస్తమని ఆ పార్టీ వొళ్ళు గెలిచినారు. అప్పటి యాల్నించి ఇయ్యాల, రేపు అంటూ ఇంకా అప్పులు మాఫ్ జేస్తలేరు. ఓ రెండు వారాల కింద పెద్దరెడ్డి అందరినీ పిల్సి అప్పులు దఫ దఫాలుగా మాఫ్ జేస్తరు, మనకు ఇంటికే లెటర్లు వస్తయ్ అని సెప్పినాడు. అప్పట్నించి పోస్ట్ మాన్ యాకూబ్ ఎప్పుడు మా యీధికి వచ్చినా మా ఇంటికాడికి వచ్చి ఏదైనా జాబు ఇస్తాడేమోనని ఆశగా ఎదురు సూస్తంటిమి. మొన్నటేల పక్క యీధిల ఎంకటేసు గానికి జాబు వచ్చిందంట వాడికి ఉన్న లచ్చ అప్పులో యాబై వేలు మాఫ్ అయినదంట. ఆడికి ఈ సంవత్సరం పంట గూడా బాగా పండింది, అదృష్టం బాగుంది ఎంకటేసు గాడికి అనుకున్నం.
            ఇయ్యాల మధ్యాన్నం పొలంల పని జేస్కుంటంటే నా ఇంటిది (భార్య) పరిగెట్టుకుంటా వచ్చింది. ఏందా అని అదుగుదమనుకునెలొపల దాని సేతిల జాబు కన్పడింది. బ్యాంకు అప్పు మాఫ్ అయిందని జాబు వచ్చిందేమో అని ఆశ కలిగింది. నా పెళ్ళాం ముఖంలో ఆ జాబులో ఏముందో తెల్సుకోవాలని శానా తొందర కనపడతాంది. దానికి సదువు పెద్దగా రాదు. బస్సు మీద బోర్డు లాంటి పెద్ద అచ్చరాలని కూడబలుక్కుని సదుకునె మాత్రం వస్తది. నేను దాని మీద కొంచం మేలు, ఐదో తరగతి దాక సదివిన. ఇంగిలీసు కూడా కూసింత కూడబలుక్కుని సదవగలను. ఆ జాబు తీసి సదివిన. గవర్నమెంట్ కాడ్నించే అది, బ్యాంకు అప్పు మాఫ్ గురించే. కాని ఏందిది? నాకున్న అప్పెంత, మాఫ్ ఐన్దెంత? నాకు సరిగ్గా కన్పడ్తలేదా లేక సదవనీకి వస్తాలేదా? సుబ్బారావు మాస్టర్ కాడికి తీస్కెళ్ళి సదియించుకొవాలె. అట్నించి ఆటే సుబ్బారావు టీచర్ కాడికి ఎల్లినాం.

"సారూ. ఈ జాబు కాస్త సదివి అందులో ఎం రాసుందో యివరంగా సెప్పు సారూ; మావాయనకి సరిగ్గ కన్పిస్తన్నట్టు లేదు" అంటూ మా ఇంటిది జాబుని సారుకిచ్చింది.

"ఒరేయ్ సాయన్నా నీకున్న మొత్తం అప్పులో రెండు రూపాయలు మాఫీ అయ్యిందని ఈ ఉత్తరంలో ఉందిరా"
"సారూ సరిగ్గా సూడు సారూ ఏమన్నా అంకెల్లో అచ్చు తప్పు పడిందేమో, కింద అచ్చరాల్లొ ఏమన్నా రాసినారేమో మల్లి ఒకసారి సూడు సారూ" ఎందుకో తెలియదు గొంతు వణికింది మాట్టాడుతూంటే.

            సుబ్బారావు మాస్టారు మరొక్కసారి ఉత్తరం ఆసాంతం సదివి ఆ జాబులో 'ఉన్న అప్పు మొత్తానికి రెండు రూపాయలు మాఫీ అయిందని' మాత్రమె ఉందని తేల్చి చెప్పాడు. ఎన్నోఆశలు పెట్టుకుంటే ఇట్టా అయ్యింది కదరా దేముడా అనుకున్నా నా ఇంటిది అయితే రాగాలు ఏడుపు కూడా మొదలెట్టింది. "ఊరుకోయే ఇప్పుడేమైందని? మనమేమన్నా అళ్ళు మాఫ్ జెస్తరని ఆశలు పెట్టుకొని సాగు సేస్తాన్నమా ఏంది? ఇన్నాళ్ళుగా ఎం జేస్తన్నమో ఇప్పుడూ అదే సెద్దామ్ పదయె. నేను ఒకపారి పెద్దరెడ్డి కాడికి పొయ్యొస్త నువ్వు బువ్వ వండు ఈ లోపల." అని జెప్పి రెడ్డికాడికి పోయిన. రెడ్డి యాడికో బోయి అప్పుడే వచ్చినట్టున్నాడు బయటనే అరుగు మీద కూకుని ఉన్నాడు.

"ఎరా సాయన్న బాగున్నవా. లెటర్ వచ్చిందారా, బ్యాంకు అప్పు మాఫ్ అయిందా?"

"ఏందీ రెడ్డి ఇదీ, ఇయ్యాల మధ్యాహ్నం జాబు వచ్చింది. రెండు రూపాయలు మాఫ్ అయిందని ఉంది రెడ్డి అందులో.  ఇట్టా అయ్యిందేంది రెడ్డి. వోటేయ్యి అప్పులు మాఫ్ ఐతయి, మొత్తం నువ్వు సూస్కుంటనంటివి. ఇప్పుడు సూస్తే రెండు రూపాయలు మాఫ్ అయిందని ఉత్తరం వచ్చింది."

"రెండు రూపాయలా ఏందిరా నిజమా? ఏదీ ఉత్తరం ఇటియ్యి ... (ఉత్తరం సదివి) అవున్రా ఏదో తప్పు జరిగినట్టుంది. రేపు మన ఎమ్మెల్యే దగ్గరికి పోదాం. సరేనా."
*                *                 *
            మరుసటిరోజు ఎమ్మెల్యే దగ్గరికి రెడ్డితో బాటు పోయిన. నన్ను బయటే కూసోబెట్టి రెడ్డి లోనకి ఎమ్మెల్యే కాడికి బోయినాడు మాట్లాడనీకి, ఎమ్మార్వో సారూ కూడా ఏదో పని మీద ఎమెల్యే దగ్గిరకి వచ్చినట్టున్నాడు, వెనక్కెల్లిపొతున్నాదు. ఎలాగు కనిపిచ్చినాడు గదా అడుగుదం అని పొయిన. "సారూ అన్నాయమైపోయింది సారు. బ్యాంకు అప్పుల మొత్తానికి కలిపి రెండు రూపాయలు మాఫ్ అయ్యిందని జాబు వచ్చిందయ్యా. మీరే అప్పుడు ఇవరాలు తీస్కున్నరు గద, ఏమైనా మీరు పంపిన దాంట్లో తేడా ఉందేమో సూడరాదు సారు."

"అవునా రెండు రూపాయలా. అరె నీకే నయంరా, మా ఇంటి పక్కన ఉన్నోడికి అసలు అప్పు మాఫీనే కాలేదు. నీకు కనీసం రెండు రూపాయలన్నా మాఫీ అయింది, సంతోషించు"

"ఏందీ సారూ అట్టా అంటావు, మా కష్టాలు నీకు నవ్వులాటగా ఉందా?"

"నవ్వక చప్పట్లు కొట్టమంటావా ఎందిరోయ్? అయినా మీ వోట్లు అవసరం కాబట్టి ఈ రాజకీయ నాయకులు మిమ్మల్ని ఇలా తయారు చేసినారు. అసలు మీ చేత కూడా టాక్స్ కట్టిస్తే ప్రభుత్వాలు అప్పులు చేయాల్సిన అవసరమే ఉండదు"

"అదేంది సారూ అట్టా అంటావు? మేము టాక్స్ ఎందుకు గట్టాలే?"

"ఇదే, ఇందుకే మీ మీద కోపమొచ్చేది. ప్రభుత్వమిచ్చే రాయితీలు అదే సబ్సీడీలు కావాలి, వరదలొచ్చి పంట నష్టపోతే ప్రభుత్వం పరిహారం ఇవ్వాలి, అప్పులు మాఫీ చెయ్యాలి, అప్పులెక్కువై మీరు ఆత్మహత్యలు చేసుకుంటే దానికీ పరిహారమివ్వాలి. అసలెందుకివ్వాలిరా మీకు ఇవన్నీ? ఇంతా చేస్తే మీరు ఎం చేస్తారు ఐదేళ్లకోసారి వచ్చే ఎలక్షన్ లలో వోటు వెయ్యడం తప్ప? లేదంటే రోడ్లెక్కి గొడవ చేస్తారు. నన్నడిగితే రైతులు కూడా టాక్స్ కట్టేలా చెయ్యాలి, సబ్సిడీలు ఇలాంటివన్నీ కట్టే టాక్స్ కోడ్ ని బట్టి ఉండాలి"

"అర్థం కాలేదు కాని మస్తు సెప్పినావు సారూ. మొత్తానికి నాకైతే రైతులు కూడా పన్ను గట్టాలే అంటన్నవని అర్థమైంది, అంతేనా సారూ?"

"అబ్బా పర్లేదు బానే అర్థం అయింది నీకు. ఏమంటావు మరి?"

"ఎమనమంటావు సారూ. మీ పెభుత్వ ఉద్యోగాలు అవీ మొదలై ఎన్నాల్లైంది సారూ మీరు సేసే లెక్కటి ఉద్యోగాలను తీస్కుంటే ఓ రెండొందలు పోనీ మూడొందల ఏళ్ళు అయిన్దనుకుందాం. మరి అంతకు ముంగల రాజులు రాజ్యాలేట్ల సేసినరనుకున్నావ్ సారూ? మీ పన్నులు రాజ్యాల పంటికిన్డికి రావు సారూ. మీరు షాపు కెల్లి కొంటారే ఆటి మీద టాక్స్, ఇంకేదో అది వాటా పీటా ఏదో అంటరు ఆయన్నీ కలిపి ఉంటాయంట కదా సారూ ధర. మేము సంవత్సరమంతా కస్టపడి పంజేస్తే వచ్చే పంట అమ్మితే మాకోచ్చే ధర ఏందో తెలుసా సారూ - మద్యల ఏజెంట్లు, బ్రోకర్లు ఇట్టాన్తోల్లు అందరు కలిసి కూలీలకి, సంచులకి, లారీల్లో తోలనీకి, గోడౌన్లలో పెట్టనీకి, బొంబాయికో ఇంకెక్కడికో తీస్కపొనీకి ఇట్టా ప్రతి దానికి అయ్యే ఖర్చు లేక్కలేసుకొని తగ్గించి కొంటారు. సారూ ఆ లెక్కన ఆ టాక్స్ లో ఎంటివో అయ్యన్నీ తీసేస్కోనే మా పంటకు లెక్క గడతన్నారు సారూ. మాకు మేముగా గడ్తలేము గాని కట్టే వాళ్ళలో శానా మంది మా తరఫున కూడా కడ్తన్నట్టే లెక్క. ఆ వచ్చేది మళ్ళీ మా తర్వాతి పంట ఖర్చులకు కూడా సరిపోదు. అయినా మీరు ఉద్యోగాలు మానేసినా పనులు ఆగవు సారూ కానీ మేము పొలం పనులు మానేసినా, పండించింది అమ్మడం మానేసినా మీకు నోటికాడ ముద్ద ఉండదు సారూ. వేరే దేశాలనుంచి దిగుమతి సేస్కుంటమంటారేమో ఆడ కూడా పండించేది రైతులే సారూ. మేము కష్టపడి పండించే పంట ప్రతివోడికి తక్కువ ధరకి కావాలి, తిననీకి మంచి తిండి కావాలి. కానీ ఆ తిండి పండించేటోడి కష్టానికి మాత్రం మీరు ఇలువ ఇవ్వరు. బిచ్చమడగట్లేదు సారూ, సాయం జెయ్యమంటన్నం."

"ఏందిరా పాఠాలు చెపుతున్నావు. నేను తల్చుకున్నానంటే ..."

"ఇంతకుమించి ఇంకేం జేస్తరు సారూ ... బతికి సెడినోల్లమే కాని సెడి బతికినోల్లం కాదు."

           ఎమ్మార్వో ఏదో అనబోతుండగా, ఇంతలో ఎమ్మెల్యే బయటకొచ్చి "ఇదిగో ఎమ్మార్వో ఏందయ్యా ఆళ్ళతో గొడవపెట్టుకోకండి. మీరు వెళ్లి నేను చెప్పిన పని సంగతి చూడండి. రేపు సాయత్రానికంతా పని పూర్తవ్వాలి. ఎల్లుండి ఉదయానికి సరుకు మీకందుతుంది." అని సాయన్న వైపు తిరిగి "ఇదిగో నీ పేరేంటి ఆ సాయన్నా. చూడు, మీ రెడ్డి నాకు విషయం చెప్పాడు. నేను చూస్తాను, కానీ కొంచం టైం పడుతుంది. సరేనా? మిగతా విషయాలు మీ రెడ్డిని అడుగు. ఇదిగో వెంకటాద్రి ఈ సాయన్నకి ఐదు వేలు ఇవ్వు. అలాగే భోజనం పెట్టి పంపించు. ఇదిగో సుబ్బారెడ్డి నువ్వు నాతోరా పనుంది.
           వెళ్ళే ముందు రెడ్డి దగ్గరకి వచ్చాడు. "చూడు సాయన్న, ఎమ్మెల్యే సారూ చెప్పాడు కదా తను చూసుకుంటాడు, కాని టైం పడుతుంది. ఎమ్మెల్యే ఇచ్చిన ఐదువేలు తీసుకుని వెళ్ళు, పండగకి కావలసినవి కొనుక్కో, కూతురు అల్లుడుకి బట్టలు పెట్టు. కానీ ఆ రాఘవయ్య అదే మన అప్పోసిషన్ పార్టీ వాళ్ళు వాళ్లకి నీకు రెండు రూపాయలు బ్యాంకు అప్పు మాఫ్ అయిందని ఉత్తరం వచ్చిందని మాత్రం చెప్పకు, నానా హంగామా చేస్తారు. మన పార్టీని బద్నాం చేస్తారు."
           "ఏమో రెడ్డి, ఆ పార్టీ వోల్లైనా మీ పార్టీ వోల్లైనా మేము అక్కరకొచ్చేడిది ఎలచ్చన్ల టైం లనే. మాకీ బతుకులు అలవాటైపోనాయి రెడ్డి. పోయిన ఎలచ్చన్లప్పుడు ఆయన, ఇప్పుడు ఈయన మమ్మల్ని వాడుకున్నరు. ఒకాయన కరెంటు చార్గిలు మాఫ్ జేస్తనంటడు, ఇంకొకాయన ఒక్క కరెంటు చార్జిలెంది అన్నీ మాఫ్ జేస్త, స్వర్గం సూపిస్తనంటడు. ఎందరు ఎన్ని సేసినా ఆ పైనోడు సరైన సూపు సూత్తే తప్ప మా బతుకుల తీరింతే రెడ్డి."
             ఊరికి తిరిగొస్తన్నా. నా/మా గోడు ఆ దేముడు ఇన్నడో ఏమో తెల్వదు వాన మొదలైంది. తడిసిన మట్టి వాసన గుండె బరువును తగ్గించేలా కమ్మగా ఉంది. పొలాలు తడిసేపాటి వర్షం పడింది, దేముడు కరుణించాడు అనుకున్నా. చేతిలో గోడుగున్నా వర్షంలో తడుస్తూ ఇంటికెల్లా. పొద్దున్న పేపర్ సూస్తే నిన్న రాత్రి అక్కడెక్కడో పెద్ద తుపాను వచ్చి వందల ఎకరాల్లో చేతికందడానికి సిద్ధంగా ఉన్న పంట సర్వనాశనమైపోయిందంట. మా ఊళ్ళో కొద్దిమేర అవసరం మేరకు వాన పడినందుకు సంబరపడాలా, అక్కడ పంట సర్వనాశనమైనందుకు దుఃఖపడాలా? "దేముడా ఎందుకురా మమ్మల్ని ఇట్టా రైతులుగా పుట్టించావు?"

Comments

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన