విక్రమార్కుడు - రాజకీయాలు: మచ్చలేని జీవితం
విక్రమార్కుడు - రాజకీయాలు
ముందు మాట: ఈ రచనలోని పాత్రలు, అంశాలు కేవలం కల్పితాలు మాత్రమే ఎవరిని ఉద్దేశించినవి కావు.
******************************************************************************
యధాప్రకారం - పట్టిన పట్టు వదలని మహా పరాక్రముడు, అవిశ్రాంత శ్రామికుడు అయిన విక్రమార్కుడు అలుపు సొలుపు లేనివాడై చెట్టుమీది భేతాళుడిని భుజం మీదకెత్తుకుని, మరో చేతిలో కత్తి పట్టుకుని అమావాస్య రాతిరిలో భయములేనివాడై నగరం వైపుగా తన ప్రయాణం మొదలెట్టాడు. విక్రమార్కుడికి పట్టుదల ఎలాగో భేతాళుడికి నోటి దూల అలాగే కాబట్టి భేతాళుడు ఊరికే ఉండకుండా తన అలవాటు ప్రకారం మాట్లాడటం మొదలెట్టాడు.
"విక్రమార్కా నిన్ను, నీ పట్టుదలను చూస్తుంటే బహు ముచ్చట వేస్తోందయ్యా. అసలు ఎందుకు నీకు ఇంత పట్టుదల, ఏమి సాధిద్దామని? ఎందుకయ్యా నీకు ఈ అనవసర ఆరాటం?"
"భేతాళా తెలిసీ అడుగుతున్నావా లేక దీన్ని తెలివి అనుకుంటారనుకున్నావా లేక గతమేమైనా మతిమరుపునకు వచ్చినదా? మన ఈ సమాగామమేమీ కొత్తది కాదు మరల ఏల ఈ విధముగా ప్రశ్నించెదవు?"
"అయ్యో విక్రమార్కా! నీకు విషయం తెలిసినట్టు లేదు. భవిష్యత్తులో రాజకీయాలలో ఇలాగే మాట్లాడాలి. మనం మాట్లాడే దానికి తలా, తోకా ఉండకూడదు. అసలు అవతలి వాడి ప్రశ్న ఏమిటన్నది పట్టించుకోకూడదు, మనం చెప్పాలనుకున్నది మాత్రమె చెప్పాలి. నోటికొచ్చిన తిట్లన్నీ తిట్టాలి, వీలయితే కొట్టాలి."
"భేతాళా, ఏమైనది నీకీవేళ? మతి గతి తప్పినదా, కల్లు/సారా గాని చవిగొన్నావా? లేక భవిష్యత్తును భూతద్దంలో దర్సించితివా? ఈ దేశమున అట్టి పరిస్థితి ఏనాటికీ రాదనీ నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను, రాకూడదని కోరుకుంటున్నాను. అయినా వర్తమానము వదిలివేసి ఇవ్వాళ ఏమిటీ భవిష్యత్తుపై నీ దృష్టి సారించితివేమీ?"
"విక్రమార్కా! నేను కాదు నీవే భవిష్యత్తును ఊహించలేకపోతున్నావు. నీ దార్శనికత దొబ్బేసింది. నీ మెదడు మొద్దుబారిపోయింది, నీ తెలివికి తిమ్మిరెక్కింది; భేతాళుడినే అయినప్పటికీ సంస్కారం అడ్డు రావడం వల్ల ఇంతకంటే ఎక్కువ తిట్టలేకపోతున్నాను రాజా ..."
"ఆగాగు భేతాళా ... ఆపాపు నీ తిట్ల దండకం. ఈవేళ నీ మతి కాస్త గతి తప్పినదని మా ఖచ్చితమైన అభిప్రాయము. అయినా ప్రతిసారి ఏదో ఒక కథ చెప్పెదవు కదా, ఈ తిట్ల దండకం ఆపి ఆ కథె యేదో ప్రారంభింపుడు, కనీసం మాకు మార్గాయాసమైనా తెలియక కాస్త ఉపశమనుముగా ఉండును."
"సరి సరి! విక్రమార్కా నీవు కూడా భవిష్యత్తు రాజకీయనాయకుల కాగే తయారయ్యవు కాబట్టి; నీవు కూడా తుచ్చమైన పదవీ వ్యామోహముతో, కాంక్షతో నేను చెప్పబోయే భవిష్యత్ రాజకీయ నాయకులవలేనే పట్టువదలక పదవికోసం ప్రయత్నించుచుంటివి కాబట్టి - నీకు ఆ భవిష్యత్తు రాజకీయాలను ప్రతిబింబించే కథనే చెప్పి యథావిధిగా చివర్లో ఒక ప్రశ్న అడుగుతాను. జాగ్రత్తగా విను ... మళ్ళీ మళ్ళీ చెప్పను. మన ఈ కథల్లో మొదటి కథగా చారలు లేని పులిలా, జూలు లేని సింహంలా, కోరలు లేని పాములా భవిష్యత్ కాలపు రాజకీయాలలో 'మచ్చలేని జీవితం' గడిపిన ఒక మహానుభావుడు, దార్శనికుడు అనదగ్గ ఒక మహా మహానుభావుడి గురించి చెపుతాను జాగ్రత్తగా విను."
"ఏమిటేమిటీ చారలు లేని పులిలా, జూలు లేని సింహంలా, కోరలు లేని పాములా - ఇలా బతకటం ఏ కాలములోనైనా ఎవరికైనా సాధ్యమంటావా భేతాళా, లేక పట్టినపట్టు వదలక నిన్ను విసిగిస్తున్నానని నోటికొచ్చినవన్నీ చెపుతూ నీ వాచాలతను ప్రదర్సిస్తున్నావా? జాగ్రత్త - నేను మంచివాళ్ళకి మంచివాడిని, నా పరాక్రమము సంగతి నీకు తెలియనిది కాదు తేడావస్తే తలకాయలు లేచిపోతాయి; శవములు గుట్టలు గుట్టలుగా పది రాబందులు, నక్కలు సంవత్సరాల తరబడి పండుగ చేసుకోనగాలవు; యమధర్మరాజు దిగి వచ్చి 'నరక లోకమునందు స్థలము సరిపోవటము లేదు దయచేసి నీ సంహారము ఆపుమా విక్రమార్కా' అని వేడుకోవలసి రావచ్చును. ఏమీ ఏమేమీ నీ వాచాలత మా దగ్గరా."
"విక్రమార్కా, నీ ఈ మాటలు వింటుంటే నాకు భవిష్యత్ కాలమునందు తెలుగు భాషలో చలన చిత్రములు; ఆ చిత్రములనందలి కథానాయకుల ఆవేశభరితమైన సంభాషణలు కనులముందు కదులాడుచున్నవి. సరి సరి ఆ చలనచిత్రముల గురించి నీకు మన తదుపరి సమాగమములలో ఏదో నాడు వివరించెదను. ప్రస్తుతానికి 'మచ్చలేని జీవితం' గడిపిన మహానుభావుడి గురించి చెపుతాను జాగ్రత్తగా విను."
* * *
మచ్చలేని జీవితం
పూర్వాంకం
-----------
ప్రపంచం స్తంభించిపోలేదు, ప్రక్రుతి పులకించలేదు, ఆకాశం వర్షించలేదు, అద్భుతాలేమీ జరగలేదు - కానీ ఆయన పుట్టాడు. మచ్చలేని మనిషి, నలుపు లేని గురవింద ఉంటాయా? తెలీదు కానీ ఆ రోజు ఒక మచ్చలేని మనిషి పుట్టాడు. ముందు చెప్పిన అధ్బుతాలేమీ జరగలేదు కానీ ఒక పెద్దాయనకు గుండె కలుక్కుమంది. సహజంగా జ్యోతిష్యాన్ని విపరీతంగా నమ్మే ఆ పెద్దాయన తన ఆస్థాన జ్యోతిష్కున్ని అడిగాడు 'కారణమేమై ఉండొచ్చు' అని. శాస్త్రాలన్నీ తిరగేసిన ఆ జ్యోతిష్య పండితాగ్రణి 'అయ్యా, ఇవ్వాళ ఒక మచ్చలేని మనిషి పుట్టాడు. భవిష్యత్తులో ఆ మచ్చలేని మనిషి వల్లనే నీవు నీ స్థానాన్ని కోల్పోతావు' అని చెప్పాడు.
అంతవరకూ దిగులుగా ఉన్న భరతమాత మోములో చిన్నపాటి ఆనందవీచిక చూసిన సామాన్యుడు కారణమడిగాడు 'చాణక్యుని అంశలో మరో మహానుభావుడు ఒక మచ్చలేని మనిషి ఇవ్వాళ పుట్టాడురా. ప్రపంచం ముందు ఆ విధంగా నన్ను ముందుకు తీసికేల్లెవాడు వాడేరా' అంటూ ఆనందంగా సమాధానమిచ్చింది. 'మరి ఆ దిగులు ఇంకా పూర్తిగా పోలేదేమిటి తల్లీ' అంటే 'ఏమి చెప్పమంటావురా వీడు ఎంతటి చాణక్యుడైనా, మచ్చలేని మనిషి అయినా వీడికంటే సమర్థులు వస్తే లేదా వీడిని అడ్డుకోగలిగే మొనగాళ్ళు వస్తే ఎలా అని దిగులుగా ఉందిరా'. అప్పుడు సామాన్యుడు పెద్ద వేదాంతిలా 'యుగాధర్మమంటే అదే కదా తల్లీ.' - నిట్టూర్పుతో సామాన్యుడు, భరత మాత ఇద్దరు తమ తమ పనుల్లో మునిగిపోయారు.
బహుదేవతాభక్తి పరాయణుడైన ఆ బాలుడి తండ్రి తన కొడుక్కి 'కేశవచంద్రశేఖరేంద్రసరస్వతి నాయుడు' గా నామకరణం చేసాడు.
* * *
కీలక మలుపు
-----------------
కాలచక్రంలో కొన్ని దశాబ్దాలు గిర్రున తిరిగిపోయాయి.
ఇప్పుడు కేశవ ఒక సాధారణ వ్యక్తి కాదు - ఎవరిపేరు చెపితే దార్శనికత గుర్తోస్తుందో, ఎవరి పేరు చెబితే చాణక్యుడు మళ్ళీ పుట్టాడురా అని జనాలు అనుకుంటారో, ఎవరి పేరు చెబితే నీతి నిజాయితీలు కూడా తమ పేరును ఆయన పేరుగా మార్చుకోవాలనుకుంటాయో అటువంటి ఒక మహానుభావుడే కేశవ. అసలు కేశవ అంటేనే రాజకీయాలలో ఒక సంచలనం. కేశవ ప్రస్థానం గురించి చెప్పుకోవాలంటే ఒక ఉద్గ్రంధమే అవుతుంది. ఒక అత్యంత సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన కేశవ ప్రభుత్వాధినేత స్థాయికి ఎదిగాడంటే అది కూడా ఏంతో పోటీ, కుట్రలు, కుతంత్రాలు నిండి ఉండే రాజకీయ రంగంలో అసాధారణ స్థాయికి, తన ప్రత్యర్థులు కూడా ఈర్ష్య పడే స్థాయికి ఎదిగాడంటేనే అర్థం చేసుకోవచ్చు కేశవ ఎంతటి కుటిల వ్యూహరచనా నిపుణుడో. కేశవ కంటే ముందు కూడా అత్యంత సాధారణ స్థాయి నుండి ప్రభుత్వాధినేతలుగా ఎదిగిన నాయకులు ఉన్నప్పటికీ వారి కాలం వేరు, ఈయన కాలం వేరు - వారు సమర్థత, మంచితనం, నాయకత్వ లక్షణాలు ఉంది ఎదిగిన వారు తప్ప కుటిల వ్యూహ రచనా నిపుణులు కారు, అడ్డొచ్చిన వారిని తొక్కుతూ ఎదిగిన వారు కూడా కాదు. కాలాలలోని ఈ తేడా కేశవను కూడా 'తేడా' గా నిలబెట్టింది. విద్యార్థి దశలోనే కేశవ రాజకీయాలే తన లక్ష్యంగా నిర్దేశించుకున్నాడు. కళాశాలలో తన మనిషిని విద్యార్థి నాయకుడిగా గెలిపించడంతో కేశవ కుటిలనీతి ఆ ఆ అదే కౌటిల్య నీతి ఆ నియోకవర్గ నాయకుడి దృష్టిలో పడింది. తన కులానికి చెందిన, తనకు నమ్మకస్థుడైన వాడిని పోటీకి నిలబెట్టాడు. కానీ అక్కడ తమ కులపు వారి సంఖ్యాబలం తక్కువ. దాంతో అక్కడ బలంగా ఉన్న వర్గపు వ్యక్తిని ఉపనాయకుడిగా ప్రతిపాదించాడు, అంటే కాదు మిగతా స్థానాలలో అధికంగా వారినే పోటీకి నిలబెట్టాడు. అప్పటివరకు ఒక మూసలో వెళుతున్న రాజకీయాలను తన ఆగమనంతోనే చిన్నస్థాయిలొనైనా నూతన ఒరవడితో మొదలెట్టాడు. కేశవ గురించి ఇంత ఉపోద్గాతం అవరమా అంటే అవసరమే - ఎందుకంటే కేశవ అట్టాంటిట్టాంటి వాడు కాదు కాబట్టి, పుట్టుకతోనే మచ్చలేని మనిషి కాబట్టి.
* * *
ఎందుకో కానీ పెద్దాయనకి ఆ రోజు పొద్దున్న పూజ చేసుకుంటుంటే ఎడమకన్ను ఆదరసాగింది అంతే కాదు ఏదో తెలియని అలజడి, 'ఏదో జరగబోతోంది అన్న అనుమానం. ఎన్నడూ లేనిది ఏమిటివ్వాళ?' తెలియదు కానీ ఏదో జరగబోతోంది అన్న భావన మాత్రం పీడించసాగింది . పూజ చేసుకుని బయటకు రాగానే కేశవ కనబడ్డాడు, మనసు కాస్త నెమ్మదించింది. అవును కేశవ తన పక్కన ఉండగా ఎవరేమి చెయ్యగలరు? 'కేశవా, ఇవ్వాళ విదేశాలనుంచి వచ్చిన ప్రతినిధులతో కీలక సమావేశం ఉంది. అలాగే కేంద్రంలో పరిస్థితులు మారేలా ఉన్నాయి, మన అవసరం ఎక్కువ పడేలా ఉంది. నేను సాయంకాలం వరకు ఈ రెండు సమావేశాలతో తీరిక లేకుండా ఉంటాను. పాలనా, పార్టీ వ్యవహారాలు నువ్వు చూసుకో"
"అలాగే గురువు గారు" అంటూ కేశవ వెళ్ళిపోయాడు.
తరువాత పెద్దాయన తన కార్యక్రమాలలో మునిగిపోయాడు. సాయంకాలం వరకు తీరిక లేకుండా ఉండే అవసరం మాత్రం లేకపోయింది. భోజన సమయానికి ముందే సెక్రటరీ ఆందోళనగా వచ్చి ,విషయం ఏదో చెప్పాడు.
"ఏమి చెబుతున్నారు మీరు? కలగంటున్నారా లేక మమ్మల్ని ఆట పట్టిస్తున్నారా? కేశవ ఏమిటి మమ్మల్ని కూలదోసి, శాసనసభ్యుల మద్దతు కూడగట్టి అధినేత అవ్వడమేమిటి? అసలు కేశవకి ఆ అవసరమేమిటి. మీ మతి చలించలేదు కదా?"
"సార్ ... మీకు అన్యాయం జరిగింది సార్. జరిగింది నిజమే. మన వైపు ఒక పదిమంది సభ్యులు ఉంటారేమో ... వారిలో ఎంతమంది గట్టిగా మనతో నిలబడతారో కూడా తెలీదు."
అంటే పెద్దాయన ఇంకేమీ మాట్లాడలేదు, దిగ్గున తను కూర్చున్న కుర్చీలోంచి లేచి 'పదండి వారందరూ ఎక్కడ ఉన్నారో అక్కడకు వెళదాం."
"సార్, అది అంత మంచిది కాదేమో? అక్కడ పరిస్థితి ఎలా ఉందొ ... మీకు ఏదైనా జరిగితే?'"
"ఏమంటున్నారు మీరు? మా చిత్రము బొమ్మ పెట్టుకుని తప్ప ఎన్నికలలో గెలవలేని వెధవలు మమ్మల్నేమి చెయ్యగలరు? గతంలో ఇలా జరిగినప్పుడు ఏమైందో మీకు తెలీదా?"
... హితులు చెప్పిన మాటలు వినక అక్కడకు వెళ్ళిన పెద్దాయనపై చెప్పులు వేశారు కేశవ మనుషులు. 'నేను చేసిన తప్పేమిటి?' అని అడిగే అవకాసం కానీ 'అసలు ఎందుకు చేసారీ పని?' అని నిలదీసే అవకాశం కానీ పెద్దాయనకు ఇవ్వలేదు. పెద్దాయన ముందు నిలబడి మాట్లాడలేమని తెలుసు కాబట్టి. తిరిగి వెళ్తున్న పెద్దాయన మనసులో ఎప్పుడు దశాబ్దాల క్రితం జ్యోతిష్యుడు చెప్పిన విషయమే మెదలాడుతోంది 'ఇవాళ పుట్టిన మచ్చలేని మనిషి వల్లనే నీవు నీ స్థానాన్ని కోల్పోతావు'. అసలే అభిమానధనుడైన పెద్దాయనకు ఆ వెన్నుపోటు, అవమానం తట్టుకోలేక ఇంటికి వెళ్ళకముందే ఆత్మ అనంతవిశ్వంలో కలిసిపోయింది. కేశవకు కలిసివచ్చిన అంశాలలో పెద్దాయన మరణం కూడా ఒకటి.
* * *
కేశవ జమానా
----------------
పెద్దాయనను దింపి అధినేతగా మారిన నాటి నుండి కేశవ ప్రభ వెలిగిపోసాగింది. రాజకీయాలను తన చిటికెన వేలిమీద ఆడించే స్థాయికి చేరాడు. ఆ తరువాత ఎవరో అడిగారు పెద్దాయనకు వెన్నుపోటు పొడవడం తప్పు కాదా అని. దానికి కేశవ సమాధానం "What I am saying is అనగా నేనేమి చెబుతున్నానంటే మీరంతా వినాలి, ముందు వినడం నేర్చుకోవాలి. ఇంతకీ నేనేం చెపుతున్నానంటే మన భవిష్యత్తు బాగుండాలి. ఆ విధంగా ... ". మళ్ళీ అడిగినా, ఎప్పుడు ఎక్కడ అడిగినా అదే తరహాలో సమాధానం - దాంతో ఇక విసుగొచ్చిన జనాలు అడగటం మానేశారు. వేరే ఎవరైనా అడిగినా ఆయనా సమాధానమివ్వడం మానేశారు, ఏదైనా తేడా జరిగినా దాన్ని జనాలకు చేరవేసే మాధ్యమాలు ఏవీ ఉన్న రెండు, మూడు మాధ్యమాలు కేశవకు బాకా ఊదే భజంత్రీలే. అసలు కేశవ అధికారంలోకి వచ్చేవరకు ఎవరు కూడా వార్తా మాధ్యమాలను ఎలా ఉపయోగించుకోవచ్చో పెద్దగా పట్టించుకోలేదు. అంతవరకూ మీడియా అంటే అన్యాయాలకు, రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతూ సామాన్యుల పక్షాన నిలబడేది అన్న అభిప్రాయాన్ని కేశవ సమూలంగా, కూకటివేళ్ళతో సహా పెకలించివేసాడు. రాజకీయ పార్టీలు మీడియా సంస్థలను తమ బాకాలుగా మార్చుకుంటే ఎలా వెలిగిపోవచ్చో ప్రపంచానికి చూపించాడు. ఒకరోజు కేశవ తనకు అత్యంత ముఖ్యులు, నమ్మకస్తులు అయిన మీడియా అధినేతలిద్దరితో సమావేశంలో ఉండగా కొందరు మంత్రులు వచ్చారు.
"సార్ వీళ్ళు రైస్ మిల్లు యజమానుల సంఘం వాళ్ళు. (వాళ్ళతో వచ్చిన మరో ఇద్దరు ప్రతినిధులను చూపిస్తూ) ఈ సారి పంట బాగా వచ్చింది, కానీ రైతులు వారి ధర పెరుగుతుండటంతో , ఇంకా పెరుగుతుందిలే అని అమ్మటం లేదు. ఏమన్నా చేయ్యమంటున్నారు. ఏం చేస్తే బాగుంటుంది సార్."
కేశవ ఒక్క నిమిషం దీర్ఘంగా అలోచించి ఆ మీడియా అధినేతలిద్దరినీ పిలిచాడు - "రేపు వార్తల్లో మన ప్రభుత్వం విదేశీ ప్రతినిధులతో మేలు రకం బియ్యం కొనుగోలు గురించి చర్చలు జరిగాయని, చర్చలు ఫలవంతంగా ముగిసాయని - అతి త్వరలో మేలు రకం బియ్యం దిగుమతి జరగవచ్చు అని రాసెయ్యండి" అంటూ ఆ రైస్ మిల్లు యజమానుల ప్రతినిధుల వైపు తిరిగి "చూడండి, ఒక నెల రోజుల్లో మీరు కోనేయ్యాలి అంతకంటే ఎక్కువ రోజులు ఈ ఫేక్ న్యూస్ ని ఆపలేం."
ఆ వార్త దెబ్బకు ధర రెండు రోజుల్లోనే సగానికి పడిపోవడంతో బెంబేలెత్తిన రైతులు వచ్చిన ధరకు పంట అమ్ముకున్నారు. నెల గడవగానే 'విదేశీ మేలు రకం బియ్యం దిగుమతి ఒప్పందం సఫలం కాలేదు' అని మరో వార్తా రాగానే ధర అంతకుముందు కంటే రెండింతలు పెరిగింది - కానీ ఏమి లాభం, 90% నికి పైగా రైతులు అప్పటికే పంటను అమ్మేసుకున్నారు, అందులో కొందరు నష్టానికే అమ్ముకోవాల్సివచ్చింది. ఇది కేశవ కుటిల అదే అదే కౌటిల్య చాతుర్యానికి ఒకానొక చిన్న ఉదాహరణ.
* * *
కేశవ ఆ విధంగా ముందుకు పోతున్నాడు, ప్రపంచాన్ని తనవెంట తిప్పుకున్నాడు. అసలు ఈ ప్రాంతమంటూ ఒకటి ఇంతకుముందు ఉండేదే కాదు, ఉన్నా నాగరికత, అభివృద్ది అన్నవి అసలే తెలీని ప్రాంతంగా ఉండేది - అటువంటి ప్రాంతాన్ని తన రెక్కల కష్టంతో, మేధో చాతుర్యంతో ఎక్కడికో తీసుకెళ్ళాడు అన్న భావనను కలుగజేయడంలో కేశవ విజయం సాధించాడు. ఇక ఉన్న ప్రముఖ మీడియా సంస్థలు తనకు సంపూర్ణ సహకారమందించడంతో కేశవ విజ్రుమ్భన తట్టుకోవడం ప్రత్యర్థుల వల్ల కాదు ఇంకో పదిహేను, పాతిక సంవత్సరాలు కేశవదే అధికారం అన్న భావన కలిగించేలా కథనాలు వండటం మొదలైంది. పైన ఉదహరించిన 'బియ్యం కొనుగోలు' లాంటివి ఎన్నో వ్యూహాలు - ఆ వ్యూహాల దెబ్బకు అటు ప్రత్యర్థులే కాదు రైతులు, కార్మికులు, శ్రామికులు అల్లాడిపోయారు; కానీ పారిశ్రామిక వర్గాలు మాత్రం పండగ చేసుకున్నాయి ప్రత్యేకించి కేశవ వర్గానికి చెందిన వారు.
ఎలా అంటే - ప్రభుత్వానికి చెందిన ఒక పనికి సంబంధించి టెండర్లు వెయ్యటానికి నోటిఫికేషన్ వేస్తారు. మొదటి వ్యూహం ఏంటంటే అది ప్రముఖంగా వచ్చేలా కాకుండా తమ మీడియా లో అప్రాముఖ్య పుటల్లో ఎక్కడో వేస్తారు, చివరి తేదీనాటికి ఎవరూ రారు - ముందే నిర్ణయించుకున్న ప్రకారం తన అనుకూల వర్గాల వారికి ఆ కాంట్రాక్టు ఇచ్చెయ్యడం. గతంలో కూడా ఇలాంటివి జరిగినా కేశవ జమానాలో లాగా మీడియాను తమ నియంత్రణలో ఉంచుకుని ఈ స్థాయిలో ఎవరూ చెయ్యలేకపోయారు. మీడియాను ఎలా ఉపయోగించుకోవాలి అన్నది తరువాతి తరాల రాజకీయనాయకులు కేశవ ను చూసి నేర్చుకోవచ్చు - అలా ఒక కొత్త తరహా రాజకీయాలకు తెర తీసిన కేశవ భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచిపోయేలా ఆ విధంగా ముందుకు పోసాగాడు.
* * *
చివరి అంకం
----------------
అలాగే సాగి ఉంటె ఎలా ఉండేదో తెలీదు కాని, మధ్యలో ఇద్దరు కొట్టిన దెబ్బకు కేశవ లాంటి అపర చాణక్యుడు కూడా దిమ్మతిరిగి కొన్నేళ్ళు మూలాన కూర్చోవలసి వచ్చింది. ఆ ఇద్దరిలో ఒకరు చిరకాల ప్రత్యర్థి పాండురంగారెడ్డి అయితే రెండో వ్యక్తీ మాత్రం ఒకప్పటి పెద్దాయన అనుంగు శిష్యుడు రాజశేఖరం. అసలకు రాజశేఖరం. ఒకప్పుడు కేశవ ఏది పట్టుకున్నా బంగారం అనే స్థాయి నుండి ఇప్పుడు కేశవ ఏమి చేసినా అది వ్యతిరేక ఫలితాలే రాసాగాయి. దానికి తోడు కేశవ లాగా వెన్నుపోటు రాజకీయాలు, కుటిలత్వాలు కాకుండా ప్రజాబలంతో గద్దెనెక్కిన పాండురంగ నానాటికీ ఎదగసాగాడు. పాండురంగారెడ్డి ఎదగడమే కాదు - మచ్చే లేని కేశవ కు 'వెన్నుపోటు' అన్న మచ్చ చిరస్థాయిగా నిలిచేలా చిత్రీకరించాడు. అలా మొదటిసారి తను ఎత్తు వేసిన కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఎత్తును మచ్చగా మార్చిన పాండురంగారెడ్డి బతికే ఉండి, పరిస్థితి అలానే సాగితే ఎలా ఉండేదో కానీ పాండురంగ ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అది ప్రమాదమా లేక పథకం ప్రకారం జరిగిన హత్యనా అన్నదానిమీద ఇంకా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కానీ పాండురంగారెడ్డి మరణం తర్వాత మొదలైంది అసలు ఆట. వైకుంఠపాళీ ని తలపించేలా. అత్యాశకు పోయిన పాండురంగారెడ్డి తమ్ముడు చెన్నకేశవ రెడ్డి అన్న ఫోటో పెట్టుకుని ప్రత్యామ్నాయంగా ఎదగాలని ప్రయత్నాలు మొదలెట్టాడు. స్వతహాగా సత్తా ఉన్న చెన్నకేశవ ఎదుగుదల అందరికీ ఒక భయం పుట్టించింది. అన్నలా మృదుస్వభావి కాదు చెన్నకేశవ. కేశవకు చెన్నకేశవకు జరిగిన ఆ రాజకీయ వ్యూహ ప్రతివ్యూహ సంగ్రామం అప్పటి రాజకీయాలలో నభూతో అన్న స్థాయిలో జరిగింది.
మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. సరిగ్గా అప్పుడే కేశవ అపర కౌటిల్య (అదేలెండి కుటిల నీతి) నీతి బయటపడింది. వర్గం, కులం, మతం, ప్రాంతం, రంగు, రూపం ఇలా ఎన్ని రకాల విభిన్నతలు ఉన్నాయో అందరికీ పేరు పేరున వరాలు ప్రకటించేశాడు. రైతులు, కార్మికులు, రైతు కూలీలు, కల్లుగీత కార్మికులు, చేనేత గాళ్ళు, ఉద్యోగులు - ఇలా ఈ వర్గాలకు కూడా. అసలు 'విభజించి పాలించు' అన్న కూట నీతికి ఆద్యులైన ఆంగ్లేయులు కూడా దిమ్మతిరిగిపొయెలా ఉంది కేశవ 'విభజించి వరాలివ్వు' నీతి. కానీ ఇన్ని చేసినా కూడా కేశవ పూర్తీ ఆధిక్యత సాధించలేకపోయాడు. కేశవ, చెన్నకేశవ, రాజశేఖరం - మూడు వర్గాలలో ఎవరికీ పూర్తీ ఆధిక్యత రాలేదు. కానీ అదే చెన్నకేశవకు ప్రతికూలత అయింది. కేశవ, రాజశేఖరం ఇద్దరు కూడా చెన్నకేశవను ఆజన్మ శత్రువులా పరిగణించేవారే. దాంతోపాటు కేంద్రంలో ఉండే ఒక మహామనిషి జోక్యంతో కేశవ - రాజశేఖరం ల మధ్య సంధి కుదిరింది. చేరి సగ భాగం ముఖ్యమంత్రులుగా కొనసాగాలన్న ఒడంబడిక జరిగింది. మొదటి దఫా కేశవ.
ఒప్పందానికి కట్టుబడి గుట్టుగా కాపురం అదే అదే అధికార పంపకం చేసుకుంటే అది కేశవ తత్త్వం ఎలా అవుతుంది. రాజకీయంగా జన్మనిచ్చిన పెద్దాయనకే వెన్నుపోటు పొడిచిన గొప్పవాడు అయిన కేశవ తన కింద పనిచేసి పక్కలో బల్లెంలా మారిన రాజశేఖరాన్ని ఉపెక్షిస్తాడా? రాజశేఖరం వర్గపు శాసనసభ్యులను ఆకర్షించే ప్రయత్నాలు మొదలయ్యాయి. తను అండదండలు అందించిన పారిశ్రామిక వేత్తలను, తన సలహా సంఘంలోని ధనవంతులను పురమాయించి కొన్ని వందల కోట్లు సమీకరించాడు. ఒక అయిదుమంది అతి ముఖ్యులతో ఒక ప్రత్యెక సమితి లాంటిదాన్ని ఏర్పరచాడు. వాళ్లకు మూడునెలల కార్యాచరణ నిర్దేశించాడు. ఒక్కొక్కరి లక్ష్యం ముగ్గురు శాసనసభ్యులు. ఒక్కొక్కరు రాజశేఖరం వర్గంలోని తమ ప్రాంతానికో, కులానికో, మతానికో చెందిన ముగ్గురు శాసనసభ్యులను గుర్తించి వారిని నయానో, భయానో, ఆశ చూపించో రాజశేఖరం పార్టీ నుంచి బయటకు లాగాలి. అలా బయటకు వచ్చిన వారందరూ కలిసి ఒక కొత్త పార్టీ గా ఏర్పడి తరువాత తమ పార్టీలో విలీనం కావాలి. అప్పుడు సాంకేతికంగా ఎలాంటి సమస్యలుండవు, రాజశేఖరానికి అధికారాన్ని అప్పగించాల్సిన పని కూడా ఉండదు.
ఇక్కడ తరువాత జరగబోయేదాని కంటే ముందు ఒక చిన్న ఉదాహరణ చెబుతాను విక్రమార్కా. 'పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తనను ఎవరూ గమనించలేదని అనుకుంటుందట'. కేశవ గమనించనిది ఏమంటే ఒకప్పుడు తాను మాత్రమే నీచుడు, అపర కుటిల నీతి నిపుణుడు. కానీ ఇప్పుడు అలా కాదు. తనను మించిన నీచులు ఉన్నారని తెలుసుకోలేకపోయాడు. గమనించుకునేసరికి పుణ్యఘడియలు దాటిపోయాయి, జరగాల్సిన అనర్థమెదొ జరిగిపోయింది'. కేశవ గురించి రాజసేఖరానికి బాగా తెలుసు. కేశవ పెద్దాయనకు వెన్నుపోటు పొడిచిన ప్రక్రియలో ప్రతి అడుగులో కేశవ పక్కనే ఉన్న రాజసేఖరానికి కేశవ వ్యూహాల గురించి కొత్తగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. కేశవ కదలికలు మొదలయ్యాక తన వర్గాన్ని అప్రమత్తం చేశాడు రాజశేఖరం. తన సభులలో ఎవరెవరిని కేశవ మనుష్యులు సంప్రదిన్చవచ్చో ముందుగానే ఒక అంచనాకు వచ్చాడు. వారిమీద ప్రైవేటు గా నిఘా పెట్టించాడు. తిరుగులేని సాక్ష్యాధారాలతో కేశవ పాత్రకు సంబంధించిన పూర్తీ ఆధారాలతో ప్రత్యక్ష్యంగా ఇద్దరు కేశవ మనుషులను పట్టించాడు అది కూడా మీడియా ముఖంగా. ఆ దెబ్బకు కేశవ పరిస్థితి తెలు కుట్టిన దొంగలా తయారయ్యింది.
కానీ తప్పు ఒప్పుకుంటే కేశవ - కేశవ ఎందుకవుతాడు. దాంతో ప్రైవేటు నిఘా పెట్టించడం చట్టరీత్యా నేరం, వ్యక్తుల స్వేచ్చను దెబ్బతీయడమే అంటూ వితండ వాదన మొదలెట్టాడు. ఇక అక్కడనుంచి మళ్ళీ వైకుంఠ పాళి ఆట మొదలయ్యింది.
* * *
... అంతవరకూ చెప్పి భేతాళుడు ఆపేసాడు.
అంతవరకూ రోమాలు నిక్కబోడుచునే కేశవ వీరోచిత గాధను విన్న విక్రమార్కుడు భేతాళుడి ఆ నిశ్శబ్దాన్ని తట్టుకోలేకపోయాడు, తనలోని ఉత్కంటతను ఆపుకోలేకపోయాడు. "భేతాళా! కేశవ ససాక్ష్యంగా పట్టుబడిన తరువాత ఏమైంది? కేశవ నిందితుడిగా తేలాడా? మచ్చలేని మనిషిగానే నిష్క్రమించాడా? రాజశేఖరం తరువాత ఏమి చేసాడు. చెన్న కేశవ ఏమయ్యాడు? కేంద్రంలోని మహానుభావుడు ఎవరు? ఈ ప్రశ్నలన్నీ నన్ను గందరగోళానికి గురి చేస్తున్నవి. దయచేసి నీ నిశ్శబ్దాన్ని వీడి మిగతా కథను చెప్పు."
"విక్రమార్కా! నీ ఆసక్తి చూస్తోంటే ముచ్చటేస్తోంది. రాజశేఖరం, చెన్నకేశవ, మహానుభావుడు తదితరుల గురించి నీకు ఒక్కొక్క కథగా తరువాతి సమాగమములలో వివరించెదను. కేశవ పరిస్థితి గురించి చెప్పాలంటే కేశవ 'కిందపడినా తనదే పై చెయ్యి' అనే రకం అని నీకు అర్థం అయింది కదా. డబ్బుకోసం అడ్డమైన గడ్డి తినే ఆ భవిష్యత్ రాజకీయాలలో మళ్ళీ కేశవ, రాజశేఖరం ఒక్కటైనా ఆశ్చర్యపోనక్కరలేదు. కాకపోయినా ఆ విషయాన్ని సాగాదీయడంలో కేశవను మించిన వారెవరూ లేరు. ఆ విషయం వదిలేస్తే కేశవ నిజంగానే మచ్చలేని మనిషేనా? నిష్కలంకుడేనా? నీతి నిజాయితీలకు మారుపేరేనా? విక్రమార్కా సమాధానం తెలిసీ చెప్పకపోయావో నీకు భవిష్యత్ కాలంలో తెలుగు భాషలో రాబోయే 'అగ్గి', 'నిప్పు' లాంటి చలన చిత్ర రాజములను; వత్సరములకొద్దీ సాగే ఏడుపుగొట్టు ధారావాహికలను ఇప్పుడే చూపించగలను. బాగా అలోచించి చెప్పు."
* * *
--- --- --- విక్రమార్కుడి సమాధానం కంటే ముందే ఈ కథను చదివో లేక చదవకున్దానో లైక్ లు కొట్టే వారిలో ఎవరైనా ఊహించి సమాధానం చెప్పగలిగితే వారు కనీసం ఒక వారం పాటు వారింట్లో ధారావాహికల అదే నండి బాబు డైలీ సీరియల్స్ గొడవ లేకుండా ప్రశాంతంగా ఉండగలరు అని భేతాళుడు తన మాటగా చెప్పమన్నాడు. ప్రయత్నించండి ... రెండు రోజుల గడువు. :)
Comments
Post a Comment