నన్ను చంపిందెవరు

నన్ను చంపిందెవరు
--- ఈ కథాంశం, ఇందులోని పాత్రలు కేవలం కల్పితం. ఈ మధ్య నేను చదివిన కొన్ని వార్తల/సంఘటనల ఆధారంగా అల్లుకున్న కాల్పనిక రచన మాత్రమే.
**********************************************************************************
          కళ్ళు నెమ్మదిగా మసకబారుతున్నాయి, చీకటి  - కళ్ళ ముందు ఉన్న వెలుతురు నెమ్మదిగా చీకటిగా మారుతోంది. నొప్పి కంటే ఎక్కువగా బాధ కలుగుతోంది. అవును కత్తి గుండెలోకి దిగుతున్నప్పుడు నొప్పి కలిగింది కానీ ఇప్పుడు అంతకంటే ఎక్కువగా బాధ కలుగుతోంది. ఎందుకు? అనుకున్నది చెయ్యలేకపోయాననా? ఏమో తెలీదు. చనిపోతున్నందుకు బాధ లేదు, ఎప్పుడో ఒకప్పుడు చావాలి కదా? కళ్ళు మూతలు పడుతున్నా, కంటి ముందు 'రవీ రవీ' అంటూ ఏడుస్తోన్న అంజలి కనిపిస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాను తనని, జీవితాంతం తోడుంటా అని ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనందుకా ఈ బాధ.
          రవి - ఈ పేరు ఎందుకు పెట్టారా అనుకునేవాడిని. చిన్నప్పుడు నాన్న విడమరిచి చెప్పేవాడు "అరేయ్ రవి అంటే సూర్యుడురా. సూర్యుడు ప్రపంచానికి వెలుగు పంచుతాడు, చీకట్లను పారద్రోలుతాడు. సూర్యుడు అంటే నాకు చాలా ఇష్టంరా అందుకే నీకు ఆ పేరు పెట్టాను. నీకు చేతనైనంత వరకు మంచి చెయ్యటానికి చెయ్, నువ్వంటూ ఒక స్థాయికి రాగలిగితే కొంతమంది జీవితాలలోనైనా వెలుగు నింపటానికి ప్రయత్నించు. నీ పేరుకు చాలా అర్థముందిరా - దాన్ని నిలబెట్టు" అని. మళ్ళీ నాన్నే అనేవాడు "కొడకా నిన్ను కన్నాను కానీ నీ రాతను కనలేనురా. మంచోడిగా బతుకురా" అని. అలా బతకటానికి, వెలుగును పంచటానికి ప్రయత్నించటమే చేసిన తప్పా. అది సాధించలేక వెళ్లిపోతున్నందుకా ఈ బాధ?
          అసలు నేనేం తప్పు చేసాను? న్యాయం చెయ్యటానికి, అన్యాయాన్ని ఆపటానికి ప్రయత్నించాను. బహుశా తప్పేనేమో.
          "అయ్యా మేమింక పోరాడలేమయ్యా, మా బతుకులు తెల్లారిపోయినయ్యి. మా పిల్లల బతుకులనన్న ఇంత ఎలుతురు నింపు అయ్యా చచ్చి నీ కడుపునా పుడతా" అంటూ కాళ్ళు పట్టుకున్న ఫ్లోరైడ్ బాధిత గ్రామంలోని ముసలి వ్యక్తి; "ఇంకా ఈ నదిలో తోడటానికి ఇసుక ఏమీ లేదయ్యా. వానాకాలంలో నదికి నీల్లోచ్చినయ్యంటే మా ఊరికి వరదోచ్చినట్టే సామీ. వాన పడకపోతే పంటకు నీల్లుండవు, వాన పడితే పంట కొట్టుకపోతాది" అంటూ గోడును వెళ్లబోసుకున్న ఇసుక అక్రమ రవాణాకు గురవుతున్న ప్రాంత గ్రామ రైతు - ఇలా ఒకటా, రెండా అసలు ఒక్క జిల్లాలోనే ఇన్ని సమస్యలుంటే; ఈ రాజకీయ నాయకులు ఇన్ని సమస్యలు సృస్తిస్తుంటే మరి రాష్ట్రం మొత్తం మీద; దేశంలో ఎన్ని సమస్యలుండాలి? ఈ సమస్యలకు మూలం వెతకటమే తప్పా? "మనం మనం ఒక కులపోల్లం. నువ్వు నాకు, నేను నీకు ఒకరికొకరికి సహాయం చేసుకోవాలి అబ్బీ." అంటూ కులం కార్డుతో వచ్చిన ఏమ్మేల్యేను చేసిన తప్పులకు జైల్లో పెట్టించటం తప్పా?
          ఏమో అవన్నీ తప్పులే కావోచ్చు ఈ రాజకీయం దృష్టిలో. అందుకేనా నాకు ఈ శిక్ష విధించింది?
          చిన్నప్పుడు పొరపాటునో లేక ఆటల్లో భాగంగానో కిందపడితే నాన్న పైకి లేపేవాడు కాదు. "నాన్నా ఎవరో వస్తారని ఎప్పుడూ ఎదురు చూడకూడదురా. నీకు శక్తి వుంది, లేవగల సత్తా ఉంది. అవి ఉపయోగించు." అందుకే ఇప్పుడు కూడా ఎవరికోసం ఎదురు చూడకుండా ఒంటరిగానే పోరాటం చేసాను. నేను ఏమి చెయ్యాలనుకున్నా వెంటనే అది రాజకీయనాయకులకు తెలిసిపోయేది. అందుకే ఎవరికీ చెప్పకుండా ఒంటరి పోరాటం సాగించాను. ఎవరికోసం ఎదురు చూడకూడదన్న నాన్న చెప్పిన మాట పాటించాను.
          ... అయిపొయింది, అంతా చీకటి. నాకు తెలుస్తోంది. ఈ 'రవి'కి రాత్రి వచ్చింది, చీకటి ముసురుకుంది. కానీ ఒక్క ప్రశ్న మాత్రం వెంటాడుతూనే ఉంది - "నన్ను చంపింది ఎవరు? రాజకేయమా లేక ఎప్పుడూ ఎవరో వస్తారు, సమస్యలను పరిష్కరిస్తారు అని ఎదురు చూసే సమాజమా? నన్ను చంపిన తిమిరమా గుర్తుంచుకో మళ్ళీ ఉదయం వస్తుంది, రవి వస్తాడు - కిరణాలతో వెలుగును పంచుతాడు.

          కిరణాలు ఆగిపోతే దీపాలు వెలిగించే మనం
          యోధుడు పడిపోతే యుద్ధం ఆపేస్తాం
          మనకోసం పుట్టే యోధులు మానవులే
          మరణానికి అతీతులేమీ కాదు
          గళమెత్తి పోరాడితే గొంతు కోసే సమాజం ఇదని
          ముందుండి నడిపిద్దామని అనుకుంటే
          వెనకున్న జనం వెన్ను చూపుతారని
          తెలియని ఒక రవి కిరణం ఆరిపోయింది
          ఇకనైనా ఇపుడైనా మేలుకుందాం
          కొవ్వొత్తుల సంతాపాలు కాదు కావాల్సింది
          ఆ పోరాటాన్ని కొనసాగించాలి
          ఆ స్ఫూర్తిని నిలిపి ఉంచాలి
          వెలుగును పంచే 'రవి' కిరణమా – జోహారు

(ఆశయం కోసం అసువులు బాసిన డి.కె. రవి IAS కి నా ఈ కాల్పనికత అంకితం.)

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన