రామ్ చరణ్ 'బ్రూస్ లీ' సినిమా గురించి నా రాత

రామ్ చరణ్ 'బ్రూస్ లీ' సినిమా గురించి నా రాత
**********************************************
మరికొంత సమయం వృధా చెయ్యాలా, వద్దా అన్న చిన్న మీమాంస. దీని గురించి కూడా రాయాలా అనే భావన. అయినా గొప్పగా అనిపించిన వాటి గురించేనా, ఇలాంటి వాటి గురించి కూడా రాయాలి కదా. పొరపాటున వారి కంటబడితే
, అర్థం చేసుకోగలిగే సహృదయత ఉంటె తరువాతి కళా ఖండాల విషయంలో జాగ్రత్తపడతారేమో అని ఒక చిన్న ఆశ. ఇదంతా నేను నిన్న చూసొచ్చిన 'బ్రూస్ లీ' చలన చిత్రం గురించే ... అర్థం కాని విషయం (బాధించిన విషయం కూడా) ఈ చిత్రానికి, బ్రూస్ లీ కి ఎటువంటి సంబంధం ఉందని ఆ పేరు పెట్టారో మరి, కథానాయక పాత్రధారుడైన చరణ్ చేతిపై బ్రూస్ లీ పచ్చ బొట్టు తప్ప. బ్రూస్ లీ అంటే కేవలం ఒక పోరాట పధ్ధతి మాత్రమే కాదు. బ్రూస్ లీ సినిమాలు చూసిన ప్రభావంతో ఒక కాలు, చెయ్యి పైకెత్తి బ్రూస్ లీ పోరాట భంగిమను కాపీ కొట్టి అలా నిలబడి 'హియ్యా' అనడమే బ్రూస్ లీ (అంటే అదేలెండి పెద్ద పోరాట యోధుడిలా పోస్ కొట్టడం అన్నమాట) అనుకుంటే ఒకానొకప్పుడు నన్ను కూడా కొంత మంది మిత్రులు 'బ్రూస్ లీ' అనేవారు. ఆ పేరు పెట్టడం వల్ల ఏదో బ్రూస్ లీ జీవితం నుంచో, లేదా ఆయన తత్త్వం నుంచో స్పూర్తి పొంది కథ రాసుకున్నారేమో అని నా లాంటి అమాయకులు భ్రమ పడే అవకాశం ఉంది, కానీ దర్శకుడి పేరు చూసిన తర్వాత ఆ భ్రమలు నాకైతే తొలగిపోయాయనుకోండి. :)

ఇక అసలు విషయానికి వస్తే చిరంజీవి నూటయాభయ్యవ చిత్రానికి ట్రైలర్ సరిగ్గా ఎడిట్ చెయ్యలేదనిపిస్తోంది - నాలుగు నిమిషాలుండాల్సిన ట్రైలర్ దాదాపు రెండున్నర గంటలు అయింది - ఎడిటర్ ఎవరో కనుక్కుని క్లాస్ పీకాలి. అయినా ఏ మాటకామాటే చెప్పుకోవాలి వయసు వల్ల వచ్చిన నెమ్మదితనం (స్లో నెస్) పక్కనపెడితే (అఫ్ కోర్స్ దాన్ని స్లో మోషన్ లో తీసి స్టైల్ గా చూపారనుకోండి) 'బాస్ ఇస్ బ్యాక్' అన్న వాక్యానికి వంద శాతం న్యాయం జరిగింది అని నా అభిప్రాయం. చిరంజీవి నటనకు విపరీతమైన అభిమానిగా చిరంజీవి ఉన్న మూడు/నాలుగు నిమిషాల వల్ల కడుపు నిండినట్టైంది. తనదైన ఆ వ్యావహారికం, శారీరక భాష మళ్ళీ తెరపై చూడటం చాలా, చాలా అంటే చాలా ఆనందం కలిగించింది. తెరపై గుర్రమెక్కి బాసు అలా స్లో మోషన్ లో వస్తోన్న దృశ్యాలు వస్తూంటే కెవ్వు కేక, రచ్చ రంబోలా. చిరంజీవి మిస్సయ్యాడో లేదో తెలీదు కాని చిరంజీవి నటనను విపరీతంగా అభిమానించే నాలాంటి వాళ్ళు ఎంత మిస్సయ్యారో ఆ నాలుగు నిమిషాలే తెలిపింది. ఇంకా ఎన్నాళ్ళు చిరంజీవి నూట యాభైయ్యవ చిత్రం కోసం ఎదురుచూడాలో!
అదేంటి 'బ్రూస్ లీ' సినిమా గురించి అంటూ మొదలెట్టి బ్రూస్ లీ గురించి, చిరంజీవి అతిథి పాత్ర గురించి తప్ప సినిమా గురించి ఒక్క ముక్కా మాట్లాడట్లేదు అనుకుంటున్నారా? ఏముందని చెప్పటానికి? కథ విషయంలో పెద్దగా మాట్లాడటానికి ఏమీ లేదు - కానీ కథలో ప్రధాన అంశం అయిన 'అక్క కోసం తమ్ముడు త్యాగం చెయ్యటం' అన్న అంశం కూడా సరిగ్గా పండలేదు. ఎవరి నటన గురించి కూడా మాట్లాడునుకోవటానికి ఏమీ లేదు. కనీసం వారి ప్రతిభను చూపుకునేంతటి సన్నివేశాలు కూడా లేవు, అవకాశం ఉన్నా అలాంటి సన్నివేశాలు అల్లుకోలేదు. బహుశా శ్రీను వైట్ల, కోన వెంకట్ & గోపి మోహన్ లకు ఈ సినిమా కోసం చరణ్ & కో కుదిర్చిన బలవంతపు రాజీ వల్లనేమో సినిమాలో ఎవరి ముద్ర కూడా కనబడలేదు. ఇక సంగీతం గురించి - ఆడియో కేసెట్/సిడి లో ఎలా వినబడ్డాయో తెలీదు కానీ సినిమా ధియేటర్ లో చూసినప్పుడు మాత్రం అయిదు పాటలు ఒకే టోన్ లో కాదు కాదు ఒకే పాట అయిదు సార్లు వచ్చినట్టనిపించింది - మరి అలా అనిపించినందుకు తప్పు నాదా లేక అలా అనిపించేలా (లేక ఒకే సంగీతం అయిదు పాటలకు) సంగీతం ఇచ్చిన తమన్ దా తెలియట్లేదు. నేపథ్య సంగీతం గురించి మాట్లాడుకోకపోవటమే మంచిది. చరణ్ విషయానికి వస్తే ఎలగెలగొ ప్రయత్నించాడు కానీ సన్నివేశాలలో బలం కానీ, సరియైన తీత (దర్సకత్వ ప్రతిభ అని నా ఉద్దేశం ఇక్కడ) లేకపోవడం వల్ల తన పాత చిత్రాల తరహాలోనే కనిపిస్తాడు, అనిపిస్తాడు, వినిపిస్తాడు. కథానాయిక దుస్తుల విషయంలోనే కాదు నటనలో కూడా పొదుపరి తనం పాటించింది - లేదా బహుశా తనకు అన్నీ ఒకేలాంటి సన్నివేశాలు ఉండటం వల్లనో ఒకే ఎక్స్ప్రెషన్ తో నెట్టుకొచ్చింది. పాటల్లో అంటే ప్రేక్షకుల దృష్టి నటన మీద ఉండదు కానీ సన్నివేశాల్లో నటన మీద కూడా ఉండే అవకాశం ఉండటంతో తన నటనా ప్రతిభ తేటతెల్లమైంది, అక్కడికీ సన్నివేశాలలో కూడా దుస్తుల పొదుపరితనంతో దృష్టి మరల్చాలని ప్రయత్నించింది. మన్నించాలి ఒకటి కాదు రెండు రకాల ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిందండోయ్ - ఒకటి నోరు మూసుకుని, కళ్ళు మామూలుగా ఉంచుకోవడం; రెండు నోరు, కళ్ళూ రెండూ పెద్దగా తెరచి చూడటం (కథానాయకుడినే అనుకోండి). చరణ్ అక్క పాత్ర పోషించిన కృతి కర్బందా గురించి, తన ప్రతిభ మనకు ఇంతకు ముందే తెలుసు కాబట్టి మళ్ళీ చెప్పాలనుకోవట్లేదు. ఇక ప్రతి నాయక పాత్రలు పోషించిన సంపత్ రాజ్ మరియు అరుణ్ విజయ్ - ఇద్దరి గురించి పెద్దగా ఏమీ చెప్పుకోవడానికి లేకుండా చేసారు. సంపత్ రాజ్ మాత్రం కొద్దిగా రిలాక్స్ అయ్యుంటాడు, ఎందుకంటే మిగతా సినిమాల్లోలాగా ఈ సినిమాలో కూడా తను పెద్దగా అరవడం, లేదా కత్తో తుపాకో పట్టుకుని పరిగేట్టం లేవు కాబట్టి. అరుణ్ విజయ్ గురించి చెప్పాలంటే తనను తమిళ 'అసల్' (తెలుగు అనువాదం 'ఎంతవాడైనా గానీ' అనుకుంటాను) తో ఎవరినా గుర్తుంచుకుని ఉంటే మరచిపోవటానికి ఈ సినిమా చాలు. తను మళ్ళీ 'అసల్' లాంటి సినిమా కోసం ఎదురు చూడాలి. మిగతా వారి గురించి చెప్పుకోవటానికి ఏమీ లేదు - అలా వచ్చి వెళ్లిపోతుంటారు అంతే. ఇప్పటికే వద్దనుకుంటూనే చాలా చెప్పాను. ఇక చాలు.
చివరగా - బ్రూస్ లీ అంటే కేవలం ఒక పోరాట పద్ధతినో లేక కేవలం ఒక కతానాయకుడో మాత్రమే కాదు. ఒక దార్శనికుడు (మన రాజకీయ నాయకుల్లాంటి దార్శనికత కాదు), తత్వవేత్త, రచయిత, కళాకారుడు, మంచి మనిషి, ఒక చరిత్ర. బ్రూస్ లీ గురించి తెలుసుకోవాలంటే కేవలం అతడి సినిమాలు చూసి మాట్లాడటం కాదు అతడి పుస్తకాలు చదవాలి. ఓపిక ఉన్నవారు, చదువరులు, పుస్తకాల పురుగులు ఇంతకు ముందు చదవకపోయుంటే చదవటానికి ప్రయత్నించండి. అలాంటి ఒక స్ఫూర్తిమంతమైన వ్యక్తీ పేరును తమ చిత్రం పేరుగా పెట్టుకుంటున్నప్పుడు కనీసపాటి జాగ్రతలైనా తీసుకోవాల్సి ఉన్ది. కనీసం కథానాయక పాత్రధారి ఏదో ఒక సందర్భంలో బ్రూస్ లీ వల్ల ప్రభావితుడైనట్టుగానో చూపాల్సింది. కేవలం అతడు డూప్/స్టంట్ మాన్ కావడం వల్ల కార్తిక్ కాస్త బ్రూస్ లీ అని పిలువబడ్డాడు అని చూపడం ఎంతవరకు భావ్యమో వారికే తెలియాలి.

Comments

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన