ప్రత్యేక రాయలసీమ పోరాటానికి, కలకు అమరావతి శంఖుస్థాపన కార్యక్రమం ఊతమిచ్చిందా? - 1

ప్రత్యేక రాయలసీమ పోరాటానికి, కలకు అమరావతి శంఖుస్థాపన కార్యక్రమం ఊతమిచ్చిందా? - 1
******************************
***************************************************************
అమరావతి శంకుస్థాపన అనే ఒక బృహత్తర ఖర్చుతో కూడిన కార్యక్రమం పూర్తయ్యింది. భవిష్యత్తులో ఆ నగరం ఎలా వుండబోతోందో తెలియదు. కానీ, ఇది ఒక చరిత్రనే - ఎందుకంటే ఆహారధాన్యాల ఉత్పాదకత తగ్గిపోతోందని అగ్రరాజ్యాలు కూడా ఆందోళన పడుతూ చేతనైనంతవరకూ పంటపొలాల రక్షణ చేపడుతూ, ఆహారధాన్యాల ఉత్పాదకతకు ఇతరత్రా మార్గాలు అన్వేషిస్తూన్న తరుణంలో ఇక్కడి దార్శనికుడు అధికారికంగానే ముప్ఫై మూడువేల ఎకరాలను రాజధాని పేరుతో తన గొప్ప కోసం, ఫాల్స్ ప్రిస్టేజ్ కోసం, ప్రచారం కోసం సంతర్పణ చెయ్యటం అన్నది ఆయన దార్సనికతకు దర్పణంగా చరిత్రలో ఖచ్చితంగా నిలబడిపోతుంది. ఇతర వైఫల్యాల నుంచి దృష్టి మళ్ళించటానికి వందల కోట్లు ఖర్చు పెట్టి శంఖుస్థాపన కార్యక్రమం చేపట్టటం అందునా రాష్త్రం ఇటువంటి దీనస్థితిలో ఉన్నప్పుడు అవసరమా అనే ప్రశ్న వేసేవారేవరైనా ఉన్నారు అంటే వారు అభివృద్ధిని వ్యతిరెకించెవారే ఎందుకంటే ఆ రెండు పత్రికలూ అలానే చెపుతాయి కాబట్టి. భవిష్యత్తులో ఆహారధాన్యాలు కొనే ప్రతి క్షణంలో తమరి పేరు గుర్తోచ్చెంతటి గొప్ప దార్సనికుడిగా చరిత్రలో నిలిచిపోతారు.వివిధ మార్గాల ద్వారా అధికారికంగా సమీకరించబడిన లేదా సమకూర్చబడిన ముప్పైమూడువేల ఎకరాలతో పాటు అస్మదీయ, తస్మదీయ వర్గాలు ముందుగానే సమీకరించి పెట్టుకున్న స్థలాలతో పాటు 'రియల్ బూమ్' అనే వేలంవెర్రిలో చేరబోతున్న ప్రాంతాలు కలుపుకుంటే దాదాపుగా లక్షకు పైగా ఎకరాల మంచి దిగుబదినిచ్చే పంట పొలాలు రాజధాని నిర్మాణాల క్రింద నిలబడి నవ్వుతూనే ఉంటాయి మన దార్శనికత చూసుకుని.
అమరావతి నిర్మాణం వల్ల వ్యవసాయ రంగానికి జరిగిన తీవ్ర నష్టం, ఆహారధాన్యాల ఉత్పాదకతపై దెబ్బ అన్నవి తొలిగా కనిపించే అంశాలు. మరో అంశం ఏంటంటే - కారణాలు ఏవైనప్పటికీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కాక ప్రత్యెక హోదా అంశాన్ని అటకెక్కించారెన్దుకో చంద్రబాబు. కేవలం రాజధాని నిర్మాణానికే నాలుగైదు లక్షల కోట్లు అవసరమావుతాయి, ప్రత్యెక హోదా కావాల్సిందే  అంటూ కాంగ్రెస్ మీద విరుచుకుపడ్డ తెలివితేటలు మోడీ గారి కాళ్ళకు సాగిలపడ్డాయెందుకో. ఇక అతి ముఖ్యమైన విషయం - ప్రస్తుతానికి చిన్నస్తాయిలోనే అయినా రాయలసీమ ప్రాంతంలో రగులుతున్న అసంతృప్తి అన్నది అతి ముఖ్యమైన విషయం. ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాలు కలిపినప్పుడు, విడిపోయినప్పుడు తెలంగాణా ప్రాంతానికి ఏమైనా నష్టం జరిగిందో లేదో నాకైతే పెద్దగా అవగాహన లేదు (కాని జరగకపోయుంటే అన్ని దశాబ్దాలుగా వారిలో ప్రత్యేక రాష్ట్రేచ్చ ఉండేది కాదు అని నమ్ముతాను) రాయలసీమకు మాత్రం తీరని నష్టం జరిగింది - రాజధానిని కోల్పోవటంతో మొదలైన నష్టాలు జరుగుతూనే ఉన్నాయి. గత రెండు దశాబ్దాలకు పైగా (ఒకటిన్నర సంవత్సరం నుంచి విభజిత ప్రాంతానికి) ముఖ్యమంత్రులుగా రాయలసీమ ప్రాంత నేతలే ఉన్నప్పటికీ (మధ్యలో రోశయ్య గారు ముఖమంత్రిగా ఉన్న కాలాన్ని వదిలేస్తే) పెద్దగా ఒరిగినదేమీ లేదు. చంద్రబాబు గతంలో మిగతా ప్రాంతాలను గాలికొదిలేసి హైదరాబాద్ మీద మాత్రమే దృష్టి కేంద్రీకరించి ఎంతటి తప్పు చేసారో ఇప్పుడు మళ్ళీ రాష్ట్రం మొత్తాన్ని, సమస్యలను గాలికొదిలేసి కేవలం అమరావతి మీద మాత్రమే దృష్టి కేంద్రీకరించి అంతకు పెద్ద తప్పు చేస్తున్నారు. దీనివల్ల అత్యధికంగా నష్టపోతున్నవి రెండు - ఒకటి వ్యవసాయ రంగం, రెండు రాయలసీమ ప్రాంతం. రాయలసీమ ప్రాంతానికి అంటూ ప్రకటించిన విద్యాలయాలు, కొన్ని పరిశ్రమలు వంటివాటిని గుట్టు చప్పుడు కాకుండా కృష్ణా, గోదావరి ప్రాంతాలకు తరలించటం వంటివి ఆ రెండు పత్రికలూ తెలుపకపోయినా సోషల్ మీడియా ద్వారా కొంతమంది విస్తృతంగా విసదీకరిస్తూ తెలుపుతున్నారు. బాబు గారు, ఆయన పూజారులు గోబెల్స్ ప్రచారంలో ఆరితెరిపొయినవారు కాబట్టి ఇంకో భావనను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు, అదేమిటంటే 'ఎవరైనా బాబును గానీ, ఆయన దార్సనికతను గానీ, అమరావతి నిర్మాణాన్ని గానీ విమర్సించారా అయితే వారు అభివృద్ధిని వ్యతిరేకించేవారు లేదా ప్రతిపక్షనేత జగన్ మద్దతుదారులు' అని. సంవత్సరానికి రెండు/మూడు పంటలు పండే పచ్చని పంటపొలాలను వేలాదిగా నాశనం చేసి నిర్మించే రాజదానివల్ల భవిష్యత్తులో ఏర్పడబోయే పరిణామాలు బహుశా వారి పరిమిత దార్సనికతకు కనబడి ఉండకపోవచ్చు, ఎందుకంటే వారి ప్రస్తుత దార్శనికత 2019 ఎన్నికల వరకే పరిమితం. విద్యాధికులైన అనేకమంది మిత్రులు కూడా అమరావతి నిర్మాణం అనేది ఒక అద్భుతంగా పేర్కొంటూ వ్యవసాయరంగానికి జరుగుతున్న నష్టాన్ని విస్మరించడం బాధాకరం. అబివృద్ది అంటే పంట పొలాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయడం కాదు అని తెలుసుకోలేకపోతే భవిష్యత్తరాలు ఆహారధాన్యాల కొరతతో అలమటిస్తాయి. ఇప్పటికే అగ్ర రాజ్యాలు ఈ విషయాన్ని గమనించి పొలాల పరిరక్షణకు, ఇతర మార్గాల ద్వారా ఆహార ధాన్యాల ఉత్పాదకతకు సంబంధించి పరిశోధనలు చేస్తున్నాయి. మనమేమో ఉన్న పొలాల్ని ఇలా నాశనం చేస్తున్నాం ఫాల్స్ ప్రిస్టేజ్ కోసం. పిడికెడు మట్టి, చెంబెడు నీళ్ళు తప్ప సభాముఖంగా అడుక్కున్నా కూడా ప్రధాని విదిలించేదేమీ లేదు, బహుశా తిరుపతి ఎనికల ప్రచార సభ వీడియో చూపితే గతమేమైనా గుర్తోస్తుందేమో, అయినా ఇప్పుడు ఎన్నికలేమీ లేవుగా. బీహార్ ఎన్నికల సభలో లాగా వేలం పాట లాంటిది పాడి ఏంటో కొంత పడేస్తాడేమో అని ఎదురు చూసిన వారికి దేవమార్గం (ఆకాశం) చూపటం తప్ప ప్రధాని చేసిందేమీ లేదు - ఆయన విమాన, భూమార్గ ప్రయాణ ఖర్చులు ఈ శంఖుస్థాపన కార్యక్రమానికి చేసిన అనవసర ఖర్చుకు జత కావడం తప్ప.
వ్యాస పరంపరలో మొదటిగా ఇందులో ఉపోద్ఘాతంగా ప్రస్తుత పరిస్థితుల ప్రస్తావనతో మొదలు పెట్టటం జరిగింది. వాస్తవిక పరిస్థితుల గురించి; జరిగిన జరుగుతున్న అన్యాయం, వివక్ష గురించి; ఊపిరి పోసుకుంటున్న ప్రత్యేక ఆకాంక్ష తదితరాల గురించి తరువాతి వ్యాసాలలో ప్రస్తావిస్తాను. ఇది విస్తృత పరిశోధనాత్మక అంశం కాబట్టి నా చిత్తానికి తోచింది రాయాలనుకోవట్లేదు, పరిశోధన చేస్తున్నాను కాబట్టి వ్యాసానికి వ్యాసానికి మధ్య కాల పరిమితి ఒక్కోసారి ఎక్కువగా ఉండొచ్చు. నా రచనలు చదువుతున్న వారు ఒకవేళ ఆలస్యమవుతే మన్నించగలరు.
అవసరమో, అసందర్భామో కానీ ఒక చిన్న వివరణ - ఏ జెండా కింద నిలబడట్లేదు, జాతీయ జెండాకు తప్ప మరే పార్టీ జెండాకు వందనం చేసే అలవాటు లేదు. 'విభజన' అన్న భావనను నేను ఈరోజుకు కూడా మనసా, వాచా, కర్మణా వ్యతిరేకిస్తాను. రాయలసీమ ప్రాంతానికే చెందిన వాడిగా అక్కడి వాస్తవిక పరిస్థితుల మీద అవగాహన ఉంది. పాలు తాగినోడు రొమ్ము మీద గుద్దినా ఓర్చుకున్న రాయలసీమ ప్రాంత ప్రజలు నేడు అధికార, ప్రతిపక్ష నేతలు ఇరువురూ రాయలసీమ ప్రాంతానికే చెందినవారే అయినప్పటికీ జరుతున్న నష్టం చూసి ఆసంతృప్తితో రగులుతూ తమ సమస్యల పరిష్కారానికి కూడా ప్రత్యెక రాష్ట్రంగా ఏర్పడటమే పరిష్కారం అనే చారిత్రక నిర్ణయానికి వస్తున్నారు. దాన్ని ఎత్తి చూపుతూ, రాజకీయాలకు అతీతంగా జరిగిన అన్యాయం వివరిస్తూ వాస్తవిక పరిస్థితుల దృష్ట్యా రాయలసీమ వాసుల ప్రస్తుత ప్రత్యేక ఆకాంక్ష ఉద్యమంగా రూపుదిద్డుకోగలదని భావించటానికి గల కారణాలు కూడా తరువాతి వ్యాసాలలో వివరిస్తాను.
(
మళ్ళీ మరో వ్యాసంతో వాస్తవాలతో కొద్ది రోజులలో ...)

Comments

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన