విక్రమార్కుడు - రాజకీయాలు - 2: లెక్కలేనంత తిక్క ఉన్నోడు

వంశీ కలుగోట్ల // విక్రమార్కుడు - రాజకీయాలు - 2 // 
లెక్కలేనంత తిక్క ఉన్నోడు
ముందు మాట: ఈ రచనలోని పాత్రలు, అంశాలు కేవలం కల్పితాలు మాత్రమే ఎవరిని ఉద్దేశించినవి కావు.
***********************************************************************************
పట్టినపట్టు వదలని మహాపరాక్రముడు, అవిశ్రాంత శ్రామికుడు అయిన విక్రమార్కుడు అలుపు సొలుపు లేనివాడై చెట్టుమీది భేతాళుడిని భుజం మీదకెత్తుకుని, మరో చేతిలో కత్తి పట్టుకుని అమావాస్య రాతిరిలో భయములేనివాడై నగరం వైపుగా తన ప్రయాణం మొదలెట్టాడు. విక్రమార్కుడికి పట్టుదల ఎలాగో భేతాళుడికి నోటి దూల అలాగే కాబట్టి భేతాళుడు ఊరికే ఉండకుండా తన అలవాటు ప్రకారం మాట్లాడటం మొదలెట్టాడు.
"విక్రమార్కా, భయము వలదు. నేను నీకు ఇంతకుమునుపు చెప్పిన 'మచ్చలేని మనిషి' కథలో చివరలో అడిగిన ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పలేదని నాకేమీ కోపము లేదు ఎందువల్లననగా అది ఎంతటి క్లిష్టమైన ప్రశ్న అన్న విషయం నాకు తెలుసు ఇక నీలాంటి వాడికి అంటే అదే భవిష్యద్దర్సనం సరిగ్గా లేని వానికి ఇంకెంత కష్టమో ఊహించుకోగలను"
"భేతాళా నా సహనమునతో పరాచికములు ఆడకుము."
"రాజా కోపము వలదు, సరి సరి. ఇప్పుడు నీకు మార్గాయసము తెలియకుండా 'లెక్కలేనంత తిక్కున్నోడు' గురించి వివరించెదను. ఇంతకుముందు లానే ఇది కూడా భవిష్యత్ రాజకీయాలను ప్రతిబింబించే విషయమే. ఒక కళాకారుడు ప్రజలలో మార్పు తీసుకురావాలని చేసిన ప్రయత్నమే ఈ 'లెక్కలేనంత తిక్కున్నోడు' . జాగ్రత్తగా విను"
*                *                 *
అనగనగా ... ఒక ఊరు. ఆ ఊరిలో ప్రసిద్ధికెక్కిన కళాకారుడు పోతురాజు. పోతురాజు మామూలోడు కాదు. పోతురాజు వేషం కట్టి ఆట మొదలెట్టాడంటే చుట్టుపక్కల ఒక అయిదారు ఊళ్ళ నుంచి కూడా జనాలు ఎగబడి వచ్చి చూస్తారు. ఊళ్ళో పిల్లకాయలు, ఆటమీద ఇష్టం ఉన్నవారు పోతురాజు అంటే పడి చచ్చిపోతారు. అదీ పోతురాజు స్థాయి. పోతురాజు ఎవరితోనూ పెద్దగా మాట్లాడడు. వేషం కట్టి, ఆట ఆడినంత సేపే జనాల ముందు ఉండేది. ఆట అయిపోగానే ఏ గుడికో వెళ్లి ధ్యానముద్రలోకి వెళ్ళిపోతాడు లేదంటే ఊరవతల తనకున్న కొద్దిపాటి పోరంబోకు పొలంలోకి వెళ్లి గడ్డి పీక్కుంటూ అదే కలుపు తీస్తూ కూచుంటాడు. పోతురాజుకు తెలిసినవి మూడే వేషం కట్టి ఆట ఆడటం, ధ్యానం చేసుకోవడం, గడ్డి పీకటం అదే కలుపు తీయటం. పోతురాజు వేషం కడుతున్నాడంటే మిగతా వేషగాళ్ళు పోతురాజు ఆట అయిపోయేవరకు ఎదురుచూస్తారే తప్ప పోటీకి రారు. పోతురాజు ఊరు అంటే అదే పోతురాజు ఉండే ఊరు ఒక చిన్న పల్లెటూరు. భారతదేశానికి 'ఉపఖండం' అని పెరున్నట్టే పోతురాజు ఉండే ఊరిని 'ఉపరాష్ట్రం' అనొచ్చు ఎందుకంటే రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితికి దర్పణం పట్టేలా ఉంటుంది ఆ ఊరు. రాష్ట్ర రాజకీయాల్లో ఎన్ని వర్గాలు, విభిన్నతలు ఉన్నాయో ఆ ఊరి రాజకీయాల్లో కూడా అంతే ఉంటాయి. ఆ విధంగా ముందుకు పోవాలని పోరాడే కేశవ నాయుడు, తేనే పోసిన కత్తిలాంటి పాండురంగారెడ్డి, విభజించి పాలించు అనే శేఖరం మూడు విభిన్న రీతులతో మూడు వర్గాలకు నాయకత్వం వహిస్తూ ఆ ఊరి రాజకీయచిత్రపటంపై తమదైన ముద్ర వేసారు. అధికారం మాత్రం గత పాతిక సంవత్సరాలుగా కేశవ నాయుడు లేదంటే పాండురంగారెడ్డి ఈ ఇద్దరి మధ్యనే తిరుగుతోంది. (శేఖరం గురించి తరువాత చెప్పుకుందాం)
పోతురాజు కేవలం వేషం కట్టి ఆటవేసే వాడు మాత్రమే కాదు పలు రకాల పాత్రలతో జనాలలో విపరీతమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. ఎన్నికల టైములో అటు కేశవ నాయుడు ఇటు పాండురంగారెడ్డి ఇద్దరు కూడా పోతురాజును తమకు మద్దతు తెలుపమని లోపాయికారీ రాయబారాలు పంపుతుంటారు. కానీ పోతురాజు తనేదో, తన లోకమేదో అన్నట్టు ఉంటాడు. తను చూస్తుండగా ఎవరన్నా ఇబ్బందులు పడుతుంటే తనకు చేతనైనంత సహాయం చేస్తుంటాడు. ముందే చెప్పుకున్నాంగా తీరిగ్గా ఉన్నప్పుడు తన పొలంలో కలుపు తీస్తుంటాడని; ఆ పొలంతో పాటు కాస్త మామిడితోట కూడా ఉంది పోతురాజుకి. అక్కడే ఒక గుడిసె వేసుకుని ఉంటాడు. మామిడి పళ్ళు రాగానే తనకు నచ్చిన వారందరికీ తలా ఒక బుట్ట మామిడి పళ్ళు పంపుతుంటాడు. పోతురాజు నుంచి మామిడిపళ్ళ బుట్ట వచ్చిందంటే అదో పెద్ద ఘనకార్యం సాధించినట్టు ఊళ్లోవాళ్ళకి. అలా తనేదో, తన పనేదో అన్నట్టు ఉండే పోతురాజుకి ఉన్నట్టుండి ఉన్నట్టుండి తనేదో ఘనకార్యం సాధించాలని అనిపించింది. అది కూడా సమాజానికి మేలు చేసేది.
"అరేయ్ సాంబడు మనం ఏదో ఒకటి చెయ్యాలిరా. ఈ జనాల్లో మార్పు తీసుకురావాలి" అంటూ సాంబడితో తన మనసులోని మాట బయటపెట్టాడు పోతురాజు.
"ఏందీ సామీ ఉన్నట్టుండి నీక్కూడా రాజకీయాల మీద మనసు మల్లినట్టుంది"
"అట్టా కాదురా సాంబడు, ఈ జనాల్లో మార్పు రావాలి. ఎప్పుడు చూసినా ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని తప్ప తమకి తాము ఏదో ఒకటి మొదలెడదాం అన్న ధ్యాస లేదే. మనదీ ఒక బతుకేనా కుక్కలవలె, నక్కలవలె, సందులలో పందులవలె"
"అర్థం కాలేదు కానీ మస్తు జెప్పినవ్ సామీ. ఇంతకీ ఎం జెయ్యలనుకుంటన్నావ్ సామీ"
"ముందు ఒక పుస్తకం రాద్దామనుకుంటున్నానురా సాంబా. అందులో అసలు ఈ రాజకీయాలు ఎలా ఉండాలి, రాజకీయనాయకులు ఎలా ఉండాలి, ప్రజలు ఎలా ఉండాలి అన్నవన్నీ వివరిస్తా అంటే అదేరా నా మనోభావాలు. ఆ తరువాత ఒక పార్టీ పెడతా. ఎన్నికల్లో పోటీ చెయ్యాలో లేదో తర్వాత ఆలోచిస్తా, మనకు సరైన రాజకీయనాయకులు దొరికేవరకు ఎదురు చూస్తా ... హడావుడి ఏమీ లేదు. కానీ సమయం లేదురా సాంబడు."
"సామీ నాకెందుకో నువ్వు నీ లచ్చుమమ్మతో (పోతురాజు మాజీ భార్య) ఇడిపోకుండా ఉంటె బావుండేదేమో అనిపిస్తాంది సామీ. ఏందో ఇప్పుడు అంతా తిక్కతిక్కగా మాట్టాడుతా ఉన్నావు. లచ్చుమమ్మకి కబురు సెయ్యమంటావా?"
"ఏందిరా సాంబడు నేనేదో చెబితే నువ్వేదో మాట్లాడుతున్నావు? లచ్చుమమ్మ సంగతి పక్కనెట్టు. ఏమైనా మన సైడ్ నుంచి పంచ్ పడాల్సిందేరా సాంబడు. వచ్చేవారం పోతురాజు బహిరంగసభ పెడుతున్నాడు అని చాటింపు వెయ్యి."
"సామీ సాద్దెమేనంటావా సామీ? ఏందో సామీ నువ్వు సెపితే నమ్మాలనిపిస్తాంది ... ఏమీ అర్థం కాకపోయినా బాగుంది సామీ. ఇయ్యాలే దండోరా వేయిస్త సామీ వచ్చే ఆదివారం సభ ... అశ్శరభ దశ్శరభ"
*                *                 *
సభ - అదేదో మామూలోడి సభ కాదు. పోతురాజు సభ - అసలు పోతురాజు వేదిక ఎక్కుతున్నాడంటే అది వేషం కట్టి మాత్రమే. అలా కాకుండా రాజకీయాల గురించి మాట్లాడటానికి అనేసరికి జనాల్లో ఆసక్తి మొదలైంది. అసలు దేన్నీ పట్టించుకోని పోతురాజు రాజకీయాల గురించి మాట్లాడటానికి ఒక సభ పెడుతున్నాడంటే ఆసక్తి రాక ఏమవుతుంది? నేల ఈనిందా, ఇసుక వేస్తే కింద రాలుతుందా అనే స్థాయిలో జనాలు వచ్చేవారే కానీ పోతురాజు ఎంచుకున్న సభాస్థలి గుడి ఆవరణ కావడంతో జనాలకు నిరాశ తప్పలేదు. కానీ స్థానిక కేబుల్ ఆపరేటర్లు పోతురాజు సభను ప్రత్యక్ష ప్రసారం చెయ్యటానికి ఏర్పాట్లు చేసారు. పోతురాజు ఏం మాట్లాడతాడో, ఏమి చేస్తానని చెప్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూడటం మొదలెట్టారు.
పోతురాజు రానే వచ్చాడు. కొద్దిసేపు అభిమానుల/జనుల కోలాహలం భరించిన తర్వాత పోతురాజు మాట్లాడటం మొదలెట్టాడు. "వాళ్లకు, వీళ్ళకు, మీకు అందరికీ - ప్రత్యేకంగా మీ సహనానికి నా నమస్కారాలు, జోహార్లు. నాకోసం ఇంతవరకు వేచి చూసినందుకు కాదు, ఈ చెత్త రాజకీయనాయకులను ఇన్నాళ్ళు భరించినందుకు." జనలోంచి ఎవరో 'పంచ్ పడిందిరోయ్' అంటూ అరిచారు అంతే జనాల అరుపులు. పోతురాజు మళ్ళీ మొదలెట్టాడు "ఇంకెన్నాళ్ళు భరిస్తారు ఈ చెత్త రాజకీయాలను. మనమందరం ఒక్కటిగా ఉండాలి, అవినీతిని పారద్రోలాలి, పంచేలూడేలా పాఠం నేర్పాలి. అసలు నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే అవసరం వచ్చింది కాబట్టి. మీకు తెలుసు నేను గంజి తాగాను, సాంబడి కొట్లో సారా తాగాను, కిట్టిగాడి కల్లు కాంపౌండ్ లో కల్లు తాగాను. గంజి తాగేవాడి బాధ తెలుసు, సారా తాగేవాడి ఆనందం తెలుసు, కల్లు తాగేవాడి తృప్తి తెలుసు. (ఈ మాటలు చెపుతున్నపుడు ఒకానోకరకమైన భావనతో పోతురాజు కళ్ళు చెమర్చాయి - అది చూసిన జనాల్లోని ఆడవాళ్ళు కొందరు భోరున ఏడుపు లంకించుకున్నారు కూడా - తనని తాను సంభాళించుకుని పోతురాజు మళ్ళీ మొదలెట్టాడు) ఏమైనా చెప్పండి వోటు వేసినరోజు మన చేతిలో ఏదో పవర్ ఉన్నట్టనిపించే ఆ ఫీలింగ్ ఉంటాది కదా అది సూపర్ అప్పా. ఇంతకీ నేనేం చెపుతున్నానంటే మనం ఎన్నాళ్ళు ఈ అవినీతిని భరించాలి. అందరూ అవినీతిపరులే. నాయకులారా గుర్తు పెట్టుకొండి మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. నాకు ఈ ఎన్నికల్లో పోటీ చెయ్యాలనే ఉంది, కానీ ఏరీ పోటీ చేసేవారు ఏరీ? సరైన వారు కావాలి, ముందుకు రండి. ఇంతకు మించి ఏమి చెప్పాలో అర్థం కావట్లేదు అందుకే ఇదిగో ఈ పుస్తకం రాసాను. 'నేను - నా పైత్యం' అనబడే ఈ పుస్తకంలో నా పైత్యం అదే నా ఆలోచనలు అన్నీ వివరించాను. చదవండి, చదివి ఎదగండి. ఇక పోరాటం మొదలుకాబోతోంది ... "
అర్థమైనోల్లకి అర్థమైంది కానోళ్ళకి కాలేదు. మొత్తానికి పోతురాజు మాత్రం తను చెప్పాలనుకున్నది చెప్పాడు. జనాలు చప్పట్లు కొట్టారు.
*                *                 *
ఏమైందో తెలియదు కాని సభ పెట్టి వారం తిరగకుండానే పోతురాజు కేశవకు మద్దతుగా రంగంలోకి దిగాడు. "కేశవ మీద నాకు నమ్మకం ఉంది, మీరు కూడా నమ్మండి. చెప్పినవి చెయ్యకపోతే చొక్కా పట్టుకుని నిలదీస్తా. నేను పూచీ, కేశవ లాంటి దార్శనికుడు మన మధ్య ఉండటం, మనకోసం తన జీవితాన్ని పణంగా పెట్టి పోరాడటం మన అదృష్టం. అందుకే నేను పోటీ చెయ్యట్లేదు." అంటూ కేశవకు బాకా ఊదేయ్యటం మొదలెట్టాడు. పనిలోపనిగా పాండురంగారెడ్డి మీద వార్తా పత్రికల్లో ఏవైతే వచ్చాయో వాటినే మళ్ళీ మళ్ళీ వల్లె వేసి, ఆరోపణలు చెయ్యటం మొదలెట్టాడు. చదువుకోకపోయినా కేశవ, పోతురాజు 'గోబెల్స్ ప్రచారం' అన్న పద్ధ తిని అంతగా ఎలా వంటబట్టించుకున్నారో కనీసం గోబెల్స్ అయినా అర్థం చేసుకోగలడో లేదో మరి. పోతురాజు దెబ్బకి కాస్త అటూ ఇటూగా ఉన్న జనాలు కేశవ వైపు తిరగడంతో మొత్తానికి చాలా కాలం తర్వాత ఎన్నికల్లో కేశవ గట్టెక్కి ఉనికిని కాపాడుకోగలిగాడు.
ఇటు ఎనికైలోపోయిన వెంటనే పోతురాజు తన మామిడి తోటలోని గుడిసెకేల్లిపోయాడు. కేశవ తనదైన శైలిలో ఆ విధంగా ముందుకుపోసాగాడు. ఏంతో కాలంగా అధికారానికి దూరంగా ఉండటంతో ఏర్పడిన లోటునంతా పూడ్చుకునేలా సాగిపోసాగాడు. జనాల గోడు వినిపించుకునే దిక్కులేకుండా పోవడంతో జనాలు పోతురాజు వైపు చూసారు (అదే పోతురాజు కోసం ఎదురు చూసారు). తనదీ పూచీ అని, తప్పు జరిగితే ప్రశ్నిస్తా అని, తమ తరఫున పోరాడుతా అని వాగ్దానం చేసిన పోతురాజు మిగతా రాజకీయనాయకుల లాగా కాకుండా మాట మీద నిలబడతాడని జనాలు ఎదురు చూడటం మొదలెట్టారు.
*                *                 *
"సామీ పోతురాజు దేవుడా జనాలు నీ కోసం ఎదురు సూత్తన్నారు సామీ."
"నా కోసమా ఎందుకురా, ఈ మధ్య కాస్త మోకాలు నొప్పి ఎక్కువైందిరా వేషం కట్టడానికి కాస్త టైం పడుతుంది. కనీసం ఒక సంవత్సరం అయినా పడుతుందిరా. వేషం కట్టడానికి సరైన పాత్ర కూడా దోరకట్లేదురా సాంబడు. నీ దగ్గర ఏదైనా వేషం ఉంటె చెప్పు ..."
"సామీ ఏందీ సామీ అట్టా మాట్టాడతన్నావ్. నీ పేరు సేప్పుకుని ఎలచ్చన్లలో గెల్సినాక ఆ కేశవ జనాలను మర్సిపొనాడు సామీ. అంతే కాదు ఆడి బామ్మర్ది ఏదో ఫ్యాక్టరీ కడతాన్నాడని ఉత్తర దిక్కున నాయాల్ది వందేకరాలు జనాలవి అద్దరూపాయి, రూపాయి లెక్కకి అమ్మించినాడు సామీ ఇయ్యమన్నోల్లని బెదిరించి మరీ సంతకం సేయిన్చుకున్నారు. నువేమో సోక్కా పట్టుకుని అడుగుతానంటివి గానీ ఇయ్యాల్టిదాకా పత్తా లెకపొతివి దానికి తోడు నువ్వేమో పక్కూరి సిలకని మరిగినావని జనాల్లో గాలి వార్తలు సామీ. ఊకే లచ్చుమమ్మని పిల్సమంటావ?"
"అరేయ్ సాంబడు రాజకీయం ఇలా చెయ్యాలని నేనేమైనా పుస్తకం రాసానా - ఎలా అనిపిస్తే అలా చేసుకుంటూ పోవటమే. అంతా గాలివాటమేరా. అయినా ఇంత జరుగుతోందా నాకస్సలు తెలీదంటే నమ్ము. నేను రేపే వస్తాను ... నీ కొట్టు దగ్గరకొచ్చి మాట్లాడతా. జనాల తరఫున పోరాడతా."
*                *                 *
సాంబడి సారా కొట్టు దగ్గర యమా గోలగా ఉంది. ఆ రోజు సారా స్టాక్ సరిపోక పక్కూరినుంచి అరువు తెప్పించాడు. తాగుబోతులతో సహా అందరు పోతురాజు కోసం ఎదురుచూస్తున్నారు. రానే వచ్చాడు పోతురాజు. "అన్నోచ్చినాడురోయ్ ... " అంటూ అందరూ పొలోమని పరిగెత్తారు.
"ఏమైంది మనకు? ఎందుకిలా జరుగుతోంది? ఎవడో అన్నాడంట నేను పక్కూరి సిలకను మరిగానని. జనాలకు నా సిలక సంగతి కంటే ఎక్కువగా నోటికి తిండి అవసరం. దాని సంగతి చూడండి. తినడానికి ఒక్క ముద్ద, తాగడానికి గుక్కెడు సారా ఆఅదే నీరు ఇచ్చే దిక్కు లేదు కానీ నన్ను సిలక గురించి ప్రశ్నించే దమ్ముందా మీకు? అసలు మన దేశం ఎలాంటిది, ఎంతటి గొప్ప చరిత్ర మనది? ... (కాసేపు ఆగి అదే మాటలకోసం తడుముకుని) అయినా పొలాలు లాక్కోవడమేంటి అని ప్రశ్నిస్తున్నాను. అయినా పొలాలు లాక్కుంటే నష్ట పరిహారం ఇవ్వాలి కదా. నేను అడుగుతున్నాను ఎవరిని అడిగి పొలాలు లాక్కున్నారు - నన్నడిగారా కనీసం లాక్కున్నోడికైనా చెప్పారా? నేను అడుగుతున్నాను, ప్రశ్నిస్తున్నాను. చెబుతున్నాను చరిత్ర హీనులుగా మిగిలిపోవద్దు అని. ఏదైనా సమస్య వస్తే ముందుండి పోరాడుతాను. ఏమైనా కానీ సాంబడి కొట్లో సారా రుచే వేరప్పా ... " ఇలా ఒకదానికొకటి అస్సలు సంబంధం లేకుండా సాగిన ప్రసంగాన్ని జనాలు విన్నారు - అర్థమైనోల్లకి అర్థమైంది కానోళ్ళకి కాలేదు. మొత్తానికి పోతురాజు మాత్రం తను చెప్పాలనుకున్నది చెప్పాడు. జనాలు చప్పట్లు కొట్టారు.
అంతే అప్పటినుంచి అంతే - ఏదైనా జరిగినప్పుడు ఒక నెల లేదా రెన్నెల్లు ఆగి జనాల ముందుకు వచ్చి పొంతనలేని మాటలు నాలుగు మాట్లాడి వెళ్ళిపోవడం ఆ తర్వాత వెళ్లి తన మామిడితోటలోనో, పోలంలోనో సమయం గడపడం అంతే. కేశవ మాత్రం ఆ విధంగా ముందుకుపోసాగాడు. సాంబడు వచ్చి ఏదో ఒక విషయం గురించి చెప్పినప్పుడో లేక తనకు తోటలోనో, పోలంలోనో పొద్దు పోకపోతెనో జనాల మధ్యకు రావడం పోతురాజు చర్యగా మారింది. ఈ మధ్య వేషం కట్టడం కూడా మానేసాడు - ఎవరన్నా అడిగితే మంచి పాత్ర తట్టట్లేదు అంటున్నాడు కానీ ఎన్నికలయ్యాక కేశవ బాగా ముట్టజేప్పాడని జనాల్లో గాలి వార్తలు ప్రాచుర్యంలో ఉన్నాయి. పోతురాజు ఎలాగు ఎవరితోనూ కలవాడు, మాట్లాడడు తనకు మూడొస్తే తప్ప. ఇక సిలక సంగతి సిలకకే తెలియాలి. పోతురాజు వింత ప్రవర్తన, చేష్టలు, మాటలు చూసిన జనాలు మాత్రం వీడు 'లెక్కలేనంత తిక్కున్న' పోరంబోకు ఎదవా అనుకోవడం మొదలెట్టారు.
*                *                 *
అంతవరకూ చెప్పి భేతాళుడు ఆపేసాడు. "విక్రమార్కా, పోతురాజు యొక్క ఈ వింత ప్రవర్తనకు, పొంతనలేని ప్రసంగాలకు కారణమేమైఉండొచ్చు? అసలు ఏదో మార్పు తీసుకురావాలన్న ఆశయంతో రాజకీయాలలోకి వస్తున్నానని ప్రకటించిన పోతురాజు ఎందుకు క్రియాసూన్యుడైపోయాడు? పోతురాజు కేశవకు లొంగిపొయాడా? భయపడ్డాడా? డబ్బు తీసుకుని రాజీ పడ్డాడా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసీ చెప్పకపోయావో నీకు వరుసపెట్టి పోతురాజు ప్రసంగాలన్నీ ఒకేసారి చూపించగలను. ఆలోచించుకో"
"భేతాళా, దయచేసి పోతురాజు ప్రసంగాలన్నీ వరుసపెట్టి చూపే కార్యక్రం పెట్టుకోకు. నీ ప్రశ్నకు సమాధానం చెపుతాను, నన్ను కాస్త అలసట తీర్చుకోనీ"
"కానివ్వు"
*                *                 *
భేతాళా, నీవు ఉపవాసముల వంటివి మానివేసినట్టున్నావు ఈ మధ్యన బాగా బరువెక్కినట్టున్నావు. అందుకే అలుపు తీర్చుకోవటానికి కాస్త ఎక్కువ సమయం పట్టినందువల్ల నీ 'లెక్కలేనంత తిక్కున్నోడు' భవిష్యత్ దర్సన కథలోని ప్రశ్నకు సమాధానం చెప్పడం ఆలస్యమైనది అన్యదా భావింపకుము. ఇప్పుడు నా సమాధానం వినుము ...
"భేతాళా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో నీవు చెప్పిన విషయమునంతటినీ బాగుగా పరిశీలించితిని. నాకు అర్థమెమైనదేమనగా పోతురాజును ప్రజలు అపార్థం చేసుకోవడం జరిగినదిగా మాకు తోస్తున్నది."
"ఏమేమీ విక్రమార్కా మీ సమాధానమునకు మాకు దిమ్మ తిరిగి బొమ్మ కనబడుచున్నది. దయచేసి కాస్త వివరముగా చెప్పుము."
"సరి, వినుము. ఏ కాలముననైనా ప్రజలు ఎవరైనా మంచి మాటలు చెప్పిన యెడల వెంటనే ఆకళింపు చేసుకోనజాలరు. ఈ విషయమును అర్థం చేసుకున్నవాడు కాబట్టే పోతురాజు విభిన్న మార్గంలో ప్రయత్నం చేసి ప్రజలకు సరియైన దిశా నిర్దేశం చెయ్య ప్రయత్నించాడు. భగవద్గీతలో శ్రీ కృష్ణ పరమాత్ముడు ఏ క్షణమున 'సంభవామి యుగే యుగే' అని వాక్రుచ్చాడో కానీ నాటినుండి ప్రజలు ప్రతి యుగమునందును, కాలమునందును తమ కష్టములును తీర్చుటకు ఆ భగవంతుడు ఏదో ఒక రూపమున అవతరించునని వేచి చూచుచునేయున్నారు. ఈ భావనను పెకలించివేయుటకు విజ్ఞులు తమవంతు ప్రయత్నము ప్రతి యుగమునందును, కాలమునందును చేయుచునేయున్నారు. కానీ పోతురాజు ఎంచుకున్న మార్గము మాత్రము బహు ప్రశంసనీయము. ఆతడు తన వ్యక్తిగత, స్వీయాభిమానాన్ని కించపరిచెరీతిలొ ప్రతిస్పందన వచ్చునని తెలిసి కూడా తన ప్రయత్నమును సాగించెను.
ఎవరో వచ్చి ఏదో చేసి తమ బ్రతుకులను బాగు చేయుదురనే భావనను దూరము చేయుటకే పోతురాజు ఆ విధంగా ప్రయత్నించేనని మాకు తోచుచున్నది. పోతురాజు ప్రజలముందుకు వచ్చిన ప్రతిసారి ప్రజలు ఆతనేదో తమకొరకు పోరాడునని భావించి ఆశలు పెంచుకొనుట, ఆ పిమ్మట నిరాశ చెందుట - కానీ పోతురాజు (పోతురాజు లాంటి వాళ్ళు) ఎదురు చూస్తూనే వున్నారు ఆ నిరాశ వదిలి ప్రజలు పోరాటబాట ఎప్పుడు పట్టేదరని, విప్లవం వచ్చి మార్పు సాధించబడునని? ఇంతటి ఉదాత్త ఆశయంతో ఒక్క ఉన్నత సమాజం కోసం తాము దీపములవలె కాలిపోవుచు మార్పు కోసం పరితపించుచున్న పోతురాజు వంటి వారు కాదు - వారి ఆశయమును అర్థం చేసుకోనలేక విమర్సించు నీలాంటి వారు 'లెక్కలేనంత తిక్క' ఉన్నవారు. నాకు ఆ భవిష్యత్ కాలపు ప్రజలను తలచుకున్నయెడల జాలి కలుగుచున్నది. పోతురాజు వంటివారి నుంచి ఏదో ఆశించి; తమకోసం పోతురాజు వంటివారు పోరాడేదరని భావించి బ్రతుకును సాగిస్తూ ఎంతకాలము ఎన్ని తరములపాటు ఆ రాజకీయనాయకులనబడేడి స్వార్థపరుల పాలన క్రింద నలిగిపోఎదరో కదా?"
విక్రమార్కుడి ఆ సమాదానమునకు దిమ్మతిరిగిన భేతాళుడు తిరిగి చెట్టుపైకి వెళ్లిపోయాడు. భేతాళుడు తదుపరి ఎవరిగురించి వివరించునో, కానీసం తదుపరి సమాగముననైనా ఈ రాజకీయాలు వదిలేసి ఏ ప్రేమ కథనో చెప్పినయెడల బాగుండునని ఆలోచిస్తూ విక్రమార్కుడు అప్పటికి సెలవు తీసుకున్నాడు.

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన