బంగార్రాజు

బంగార్రాజు
ముందు మాట: ఈ రచనలోని పాత్రలు, అంశాలు కేవలం కల్పితాలు మాత్రమే ఎవరిని ఉద్దేశించినవీ కావు.
*****************************************************************************
బంగార్రాజు అంటే మా ఊరి సోగ్గాడు. పేరుకు తగ్గట్టే ఒంటి నిండా ఆడోళ్ళ కంటే ఎక్కువగా నగలేసుకుని ఉంటాడు. సూడ్డానికి సినిమా హీరో శోభన్ బాబు లెక్క ఉండేటోడు. ఆరు అడుగుల ఎత్తు, ఉంగరాల జుట్టు, మాంచి రంగు, ఓ వందెకరాల పొలం ఇంకేముంది బంగార్రాజు సోగ్గాడే కాదు ఊళ్ళో అమ్మాయిలకు హీరో. బంగార్రాజుని వాళ్ళ నాన్న పట్నంలో ప్రైవేటు బడిలో సదివించాడు. ఆడికోచ్చే మాత్రపు ఇంగిలీసు ఊళ్ళో ఎవరికీ రాదు కాబట్టి ఆడు మాట్టాడుతంటే 'సూసి నేర్సుకొండ్రా' అని సేప్పెటోల్లు. అసలు బంగార్రాజు సెలవలకు ఊరికోచ్చాడంటే, వీధిలోకి ఓ పిట్టల దొరలా తయారయ్యి వచ్చేటోడు. జీను ప్యాంటు, టీ సోక్కా, నెత్తిన టోపీ (అది సలికాలమైనా సరే), ఆక్షన్ షూస్, నడుము బెల్ట్ కి వాక్ మాన్ పెట్టుకుని చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని తిరిగేటోడు. పగటి యాల ఎక్కడ తిరిగినా సాయంత్రమయ్యేసరికి సెరువు గట్టు కాడ తేలేటోడు, అక్కడ బేవార్స్ బాచ్ తో కూచుని పొలాల నుంచి వచ్చే ఆడోల్లపై సటైర్లు యెత్తా ఉండెటోడు, ఆడి బ్యాక్ గ్రౌండ్, ఆడి ఒంటి మీద ఉండే బంగారం సూసి ఆడిని ఎవరూ ఏమీ అనేటోల్లు కాదు. కాస్త సనువుండే వోల్లైతే 'అల్లుడు అమ్మాయి యెనకాల వస్తాంది దాంతో ఆడు సరసం నాతొ ఏందీ నీకు' అనేవోళ్ళు.
మొత్తానికి బంగార్రాజు సదువు అయిపోయి రెండేళ్ళు అయ్యింది. మా బంగార్రాజు గాడి పరిస్థితి 'ధోభి కా కుత్తా న ఘర్ కా న ఘాట్ కా' అన్నట్టు తయారైంది. ఆడు సదివింది యే పెద్ద ఉద్యోగానికి పనికి రాదు, సిన్న ఉద్యోగాలేమో వాడి స్టేటస్ కి సిన్నతనం, పొలం పనులు సేద్దామనుకుంటే యేనాడూ పొలం మొహం సూసినోడు కాదు. మొత్తానికి ఆళ్ళ నాన్నని ఒప్పించి పట్నంలో ఓ మందు షాపు పెట్టాడు అంటే అదే బార్. సంతోషమొచ్చినా, బాధొచ్చినా జనాలు తాగుతారు కాబట్టి ఆడి యాపారం బాగానే సాగేది. బంగార్రాజు గాడికి తాగుడు అలవాటు, ఫ్రెండ్ సర్కిల్ రెండూ ఉన్నాయి. వాడి బార్ లో ముందుగా తాగడం మొదలెట్టేది ఆడి బాచే. ఆడు ఊళ్ళో ఉన్నప్పుడు ఈడొచ్చిన అమ్మాయిల తల్లి తండ్రులు ఏదో ఒక రకంగా వాడితో సంబంధం కలుపుకోడానికి ట్రై సేసేవోల్లు. ఆళ్ళ నాన్న మాత్రం ఎవరికీ అంత సనువు ఇచ్చేవోడు కాదు. 'ఎక్కడైనా బావే కానీ వంగతోట కాడ కాదు' అనే టైపు. బంగార్రాజు తాగుడు గురించి, సిగరెట్ వ్యసనం గురించి ఎన్ని రకాలుగా వార్తలు ఉన్నా ఆడికి ఏ అమ్మాయితో లింకు ఉందన్న వార్తలు ఇంతవరకూ లేవు. ఆట్టాగని బంగార్రాజు గాడేమీ ఋష్య సృంగుడు ఏమీ కాదు. కానీ ఎందుకో ఆడోల్ల దగ్గరకొచ్చేసరికి ఆడు మాటలతోటే ఆగిపోయేవోడు. వాడికున్న బ్యాక్ గ్రౌండ్ కి ఊళ్ళో చాలామంది అమ్మాయిలు ట్రై చేసారు కానీ వాడు ఎవరికీ ఛాన్స్ ఇవ్వలేదు. బహుశా మనోడికి పెళ్లి మీద మాంచి అభిప్రాయం ఉందేమో అనుకునే వాళ్ళం.
మొత్తానికి బంగార్రాజు గాడికి వాళ్ళ నాన్న మాంచి పట్నం సంబంధం చూసాడు. ఏ మాటకామాటే సేప్పుకోవాలి బంగార్రాజు గాడి పెళ్ళాం మాత్రం హీరోయిన్ లేక్కుండేది. ఊళ్ళో అందరూ 'బంగార్రాజు గాడి పెళ్ళా కూడా బంగారం లేక్కుంది' అనుకున్నారు. పెళ్ళికి నా సామి రంగా వాళ్ళ నాన్న భీభత్సమైన హంగామా చేసాడు. పెళ్లి ముందు రోజు బాచిలర్ పార్టీ కి ఐతే బంగార్రాజు గాడు రికార్డింగ్ డాన్సులు పెట్టించాడు. ఏమైనా మళ్ళీ పుడితే బంగార్రాజు లెక్కటి పుట్టుక పుట్టాలే అనుకున్నారు ఆ హంగామా చూసినోల్లు. దుబారా ఖర్చు ఎందుకు అన్నోల్లకి ఆళ్ళ నాన్న ఒక్కటే సేప్పాడు "సూడబ్బా నా కొడుకు కూచుని తిన్నా తరగని ఆస్తి ఉండాది. నాకా ఆడోక్కడే కొడుకు. ఆడి పేరే కాదబ్బా ఆడి బతుకు కూడా బంగారం లెక్కుండాలే"
మొత్తానికి బంగార్రాజు పెళ్లై ఓ ఏడేళ్ళు గడిచాయి. గొడవలేమీ లేవు గానీ ఇంతవరకు పిల్లలే పుట్టలేదు. "అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని" అన్నట్టు బంగార్రాజు గాడికి అన్నీ ఉన్నా పిల్లలు పుట్టటం ఇంకా లేట్ అవుతున్నందుకు అందరూ తలో మాట అనుకునేవాళ్లు. బంగార్రాజు గాడి పెళ్ళాం మాత్రం కనిపించిన దేవుడికల్లా చెప్పిన పూజలన్నీ చేసేది. ఈలోగా మనోడు పట్నంలో పెట్టిన బార్ ని దివాలా తీయించాడు. ముందే సేప్పినట్టు బంగార్రాజు గాడికి తాగుడు అలవాటు, ఫ్రెండ్ సర్కిల్ రెండూ ఉన్నాయి. వాడి బార్ లో ముందుగా తాగడం మొదలెట్టేది ఆది బాచే. వచ్చి డబ్బులిచ్చి తాగే జనాలకంటే వీడి బేవార్స్ బాచ్ తాగుడే ఎక్కువ కావడంతో దెబ్బకి దివాలా తీసి, అప్పులు తీర్చటానికి వాళ్ళ నాన్న సగం పొలం అమ్మాల్సి వచ్చింది. బంగార్రాజు గాడికి ఉన్న ఆ ఒక్క పనీ లేకపోవడంతో ఇక ఇంటి దగ్గర కూచోడం తప్ప ఏమీ సేసేవోడు కాదు. ఒకప్పుడు 'మళ్ళీ పుడితే బంగార్రాజు లెక్క పుట్టాలే' అనుకున్నోల్లు ఇప్పుడు 'సీ యీడిదేం బతుకురా' అనుకోడం మొదలెట్టారు. ముసలోడైనా ఆళ్ళ నాన్న దగ్గరుండి పొలం పనులు అవీ సేయిస్తుంటే యీడు ఎప్పుడు  సూసినా తాగుడు, పేకాట, సొల్లు కబుర్లు సెప్పడం తప్ప ఇంకేం సేసేవోడు కాదు. ఇంటి దగ్గర ఉంటె బయట అరుగు మీద బేవార్స్ బాచ్ తో కూచుని సిగరేట్ తాగతూ పేకాడటం లేదంటే సారా కొట్టు దగ్గర ఉండడం ఇదే వాడి పని. దెబ్బకు శోభన్ బాబు లేక్కుండేటోడు రమణారెడ్డి లెక్క తయారయినాడు. కాస్త పరిచయమున్నోల్లయితే 'ఏమన్నా రోగమొచ్చిందేమో డాక్టర్ దగ్గర చూపించుకో'మని చెప్పారు కూడా.
యవ్వారం ఇట్టా ఉంటె ఒకరోజు ఉన్నట్టుండి బాంబు లేక్కటి వార్త ఊరంతా పాకిపోయింది. బంగార్రాజు వాళ్ళ పక్క వీధిలో ఉండే కామేశ్వరి కి కడుపోచ్చింది. కామేశ్వరి కి ఇంకా పెల్లవలేదు, అలాగని తిరుగుబోతు కూడా కాదు. శానామంది కామేశ్వరి కోసం ట్రై చేసి పడగొట్టటం చేతకాక వదిలేసారు. అట్టాంటి కామేశ్వరి కి పెళ్లి కాకుండానే కడుపోచ్చిందంటే వార్త కాకుండా ఎలా ఉంటుంది. కామేశ్వరి ని పడగొట్టిన మొనగాడెవరబ్బా అని ఆసక్తి అందరికీ. గంటకే తెలిసిపోయింది అది బంగార్రాజు గాడని, కామేశ్వరి వాళ్ళమ్మ బంగార్రాజు వాళ్ళింటి దగ్గర గొడవ మొదలెట్టేసరికి. వార్నీ బంగార్రజుగా అనుకున్నాం. కామేశ్వరి వాళ్ళమ్మ అయితే రెచ్చిపోయింది. 'కట్టుకున్న పెళ్ళానికి కడుపు సేసే దమ్ము లేదు గాని పెళ్లి గాని నా కూతురికి కడుపు సేస్తావా దొంగాసచ్చినోడా. రా రా బయటకి దొంగ నా ... (బూతు)' అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. మొత్తానికి బంగార్రాజు మాత్రం మేటర్ ని ఖండించేసాడు అంటే అదే కామేశ్వరి కడుపుకి తనకి సంబంధం లేదని చెప్పాడు. దాంతో వ్యవహారం పోలీసుల దాకా వెళ్ళింది. మరుసటి రోజే పోలిసులొచ్చారు. బంగార్రాజు గాడిని అరెస్ట్ చేసి తీసికేల్తారని అనుకున్నాం అందరం. ఏమయ్యిందో తెలీదు పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చిన అరగంటకి ఓ కానిస్టేబుల్ వచ్చి కామేశ్వరిని, వాళ్ళమ్మని లోపలకి తీసికెళ్ళాడు. ఏం మాట్లాడుకున్నారో ఏమో తెలీదు కానీ ఒక రెండు గంటల తర్వాత కామేశ్వరి, వాళ్ళమ్మ బయటకు వచ్చి వాళ్ళింటికి వెళ్ళిపోయారు.
మరుసటి రోజు తెల్లారేసరికి బంగార్రాజు వాళ్ళ నాన్న ఉరేసుకున్నాడు, వాడి పెళ్ళాం వాళ్ళ పొలంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. బంగార్రాజు ఎక్కడికేల్లాడో మాత్రం ఎవరికీ తెలీదు, మళ్ళీ ఎప్పుడూ  ఎవరికీ కనపడలేదు. అసలు విషయం కామేశ్వరి వాళ్ళమ్మ చెప్పేవరకు ఎవరికీ తెలీదు. ఇన్ని రోజులు బంగార్రాజు అసలు ఏ అమ్మాయిని పట్టించుకోవట్లేదు అంటే నిప్పులాంటోడు అని అనుకున్నాం కానీ అగ్గి లేనోడు అని తెలీదు.

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన