నువ్వు దేవుడివి సామీ

వంశీ కలుగోట్ల // ... నువ్వు దేవుడివి సామీ //

ముందు మాట: ఈ రచనలోని పాత్రలు, అంశాలు కేవలం కల్పితాలు మాత్రమే ఎవరిని ఉద్దేశించినవీ కావు.
*******************************************************************************
"సామీ నువ్వు గోప్పోడివి సామీ. నీ లెక్కటోల్లు ఈ రోజుల్లో యాడుంటారు సామీ? దేవుడి లెక్కటోండివి సామీ"
"అరేయ్ సాంబడూ ఆపరా నీ స్తోత్రాలు. అదేదో పోయి ఆ సారా కొట్టు కిట్టయ్య గాడి దగ్గర చదివితే వాడు కనీసం కొంచం సారా అయినా పోస్తాడు. పోరా"
"సామీ ఆడు సారా పోయ్యాలంటే సెయ్యి తడపాల్సిందే. పది రూపాయలుంటే ఇయ్యరాదు. నాలుక పిడచగట్టుకపోతాంది సుక్కబడక మూన్నాల్లయ్యింది సామీ."
            సాంబడి స్తోత్రాలు తప్పించుకోవడానికి అన్నట్టు వాడికి ఓ పది రూపాయలిచ్చి పంపించేసాడు శివయ్య. సాంబడు అంటే మా ఊళ్ళో దండోరా వేసేటోడు. ఊళ్ళో ఏదన్నా వార్త అందరికీ తెలియజేయాలంటే వాడికి ఓ పాతిక రూపాయలిస్తే సాయంకాలం నుండి అర్ధ రాత్రి వరకు ఊరంతా దండోరా కొట్టుకుంటూ 'ఇందుమూలంగా అందరికీ తెలియజేయడమేమనగా ... ' అంటూ వీధి వీధి తిరిగీ సారా కొట్టు దగ్గర ఆగిపోతాడు. సారా కొట్టు కిష్టయ్య ఎప్పుడైతే డబ్బులడుగుతాడో అప్పుడు సాంబడు ఊరి మీద పడతాడు. వాడు ఎదురు పడి అడిగినప్పుడు పదో పరకో ఇవ్వాల్సిందే లేదంటే దాన్ని కూడా దండోరా వేసి ఊరంతా చెప్పేస్తాడు. అంటే కాదు ఆ ఇవ్వనన్నోల్లకి ఏవన్నా చాటు మాటు వ్యవహారాలు ఉన్నాయంటే ఇక అంతే. పేర్లు చెప్పకుండానే ఊరందరికీ అర్థమయ్యేటట్టు విషయం చెప్పేస్తాడు. అందుకే వాడంటే చాలా మందికి భయం.
            సాంబడికి సారా తప్ప వేరే అలవాట్లేవీ లేవు. ఒక్కోసారి తిండి కూడా తినడు సారా మీదే బతికేస్తాడు. వీడి సారా వ్యసనాన్ని భరించలేక వాడి పెళ్ళాం కూడా ఎప్పుడో వాణ్ని వదిలేసి వెళ్ళిపోయింది. అప్పటినుండి వాడికి సారా కొట్టు పక్కనే ఉండే వేపచెట్టే ఇల్లు వాకిలి అన్నీ. ఊళ్ళో వాళ్ళు వాడిని అవసరాలకు వాడుకుని పదో పరకో పడేస్తే దాంతో సారా తాగి, తూలుతూ డప్పు కొట్టుకుంటూ బొంగురు గొంతుతో నోటికొచ్చిన పాటలేవో పాడుకుంటూ ఊరంతా తిరగడం ఇది వాడి పని. వాడు భయపడేది లేదా మాట వినేది ఒక్క శివయ్యకి మాత్రమే. శివయ్య అంటే వాడికి మాత్రమే కాదు ఊళ్ళో అందరికీ గౌరవమే ఒక్క నాయుడమ్మ వర్గానికి తప్ప. శివయ్య చెప్పుకోవడానికి బ్రాహ్మణుడే అయినా అన్నీ క్షత్రియ లక్షణాలు. పూజలు, పునస్కారాలు చేయించడమే కాదు; మీసం మెలేసి రంగం లోకి దిగాడంటే ఎంతటి వాడినైనా అవలీలగా ఓడించే దమ్మున్నోడు. ఆరు అడుగులకు పైగా ఎత్తు, తాలింఖానా లో గంటలకొద్దీ గడపడంతో ఉక్కులా గట్టిపడ్డ శరీరం - ధోవతీ కట్టి, జుబ్బా వేసుకుని మీసం మెలేసి నడుస్తుంటే రాజ ఠీవీ కనిపించేది. పేరుకు నాయుడమ్మ ప్రెసిడెంట్/సర్పంచ్ అయినా పంచాయతీ జరిగేది శివయ్య ఇంటి దగ్గరే. నాయుడమ్మ అభిమానం దెబ్బతిన్నది కూడా అక్కడే. శివయ్యని దెబ్బతియ్యాలని, లేపెయ్యాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరకపోవడంతో నాయుడమ్మ ఏమీ చేయలేక దేవుడి మీద భారం వేసి ఊరికే ఉన్నాడు. నాయుడమ్మకి ఊరటనిచ్చే అంశం ఏంటంటే శివయ్యకి రాజకీయాల్లో ఆసక్తి లేకపోవడం. అయినా కూడా తన ఆధిపత్యానికి నిలువెత్తు అడ్డుగోడలా ఉన్న శివయ్యని అడ్డు తొలగించుకొవటానికి ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోని నాయుడమ్మకి అనుకోకుండా బంగారం లాంటి అవకాశం లభించింది అది కూడా సాంబడి రూపంలో. దానికి మూలం ఆ రోజు సాయంకాలం జరిగిన సంఘటన.
*                *                 *
అసలు ఆ రోజు సాయంకాలం ఎం జరిగిందంటే ...
            ఊరికి మూడు వంక/వాగులు ఉన్నాయి. మూడు వైపుల నుండి వచ్చే ఆ వంకలు ఊరు దాటే ముందే ఒక్కటిగా కలిసి పోయి పక్కూరి చెరువులో కలుస్తాయి. వర్షాకాలం పడే కొద్దిపాటి వర్షాలకు వచ్చే నీరంతా పోయి ఆ పక్కూరు చెరువులో కలవడమే తప్ప ఇక్కడ పెద్దగా నిలిచేది, ఉపయోగపడేది ఉండదు. శివయ్య ఎప్పటినుండో ప్రయత్నిస్తున్నాడు వాళ్ళ ఊరికే ఒక చేరువుండేలా చెయ్యాలని. సమస్య అంతా ఎక్కడ వస్తుందంటే ఊళ్ళోని పెద్ద మనుష్యులతో. గవర్నమెంట్ వాల్లోచ్చి సమావేశం పెట్టగానీ ఈ పెద్దమనుషులు రావడం, గొడవ మొదలెట్టటం దాంతో ఆ వచ్చినోల్లు 'స్వామీ, ముందు మీ ఊళ్ళో పెద్ద మనుషులందరూ ఒక అభిప్రాయానికి వచ్చి మమ్మల్ని పిలవండి' అంటూ వెళ్ళిపోవడం. పెద్ద మనుషుల పోలాలేవి చెరువు తవ్విన్చాలనుకుంటున్న ప్రాంతానికి దగ్గరలో లేవు, అక్కడ ఉన్న పొలాలన్నీ చిన్న,సన్నకారు రైతులవే. చెరువుకు అనుమతి తీసుకురావాలని శివయ్య ఎంత గట్టిగా ప్రయత్నిస్తున్నాడో వీళ్ళంతా కలిసి అంత కంటే గట్టిగా రాకుండా ఉండటానికి ప్రయత్నాలు చేస్తారు. దాంతో ఒక అడుగు ముందుకు, నాలుగడుగులు వెనక్కు అన్నట్టుగా తయారైంది వ్యవహారం.
            దాంతో ఈ సారి గవర్నమెంట్ ముందేకేల్లెకంటే ముందుగా పెద్దమనుషులతో సమావేశం ఏర్పాటు చెయ్యాలనుకున్నాడు శివయ్య. సాంబడిని పిలిచి దండోరా విషయం చెప్పి దండోరా వెయ్యమన్నాడు.సాంబడి తీరు ఏంటంటే వాడు వీధిని బట్టి తాను చెప్పే తీరు మారుస్తాడు. నాయుడమ్మ ఉండే వీధికి వెళ్తే 'పెద్దమడుసులందరికీ సేప్పోచ్చేదేంటంటే ...' అని మొదలెడతాడు, ఇంకో వీధికి వెళ్తే ఇంకో రకంగా ఇలా. ఆ రోజు మాత్రం ఇంకో రకంగా చెప్పడం మొదలెట్టాడు - "శివయ్య సామి చెరువు గురించి మాట్టాడనీకి పెద్దమనుసులను, మామూలోల్లని అందరిని రచ్చబండకాడికి సాయంత్రం రమ్మన్నాడహో. ఇష్టం లేనోళ్ళు ఇంట్లో గాజులేసుకుని కూకోవచ్చు - ఇది సాంబడి మాట" అంటూ. సాంబడి దండోరాతో పాటు నాయుడమ్మ లాంటి పెద్ద మనుషులందరి దగ్గరికి తన జీతగాడిని పంపి మరీ ఆహ్వానించాడు శివయ్య. ఎంత వైరం ఉన్నా, నచ్చకపోయినా శివయ్య పిలుస్తున్నాడంటే రాము అనే దమ్ము లేదు నాయుడమ్మ తదితరులకు. చెరువు గురించి అనే సరికి అందునా పిలుస్తున్నది శివయ్య అనేసరికి ఊరు ఊరంతా రచ్చ బండ దగ్గరికి వచ్చేసింది. ఎన్నికల ప్రచార సభలా ఉందది. అసలే శివయ్య తీరుతో ఉడికిపోతున్న నాయుడమ్మ వర్గానికి ఈ చర్చ ఏర్పాటు చేసిన తీరు పుండు మీద కారం జల్లినట్టు అయ్యింది. దాంతో సమావేశం నువ్వెంత నువ్వెంత అనుకునేదాకా వెళ్ళింది.

"చూడు సామీ అక్కడికి నువ్వు మాత్రమే ఊరి గురించి, ఊరి జనాల గురించి అలోచించి మంచి సేత్తన్నట్టు మేమంతా దుర్మార్గులం అన్నట్టు మాట్టాడుతన్నావ్. ఇదేం బాలేదు. అయినా అక్కడ సెరువు వస్తే మన ఊరికి ఎమోస్తాది? కట్ట తెగితే ఊరు మొత్తం మునిగిపోతాది. రెండేళ్ళ క్రితం మన పక్క ఊరికి ఎంత నష్టం జరిగిందో తెలవదా నీకు? ఊరి సర్పంచ్ గా ఊరు, ఊళ్ళోని జనాల బాగోగులను సూసుకోవాల్సిన బాధ్యత నాది. నీకేముంది తాడు, బొంగరం లేనోడివి ఎన్నైనా సెప్తావ్. మంచి సేడ్డలు అలోచించి సేయ్యల్సిన బాధ్యత నాది, మాది. సెరువు గురించి సేయ్యల్సిందేదో మేము సేత్తాం. నువ్వు ఇయ్యన్నీ మానేసి గుడికెల్లి పూజలు సేసుకో."

నాయుడమ్మ మాటలకి శివయ్య బదులివ్వకముందే సారా మత్తులో ఉన్న సాంబడు "ఓయ్ ఎందివయ్యా నువ్వు మమ్మల్ని సూసుకున్నేడిది. నువ్వా సెరువు తెప్పించేడిది? అద్దంల మొహం సూస్కున్నవా ఎప్పుడైన? దీంతల్లి ఇప్పుడు తెలిపోవాల్చిందే పోయినేడు రోడ్దేయిస్తనంటివి, సర్కారు డబ్బులోచ్చినయంటివి? ఏది ముందు ఆ డబ్బులకు లెక్క సెప్పు ... నాయాల్ది సెరువు ఇసయంలో అడ్డం అచ్చినవంటే నీ తోలు నా డప్పుకేసుకుంట"

సాంబడి మాటల తీవ్రతకు నాయుడమ్మ విస్తుపోయినా,నాయుడమ్మ కుడి భుజం భీముడు మాత్రం విస్తుపోలేదు. చేతలతో స్పందించాడు ... సాంబడి ని ఎత్తి కింద పడేసి "నీయవ్వ ఏందిరా నువ్వు మా నాయుడమ్మని సేసేడిది ముందు ఇయ్యాల నా సెతిల సావునుండి తప్పించుకో తర్వాత సూసుకుందాం నువ్వు సూసేడిదేందో" అంటూ కొట్టటం మొదలెట్టాడు.

క్షణాల్లో మారిపోయిన పరిస్థితిని అర్థం చేసుకున్నది, సరియైన రీతిలో స్పందించింది మాత్రం శివయ్యే. భీముడిని, సాంబడి ని విడదీసి "చూడు నాయుడమ్మా తాగుబోతు సాంబడి మాటలు పట్టించుకోకు. వాడి తరఫున నేను క్షమాపణ చెబుతున్నాను. మన ఊరికి తర తరాలకు మేలు చేసే చెరువు విషయంలో మాత్రం దయచేసి అడ్డు పడకండి. అసలు చెరువు విషయంలో మనకున్న అనుమానాలేమిటో అందరం కలిసి కూర్చుని మాట్లాడుకుందాం."

"ఏంది బాపనయ్యా మాట్టాడేడిది. నాలుగ్గోడల మద్దెన మనం నలుగురం మాట్టాడుకోవాల్సింది సాటింపు యేసి జనాలందరి ముందర మమ్మల్ని ఎదవల్ని సేసేటందుకా ఇట్టా సేసింది. ఆ తాగుబోతోడితో నానా మాటలు అనిపించనీకి పిలిపించినావా. సూస్తా ఎట్టా తెప్పిస్తావో సెరువు. రేయ్ తాగుబోతోడా నీ సంగతి సూస్తా."

"ఏందీ నువ్వు సూసేడిది, సామీ నువ్వు ఊ అను సామీ నాయాల్ది నాయుడమ్మ పేనాలతో ఇంటికేల్లితే ఒత్తు. సాంబడు దరువేట్టా ఎత్తాడో తెలుత్తాది"

అక్కడున్న మిగతావాళ్ళు కల్పించుకుని విడదీయడంతో గొడవ అప్పటికి సమసిపోయింది.
*                *                 *
            తెల్లారేసరికి ఊరికి పోలీసులు వచ్చారు. నాయుడమ్మ పెద జీతగాడు, కుడి భుజం లాంటోడు అయిన భీముడు రాత్రినుండి కనపడట్లేదని నాయుడమ్మ కంప్లైంట్ ఇచ్చాడట. అనుమానితులుగా శివయ్య మీద, సాంబడి మీద కేసు నమోదు చెయ్యబడింది. పోలీస్ ఇన్స్పెక్టర్ చెంగల్రాయుడు నాయుడమ్మకి దూరపు బంధువు అవుతాడు అంతే కాదు కుల పిచ్చి బాగా ఎక్కువ. తన కులపోడు అయితే కేసు తారుమారు చేసేసేయ్యగలడు. అలాంటి చెంగల్రాయుడు శివయ్యని దాదాపు ఇంటరాగేషన్ చేసేస్తున్నాడు. దానికి తోడు నాయుడమ్మ "రాయుడు ఈయన్ని అడిగేదేన్దిరా ఈయన ఇల్లు మొత్తం వెతికించండి ఈయనే సంపించుంటాడు, నిన్న ఆ సాంబడి ని ఉసిగొల్పినప్పుడే అనుకున్నా ఇట్టాట్టిదేందో సేత్తాడని. భీముడి మీద సెయ్యి యెయ్యగలిగె మొగోడు లేడు శివయ్య తప్ప." ఎవరేం చెబుతున్నావినిపించుకోకుండా చెంగల్రాయుడు శివయ్య ఇంట్లో సోదా మొదలెట్టాడు. ఇంతలో శివయ్య పశువుల కొట్టంలో వెతకటానికి వెళ్ళిన కానిస్టేబుల్ కేకేయ్యడంతో అందరూ అక్కడికేల్లారు. శివయ్య పశువుల కొట్టంలో గాడిపాట్లో/గాడిపాడులో (పశువులను కట్టేసి, మేత వేసే ప్రాంతం - ఇది రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో ఉన్న వాడుక పదం) మధ్యభాగం ఎత్తుగా ఉండడంతో పాటు ఏదో వాసన వస్తోంది. వెంటనే చెంగల్రాయుడు ఆదేశంతో నాయుడమ్మ మనుషులు దాన్ని తవ్వి, భీముడి శవాన్ని బయటకి తీసారు.

"సూశారా దేవుడు దేవుడు అన్నారు ఈయన్ని, దేవుడు కాదు దయ్యం. భీముడిని సంపినందుకు ఉరి తీయాల్సిందే." అని నాయుడమ్మ శివాలెత్తిపోయాడు.

            భీముడి శవం శివయ్య ఇంట్లో అదే పశువుల కొట్టంలో దొరకడంతో ఇక ఎవరూ ఏమీ చెప్పలేకపోయారు - అదేదో కుట్ర, భీముడిని శివయ్య చంపలేదు అని అర్థమవుతున్నా కంటిముందు కనపడేది వేరేగా ఉండడంతో చెంగల్రాయుడు శివయ్యని అరెస్ట్ చేసి తీసుకెళ్ళాడు. అరెస్ట్ అయ్యి వెళ్లేముందు శివయ్య తన జీతగాడు రంగడిని పిలిచి "అరేయ్ రంగడు, వెళ్లి సుబ్బారెడ్డిని కలువు, జరిగింది చెప్పు. చెయ్యాల్సింది సుబ్బారెడ్డి చేస్తాడు." అని మాత్రం చెప్పాడు.నాయుడమ్మ ఆరోపణలకి, చెంగల్రాయుడు దురుసుతనానికి ఎలాంటి సమాధానం చెప్పలేదు, శివయ్య గురించి తెలిసిన వాళ్లకి మాత్రం అది తుఫాను ముందరి ప్రశాంతతలా అనిపించింది.
*                *                 *
            వారం రోజుల తర్వాత, సుబ్బారెడ్డి ప్రయత్నంతో శివయ్యకి బెయిల్ వచ్చింది. సుబ్బారెడ్డి అంటే ఆషామాషీ వ్యక్తి కాదు, పెద్ద లాయరు. సుప్రేం కోర్ట్ లో కేసులు వాదించే స్థాయి లాయరు. శివయ్యకి బాల్య స్నేహితుడే కాదు, ప్రాణ మిత్రుడు కూడా. అలాంటి సుబ్బారెడ్డి పూనుకున్నాక బెయిల్ రాకుండా ఎలా ఉంటుంది. శివయ్య ఊర్లోకి వస్తుంటే సంతోషంతో వేస్తున్న సాంబడి దరువు తప్ప వేరే ఏ శబ్దమూ లేదు. శివయ్య ఎవరినీ పలకరించలేదు, ఎవరూ శివయ్యని పలకరించే సాహసమూ చెయ్యలేదు. ఒక్కసారి చెయ్యెత్తి 'ఆపు' అన్నట్టుగా సాంబడి వైపు చూసి, సాంబడి దగ్గరకెళ్ళి జేబులోంచి పదిరూపాయల నోటు కాగితం ఒకటి తీసి ఇచ్చాడు. "సామీ ఇప్పుడు దరువేసింది సారాకోసం కాదు, నాయుడమ్మ గుండెలు అదరాలని. నువ్వోచ్చినావని యెదవలకు తెలవాలని సామీ". సాంబడికి మాటలు పట్టించుకోకుండా శివయ్య డైరెక్ట్ గా భీముడి ఇంటికి వెళ్ళాడు. భీముడి భార్యతో "అమ్మా! చంపింది నేను కాదని నీకు కూడా తెలుసు. కానీ పరోక్షంగా నా వల్లనే భీముడు చనిపోవడం నన్ను బాధిస్తోంది. కాని నీకు తీరని నష్టం జరిగింది. భీముడిని తిరిగి తీసుకురాలేకపోయినా నా శక్తి కొద్దీ నీకు ఆర్ధిక సహాయం మాత్రం చెయ్యగలను. ఇంటికెళ్ళాక డబ్బు పంపుతాను. నీకు ఏ అవసరం వచ్చినా సంకోచించకుండా అడుగు అమ్మా". చేతులెత్తి దండం పెడుతున్న భీముడి భార్యను పట్టించుకోకుండా గుడివైపు సాగిపోయాడు శివయ్య.
            ప్రతిరోజూ ఊరి చివర ఉండే అమ్మవారి గుడికి వెళ్ళడం శివయ్య అలవాటు, మనసు బాగోలేకపోతే ఒక్కోసారి గుడిలోనే రోజంతా గడుపుతాడు. గుడి ప్రాంగణంలోని రావి చెట్టు కింద కూర్చుని ధ్యానం చేసుకోవడం శివయ్యకి చాలా ఇష్టం. తనకు తానుగా లేచేవరకు శివయ్యని ఎవరూ కదిలించరు ధ్యానంలో ఉన్నప్పుడు. కారణం లేకుండా కదిలిస్తే అది వారి ఖర్మ. ఆ రోజు కూడా గుడికి వెళ్లి రావి చెట్టు కింద ధ్యాన ముద్రలో కూర్చున్నాడు శివయ్య.

శివయ్య బెయిల్ పై ఊళ్లోకి వచ్చిన మరుసటి రోజు నాయుడమ్మ సమావేశం ఏర్పాటు చేసాడు. శివయ్యని తప్ప ఊరందరిని సమావేసపరచాడు.

"అందరికీ సేప్పోచ్చేదేందంటే,గత రెండు టెర్ములుగా నేనే మనూరికి సర్పంచ్ గా ఉన్న. మనూరికి మంచేదో, సెడేందో నాకు బాగా ఎరికనే. తాడు బొంగరం లేని శివయ్య లాంటోడిని కాదు, హత్తెలు సేసేటోడిని కాదు. మనూరికి సెరువు కంటే ముంగల అగ్గో ఆ వాగు మీద వంతెన అవసరం. శివయ్య లేక్కటాన్తోల్లు సెప్పే మాటలు ఇని సేడిపోబాకండ్రి. నేను ఎమ్మెల్యేతో మాట్టాడి వాగు మీద వంతెనతో పాటు ఊళ్ళో సిమెంట్ రోడ్డు యేయించమని అడుగుత. సెరువు కత ఇప్పటికి మర్చిపొండి. పక్కూరికి సెరువు ఉంది గదా, రెండేళ్ళ కిందట సెరువు కట్ట తెగి సగమూరు నీల్లపాలైంది, అట్టాంటివి జరక్కూడదనే మనూరికి సెరువు వద్దు అంటన్నా. ఎవరన్నా కాదనేటోల్లు ఉంటె ముందుకొచ్చి సెప్పుండ్రి"

"నాయుడమ్మా, మాటికోసారి పక్కూరికి రెండేళ్ళ క్రితం కలిగిన నష్టం గురించి మాట్లాడే నువ్వు అదే పక్కూరికి చెరువు గత ముప్పై ఏళ్లుగా ఉందన్న సంగతి ఎందుకు మర్చిపోతున్నావు? ముప్పై ఏళ్లలో ఒకే ఒక్కసారి అదీ గత రెండేళ్ళ క్రితం మాత్రమే గట్టు తెగి, నష్టం కలిగింది. అది కూడా ఎన్నడూ ఎరుగని వరదల వల్ల. అదే మనూరికి కూడా చెరువు ఉండి ఉంటె ఆ ఆపద వచ్చేది కాదు.రెండు టెర్ములుగా సర్పంచ్ గా ఉన్న నువ్వు గత సంవత్సరం మనూరికి చెరువు వల్ల మనూరికే కాక చుట్టూ పక్క ఎనిమిది ఊర్లకు పొలాలకు నీరు అందుతుందని గవర్నమెంట్ పంపిన రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదు." అడిగింది శివయ్య అని అర్థమయ్యేసరికి నాయుడమ్మ ముఖంలో రంగులు మారాయి, అదే సమయంలో శివయ్యని మళ్ళీ మామూలుగా చూసేసరికి జనాల్లో ఉత్సాహం పొంగింది.

నాయుడమ్మ తన బింకం సడలకుండా "ఏందీ సామీ పిలవని పేరంటానికొచ్చి నోటికోచ్చిందల్లా మాట్టాడుతున్నావు. హత్తెలు సేసేటోడికి కూడా సమాధానం సేప్పాల్నా ఏందీ. ఇట్టా అయితే అయినట్టే, ప్రతి కుక్కకి సమాధానం సెప్పడం నా పని కాదు. బెయిల్ మీద వచ్చినవ్, భీముడిని సంపినందుకు నీకు ఉరి సిచ్చ పడేవరకు వదల్ను. నీతో మాటలు అనవసరం శివయ్యా ఇక్కడనుంచి ఎల్లకపోతే మర్యాద దక్కదు."

నాయుడమ్మ పెడసరి సమాధానం విన్న తర్వాత కూడా శివయ్యలో అదే ప్రశాంతత, చెంగల్రాయుడు తన చేతికి బేడీలు వేసి లాక్కెళ్ళి పోలీస్ జీపులో కూర్చోపెట్టినప్పుడు ఎంతటి ప్రశాంతతతో ఉన్నాడో ఇప్పుడూ అలానే ఉన్నాడు. "నువ్విచ్చే మర్యాద కోసం రాలేదు నాయుడమ్మా. పెరట్లో పెరుగుతున్న గడ్డి మొక్కలాంటి వాడివని ఇన్నాళ్ళు ఉపేక్షించాను. కానీ ఇప్పుడు గంజాయి వనంలా ఎదుగుతున్నావు. నీ అడ్డు తొలగించాల్సిందే."

"ఏందీ సామీ నువ్వు మాట్టాడేది? నేను గడ్డి మొక్కనా, గంజాయి వనాన్నా నన్ను అడ్డు తొలగిస్తావా అంటే సంపెత్తావా? ఏందీ నువ్వు సంపేడిది ఇక్కడ ఎవ్వరూ గాజులు తొడుక్కొని కూచోలేదు. రేయ్ ఎసేయ్యండ్రా శివయ్యని."

            నాయుడమ్మ నోటి వెంట వస్తున్న మాట పూర్తి కాకుండానే, అసలేం జరుగుతోందో మిగతావాళ్ళు అర్థం చేసుకునేలోగానే నాయుడమ్మ తల ఎగిరి పడింది. ఎప్పుడు తీసాడో తెలీదు తాను తెచ్చిన గండ్ర గొడ్డలితో ఒక్క వేటుకు నాయుడమ్మ తల ఎగిరేసాడు శివయ్య. గండ్ర గొడ్డలి పట్టి క్షత్రియ సంహారానికి బయల్దేరిన పరశురాముడిలా ఉన్నాడు శివయ్య. అస్తమిస్తున్న సూర్యుని కిరణాలు శివయ్య చేతిలోని రక్తంతో తడిసిన గండ్ర గొడ్డలి మీద పడి కొత్త కాంతులు వెదజల్లుతున్నాయి. ముందుకొచ్చిన నాయుడమ్మ మనుషులను కూడా అదే వేగంతో అడ్డు తొలగించాడు శివయ్య. జనాల్లో కలకలం మొదలైంది, పరుగులు తీయబోతున్న జనాన్ని శివయ్య మాటలు ఆపాయి. "ఎవరూ ఖంగారు పడాల్సిన పని లేదు. ఇక గొడవలు ఉండవు, ఊరికి జరగబోయే మంచికి అడ్డొచ్చే శనీ ఉండదు. ఇంకా ఎవరైనా నాయుడమ్మ తరఫున మాట్లాడాలనుకుంటే మాట్లాడండి."

అది ఆశ్చర్యమో, భయమో తెలీని భావంతో చూస్తున్న జనాలను పట్టించుకోకుండా "అరేయ్ రంగడు, ఇదిగో ఈ కవర్ సుబ్బారెడ్డికి ఇవ్వు. నేను వెళ్తున్నాను." అంటే ఇంకేమీ మాట్లాడలేదు.

            దూరంగా గుడి మైకు లో పెట్టిన ఘంటసాల భగవద్గీత శ్లోకాలు మంద్రస్వరంలో వినిపిస్తున్నాయి.
"పరిత్రాణాయ సాధూనాం నాశాయచ దుష్కృతాం
ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే"
గుడి మైకు లో భగవద్గీత శ్లోకాలు అలా వస్తూనే ఉన్నాయి - దుష్ట సంహారరక్తంతో తడిసిన గండ్ర గొడ్డలి చేత ధరించి శివయ్య అస్తమిస్తున్న సూర్యుడి దిశగా అడవుల్లోకి వెళ్ళిపోయాడు.
*                *                 *
ఇది జరిగిన నెలరోజుల తరువాత
            వీలునామా లాంటి శివయ్య లెటర్ లో ఉన్న/కోరిన విధంగా శివయ్య వందెకరాల పొలం ఊర్లోని పేదలకు పంచాడు సుబ్బారెడ్డి. భీముడి భార్యకు లక్షరూపాయలు, రెండెకరాల పొలం అందించాడు. ప్రభుత్వాధికారులను పిలిచి చెరువు గురించి మళ్ళీ నిర్వహించిన సమావేశంలో గ్రామ ప్రజల ఎకగ్రీవ అభిప్రాయంతో చెరువు నిర్మాణానికి అయ్యే ఖర్చులో 70% ఖర్చు భరించి ప్రభుత్వ పోరంబోకు భూమిలో చెరువు నిర్మించడానికి ప్రభుత్వం అంగీకరించింది. మిగతా 30% లో 25% శివయ్య గ్రామాభివ్రుద్దికై ఇచ్చిన డబ్బు సరిపోగా మిగతాది ఊరంతా కలిసి సర్దుబాటు చేసారు. చెంగల్రాయుడిని ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. శివయ్య కోరిన విధంగా శివయ్య ఇల్లు గ్రంధాలయంగా మార్చడం జరిగింది.
            కానీ ఆ రోజు చేతిలో గండ్ర గొడ్డలితో అడవి వైపు వెళ్ళిన శివయ్య మళ్ళీ రాలేదు, ఎవరికీ కనపడలేదు. అన్నల్లో కలిసాడని కొందరు, సన్యాసం తీసుకుని హిమాలయాలకు వెళ్లిపోయాడని కొందరు అనుకోవడమే తప్ప శివయ్య ఏమయ్యాడో ఎవరికీ తెలీదు. శివయ్య గురించిన ప్రస్తావన వస్తే 'దేవుడి లెక్కటోడు' అని మాత్రం అందరూ అనుకుంటారు ఊర్లో. చట్టం దృష్టిలో తప్పైనా శివయ్య మాకు దేవుడే. శివయ్య చంపింది మనిషిని కాదు, మా ఊరికి పట్టిన శనిని.

Comments

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన