చిరునవ్వుకు మరణం లేదు

వంశీ కలుగోట్ల // ...  చిరునవ్వుకు మరణం లేదు //

ముందు మాట: 
ఈ రచనలోని పాత్రలు, అంశాలు కేవలం కల్పితాలు మాత్రమే.
ఎవరిని ఉద్దేశించినవీ కావు.
*********************************************************************************
            ఇవాళ సడన్ గా ఎందుకో గురువు గారు గుర్తొచ్చారు. గురువు గారు అంటే ఏ సన్యాసో, సాధువో, మహాత్ముడో కాదు. మా స్నేహితుడు మౌళి. సరదాగా అందరం గురువు గారు అని పిలుస్తుంటాం. గురువుగారు రాగానే, మనసు అలా ఓ పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది ... 
*                *                 *
          మా క్లోజ్ ఫ్రెండ్స్ గ్రూప్ లో మౌళి ఒక డిఫరెంట్ పర్సన్. మా గ్రూప్ లోకి వాడో లేక వాడి గ్రూప్ లోకి మేమో రాంగ్ అడ్రెస్స్ అనుకుంటుంటాం. కానీ, అలా అలవాటైపోయామంతే. వాడు ఎపుడూ ఒక ఊహ ప్రపంచంలో ఉండేవాడు, ఏవేవో ఆదర్శాలూ అంటూ చెప్పేవాడు. మేమంతా మేము ప్రాక్టికల్ లైఫ్ లో ఏదో ఒకటి సాధించాలనే గోల్ తో ఉంటామని అనుకునే వాళ్ళం. మౌళి పుస్తకాల పురుగు, ఓ చిన్న స్థాయి లైబ్రరీ లాగా ఉండేది మా రూం వాడి పుస్తకాలతో. హైదరాబాద్ లో మేమంతా అంటే నేను, మౌళి, సాగర్, రెహమాన్ ఒకే రూం లో ఉండేవాళ్ళం. మౌళి సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవుతుండే వాడు. రెహ్మాన్ ఫిలిం ఇండస్ట్రీ లో మ్యూజిషియన్ గా ట్రై చేస్తుండేవాడు. నేను, సాగర్ గాలివాటం గాల్లం. చెప్పుకోవడానికి జావా కోర్స్ అంటూ ఒకటి చేసేవాళ్ళం. మౌళి ఉంటే సివిల్స్ గురించి, రెహ్మాన్ వస్తే సినిమాల గురించి తప్ప జావా గురించి ఏనాడు మాట్లాడేవాళ్ళం కాదు. సాఫ్ట్ వేర్ తుఫానులో ఏదో ఒక జాబు మనక్కి తగలకపోదా అనుకుని ధీమాగా మౌళి, రెహ్మాన్ లతో కబుర్లు చెప్పుకోవడం వాళ్ళని 'అరేయ్ రియలైజ్ అవ్వండ్రా సివిల్స్, సినిమాలు అంటూ టైం వేస్ట్ చేసేబదులు ఏ జావానో, టెస్టింగ్ కోర్సో చేస్తే ఏదో ఒక కంపనీలో నెలకు ఒక పాతిక వేల ఉద్యోగం దొరక్కపోదు' అంటూ సుద్దులు చెప్పడం. రెహ్మాన్ గాడు రెస్పాన్స్ ఇచ్చినా మౌళిమాత్రం మా మాటలకు నవ్వి ఊరుకునే వాడు. రెహ్మాన్ గాడు మాత్రం మ్యూజిక్ గురించి ఒక అరగంట క్లాసు పీకేవాడు. ఎ అర్ రెహ్మాన్ అంతటోడు కావాలన్నది మా రెహ్మాన్ కోరిక.
            దాదాపు కనీసం రెండు రోజులకు ఒకసారి మా మధ్య గురువు గారి కెరీర్ గురించి చర్చ జరిగేది. మా బాధంతా ఒకటే, వాడి టైం ఆ పుస్తకాల మీదా, సమాజ సేవ మీదా కాకుండా సాఫ్ట్వేర్ కోర్సెస్ మీద పెట్టి ఉంటే, మంచి స్థితిలో ఉండేవా డు కదా అని. 
            "గురువు గారు ఏమన్నా అంటే అన్నామంటారు కానీ అన్ని పుస్తకాలు చదివే టైం లో పావు వంతు టైం ఇటేపు పెట్టేసి ఏ జావానో కోర్స్ చేసేసి ఉంటె ఈ పాటికి ఏ ఒమెరికా లోనో సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ ని కుమ్మేస్తూ ఉండేవాళ్ళు మీరు, బిల్ గేట్స్ పెట్టె బేడా సర్డుకునేలా చేసే టాలెంట్ అండీ మీది. మా మాట విని జావా కోర్స్ లో జాయిన్ అవ్వండి."
         "మళ్ళీ మొదలెట్టావా రవీ, అయినా బిల్ గేట్స్ తనకి ఇష్టమైంది చేసాడు కాబట్టే ఈరోజు మనం చెప్పుకునే స్థాయికి ఎదిగాడు. నువ్వు కూడా నీకు ఇష్టమైంది చెయ్ ఏదో ఒకరోజు అందరూ చెప్పుకునే స్థాయికి ఎదుగుతావు. మాటలు బాగా చెబుతావు కదా నా మాట విని వెళ్లి ఏదో ఒక చానెల్ లో అంకర్ గా ట్రై చెయ్ మంచి ఫ్యూచర్ ఉంటుంది"
            "తెలిసీ నీతో పెట్టుకున్నాను చూడు నన్ను నేను కొట్టుకోవాలి."
            "పర్లేదు రవీ కావాలంటే నేను హెల్ప్ చేస్తా. కొట్టమంటావా?"
        "వద్దులే కానీ పద టీ తాగి వద్దాం. మీ కోచింగ్ సెంటర్ ఎదురుగా ఉండే టీ స్టాల్ లో టీ మాత్రం అదిరిపోతుంది. అరేయ్ డబ్బాలోడా నువ్వు కూడా రారా." డబ్బాలొడు అంటే అదే మా రెహ్మాన్ గాడు, రూంలో ఉన్నాడంటే ఖాళీ డబ్బాలు ముందేసుకుని మ్యూజిక్ అంటూ వాటిని కొడుతూ మా ప్రాణాలు తీసెవాడు. అందుకే ఆ కసితో వాడిని మేము డబ్బాలోడు అని పిలిచేవాళ్ళం.
       "రేయ్ డబ్బాలోడు అని ఇంకోసారి అన్నావంటే, ఈసారి డబ్బాలోదిలేసి నీ వీపు మీద వాయించుకుంటా చూసుకో. ఇంతకీ సాగర్ గాడు ఎక్కడరా?"
            "సాగర్ గాడికేమిరా మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు. గర్ల్ ఫ్రెండ్ తో ఏదో సినిమా కి వెళ్ళాడు. ఆడికేమిరా వాళ్ళ నాన్న పెద్ద లాయరు. వాళ్ళ నాన్న ఒక పెద్ద కేసు పట్టాడంటే వీళ్ళు ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఓ రెండేళ్ళు గడిపేసే సంపాదన వస్తుంది. ఏమైనా మనోడు పెట్టి పుట్టాడురా."
            "రవీ, సాగర్ గాడి గురించి వదిలేయ్ పద మనం టీ తాగటానికి వెళ్దాం."
        "సరే పదండి గురువు గారు. మీరు కదలడమే మహా భాగ్యం, తమరు మనసు మార్చుకునేలోపు బయల్దెరాలి."
            ముగ్గురం అలా మౌళి వాళ్ళ కోచింగ్ సెంటర్ దగ్గర టీ తాగి, దగ్గరే ఉన్న ఇందిరా పార్క్ కి వెళ్లాం. ప్రతి రోజు సాయంత్రం ఇందిరా పార్క్ లేదా రామకృష్ణ మఠం లేదా ట్యాంక్ బండ్ ఈ మూడింట్లో ఏదో ఒకటి మా గమ్య స్థానం. సరదాగా గడుపుదామని వెళతాం. వెళ్ళిన ప్రతి చోటా మా గురువు గారికి ఏదో ఒక సమస్య కనబడుతుంది, అంతే ఇక దాని గురించి క్లాసు పీకుడు. ఒక్కోసారి అవసరమా ఈ పిచ్చోడితో అనిపించేది. ఒక్కోసారి తనలా ఉండలేకపోతున్నందుకు అసహ్యం వేసేది. సహాయం కావాలంటే అడగాల్సిన పని లేదు తనకు తానుగా చేయూతనిచ్చేవాడు ఎవరికైనా. సమస్యని తనదైన విశ్లేషణతో చెపుతుంటే ఆ క్షణంలో మాకు కూడా ఏదో చెయ్యాలన్నంత ఊపు వచ్చేది. కానీ మళ్ళీ రెండు బీర్లు లోపల పడగానే జీవితంలోని సరదాలన్నీ గుర్తొచ్చి ఆ ఆవేశాన్ని బజ్జోపెట్టేసేవాళ్ళం. కానీ మౌళి అలా కాదు. సామాజిక చైతన్యం అంటూ ఏమేమో చెప్పేవాడు, చేసేవాడు. క్రమం తప్పకుండా వారంలో ఏదో ఒకరోజు ఏదో ఒక అనాదాశ్రమానికో, వృద్ధాశ్రమానికో లేదా ఏదో ఒక స్వచ్చంద సేవా సంస్థకో వెళ్లి తనవంతు ఏమి చెయ్యగలడో ఆ సేవా కార్యక్రమాలు చేసి వచ్చేవాడు. ఒకరోజు అదే విషయం మీద చాలా చర్చ జరిగింది.
            "ఏంటి గురువు గారు మీరు, ఏదో అన్నీ ఉడిగిపోయిన వయసులో చెయ్యాల్సిన పనులు చేస్తున్నారు. అవన్నీ కడుపు నిండిన వాళ్ళు చేసే పనులు అండి. మీరేంటి ఇప్పుడు సంఘం, సేవ అంటూ బయల్దేరారు. ఒక మంచి ఉద్యోగం చూసుకోండి, మాంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి. పిల్లలు లైఫ్ లో సెటిల్ అయ్యాక అప్పుడు మొదలెట్టండి ఇవన్నీ. ఏదో చెబుతున్నాం అని కాకుండా కాస్త ప్రాక్టికల్ గా ఆలోచించండి గురువు గారు."
            "రవీ, సరే నేను చేసే పనులకు అన్నీ చూసుకుని చేయ్యమంటున్నావు. నేను చేసే ఈ పనులకు నేను ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టట్లేదు - రానూపోనూ సిటి బస్సు టికెట్ ఛార్జ్ తప్ప. మరి బీరు, సిగేరెట్ తాగుతున్నారే మీరందరూ వాటికి డబ్బు ఖర్చు అవుతోంది కదా. మరి మీరు కూడా ఇవన్నీ మీ పిల్లలు లైఫ్ లో సెటిల్ అయ్యాక చేసుకోవచ్చు కదా. ఇప్పుడెందుకు?"
            "అది  వేరు గురువు గారు. సందు దొరికింది కదా అని దానికి దీనికి లింక్ పెట్టోద్దండి. దట్స్ జస్ట్ ఫర్ ఎంజాయ్మెంట్. అసలు మీరు ఇలా అక్కడికో ఇక్కడికో వెళ్లి ఏదో కాస్త చెయ్యడం వలన మీరు కోరుకున్న మార్పు ఏమైనా వస్తుందంటారా?"
            "నేను చేసే ఈ పనుల వల్ల మార్పు వస్తుందని నేను చెప్పట్లేదు రవీ. కానీ నాకు తృప్తి కలుగుతుంది అంతే. నీవు ఇలా అడుగుతుంటే నేను ఎప్పుడో చదివిన ఒక విషయం గుర్తుకువస్తోంది - 'అప్పట్లో వల్లభాయి పటేల్ గారు అహ్మదాబాద్ లో ప్రముఖ న్యాయవాది. ఆ కాలంలోనే ఆయన ఫీజు ద్వారా లక్షలు సంపాదించారంటే ఎంత పెద్ద న్యాయవాదో అర్థం చేసుకో. ఆయనకు గాంధిగారు అన్నా అయన పద్ధతులు అన్నా పెద్దగా సదభిప్రాయం ఉండేది కాదు, విమర్శించేవాడు కూడా. ఒకరోజు గాంధిగారు అహ్మదాబాద్ వచ్చారని తెలిసింది. అ రోజు సాయంకాలం పటేల్ గారు తన ధనిక/పుర ప్రముఖ మిత్రులతో ఒక క్లబ్ లో బిలియర్డ్స్ లాంటి ఆటలేవో ఆడుతున్నారు. ఇంతలో వారి మిత్రుడు ఒకడు అక్కడకు వచ్చి అందరితో గాంధిగారు వచ్చారని, గాంధీగారిని కలుద్దామని అన్నాడు. దానికి పటేల్ గారు వెటకారంగా 'ఆయన దగ్గరకెళ్ళి మనం చేసేదేముంది. స్వాతంత్ర్యం రావాలంటే ఆయనలాగా గోచి కట్టుకుని, రోడ్లు ఊడవమంటాడు, లేదంటే దళితవాడలు శుభ్రం చెయ్యమంటాడు. దాంతోటి స్వాతంత్ర్యం వస్తుందా? అక్కడకు వెళ్ళడం సమయం వృధా' అన్నారట. ఆ మిత్రుడు తక్కువోడేమీ కాదు, 'మరి స్వాతంత్ర్యం రావాలంటే, లేదా మార్పు రావాలంటే మనలా క్లబ్బుల్లో సమయం గడిపితే వస్తుందా?' అన్నాడట. ఆ క్షణంలో ఆ మిత్రుడికి తెలీదు ఆ మాట ఎంత ప్రభావం చూపిస్తుందో. కాని పటేల్ గారి మీద ఆ మాటలు గొప్ప ప్రభావమే చూపాయి. ఆ ప్రభావం/అంతర్మధనం పటేల్ గారిని గాంధేయమార్గం వైపు, తద్వారా స్వాతంత్రోద్యమంవైపు నడిపించాయి. స్వాతంత్ర్యానంతర భారత దేశాన్ని నడిపించడంలో భాగస్వామిని చేసాయి. అందుకే మనం కూడా ఏదో ఒకటి చేసే వాడిని విమర్శించే కంటే మనకు చేతనైంది చెయ్యడం మంచిది'"
            "అది కాదు గురువు గారు, మిమ్మల్ని హర్ట్ చెయ్యాలని కాదు. మీరు చేసేది మంచిదే కాని మీ ఫ్యూచర్ కి ఉపయోగపడేలా ఏమన్నా చెయ్యండి అని చెప్పాలన్నదే నా ఉద్దేశం. అంతకుమించి మరేమీ కాదు. అయినా ఈ జనాలు ఎపుడూ తమకోసం పనిచేసే వాళ్ళకోసం/పోరాడేవాళ్ళకోసం ఎదురు చూస్తుంటారు తప్పించి, తమకై తాము పోరాడాలని అనుకోరు. అలాంటోళ్ళకోసం మీరెందుకు సమయం వృధా చెయ్యటం. మీతో మొదలవలేదు, మీతో ఆగిపోదు."
            నేను ఇంకా ఏదో అనబోతుండగా, రెహ్మాన్ కల్పించుకోవడంతో ఆ రోజు మా చర్చ అంతటితో ముగిసింది. ఆ తరువాత కొద్దీ కాలానికే అందరం కెరీర్ లో సెటిల్ అయ్యాము. మౌళి మాత్రం సివిల్స్ కి ట్రై చేస్తూనే ఉండేవాడు. 
*                *                 *
            ఇదంతా దాదాపు పది సంవత్సరాల క్రితం మాట. ఇప్పుడు నేను హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యాను. నేను స్టార్ట్ చేసిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కం రిక్రూట్మెంట్ ఏజెన్సీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. సిటీలోనే రెండు బ్రాంచ్ లు ఉన్నాయి. స్టార్ట్ చేసి దాదాపు ఐదేళ్ళు అవుతోంది. సాగర్ విదేశాలకెళ్ళాడు. ఎప్పుడో సంవత్సరానికొక్కసారి వస్తాడు. వచ్చేప్పుడు వాడు తెచ్చే ఏ జానీ వాకర్ తోనో కలిసి కూర్చుని సిట్టింగ్ వేయడం అంతే. ఇక రెహ్మాన్ సినీ ఇండస్ట్రీ లో ప్రయత్నించి ప్రయత్నించి విసుగొచ్చి బ్యాక్  టు పెవిలియన్ అన్నట్టు మళ్ళీ ఐ.టి. కి వచ్చేసాడు. నా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కం రిక్రూట్మెంట్ ఏజెన్సీ రెండో బ్రాంచ్ వాడే మేనేజ్ చేస్తున్నాడు. అయినా మ్యూజిక్ డైరెక్టర్ కావాలన్న వాడి ప్రయత్నాలు మాత్రం మానలేదు. రమణ గోగులని ఆదర్శంగా తీసుకుని ఏవో ఒకటి రెండు ప్రైవేటు ఆల్బమ్స్ కూడా చేసాడు అంతే కాదు మా ఆర్గనైజేషన్ లో ఏవన్నా ఈవెంట్స్ జరిగితే వాటికి వాడిదే మ్యూజిక్. చెప్పాలంటే నిజంగా మ్యూజిక్ బాగా చేస్తాడు రెహ్మాన్, ఎ అర్ రెహ్మాన్ అంతటి స్థాయిలో కాకపోయినా ఓ రేంజ్ లో బానే ఇస్తాడు. ఇక మిగిలింది గురువు గారు - సివిల్స్ లో రెండుసార్లు విఫల ప్రయత్నం చేసాక అది మానుకుని కొన్నాళ్ళు ఏదో మాగజిన్ లో ఎడిటోరియల్ డిపార్టుమెంటు లో పని చేసాడు. తరువాత అదీ మానేసి వాళ్ళ ఊరికెల్లిపోయాడు. మళ్ళీ ఇంతవరకు టచ్ లో లేదు. రెహ్మాన్ మాత్రం అప్పుడప్పుడు తనకి ఫోన్ చేస్తుండేవాడు, తన గురించి ఏవైనా విశేషాలుంటే రెహ్మాన్ ద్వారానే తెలిసేవి.
        ఆ రోజు ఉదయం ఆఫీసు కి వచ్చాక ఏవో మీటింగ్స్ అంటూ మధ్యాహ్నం దాకా అలా బిజీ గా గడిచిపోయింది. టైం చూస్తె రెండు అయ్యింది. భోజనానికేల్దాం అనుకుంటుండగా రెహ్మాన్ నుండి ఫోన్ వచ్చింది. అప్పటికే రెండుసార్లు చేసినట్టున్నాడు, ఏమంత అర్జెంటు పని ఉందబ్బా అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసాను.
            "రవీ, మనం వెంటనే గురువు గారి ఊరికి బయల్దేరాలిరా"
            "ఏమైందిరా ... ఏమన్నా అవసరం ఉందటనా గురువు గారికి. బహుశా నాకు వీలు కాదేమో, నువ్వు వెళ్లి వస్తావా? డబ్బేమన్నా కావాలంటే ఆఫీసు నుంచి తీసుకెళ్ళు."
         "రవీ గురువు గారు చనిపోయారట. ఏం జరిగిందో తెలీదు, ఒక అరగంట క్రితం తన రూం కి వెళ్లి చూస్తే తెలిసిందట. ఉదయం నుంచీ ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయ్యకపోవటంతో అనుమానం వచ్చి చెక్ చేసారు. కానీ తనకి ఎం జరిగినా మన ఇద్దరికీ ఫోన్ చెయ్యమని చెప్పాడట."
          "వాట్?" గట్టిగా అరిచాననుకున్నాను కానీ మాట గొంతు దాటి బయటకి రాలేదని రెహ్మాన్ మల్లి" హలో హలో మాట్లాడవెంట్రా? నువ్వు ఒకె నా?" అన్నప్పుడు తెలిసింది.
            "రెహ్మాన్ నువ్వు వెంటనే ఇక్కడికి వచ్చేయ్. ఇక్కడనుంచి బయల్దేరదామ్." అంటూ ఫోన్ పెట్టేసాను.
మైండ్ అంతా బ్లాంక్ గా అయిపొయింది. నేను విన్నది నిజమేనా? గురువు గారు, అసలు మౌళి కి ఏమయ్యింది. ఆత్మహత్య చేసుకున్నాడా? అంత పిరికి వాడు, బలహీన మనస్కుడు కాదు. ఆర్ధిక ఇబ్బందులు లేవు, ఒకవేళ ఉన్నా మమ్మల్ని అడిగేంత చనువు ఉంది. మరి ఏమైంది?
      "రేయ్ రవీ నువ్వెంటిరా ఇలా ఏడుస్తూ కూర్చున్నావు. లే బాత్రూం కెల్లి ముఖం కడుక్కురా బయల్దేరుదాం. ఇదిగో కొంచం నీళ్ళు తాగు" అంటూ రెహ్మాన్ గొంతు వినబడ్డప్పుడు కానీ తెలీలేదు నాకు కన్నీళ్లు వస్తున్నాయని. మాట్లాడితె ఏమవుతానో అని భయంతో వెంటనే బాత్రూం కి వెళ్లి రెడీ అయ్యి వచ్చాను. ఈ లోగా రెహ్మాన్ టీ తెప్పించాడు. టీ తాగింతరవాత కాస్త ఆలోచించడం మొదలెట్టాను. మేమిద్దరం డ్రైవ్ చెయ్యడం మంచిది కాదనిపించింది, దాదాపు 250 కిలోమీటర్లు గురువు గారి ఊరు. డ్రైవర్ ని పిలిపించాను. రెహ్మాన్ వచ్చిన అరగంటకి నా కారులో ఇద్దరం బయల్దేరాం. దాదాపు రాత్రి ఏడున్నర అయింది మేము అక్కడకు చేరేసరికి. ఊరిలోకి ఎంటర్ అయ్యాక గురువు గారి ఇంటికి చేరటానికి మాకు దాదాపు అరగంట పట్టింది. గురువు గారికి ఇంత ఫాలోయింగ్ ఉందా ఊళ్ళో అనిపించింది. మౌళి ఇంటికి అని దారి అడుగుతుంటే దుఃఖంతో తడబడే గొంతుతో సమాధానం చెప్పే వారే తప్ప మామూలుగా ఒక్కరు కూడా కనబడలేదు.
            ఎవరిని కదిలించినా వారికో లేక వారు ఉండే ప్రాంతానికో లేక ఊరికో మౌళి చేసిన మంచి గురించే చెపుతున్నారు. ఊరు ఊరంతా పనులన్నీ మానేసి మౌళి ఇంటి దగ్గరే ఉన్నారు. అసలేం చేసాడు మౌళి ఇంతమందిని కదిలించేలా? ఎవరు అడిగినా కాదనకుండా తనకు వీలైనంత సహాయం చేస్తాడు. గురువు గారు అప్పుడప్పుడూ చెప్పేవారు "దేవులపల్లి కృష్ణశాస్త్రి బాధ ప్రపంచం బాధ అయితే ప్రపంచం బాధ శ్రీ శ్రీ బాధ అయింది" అని. ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే ఆ మాటకు అర్థం తెలుస్తోంది. ఈ ఊరి బాధ గురువు గారి బాధ అయ్యింది. అందుకే ఆ సమస్యని/బాధని తీర్చటానికి వెనక్కి మళ్ళీ ఊరికే వచ్చాడు. రావడమే కాదు తను అనుకున్నది, తనకు చేతనైంది చేశాడు. గురువు గారి శ... ఆ పదం ఉపయోగిన్చాలనిపించట్లేదు. అసలు అక్కడకు వెళ్లి గురువు గారి శరీరాన్ని చూసి తట్టుకోగలనా అనిపిస్తోంది. రెహ్మాన్ పరిస్థితి కూడా ఇంచుమించు నాలాగే ఉంది. తన దుఃఖాన్ని అదుపులో ఉంచుకోవడానికో లేక గురువు గారి ఆత్మ శాంతికో తెలీదు కానీ వాడు ఒక మూలన కూర్చుని నమాజ్ చేస్తున్నాడు.
            ఇలా దుఃఖానికి, ఆలోచనలకి మధ్య ఉండగానే తెలీకుండానే తెల్లారింది. మిగతా కార్యక్రమాలన్నీ త్వరగా త్వరగా పూర్తయ్యాయి. గురువు గారి తల్లి తండ్రులు కాలం చేసి అప్పటికే కొన్ని సంవత్సరాలు అయ్యింది. ఒక్కడే ఉంటున్నాడు. మిగతా బంధువులందరికీ మౌళి దూరంగా ఉంటుంటాడు కాబట్టి మౌళి చివరి ప్రయాణానికి ఎవరూ రాలేదు. దూరంగా గురువు గారి శరీరం కట్టేల్లో కాలుతోంది. మనసులో ఆవేదన చితి మంటల్లా ఎగుస్తోంది.
           
            విషాదం వెక్కిరింపులా అనిపిస్తోంది కాలం
            నీ మౌనాన్ని తట్టుకోలేక కరిగిపోతోంది
            పలకవేం నేస్తం, ఇంతకాలం పక్కనలేనని కోపమా
            అయినా ఎక్కడకెళతావు మమ్మల్ని కాదని
            దిగంతాలకావల నువ్వున్నా చిరుదివ్వెని
            వెలిగిస్తే  మిణుగురువై నువ్వు రావా
            అసలు నిన్ను మేము వెల్లనిస్తేగా
            చిరునవ్వుల రవ్వల్ని రువ్వుతూ
            నీ వైపోచ్చే చీకటిని పారదోలుతాం
            నవ్వుతూ ఉండిపో ... నువ్వుగా మిగిలిపో
            సిరిమువ్వకు మౌనం లేదు
            చిరునవ్వుకు మరణం లేదు
            నవ్వుతూ ఉండిపో ... నువ్వుగా మిగిలిపో

            ఎవరిదో చేయి భుజం మీద పడితే ఈ లోకం లోకి వచ్చి పక్కకి తిరిగి చూసాను. ఎవరో ముసలాయన, "బాబూ, మంచోల్లని దేవుడు తొందరగా తీసుకెళతాడు అంటారు. మౌళి మంచోడు. పద బాబు." అక్కడే రెహ్మాన్, డ్రైవర్ కారులో సిద్ధంగా ఉన్నారు. రెహ్మాన్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఒక్కమాటా మాట్లాడలేదు. ఎందుకో తెలీదు కాని కారులో కూర్చున్న వెంటనే డ్రైవర్ తో వెనక్కి మౌళి వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నాను. మౌళి గది, దాన్ని గది అనేకంటే గ్రంథాలయం/లైబ్రరీ అంటే మేలేమో అనిపించేలా ఉంది. గురువు గారికి అత్యంత ఇష్టమైన నిశ్శబ్దం ఇప్పుడు అక్కడ రాజ్యమేలుతోంది. టేబుల్ మీద ఉన్న నోట్బుక్ తీసుకుని పేజీలు తిరగేస్తుంటే అందులోంచి ఏదో కాగితం జారిపడింది. దాన్ని తిరిగి అందులో పెట్టబోతుంటే నా పేరు కనిపించింది.
            "రవీ, ఎందుకో తెలీదు ఇది నీకోసం రాయాలనిపించింది. ఎప్పుడూ నువ్వు అనేవాడివి కదా నేను చేసే చిన్నా చితకా పనుల వల్ల మార్పు వస్తుందా అని? నిజంగా ఆ మాటలే నాలో ఆలోచన రేపాయి. అందుకే ఎక్కడో ఉండి ఏం చెయ్యాలో ఆలోచించేకంటే చేతనైంది చెయ్యడమే మేలని ఊరికి వచ్చేసాను. నా చేతనైంది మొదలెట్టాను. ఏమి సాధించానో తెలీదు కాని తృప్తిగా ఉంది రవీ. ఎప్పుడు పోతానో తెలీదు కానీ పోయేటప్పుడు అసంతృప్తి లేకుండా పోతాను.  కారణం నీ మాటలే. రవి కిరణాలు చీకటిని పారదోలినట్టు తెలియకో నువ్వన్న మాటలు నన్ను జాగృతం చేసాయి రవీ. నేను ఎప్పుడూ ఏదో సాధించాలనుకోలేదు, మార్పు మొదలవ్వాలనుకున్నాను. ఎవరికోసమో ఎదురు చూడటం నాకు నచ్చదు రవీ. కనీసం నా ఊరిలో కొద్దిమందిలోనైనా మార్పు మొదలైంది. వారికై వారే, తమకేం కావాలో తాము పోరాడి సాధించుకోగలుగుతున్నారు. నువ్వు ఆ రోజు ఆ మాట అనకపోయుంటే, నాకు తెలిసేది కాదు. తొలి అడుగు ఎప్పుడూ ఒంటరే కదా రవీ. చివరగా ఒక్కమాట విప్లవం ఎప్పుడూ విహంగంలా ఎగురుకుంటూ రాదు రవీ, ఎవరో ఒకరు మొదలేడితేనే మార్పు మొదలయ్యేది... నిజమే ఇది నాతో మొదలవ్వలేదు, నాతో ముగిసిపోదు." అంతే ఆ కాగితంలో ఇంకేమీ లేదు.
*                *                 *
            కారులో హైదరాబాద్ కి తిరుగి వెళుతున్నాం. గురువు గారు ఆ పేపర్ లో రాసిన వాక్యాలే కళ్ళముందుకదులుతున్నాయి. నాలో కూడా మార్పు మొదలైందా? నేను మారతానా ... ఏమో నేను గురువు గారిలా గోప్పోడిని కాదు, ఒక మామూలు మనిషిని. మారతానో లేదో తెలీదు ... పుస్తకాల్లో రాసినట్టు, సినిమాల్లో చూపినట్టు కాలమే సమాధానం చెప్పాలి. గురువు గారి మాటలు వెంటాడుతున్నాయి, హైదరాబాద్ కి మా ప్రయాణం ఇంకా సాగుతోంది. డ్రైవర్ టీ తాగటం కోసం జడ్చర్ల దగ్గర కారు ఆపాడు.
            నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. "రెహ్మాన్ నేను తిరిగి గురువు గారి వాళ్ళ ఊరికి వెళ్తున్నాను. తను ఏమి ఆశించాడో తెలీదు, ఒక మార్పుకు తను నాంది అయ్యాడు. నేను ఆ మార్పుకు కొనసాగింపు కావాలనుకుంటున్నాను. నువ్వు హైదరాబాద్ వెళ్ళు. నేను కొద్దిరోజుల్లో వస్తాను." తిరిగి గురువు గారి ఊరికి బస్సు లో బయల్దేరాను. నేను అక్కడ ఏం చేస్తానో, ఏం చేయగలనో కూడా తెలీదు. కానీ ఒక ఆశయం అర్ధాంతరంగా ముగిసిపోకూడని అనిపించింది. మా దారులు వేరై, రూమ్ ఖాళీ చేసి వెళుతున్నప్పుడు ఆటోగ్రాఫ్ అని కాదు కానీ అలాంటిదే ఒకరికొకరం రాసుకున్నాం. నేను గురువు గారి బుక్ లో జస్ట్ 'ఆల్ ది బెస్ట్' అని రాశా, కానీ వాడు రాసింది నాకు ఇప్పటికీ గుర్తుంది ... అప్పట్లో అర్థం తెలీదు. ఇపుడు తెలుసుకోవటానికి మొదలవుతున్నాను ... ఎందుకంటే, ఇది గురువుగారితో ముగిసిపోకూడదు. 

            ఇది అనంతయాత్ర, ఇక నిదుర విడువోయి
            పయనించుటే నీదు పరమాశంబోయి
            పయనించు పయనించు బాట ఏది అనక
            పదిమంది దారితో పనియేమి నీకోయి

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన