రేడియో మూగబోయింది

వంశీ కలుగోట్ల // రేడియో మూగబోయింది //
**************************************
ముందు మాట:
ఈ రచనలోని పాత్రలు, అంశాలు కేవలం కల్పితాలు మాత్రమే ఎవరిని ఉద్దేశించినవీ కావు. 1990 ద్వితీయార్ధం మరియు కొన్ని సంవత్సరాల కాలం క్రితం నాటి పరిస్థితులను రైతు నేపథ్యంలో వ్యక్తీకరించాను.  
 
*            *            *
          మాది ఒక మారుమూల పల్లెటూరు. దేశంలోని అనేక పల్లెటూర్లలో మాదీ ఒకటి. 'పల్లెటూర్లు దేశానికి పట్టుగొమ్మలు' అన్న మాటకు ఉబ్బిపోవడం తప్ప అది ఏ విధంగానో ఎప్పుడూ అర్థం కానీ మామూలు రైతు కుటుంబం మాది. విత్తనం వేసాక వర్షం కోసం ఆకాశం వైపు, పంట చేతికొచ్చాక కొనేవాడు ఎప్పుడొస్తాడో అని రోడ్డు వైపు చూడటం అలవాటైపోయిన గానుగెద్దుల్లాంటి బతుకులు మావి. అలాంటి వాళ్ళలో రేడియో గాడు ఒకడు. వాడి పేరేమిటో మాకైతే తెలీదు, తెలిసిన వాళ్ళు కూడా మర్చిపోయారు. రేడియో గాడు అని తప్ప ఇంకో రకంగా ఎవరికీ తెలీదు. పొరపాటున వాడి అసలు పేరు గుర్తున్న వాళ్లెవరైనా ఆ పేరుతొ పిలిచినా వాడు పలకడు, అంతగా వాడికి కూడా అలవాటైపోయింది ఆ పేరు.
          రేడియో గాడికి ఆ పేరు రావటానికి వెనక ఒక చిన్న కథ ఉంది. వాడు ఒకప్పట్లో డ్రామాల్లో వేషాలు వేసాడట. వాడు బడికేల్లింది లేదు, అక్షరాలూ దిద్దింది లేదు కానీ ఎలా నేర్చుకున్నాడో తెలీదు కానీ కష్టమైన పౌరాణిక పద్యాలు, డైలాగులు అలవోకగా చెప్పేవాడు. రచ్చబండ దగ్గర కూర్చునే బాచ్ కి వాడే పెద్ద ఎంటర్టైన్మెంట్, ఆ రచ్చబండ బాచ్ లో ఎవడో ఎప్పుడో వాడికి ఆ రేడియో అనే పేరు తగిలించేసాడు అంటే అది పెర్మనెంట్ ఐపోయింది. మామూలుగా ఎవరితో మాట్లాడడు, తనకు సంబంధించని ఇతర ఏ విషయాలలో కల్పించుకోడు. తన పొలం పని చూసుకోవడం, సారా తాగడం తప్ప వేరే దేని గురించి పట్టించుకోడు. వాడి సంపాదనలో అధిక భాగం సారా కొట్టులో అప్పు తీర్చటానికే సరిపోయేది. ఇవ్వన్నీ వదిలేస్తే ముందే చెప్పుకున్నట్టు వాడు చాలా బాగా పాడతాడు. పాడతాడు అంటే సినిమా పాటలు కాదు, పౌరాణిక పద్యాలు మాత్రమే. పొలం నుంచి ఇంటికొచ్చాక కాళ్ళూ, చేతులు కడుక్కుని సరాసరి సారా కొట్టుకే ప్రయాణం. అక్కడ ఒక మూడ్నాలుగు గ్లాసులు పడేవరకు మామూలుగానే ఉంటాడు. ఆ తర్వాతే ఒక సీసా అది ఖాళీదైనా సరే చేతిలో పట్టుకుని మొదలెడతాడు 'బావా ఎప్పుడు వచ్చితివీవు ...' తో మొదలెడతాడు, వినడానికి వచ్చిన జనాలను చూస్తె మరింత రెచ్చిపోతాడు. బాల నాగమ్మ కథ లోని మాయల ఫకీరు డైలాగులు గుక్క తిక్కుకోకుండా చెప్పడం, లవ కుశ సినిమాలోని పద్యాలు పాడటం ఇలా ఇక దానికి అంతు అంటూ ఉండదు. వాడి పెళ్ళాం వెతుక్కుంటూ వచ్చి నెత్తిన ఓ బిందెడు నీళ్ళు పోసి తీసుకుపొయెదాకా.
          ఊళ్ళో శుభకార్యాలకు చాలా మంది వాడిని పిలిచి మందు పోస్తారు - ఆ తర్వాత అంతా వాళ్లకి ఫ్రీ ఎంటర్టైన్మెంట్ కాబట్టి. అంతా ఐపోయింతర్వాత వాడికి ఇంకో సారా బాటిల్, ఓ యాభై రూపాయలు ఇచ్చి పంపేవాళ్ళు. అలా రేడియో గాడి ప్రస్తానం సాగిపోయేది మూడు సంవత్సరాల క్రితం వరకు. మూడు సంవత్సరాల క్రితం మొదలైన వర్షాభావ పరిస్థితి కొనసాగుతూనే ఉంది. నీటి కోసం బోర్ వేయిద్దామంటే తర్వాత బిల్లు కట్టే స్థోమత లేకపోతే, బిల్లు కట్టలేదని ఎక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తారేమోనని భయం. ఎంత పరువు తక్కువ? ... తిండి లేకపోయినా పస్తులుండొచ్చు. పరువు పొతే ఎంత అవమానం. రైతులం కదా అప్పులు చేస్తామే తప్ప, అడుక్కు తినలేము, బిల్లు కట్టలేని కష్టాల్లో ఉంటాం తప్ప ఎగ్గొట్టాలన్న దొంగ బుద్దితో కాదు. అవసరమైతే ఆస్తులమ్మి, అప్పు కట్టి కూలీపనులు చేసుకుంటాం కానీ అవమానం భరించలేం. కానీ మాకు గుర్తుంది మా ఊళ్ళో కాదు గానీ అటేపు పక్క ఊళ్ళో పొలం మోటార్ కరెంటు బిల్లు కట్టలేదని అరెస్ట్ చేసారు, ఆ అవమానం భరించలేక కుటుంబమంతా ఆత్మహత్య చేసుకున్నారు. అది తెలిసినప్పటినుండి ఊళ్ళో ఎవరన్నా పొలానికి మోటార్ కనెక్షన్ తీసుకోవాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించేవాళ్ళు. మూడేళ్ళ నుండి పరిస్థితి దుర్భరమైంది, అప్పులిచ్చే వాళ్ళు కూడా మొహం చాటేస్తున్నారు, తీర్చ(లే)కపొతే వాళ్ళు మాత్రం ఎం చేస్తారు పాపం అనిపించినా నీళ్ళు తాగి పడుకున్నప్పుడు మాత్రం పరిస్థితి గుర్తొచ్చి ఆ తాగిన కాసిని నీళ్ళు కళ్ళలోంచి బయటకోచ్చేసేవి.
          పొలం మీద ఉన్న అప్పులకు తోడు రేడియో గాడు తాగుడు కోసం ఇల్లు కూడా తాకట్టు పెట్టాడని తెలిసినప్పుడు అనిపించింది తాగుడు ఎంత భయంకరమైందో కదా అని. వాడి పెళ్ళాం ఆ బాధతో వాడిని ఎప్పుడూ తిడుతూనే ఉండేది. ఆ గోల భరించలేక వాడు ఇంటికేల్లడం కూడా మానేసాడు. ఇప్పుడు కూడా తాగినప్పుడు పాడుతున్నాడు, కానీ ఆ శ్రావ్యత లేదు. వాడి గొంతులోని మాధుర్యాన్ని ఇప్పుడు వాడు అనుభవిస్తున్న బాధ డామినేట్ చేస్తోంది. వాడి గాత్ర మాధుర్యంతో జనాలని ఎంతగా రంజింపజేసాడో, వాడి బాధతో అంతగా ఇబ్బంది పెడుతున్నాడు ఇప్పుడు.
          ఈ టైములోఎలక్షన్స్ వచ్చాయి. అన్ని పార్టీల వాళ్ళు రైతులకు హామీలు గుప్పించారు. అరచేతిలో స్వర్గం చూపారు. కొన్నాళ్ళ పాటు ఆ హడావుడిలో ఎవడోచ్చినా రైతులకు ఏదో చేస్తాడని చెప్పడంతో ఆశలు చిగురించాయి. మొత్తానికి ఎలక్షన్స్ అయిపోయాయి. ఆ పార్టీ గెలిచింది. వాళ్ళ సంబరాలకోసం చేసిన ఖర్చులో సగమైనా మాకోసం ఖర్చు పెట్టుంటే ఎంత బాగుండేది అనిపించింది. అయినా ఎలాగు ఉన్న అప్పులు మాఫీ చేసి కొత్త అప్పులు కూడా ఇప్పిస్తామన్నారు కదా కష్టాలు తీరినట్టే అనుకున్నాం. రెవిన్యూ డిపార్టుమెంటు వాళ్ళు వచ్చారు మా ఊరికి వివరాలు తీసుకోవడానికి. తీసుకున్న అప్పు కేవలం పొలం/పంట కోసమే అని ఏదో ఆధారాలు చూపించాలంట. అందరం వెళ్లి మా దగ్గర ఉన్న పత్రాలు, ఆధారాలు అవీ చూపించాం. వాళ్ళు అన్నీ రాసుకుని తొందరలోనే మాఫీ జరుగుందని చెప్పి వెళ్ళిపోయారు.
          ఇక అప్పటినుండి మళ్ళీ ఎదురుచూపులు మొదలయ్యాయ్. విత్తనాలు వేసే టైం కూడా ఐపోయింది. ఇంకా అప్పులు మాఫీ జరగలేదు. అప్పుడు ఇప్పుడు అంటూనే ఉన్నారు. మొత్తానికి ఎవరెవరికి అప్పు మాఫీ జరిగిందో అదేదో వెబ్ సైట్ లో పెట్టారంట, చూసుకోమన్నారు. మా ఊళ్ళో మొత్తం దాదాపు 1000 కి పైగా ఉన్నాం రైతులం. ఎంతమందికి మాఫీ అయిందో కనుక్కుందామని మీ సేవ సెంటర్ కి వెళ్ళాం. ఊరు ఊరంతా అక్కడే ఉంది. అప్పుడే అందరికీ తెలిసిపోయినట్టుంది వెబ్ సైట్ లో వివరాలు పెట్టారని. ఆశతో లొపలికెల్లిన ప్రతి ఒక్కరు వేదనతోనో, ఆవేశంతోనో బయటకి వస్తున్నారు. సాయంకాలానికంతా తెలిసిపోయింది ఉన్న 1000 మందికి పైగా రైతులలో కేవలం ఇద్దరి పేర్లే ఉన్నాయని ఆ ఉన్న ఆ ఇద్దరు రైతులు ఎవరంటే మా ఊరి సర్పంచు, పెద్ద రెడ్డి. ఊరు మొత్తానికి అతి పెద్ద ధనవంతులు వాళ్లిద్దరు వాళ్ళిద్దరికీ రుణ మాఫీనా, మళ్ళీ కొత్త అప్పు కూడానా? మాకు మాత్రం నోట్లో మట్టి ... ఆవేశపడే ఓపిక కూడా చచ్చిపోయింది ఆవేదనా భారంతో.
          అప్పుడే ఎవరో అంటున్నారు 'రేడియో గాడు మందు తాగాడట'. వాడు మందు తాగడంలో కొత్తేముంది అనుకుంటూ ఉండగా తెలిసింది వాడు తాగింది మామూలుగా తాగే సారా కాదు, పురుగుల మందు అని. ఊళ్లోనే ఉన్న అర్.ఎమ్.పి డాక్టర్ అధ్వర్యంలో నిర్వహింపబడే హాస్పిటల్ అనబడు గదికి వాడిని తీసుకెళ్ళారు. మేమంతా అక్కడికేల్లెసరికి అంతా అయిపొయింది రేడియో గాడు ఇక లేడు. అది బాధో, నిస్సహాయతో తెలీదు కానీ కంటి నుంచి రెండు నీటి చుక్కలు రాలాయి. తప్పు సారాదో, దేవుడిదో లేక ప్రభుత్వానిదో తెలీదు కానీ మా రేడియో గాడు ఇక లేడు. మా ఊరి వరకు చెప్పాలంటే మా రేడియో మూగబోయింది.

Comments

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన