పిచ్చి కుక్క
వంశీ కలుగోట్ల // కథ: పిచ్చి కుక్క ... //
*********************************
*********************************
--- ఈ కథాంశం, ఇందులోని పాత్రలు కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవీ కావు.
"చూడవయ్యా విహారీ ఈ వార్త చదివావా - ఇది దారుణం, అమానుషం, రాక్షసత్వం. ఈ దేశంలో పుట్టానని చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నాను, భయమేస్తోంది ఇక్కడ బతకాలంటే. ఈ ఆధునిక కాలంలో కూడా మనుషులను ఉరి తీసే అనాగరిక చర్యలకు పాల్పడే ఆచారం ఇంకానా?"
"ఏమిటి మాస్టారూ పొద్దున్నే దేశం మీద పడ్డారు? ఏమైందని?"
"ఏమైంది అని అలా తాపీగా అడుగుతావేమిటి నాయనా? నీలాంటివాళ్ళు ఉండబట్టే ఇలాంటి ప్రభుత్వాల ఆగడాలు సాగుతున్నాయి."
"అయ్యబాబోయ్ శంకరం గారూ నా మీద పడ్డారెంటండి బాబూ అసలు మాటరెంతో చెప్పి తరువాత తిట్టండి"
"ఇవాల్టి పేపర్ చూడలేదా నువ్వు? ముప్పై ఏళ్ల క్రితం మన ఊర్లో వంద మంది మృతికి కారణమైన వ్యక్తిని నిన్న ఉరి తీసారు. ఇది ప్రభుత్వ ప్రతీకార హత్య తప్ప మరేమీ కాదు. అసలు అతడే నిందితుడని ఎలా నిర్ధారించారు? ఒకవేళ అవునే అనుకో తప్పు ఒప్పుకున్నాడు కదా, క్షమాభిక్ష కోరాడు కదా - మరి ఉరి తీయటం ఎందుకు? సంస్కరించాలి తప్ప చంపేస్తే ఎలా?"
"అదేంటి మాస్టారూ అలా అంటారు? వందమంది అమాయకులు అకారణంగా చావడానికి కారణమైన వాడికి తగిన శిక్ష విధిస్తే అలా అంటారు. వాడు తప్పు ఒప్పుకున్నాడు కూడా ... అసలు ఇన్నేళ్ళు వాడిని జైల్లో పెట్టి మేపటమే ఖర్చు దండగ అని అంతా అనుకుంటుంటే మీరిలా అంటారేంటి? సరే పదండి అలా నడుస్తూ పోట్లాడుకుందాం అదే మాట్లాడుకుందాం, శరీరానికి కూడా కాస్త పని చెప్పినట్టు ఉంటుంది."
"పద ఏది తప్పినా ఈ శరీరానికి తిండి, వ్యాయామం లేకపోతే కష్టం."
అలా మేము నడుస్తూ ఆ తీవ్రవాది ఉరి గురించి పోట్లాడుకుంటూ అదే మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. ఇది మాకు మామూలే - కలిసినప్పుడంతా ఏదో ఒక అంశం మీదా చర్చికుంటూ ఉంటాం. శంకరం గారు ఒకప్పుడు సామ్యవాద రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించేవారు. ఆ తరువాత ప్రజా హక్కుల పరిరక్షణ కార్యక్రమాలలో అంతకంటే చురుకుగా ఉండేవారు. ఇక విహారి అనబడే నేను అంటారా సామాన్యులలో ఒకడిని, చెప్పుకోవడానికి పెద్దగా ప్రత్యేకతలేమీ లేని అతి మామూలు మనిషిని. క్రికెట్ లో మనం పాకిస్తాన్ మీద గెలిస్తే అదేదో పెద్ద ఘనకార్యం సాధించినట్టు సంబరపడిపోయే; నాకు నచ్చినోడు గెలిస్తే దేశం తలరాత మారిపోయినట్టే అనుకునే అల్పసంతోషఆశాజీవిని.
"చూడవయ్యా విహారీ, వాడు తప్పు చేసాడు వందమంది చావటానికి కారణమయ్యాడు. నిజమే. అలాగని మనం కూడా వాడిని చంపితే ఇక దానికి అర్థమేముంది చెప్పు."
"కానీ ఆ చనిపోయిన వందమంది అమాయకులు మాస్టారూ. నేను ప్రత్యక్షంగా చూసాను - నా స్నేహితుడి తండ్రి రెండు కాళ్ళూ పోయాయి ఆ దాడిలో, వాడి చెల్లెలు అప్పుడు రెండేళ్ళ పసిపాప ఆ పాపని కూడా చంపారు దుర్మార్గులు. అలాంటి వాడిని ..."
"ఏమిటయ్యా విహారీ నువ్వు కూడా. నువ్వు చెప్పేది కాదనట్లేదు - అది బాధాకరమైన సంఘటనే కాదనను కానీ అందుకని ముప్పై ఏళ్ళ తరువాత వీడిని చంపితే లెక్క సరిపోయినట్టా? జనాలను చూడు పేస్ బుక్, ట్విట్టర్ తదితర మాధ్యమాలలో ఎలా రేచ్చిపోతున్నారో ఇదేదో పెద్ద ఘనకార్యం అయినట్టు. ఇలాంటి మనుషుల మధ్య బతకాలంటే భయమేస్తోంది, మన దేశం ఎటు పోతోంది అని ఆవేదన కలుగుతోంది."
"అదేంటి మాస్టారూ అలా అంటారు. ఎక్కడైనా తీవ్రవాదుల దాడిలో పదుల సంఖ్యలో అమాయకులైన సామాన్యులు చనిపోయినప్పుడు మీరిలా స్పందించినట్టు కనబడలేదు, ఇంత ఆవేశపడిన దాఖలాలూ లేవు. అంతెందుకు మొన్న పంజాబ్ లో తీవ్రవాదుల దాడిలో చనిపోయాడే SP, ఆయనతో పాటు మరికొందరు పోలీస్ అధికారులు వారి గురించి మీలాంటి మానవ హక్కుల ఉద్యమకర్తలు పెద్దగా పట్టించుకున్న సూచనలు లేవు. ఇదెక్కడి న్యాయమండీ ..."
మా సంభాషణ అలా జరుగుతుండగా ఎదురుగా వచ్చిన రామారావు గారు "శంకరం గారూ ఎలా వున్నారు? ఆ పార్కు వైపు వెళ్ళకండి, జాగ్రత్త అటువైపు పిచ్చికుక్క తిరుగుతోందని అనుకుంటున్నారు."
"ఆ బాగున్నాను రామారావు గారు, మీరెలా ఉన్నారు. ఈ మధ్య అస్సలు కనబడట్లేదు, ఎక్కడకెళ్ళారు?"
"ఆ ఏం లేదండీ మా పెద్దాడు అమెరికా లో ఉన్నాడు కదా అక్కడికేల్లాం, వచ్చేనెలలో చిన్నోడి దగ్గరికేళ్తున్నాం వాడు స్విట్జర్లాండ్ లో ఉన్నాడండీ."
"మంచిది. మళ్ళీ కలుద్దాం, ఉంటాను." (అని రామారావు గారితో అని, మళ్ళీ నా వైపు తిరిగి) "ఆ ఎక్కడున్నామయ్యా విహారీ మనం?"
"ఎక్కడుంటాం మాస్టారూ ఇక్కడే రోడ్డు మీద ... అబ్బా, ఏంటిది?" అని వెనక్కి తిరిగి చూసేసరికి బహుశా ఆ పిచ్చి కుక్కే అనుకుంటా నా పిక్క పట్టుకుంది. అంతే కన్ను మూసి తెరిచే లోపు శంకరం మాస్టారి చేతి కర్ర దెబ్బకు ఆ కుక్క కింద పడిపోయింది. కింద పడ్డం ఏంటి, ఏకంగా ప్రాణాలు కోల్పోయింది.
డాక్టర్ దగ్గరకి వెళ్లి వైద్యం చేయించుకుని తిరిగి వస్తూ ఉండగా శంకరం గారిని అడిగాను "అదేంటి మాస్టారు కుక్కని అలా చంపేశారు?" అని.
"చంపకపోతే ఎలా అబ్బాయ్? ఆ పిచ్చి కుక్క ఇంకా ఎంతమందిని కరుస్తుందో, ఆ వీధిలో వేల్లెవాళ్ళకి కూడా ఇబ్బంది కదా?"
"అలా కాదు మాస్టారు, మీ సిద్ధాంతం ప్రకారం ఆ కుక్కని పట్టుకుని జంతు వైద్యుడి దగ్గరకు తీసుకెళ్ళి వైద్యం చేయించి, పిచ్చి తగ్గించి సంస్కరించాలి కాని అలా చంపేస్తే ఎలా?"
"అబ్బాయ్ బోడిగుండుకి మోకాలికి లంకె పెడితే ఎలా? అక్కడ ఒక నిండు జీవితం, ఇక్కడ ఒక పిచ్చి కుక్క."
"తేడా ఏమీ లేదు మాస్టారు, అయినా ప్రతివాడు తీవ్రవాది/ఉగ్రవాది కాదు. ఒక వ్యక్తీ తనకు అన్యాయం చేస్తే అతడి మీద పగ తీర్చుకోవడం వేరు. ఎక్కడో ఏదో జరిగిందని వందలాది మంది అమాయకుల ప్రాణాలు తీయడం పిచ్చితనమే. అత్యంత ప్రమాదకరమైన ఆ పిచ్చి తగ్గకపోతే మీరు కుక్కకు విధించిన శిక్షే సరియైన మందు. అది మీ చర్య ద్వారా మీరే చెప్పారు."
అప్పటికి మరింకేమీ మాట్లాడలేదు శంకరం మాస్టారు, బహుశా తన వాదనని తయారు చేసుకుంటున్నారేమో! అయినా ఈ కాలంలో మేదావిత్వం అంటే 'తమ మూర్ఖత్వాన్ని బలపరుచుకోవటానికి వాదనలు నిర్మించుకోవటమే కదా' అది శంకరం మాస్టారు అయినా, నేనైనా.
* * *
హేవిటో: నాతో పాటు చాలామందికి అర్థం కానిదేమంటే శంకరం మాస్టారి లాంటి మేధావులు పోలీసులో, సైనికులో, నాయకులో, సామాన్యులో చనిపోయినప్పుడు వెళ్లి ఆ ఉగ్రవాద/తీవ్రవాద/సంఘ వ్యతిరేక శక్తులకు సుద్దులు చెప్పరెండుకని? గళమెత్తరెందుకని? బహుశా, ఆ వర్గాల వారు ఎత్తిన గళాన్ని చిదిమెయ్యగలరని భయమేమో.
Comments
Post a Comment