నేనెవరిని

నేనెవరిని
ముందు మాట: ఈ రచనలోని పాత్రలు, అంశాలు కేవలం కల్పితాలు మాత్రమే ఎవరిని ఉద్దేశించినవీ కావు.
********************************************************************************************
అలవాటైన ప్రాణానికి పని సరిగ్గా లేకపోతే పిచ్చెక్కినట్టు ఉంటుంది. మనకిష్టమొచ్చిన పని చెయ్యలేము, చేసే పని నచ్చదు. నచ్చకపోవడమంటే పని చెయ్యడం నచ్చదని కాదు, వేరే ఏదో చెయ్యాలని కోరిక. అలాంటి ఒకానొక సందర్భంలో, టైం పాస్ కాక బోర్ కొట్టి, సొల్లు కబుర్లు చెప్పుకుందామని హైదరాబాద్ లో ఉంటున్న ఫ్రెండ్ రాంబాబుకి ఫోన్ చేశా. ఆఫీసు లో డెస్క్ ఫోన్ కి ఎస్ టి డి సదుపాయం ఉండటం వలన ఎంత అదా అవుతోందో - ఇలాంటి టైం లోనే ఒక గర్ల్ ఫ్రెండ్ ని సెట్ చేసుకునుంటే బాగుండేది అనిపిస్తుంది. ఫోన్ కాల్స్ ఖాతా మొత్తం ఆఫీసు లెక్కలోకి తోసేయ్యచ్చు కదా. రెండు సార్లు వాయిస్ మెసేజ్ కి వెళ్ళాక మూడోసారి కానీ ఫోన్ లిఫ్ట్ చెయ్యలేదు మా రాంబాబు గాడు. ఎప్పుడు బోర్ కొట్టినా ఫస్ట్ మా రాంబాబు గాడికే ఫోన్ చెయ్యడం అలవాటు మా ఫ్రెండ్స్ గాంగ్ లో అందరికీ. మామూలుగా ఐతే వాడు పెద్ద నస కానీ ఇలా పిచ్చ బోర్ కొట్టినప్పుడు; మందు పార్టీ లలో మాత్రం వాడే చీఫ్ గెస్ట్ అన్నమాట.
"ఏరా మామా నిన్న తాగింది ఇంకా దిగలేదా? మూడో సారికి కానీ ఫోన్ లిఫ్ట్ చెయ్యలేదు, బలిసిందిలే పటాస్ గా, ఇంకా మేము బతికే ఉన్నాంరా, ఎం పోయినమనుకున్నావురా ఒక్క ఫోన్ కూడా లేదు బిడ్డా." [పటాస్ అన్నది రాంబాబు గాడికి మేము పెట్టుకున్న ముద్దు పేరు]
[రాంబాబు] "అరేయ్ మామా కూల్ డౌన్, కూల్ డౌన్. ఏందీ మామా నారాయణ మూర్తి సినిమా గిట్ల సూసినవా ఏందీ మాంచి ఫైర్ మీదున్నవ్. ఏందీ కత?"
[అన్నట్టు నా పేరు చెప్పడం మరచితిని, నా పేరు గిరి] "అరేవో పటాస్ గా ... మనకి ఫైర్ పుట్టనీకి మూర్తి అన్న సినేమాలేందుకురా పటాస్ గాడు రెండు దినాలు గిట్ల ఫోన్ సేయ్యకపోతే ఫైర్ ఆటోమేటిక్ గా పుట్టేస్తది బిడ్డా"
ఈ సొల్లు కబుర్లు అలా అలా తిరిగి రాజకీయాల దగ్గరకి వచ్చింది మా సంభాషణ. మా పటాస్ గాదు అదే రాంబాబు గాడు ఆ పార్టీ అంటే పది చస్తాడు, వీరాభిమాని అన్నమాట. అసలు మనోడికి ఐ టి లో ఉద్యోగం వచ్చిందే ఆ పార్టీ, ఆ నాయకుడి వల్ల; అంటే తప్ప మనోడి టాలెంట్ ఏమీ లేదు అన్నంతటి స్థాయి అభిమానం అన్నమాట. పార్టీ కోసం ప్రాణమైనా ఇస్తా లాంటి డైలాగులు ఎన్ని సార్లు చెప్పాడో తెలీదు. ఏవైనా ఎన్నికలొస్తే ఆఫీసు కు సెలవు పెట్టి మరీ వెళ్లి ఆ పార్టీ తరఫున కార్యక్రమాల్లో పాల్గొంటాడు. ఎప్పుడూ అనుకుంటుంటాం మా పటాస్ గాడు అంతోటి శ్రద్ధ తన ఉద్యోగం మీద పెట్టుంటే ఈ పాటికి సొంతంగా ఒక కంపెనీ యే పెట్టేయ్యగలిగేటోడు అని. అసలే ఎన్నికల టైం ... ఇంక మా పటాస్ గాడిని కెలికామంటే టైం చూసుకోకుండా ఉపన్యాసాలు ఉతికేసేయ్యగలడు. తను అభిమానించే ఆ పార్టీ ని/నాయకుడిని ఏమన్నా అంటే నోటికొచ్చింది అనేస్తాడు. అది తెలిసీ నా టైం బాలేక, నాకు బోర్ కొట్టడం వల్ల వాణ్ని కెలికాను.
"ఏరా పటాస్ గా మీ నాయకుడు గిట్ల ఎలక్షన్స్ గిట్ల ఐనంక ఇంకోసారి ఐదేండ్లు గోళ్ళు గిల్లుకుంట కూకోవాల్సిందే అంటన్నారు గదరా, ఏమంటవ్?"
"ఎరా గిరిగా నీకు సెప్పిన కద 'ఆ' పార్టీ వొళ్ళ పపెర్ గిట్ల సదవోద్దని. ఆ నాయాళ్ళు గట్లనే రాస్తరు. అసలు మా నాయకుడు ఆ మాత్రం సేయ్యబట్టే మన బతుకులు ఇయ్యాల గిట్ల ఉన్నయ్ లేదంటే నాయాల్ది మనం పేడ పిసుక్కుంటూ కూసునేవోల్లం మామా. అసలు మా ఊరికి ఇంత పేరు రావడం, ఈ అభివృద్ది గంతా మా నాయకుడి సలవే రా మామా. జనాలకి ఋణం తీర్చుకునేకి వచ్చిన ఛాన్స్ మామా ఇది.  మా పార్టీ ని, నాయకుడిని గెలిపిస్తే జనాల బతుకులు మళ్ళీ బాగుపడతయ్"
"అరేయ్ పటాస్ గా నీకు బాగా ఎక్కిందిరా. నీ టాలెంట్ నీకు తెలవదార. ఆడు లేకపోతే నువ్వు సడుకునేతోనివి గాదా నీకు ఉద్యోగం రాదా? ఎందుకురా నిన్ను సిన్నబుచ్చుకుంటవ్? అయినా ఆడు నాయకుదేన్దిరా ఆడికి ఒక విలువా లేదు, నక్కలెక్కటి వోడురా ఆడు"
"అరేయ్ గిరిగా నువ్వు గిట్ల ఆళ్ళ పార్టీలో జేరినవా ఏందీ? యవ్వారం సూత్తాంటే గట్లనే ఉంది. అరేయ్ మీ పార్టీ వోడు డబ్బులు తిన్నట్టు పండి కొక్కులు కూడ తిన్లేవురా. ఎలక్షన్స్ గిట్ల ఐనంక మాట్టాడుకుందమ్ మీ పార్టీ నో లేక మా పార్టీ నో సూసుకుందాం. రేపు గిట్ల మా నాయకుడు ముఖ్యమంత్రి ఐనంక సూడు ఆడు ____ పోసుకోవాలే, కొడుక్కి గుండెలు జారిపొతంటయ్."
"అరె మామా అది కాదురా ... నేను చెప్పేది వింటావా ఫస్ట్"
"ఇంకా వినేదేమీ లేదు మామా నాకు క్లియర్ గా అర్థమైంది నువ్వు ఆ దొంగ నా కొడుక్కే సపోర్ట్ జెస్తన్నవ్, ఎలక్షన్స్ ఐనంక మాట్లాడదం. ఇప్పుడు నీతో మాట్లాడి వేస్ట్ ... ఉంట"
అలా మా పటాస్ గాడు నన్ను 'ఆ' పార్టీ సపోర్టర్ గా ముద్ర వేసేసి, చెప్పేది వినకుండా ఫోన్ పెట్టేసాడు.
*                *                 *
వీకెండ్ సెలవులు ఐపోయాయి, ఆదివారం రాత్రి ఊరినుండి బయల్దేరాను. రాత్రి బస్సు లేట్ టైం లో క్యాచ్ చెయ్యగలిగితే సరిగ్గా ఆఫీసు టైం కి వెళ్ళొచ్చు అనుకుంటూ వెంట తెచ్చుకున్న 'ఈ తరం రాజకీయాల్లో విలువలు' అన్న పుస్తకం తీసి చదవడం మొదలెట్టాను. ఇంతలో శేఖరం మాస్టారు గారు వచ్చి పక్కనే కూర్చున్నారు. శేఖరం మాస్టారు గారంటే మా ఊళ్ళో అందరికీ తెలుసు. అయన రిటైర్ అయ్యి చాలారోజులు అయినా ఇంకా ట్యూషన్స్ చెబుతుంటారు. మా ఊళ్ళో వాళ్ళందరికీ ఆయనంటే గుడ్డి నమ్మకం, అందుకే అందరు తమ పిల్లలను ఆయన దగ్గరికి ట్యూషన్స్ కి పంపుతారు అక్కడైతే చదువుతో పాటు క్రమశిక్షణ కూడా అలవడుతుందని. నేనూ స్కూల్ డేస్ లో ఆయన దగ్గర చదువుకున్న వాడినే. వాళ్ళబ్బాయి కూడా బెంగుళూరు లోనే ఉద్యోగం చేస్తున్నాడు, బహుశా తనూ అక్కడికే వస్తున్నట్టునాడు అనుకుని పలకరించాను.
"ఎరా గిరి బావున్నావా? నువ్వు కూడా బెంగుళూరు లోనేఉద్యోగం చేస్తున్నావని మీ నాన్న చెప్పాడు. నేను కూడా బెంగుళూరు కె వస్తున్నాను. ఏంటి ఎం పుస్తకం ఇది" అంటూ నా చేతిలోని పుస్తకం తీసుకున్నాడు. 'ఈ తరం రాజకీయాల్లో విలువలు'  పుస్తకం పేరు ఎప్పుడూ వినలేదే, అయినా ఈ తరం రాజకీయాల్లో విలువలు ఎక్కదేడ్చాయి కనకరా. అందరూ ఎదవలె, ఎవడికి వాడు అందిన కాడికి దోచుకునే దొంగలే తప్ప మంచోళ్ళు ఎవరున్నారురా? మంచోల్లందరూ 'మనకెందుకురా ఆ రొచ్చు' అనుకుంటూ ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు. ఏమంటావ్.
"ఒక రకంగా మీరన్నది నిజమే మాస్టారు. కానీ దొంగల్లో కొంతమంది మంచి దొంగలు కూడా ఉంటారు కదా. అందరికీ కాకపోయినా కొన్ని రంగాల వారికైనా మంచి చేస్తారు అలాంటి వాళ్ళు. 'ఈ' పార్టీ నాయకుడు చూడండి, ఆయన ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆఫీసులలో పని సక్రమంగా జరిగేది, ఉద్యోగుల్లో కాస్తైనా భయముండేది. ఆయన దోచులేదని కాదు, అక్రమాలు జరగలేదని కాదు మాస్టారు కానీ ఇంతగా మాత్రం కాదు. వీళ్ళు మరీ ఎక్కువగా దోచుకున్నారు/దోచుకుంటున్నారు."
"ఎక్కడరా 'ఆ' పార్టీ వాళ్లకు దోపిడీలో తెలీని కొత్త దారులు చూపింది వాడే. ఏదో ఒకటి రెండు రంగాలు మాత్రమె కాదు కాదురా అభివృద్ది అంటే. ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, వ్యవస్థలు నాశనం అయ్యాయో తెలుసా. ఎంతమంది బతుకులు బజారున పడ్డాయో తెలుసా ఆయనగారి పాలనలో?"
"అది కాదు మాస్టారూ ... అసలు"
"ఎందుకులేరా మీ సదువుకున్నోల్లకి, ఎక్కడో ఉద్యోగాలు చేసేవాళ్ళకి ఈ పల్లెటూరి జనాల గొడవ పట్టదు. మీకు అభివృద్ది అంటే ఎంతసేపు మీరుండే ఆ పట్టణాలు, మెట్రో సిటీ లు తప్ప మీరేమీ కాదు. ఇక్కడ పల్లె జనాలు ఏ గంగలో దూకినా పట్టదు. నువ్వు 'ఈ' పార్టీ కి, ఆ నాయకుడికి సపోర్ట్ అని అర్థమైంది. ఇంక ఏమి మాట్లాడినా వేస్ట్. సర్లే కానీ ఇంతకీ పెళ్ళెప్పుడు చేసుకుంటున్నావు?"
అలా మాస్టారు నన్ను 'ఈ' పార్టీ సపోర్టర్ గా ముద్ర వేసేసి టాపిక్ ని వేరే వైపు మళ్ళించాడు.
*                *                 *
"అరేయ్ గిరి, ఇంట్లో పూజ ఉంది తొందరగా లేవరా." అన్న నాన్న పిలుపు/అరుపుకు నిద్ర లేవలేక తప్పలేదు. పూజ ఉంది అంటే శివయ్య మామ రావాల్సిందే. మా ఊళ్ళో ఎవరింట్లో శుభ కార్యమైనా లేక మరోటైనా అది శివయ్య పంతులు ముహూర్తం పెట్టిన తర్వాతే, ఆయన చేతుల మీదుగానే జరుగుతుంది. మాకు చిన్నప్పటినుండి బాగా తెలుసు, కుటుంబ మిత్రులు కాబట్టి మేము మామ అని పిలుస్తుంటాం. ఆయనోచ్చేలోపు స్నానం అవి చేసి రెడీ అవ్వకపోతే పెద్ద క్లాసు పీకుతాడు, ఆ క్లాసు పీకిన్చుకోవడం కంటే చన్నీల్లతోనైనా సరే స్నానం చెయ్యడమే మేలు అనుకుంటూ స్నానం ముగించి ఇలా వచ్చానో లేదో అలా వచ్చేశాడు.
"ఏరా అబ్బాయ్ గిరి, ఎప్పుడోచ్చావురా బెంగుళూరు నుంచి. పప్పన్నమేమైనా పెట్టే ఆలోచన చేస్తున్నావా? పిల్లను చూసే అవకాశం మాకో, మీ నాన్నకో ఇవ్వరా."
"నేను బాగున్నా, నువ్వు బాగున్నావా మామా? అప్పుడే నాకు పెళ్ళేంటి ... ఇంకొన్నాళ్ళు కానీ. ఉద్యోగంలో చేరి సంవత్సరం కూడా కాలేదు."అలా మొదలైన సంభాషణ అలా అలా లోకల్ పాలిటిక్స్ మీదికి తిరిగింది. "అవును కానీ మామా అదేంటి నువ్వు కూడా ఏదో ఉద్యమం అంటూ మొదలెట్టావంట. దేని కోసం?"
"ఓహో అది నీ దాకా వచ్చిందా ఐతే బానే ఉందన్నమాట ఊపు. నీలాంటోళ్ళు కూడా ఒక చెయ్యేస్తే ఇక తిరుగు ఉండదురా అబ్బాయ్. మొనామధ్య నేను ఆ ప్రాంతానికేల్లానురా, ఇంతవరకు వేరే వాళ్ళు చెబితే నమ్మలేదు కానీ నాకు అనుభవమయ్యేసరికి తెలిసొచ్చింది. అసలు మనల్ని వాళ్ళు మనుషుల్లాగా చూడరు అదేదో పురుగులను చూసినట్టు చూస్తార్రా అబ్బాయ్. బ్రహ్మడిని, పూజలు చేయించేవాడిని, ఒక స్థాయి ఉన్నవాడిని నాలాంటి వాడికే అలా ఉంటె ఇక మామూలు జనాల పరిస్థితి ఎలా ఉంటుందో అనిపించింది. మా బంధువుల అబ్బాయి ఒకడు పట్నంలో గవర్నమెంట్ ఆఫీసు లో క్లర్క్ గా పని చేస్తున్నాడు. అన్ని అర్హతలు ఉన్నా కూడా వీడిని కాదని వాళ్ళ ప్రాంతం వాడికి ప్రమోషన్ ఇచ్చాడు ఆ మేనేజర్. ఇలా ఒకటా రెండా. ఇవన్నీ ఆగాలంటే మన తరఫున పోరాడటానికి ఏదో ఒకటి ఉండాలిరా."
"ఏంటి మామా నువ్వు కూడా. రెండేళ్ళ క్రితం అక్కడే కదా నీకు పెద్ద సన్మానం జరిపి అదేదో బిరుదు కూడా ఇచ్చారు. ఎవరో కొందరు తేడా గాళ్ళు ఉంటారు, ఏం మనూళ్ళో అలాంటి తేడాగాళ్ళు లేరంటావా చెప్పు.?"
"చూడబ్బాయ్ గిరి నీలాంటి వాళ్లకి ఏమీ తెలీదు. కడుపులో చల్ల కదలకుండా ఎ.సి. ఆఫీసు రూంలో కూర్చుని పని చేసే మీకు మామూలు జనాల కష్టాలు ఏమి తెలుస్తాయి? అవమానాల పాలవుతున్న మాలాంటి వాళ్లకు, అర్హత ఉన్నా అవకాశాలు వాళ్ళు తన్నుకెల్తుంటే ఎం చెయ్యాలో అర్థం కాని అభాగ్యులకు తెలుస్తుంది ఆ మంట ఎలా ఉంటుందో; మీకు తెలీదబ్బాయ్. తెలీకపోవడం తప్పు కాదు కనీసం తెలుసుకోవడానికి ప్రయత్నించు. ఈ గొడవలు, రాజకీయాలు నీకు అస్సలు తెలీవు. నీతో మాట్లాడుతూ కూర్చుంటే పూజ తెల్లారినట్టే."
అలా నాకు రాజకీయాలు అసలేమీ తెలీవని తేల్చేసి పూజ నిర్వహించటానికి వెళ్ళాడు శివయ్య మామ.
*                *                 *
నాకు అర్థం కాలేదు, నేనెవరిని?
మా పటాస్ గాడెమో నన్ను 'ఆ' పార్టీ సపోర్టర్ గా ముద్ర వేసేసాడు
శేఖరం మాస్టారు గారేమో నన్ను 'ఈ' పార్టీ సపోర్టర్ గా ముద్ర వేసేసాడు
శివయ్య మామనేమో అసలు నాకు రాజకీయాలే తెలీవనేసాడు.
నేనవరినో నాకర్థం కాలేదు - బహుశా పటాస్ గాడు, శేఖరం మాస్టారు, శివయ్య మామ లాంటి వాళ్ళ ఆలోచనలను, సమస్యలను విస్లేశించటానికి ప్రయత్నించే కొత్త వర్గం వాడినేమో. దేవుడా, ఈ ప్రజాస్వామ్యంలో నేను ఎవడి సమర్థకుడినీ కాదని చెప్పుకునే స్వాతంత్ర్యం కూడా లేదు.

Comments

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన