'మార్పు'కు బాధ్యత ఎవరిది?

వంశీ కలుగోట్ల // 'మార్పు'కు బాధ్యత ఎవరిది? //
******************************************
     "ఆలోచన" మతం లాంటిది. నువ్వు దాన్ని ఎంత బలంగా నమ్ముతావో అంత బలంగా ఆచరిస్తావు ... ప్రపంచంలో ప్రతి మతం, సిద్ధాంతం, విప్లవం, మార్పు పేరేదైనా కానివ్వండి అది ఒక ఆలోచనలోంచే ఉద్భవించింది ... అందుకే స్వామి వివేకానంద చెప్పినట్లు "ఒక మహోన్నతమైన ఆదర్శాన్ని నీ జీవిత ధ్యేయంగా చేసుకో. దాన్ని గురించే ఆలోచించు. దానికి అనుగుణంగా జీవించు. నీ మెదడు, నరాలు, కండరాలు, నీ శరీరమంతా నీ ఆదర్శంతో/ఆలోచనతో నిండాలి."    
     దేవుడు అంటే ఒక రూపం కాదు. దేవుడు అంటే మంచి. మంచి చేసే ప్రతి ఒక్కరూ దేవుడి ప్రతి రూపాలే. అందుకే మంచి చేసిన ప్రతి ఒక్కరిని దేవుళ్ళను చేశాం, కానీ వారు చేసిన మంచిని మాత్రం ఆచరించటం లేదు. ఇలాగే మంచి చేసే వాళ్ళందరినీ దేవుళ్ళుగా చేస్తూ మనం మాత్రం దానవులుగా మిగిలిపోతున్నాం. మనం వ్యవస్థలో మార్పు రావాలి రావాలి అంటూ ఉంటాం కాని ఆ వ్యవస్థలో మనమూ భాగమనే విషయం మర్చిపోయి ఎవరో మార్పు తీసుకుని రావాలి అంటూ ఉంటాం. ఈ వాక్యాలు ఎవరో ఒకరిని ఉద్దేశించి చెప్పడం లేదు ... అలాంటి వ్యవస్థలో నేను కూడా భాగస్వామినే. మన వ్యవస్థలో రావాల్సిన మార్పు అంటే ముందుగా ప్రజలలో రావాల్సిన మార్పు, ప్రజలలో మార్పు వస్తే రాజకీయ వ్యవస్థలో దాని అనుబంధ/ఆధారిత వ్యవస్థలలో కూడా మార్పు వస్తుంది.
    అయిదేళ్ళకోసారి ప్రభుత్వమో, అధినేతో మారితే మార్పు వస్తుందనే గుడ్డి ధోరణి వద్దు. మనుషులలో మార్పు రానంతవరకూ దేవుడే దిగి వచ్చినా పరిస్థితిని మార్చలేడు. మనం మాత్రం మారం, మనకోసం ఎవడో తనను తానూ మార్చుకుని ఉన్నతుడిగా ఉండాలి అంటే ఎలా? పదవిలో ఉన్నోడు, పై స్థాయిలో ఉన్నోడు తన వ్యక్తిగత ఇష్టా ఇష్టాలకు, స్వలాభానికి కాకుండా, బంధు ప్రీతికి లోబడకుండా, డబ్బుకు ఆశపడకుండా గట్రా గట్రా నీతి నియమాలకు కట్టుబడి సమాజోద్దరణకు పాటుపడాలని తెగ ఆవేశంగా చెప్పేస్తాం కాని; సప్పోస్ ఫర్ సప్పోస్ - ఓటేసే టైం లో మనం, మనం అంటే మనమే అని కాదులే అదే వోటేసేవోడు అన్నమాట తన వ్యక్తిగత ఇష్ట ఇష్టాలకు లోబడి కాకుండా, వోటుకు నోటు/మందు తీసుకుని కాకుండా, కులం/ప్రాంతం చూడకుండా - సరిగ్గా వారేమి హామీలు ఇస్తున్నారు అవి నిజంగా ఆచరణ సాధ్యమయ్యేవేనా ఇలాంటివి అలోచించి వోటేస్తున్నారా? కెసిఆర్ కొన్నాళ్ళ క్రితం ఒక మంచి మాట చెప్పారు - 'గాదిడకి దాణా వేసి గేదేకి పాలు పితకాలనుకుంటే ఎలా' అని. కరెక్ట్ గా ఇలానే చెప్పాడో లేదో గాని ఇలాంటి అర్థమే వచ్చేట్టు చెప్పారు. మనం మాత్రం డబ్బో, కులమో, మతమో, మరోటో ఏదో ఒక ప్రలోభం వల్ల ఎదవలకు మాత్రమే వోటేసి, ఆ ఎదవలు మంచి పనులు చెయ్యాలంటే ఎలా? కనీసం వోటేసే మాత్రపు దమ్ము ధైర్యం లేని మేధావులు - అదేలెండి ఆ వరుసలో, ఎండలో నిలబడి ఓటేసే ఓపిక, తీరిక లేనివారు; వోటు వేసే వారిని ప్రధానంగా గ్రామీణ ప్రాంత వోటర్లను ఉద్దేశించి ఎదవలను ఎన్నుకుంటున్నారు, చదువులేని మూర్ఖులు అని నిందించడం ఎంతవరకు సమంజసం?
     వ్యవస్థ భ్రష్టు పట్టిపోవటానికి నాయకులు ఎంత కారణమో వారు నాయకులుగా ఎదగటానికి (?) అవకాశం ఇచ్చిన ప్రజలది కూడా అంతే ఉంది. ఒక్కసారి కాదు తెలిసినా కూడా మళ్లీ మళ్లీ వారికే అవకాశం ఇస్తూ, మళ్లీ వారు వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని కన్నీరు కార్చటం ఎందుకు? వెన్నుపోటులు, కక్షసాధింపులు, అవినీతి గట్రా గట్రాలాంటివన్నీ ఈ నాటివి కావు - కాకపొతే గతంలో రాచరికం ఉండేది కాబట్టి రాజులు చెప్పిందే వేదం గా నడిచేది. ఈ చెడ్డ రాజు పోయి మంచి రాజు రావటానికి వీడు చావడమో, యుద్ధం లో ఓడిపోవటమో జరగాల్సోచ్చేది. కాని ఇప్పుడున్నది ప్రజాస్వమ్యమైపోయే ... మరి ఇంకెవరిని తప్పు పట్టగలం మరి? విప్లవం/మార్పు రావాలంటే తుపాకులు, కత్తులు, అవతారపురుషులు అవసరం లేదు మన బాధ్యతలు ఏమిటో మనం తెలుసుకుని, మనకు ఉన్న అవకాశాలను సరి ఐన పద్ధతిలో ఉపయోగించుకోగలిగితే చాలు. మార్పు రావలసింది సమాజం లోనో, ప్రభుత్వం లోనో, పాలకులలోనో లేదా మరేవరిలోనో కాదు - మార్పు రావలసింది మన ఆలోచనాధోరణిలో. మనం ఇంట్లో కూర్చుని అబ్దుల్ కలాం, అన్నా హజారే లాంటి వాళ్ళు సమాజాన్ని ఉద్ధరించాలని కోరుకుంటూ ఉన్నంత కాలం అది అలానే ఉంటుంది. లగే రహో మున్నాభాయ్ చిత్రం లో గాంధీ గారి పాత్ర "తన ఆదర్శాలను, ఆశయాలను వీధుల్లో, విగ్రహాలలో కాదు మనస్సులో ఉంచుకోవాలి, ఆచరించాలి" అని చెబుతుంది. విగ్రహాలు పెట్టటంలో ఉన్న ఆసక్తిలో కాస్తైనా ఆదర్శాల ఆచరణలో చూపగలిగినప్పుడు మాత్రమే మనం నిజమైన మార్పు ఆశించగలం. అలా కాకుండా మన సమస్యలకోసం ఇంకెవరో పోరాటం చెయ్యాలి, ఎవడో ముందుండి తాను మార్పు తెస్తానంటే మనం గొర్రెల్లా వెంట నడిచేస్తామనడం, ఇంకెవడో - నాకు అధికారమిస్తే మీ జీవితాలలో మార్పు తెచ్చేస్తానంటే నమ్మేయ్యడం జరిగినన్నాళ్ళూ వాళ్లనో, వీళ్లనో తిట్టుకుంటూ రోజులు గడపాల్సిందే. మార్పు అంటే ఎప్పుడూ ఇంకెవరో తెచ్చేదే అవుతోందే కానీ మన నుండి మొదలవ్వట్లేదు. సమాజం లోని అట్టడుగు స్థాయి జాగృతమైనప్పుడే అది విప్లవం గా మారి ఉప్పెనై ఎగిసి నిజమైన మార్పుగా రూపాంతరం చెందుతుంది. నేను చెప్పే మార్పు కోసం నా ప్రయత్నం నేను మొదలుపెట్టాను ... వీలయితే మీరూ మొదలుపెట్టండి. చూద్దాం ... ఏదో ఒకరోజు వాళ్ళనీ, వీళ్ళనీ తిట్టుకోవడం కాకుండా మనల్ని మనం పోగుడుకునే రోజు వస్తుందేమో అదే 'మార్పు' అని ఉద్దేశం. :)

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన