యముడి భూలోక యాత్ర: ఒకటవ రోజు (కథ) - అమరావతి సందర్శనం

యముడి భూలోక యాత్ర
ఒకటవ రోజు (కథ) - అమరావతి సందర్శనం
**************************************
ముందుమాట: ఇది కొన్ని వాస్తవ ఘటనల నేపథ్యంలో అల్లుకున్న కాల్పనిక కథ. ఎవరినీ నొప్పించాలని, విమర్శించాలని కాదు. కేవలం రచయిత ఊహ మాత్రమే.
*                *                 *

అది యమసభ - పాపుల విచారణ, శిక్షల విధింపు ఆ రోజుకి పూర్తయ్యింది. ప్రతిరోజూలానే ఆ రోజు కూడా ఎలాంటి ప్రత్యేకత లేకుండా యుగాల తరబడి సాగుతున్న వారి దినచర్యలో భాగంగా మరో రోజుకు ముగింపు పలకడం తప్ప చేసినది ఏమీ లేదు. భూలోకం నుంచి వస్తున్న పాపుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుండటం అటు చిత్రగుప్తుడికి, ఇటు యమధర్మరాజుకి శిరోభారంగా మారింది. తమ బాధ్యతల నుండి కాస్త విరామం తీసుకుని స్వర్గమునకో లేక మరియొక లోకమునకో కొద్దిరోజులు వెళ్లి రావాలని యోచింపసాగాడు యముడు. విచారణ పూర్తయినందువలన పాపులు, భటులు, మిగతా అందరూ వెళ్ళిపోవడం వలన సభా మందిరంలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. బయలుదేరటానికి సిద్ధమవుతూ చిత్రగుప్తుడితో సంభాషణ మొదలు పెట్టాడు యమధర్మరాజు.
యముడు: "గుప్తా! భూలోకమునుండి వచ్చు పాపుల సంఖ్యా నానాటికీ పెరిగిపోవుచున్నది, భూలోకమున పుట్టు వారి సంఖ్యకంటే గిట్టువారి సంఖ్యయే అధికముగా ఉన్నట్టుగా మాకు తోచుచున్నది. బ్రహ్మదేవులవారు విరామము తీసుకోనినారో ఏమో మరి. అది ఏమో గాని, ఏమాత్రమూ మజాలేని ఈ దైనందిన కార్యక్రములతో మాకు శిరోభారము అధికమగుచున్నది గుప్తా. కొలదికాలము ఈ కార్యక్రమముల నుండి విరామము తీసుకొని స్వర్గమున విహరించి రావలేనని మాకు అనిపించుచున్నది."
చిత్రగుప్తుడు: "ప్రభూ! ఎంత కాలమైనది విరామము అను మాట విని అందునా మీ నోటివెంట. నాకు మీ వాక్కు అమృతతుల్యముగా తోచుచున్నది. స్వయముగా నేను మిమ్ములను వేడుకొనవలేనని యోచించుచుంటిని. ప్రభూ, ఈ మధ్యనే భూలోకమునుండి వచ్చిన ప్రముఖ పాపి యొకడు ఆ లోకమునందుండు సకల సౌఖ్యముల గురించి పరిపూర్ణముగా వివరించెను, అవి వినిన పిమ్మట నాకు స్వర్గ విహారమున ఆసక్తి తరిగి భూలోకమునకు వెళ్ళవలెనను కోరిక అధికమగుచున్నది ప్రభూ. మిమ్ములను అడుగవలెనన్న ఏమందురో అని భయము చేత మిన్నకుంటిని ..."
యముడు: "హా గుప్తా! ఎంత మాటంటివి. కఠినముగా ఉండుట మా వ్యక్తిత్వము కాదు, స్వభావము కాదు. మేము నిర్వహించుచున్న బాధ్యతలు అత్యంత క్లిష్టమైనవి కావుటవలన, అవసరము కొద్దీ కఠినముగా ఉండవలసి వచ్చుచున్నదే కానీ అంతర్గతముగా మేము చాలా సున్నిత మనస్కులము గుప్తా."
ఎప్పుడూ ఆ విధముగా మాట్లాడని యమధర్మరాజు ఆవేళ మనసు విప్పి అలా మిత్రుడిలా మాట్లాడటంతో చిత్రగుప్తునికి ఆనందంతో కళ్ళు చెమర్చాయి. "ప్రభూ, మీరు నిర్వహిస్తున్న బాధ్యతల గురించి, మీ గురించి తెలిసినవారు నన్ను మించి వేరేవరున్నారు ప్రభూ. నా మాట మన్నించి, భూలోక విహరమును గురించి కాస్త యోచించండి." అంటూ తన మనవిని మరొకమారు విన్నవించుకున్నాడు.
యముడు: "గుప్తా! ఆ స్వర్గమును అందలి అప్సరలను చూచి చూచి మాకును విసుగు వచ్చినది. ఏదైనా కొత్తగా చూడవలెనని మనసు కోరుకోనుచున్నది. భూలోక విహారమునకు వెళ్ళవలెనని నిర్ణయం తీసుకున్నాము. త్వరగా బయల్దేరేదము ... సిద్ధము కమ్ము"
ఆ విధముగా కొద్ది కాలము తమ బాధ్యతలనుండి విరామము తీసుకుని, భూలోక సందర్శనమునాకు యమధర్మరాజు, చిత్రగుప్తుడు బయల్దేరారు.
*                *                 *
సరిగ్గా అదే రోజు, భూలోకంలో ...
చీకట్లు ముంచుకొచ్చి అప్పటికే చాలా సమయమైంది. ప్రపంచమంతా (అదేలెండి ఎవరికైతే రాత్రి అయ్యుంటుందో వారు అని) నిద్రావస్థలో జోగుతున్నవేళ, అతడు ఇంకా తన కార్యాలయంలో కూచుని భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ పథకాలు వేస్తూనే ఉన్నాడు. అద్భుతమైన భవిష్యత్తును ఊహించుకుంటూ జనావళి నిద్దురలో కలలు కంటూంటే, అతడు నిద్దుర మానేసి ఆ భవిష్యత్తుకోసం శ్రమిస్తున్నాడు. అతడే నాయకుడు - సకల జనులు దార్సనికుడని ఎవరిని కొనియాడతారో; ఎవరిని సచ్చీలుడు, నిప్పులాంటి వాడు అని నమ్ముతారో; అవినీతి మకిలి అంటని వాడుగా కీర్తిస్తారో; తమ భవిష్యత్తును నిర్మిస్తాడని నమ్ముతారో ఆ నాయకుడే అతడు. నిద్ర మానుకుని మరీ రాజధాని నగర నిర్మాణానికి సంబంధించిన విషయాలు, వివరాలతో తలమునకలై ఉన్న సమయంలో అతడి కుడి కన్ను అదరటం ప్రారంభించింది. పనిలో నిమగ్నమై ఉన్న ఆతడు కన్ను ఆదరటంతో కాస్త కలవరపడ్డా అది కుడికన్నుగా గమనించి 'కుడికన్ను అదరటం శుభసూచకం' అని ఆనందించాడు. ఎందుకో తెలియదు కాని, ఆవేళ ఉదయం నుంచి ఏదో మంచి జరగబోతోంది అని అతడికి అనిపిస్తూనే ఉంది. బహుశా ఇది దానికి సంకేతమేనేమో. అంతలో అతడికి ఆరోజు ఎవరో అనుకోని అతిధి వస్తారని అనిపించింది. వెంటనే తన పియ్యేని పిలిచాడు.
నాయకుడు: "పియ్యే, ఇక్కడకు వచ్చే అన్ని రకాల దారుల మీద కాస్త నిఘా పెంచి జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఏ చిన్న కదలిక ఉన్నా వెంటనే నాకు తెలియజేయండి."
పియ్యే: "అలాగే సర్. సర్, భద్రతా ఏర్పాట్లు ఏమైనా పెంచామంటారా? సెక్యూరిటీగా మరికొంతమందిని రమ్మని చెప్పమంటారా? ఏదైనా దాడి జరగోచ్చు అని ఇంటెలిజెన్స్ నుంచి ఏమైనా సమాచారం అందిందా?" పియ్యే అంటూ ఒకింత ఆత్రుతగా, భయంగా అడిగేసరికి నాయకుడికి నవ్వు వచ్చింది. తనలాంటి దార్శనికత లేకపోబట్టే కదా వీరు ఇలాగే ఉండిపోతున్నారు అనుకుంటూ (నాయకుడు) "అలాంటిదేమీ లేదయ్యా పియ్యే. కానీ, ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే నాకు ఎందుకో అనిపిస్తా ఉంది ఇవ్వాళ ఎవరో అనుకోని అతిధి ఇక్కడకు రాబోతున్నారు అని. అందుకే నేను ఏమి చెబుతున్నానంటే అన్ని రకాల మార్గాల మీద ఒక కన్ను వేసి ఉంచండి. ఏ చిన్న కదలిక కనిపించినా నాకు తెలియాలి అని చెబుతాఉన్నాను. అర్థమైందా అని ఆడుతున్నాను పియ్యే."
పియ్యే: "సర్, అర్థమైంది సర్. మీరేమీ అనుకోనంటే ఒక మాట చెబుతాను సర్. మీలాంటి దార్శనికుడు మాకు నాయకుడిగా అందునా ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో మీరు ఉండటం మా అదృష్టం సర్. ప్రజల భవిష్యత్తు కోసం మీరు నిద్ర మానుకుని మరీ ఎంత కష్టపడుతున్నారో నాకు మాత్రమే తెలుసు సిర్. నిజంగా మీ దార్సనికతకు, మేదావిత్వానికి, కష్టానికి జోహార్లు సర్. మీరు కలకాలం వర్ధిల్లాలి, ఎప్పటికీ మీరే మా నాయకుడిగా ఉండాలి."
నాయకుడి మొఖంలో చిరునవ్వుతో కూడిన చిన్న గర్వ వీచిక అలా కదలాడగా, (నాయకుడు) "ఏమి చెయ్యమంటావయ్యా పియ్యే. నువ్వంటే చదువుకున్నవాడివి, కాస్త తెలివితేటలు ఉన్నవాడివి, అంతో ఇంతో దార్శనికత ఉన్నవాడివి కాబట్టి నన్ను అర్థం చేసుకోగాలిగావు. కానీ, ఈ మామూలు ప్రజలు, ప్రతిపక్షాలు అనబడే వాళ్ళు ఉన్నారే వారు అర్థం చేసుకోవట్లేదు. ఎప్పుడు చూసినా వ్యవసాయం, ఆహారధాన్యాల ఉత్పత్తి అంటూ గోల చేస్తారు. నేను ఏమి చెబుతున్నానంటే, ఆహారధాన్యాలు కావాలంటే చైనా నుండో, మరోకచోటు నుండో తక్కువ ధరలకే దిగుమతి చేసుకోవచ్చు. కానీ, అభివృద్ధిని, పాశ్చ్యాత్యదేశాల జ్ఞానాన్ని మనం దిగుమతి చేసుకోగలమా అని అడుగుతాఉన్నాను. నేను ఏమి చెబుతున్నా ... " అంటూ నాయకుడు తన పియ్యే వైపు చెప్పటం ఆపేసాడు.
అప్పటికే పియ్యే కళ్ళలోంచి రాలిన ఆనందభాష్పాలతో అతడి చొక్కా సగం తడిసిపోయింది. అతడు గద్గద స్వరంతో (పియ్యే) "సర్, మీలాంటి గొప్ప వ్యక్తి దార్శనికుడు మా నాయకుడిగా ఉండటం మా అదృష్టం. మీరు కలకాలం వర్ధిల్లాలి, జిందాబాద్ ... జిందాబాద్" అని నినాదాలు చేస్తూ కళ్ళు తుడుచుకుంటూ అతడు గది బయటకు వేల్లిపోతోంటే నాయకుడి కళ్ళు కూడా చెమర్చాయి. అందరూ తన పియ్యేలాగా ఉంటే (???) తన పని ఎంత సులువుగా ఉంటుంది అని నిట్టూరుస్తూ అలా ముందుకుపోసాగాడు, అదే ఆలోచనలలో మునిగిపోయాడు.
*                *                 *
ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న తరుణమది - యుగాల తరబడి విరామమనునది ఎరుగక; తాము పాపులను శిక్షించుచున్నారో లేక తెలిసో తెలియకో చేసిన పాపములకు శిక్ష అనుభవిస్తున్నారో తెలియక కొట్టుమిట్టాడుతున్న యమధర్మరాజు, చిత్రగుప్తుడు దొరికిన ఆ కాస్త విరామమును భూలోకమునండలి ఆనందములను చూచి, అనుభవించి సేద తీరాలని ఆతృతగా ఉన్నారు. ఆకసము నుండే భూలోకము యొక్క సౌందర్యమును చూసి ఆత్రుత అధికము కాగా మరింత త్వరపడుతూ సంభాషించుకోసాగారు.
చిత్రగుప్తుడు: ప్రభూ! ఏమీ ఈ భూలోక సౌందర్యము? నిజముగా నాకు భూలోకము గురించి వివరించిన ఆ పాపి యొక్క పాపములను మన్నించి ఆతడిని స్వర్గమునకు పంపవలె అనిపించుచున్నది. ఏమా సౌందర్యము - అహో ఒకవైపు మంచుచే కప్పబడి తెల్లని రంగులో మెరియుచున్న పర్వతశ్రేణి, మరియోకవైపు ఆకుపచ్చని తివాచీ పరచినట్టున్న పచ్చిక మైదానములు, సర్పములవలెనున్న సుదీర్ఘ రహదారులు, మన అంతరిక్షలోకములకు నిచ్చెన వేయుచున్నవా అనులాగున్న ఆకాశహర్మ్యములు ... ఇంతటి అద్భుతమైన భూమాత ఒడిలో జీవిస్తూ ఈ మానవులు అటువంటి ఘోర పాపములను ఎటుల చెయగలుగుచున్నారు. వారి పాపములను తలచుకొనిన యెడల నాకు ఆవేశము అధికమగుచున్నది. కొన్ని మారులు నా ఆయుధమును తీసుకుని ఆ పాపులను శిక్షించవలెనని అనిపించును." అని చెబుతున్న చిత్రగుప్తుడిని వారిస్తూ ...
యముడు: "గుప్తా! శాంతించుము. భూమిపై యుగధర్మమనునది ఉన్నదని తెలియును కదా. ఈ కలియుగమునందు ధర్మము ఒక పాదముపై, అధర్మము మూడు పాదములపై నడయునన్నది మనకు తెలిసిన విషయమే కదా. ఈ యుగాధర్మమే మన లోకమునకు పాపుల తాకిడి అధికమగుటకు అతి ముఖ్య కారణము. అయినను ఇందున మనము చేయగలిగినది ఏమున్నది, వీరు మన లోకమునకు వచ్చిన పిదప పాపములను విచారించి శిక్షించటము తప్ప. గుప్తా! అనవసరమైన విషయములతో మనకు లభించిన కొద్ది కాలపు విరామమును వృధా చేయుట ఎందులకు?"
చిత్రగుప్తుడు: "ప్రభూ! లెస్స పలికితిరి. క్షణకాలము పాటు మా ఆలోచన అదుపు తప్పినది, మన్నించండి." అంటూ ఏదో చూసిన చిత్రగుప్తుడు వెంటనే ఉత్సుకతతో "ప్రభూ! అటు చూడండి, ఆ జనసందోహమును తిలకించండి." అంటూ యమధర్మరాజు దృష్టిని కూడా తాను చూచిన దృశ్యము వైపు మరల్చాడు.
యముడు: "గుప్తా! ఏమీ ఏమేమీ ఆ జన సందోహము? ఎటు వైపు చూచినను జనులే తప్ప, ఇసుమంతైనను మట్టి కనబడుటలేదే? లక్షలాదిగా జనము అలా గుమికూడుటకు కారణమేమై ఉండవచ్చును?"
యమధర్మరాజును అంతటి ఆశ్చర్యమునకు గురి చేసిన ఆ జనసందోహము అక్కడ గుమి కూడినది ఒక చరిత్రలో తాము భాగము కావటానికి. అవును, ఆంధ్రప్రదేశ్ ప్రజలు భవిష్యత్తులో మొత్తం ప్రపంచం చేత అత్యుత్తమమైన నగరంగా కీర్తించబడబోయే అద్భుతనగరాన్ని రాజధానిగా పొందబోతున్నారు. అటువంటి అద్భుత నగర నిర్మాణానికై శంఖుస్థాపన కార్యక్రమము జరుగుచున్న ఆ శుభ, అద్భుత, చారిత్రాత్మక క్షణంలో తామూ అందులో భాగము కావాలని కన్నులారా వీక్షించి ఆనందించాలని అక్కడ గుమి కూడారు. అక్కడ ఆంధ్రుల ప్రతిపాదిత నూతన రాజధాని నగరం 'అమరావతి' శంఖుస్థాపన కార్యక్రమము జరుగుచున్నది. తనకు తెలిసిన ఆ వివరాలను చిత్రగుప్తుడు యమధర్మరాజుకి వివరించసాగాడు.
చిత్రగుప్తుడు: "ప్రభూ! మీకు ఇప్పుడు ఇంచుకైనను భూమి కనబడకబోవుటకు కారణము - ఈ రోజు జరుగాబోవుచున్న చారిత్రాత్మక 'అమరావతి' శంఖుస్థాపన కార్యక్రమములో పాలు పంచుకోవాలని ఎక్కడెక్కడినుండో విచ్చేసిన జనులందరితో నిన్దిపోవుటయే. అంతేకాదు ప్రభూ ... భవిష్యత్తులోనున్నూ మీరు ఈ ప్రాంతమున భూమి యనునది, సరిగా చెప్పాలనినచో ఇప్పుడు కనబడుతున్నటువంటి పచ్చటి పంట పొలాలను చూడలేరు. ఎందువల్లననగా దాదాపు ముప్పైమూడువేల ఎకరములలొ ఈ అమరావతి నగరము నిర్మాణము కానున్నది. ఆకాశహర్మ్యాలు, పరిశ్రమలు, IT కంపెనీలు, ఫ్లై ఓవర్లు తదితరములైనటువంటి అభివృద్ది తార్కాణాలు మాత్రమే ఉంటాయి. భవిష్యత్తులో ఈ నగరమును జూచిన యడల మయుడైనను సిగ్గుపడవలె అనునట్టు కన్నులపండువగా ఉండును."
యముడు: "గుప్తా! మీ మాటలు చెవులకు ఇంపుగా ఉన్నప్పటికీ అది సాధ్యమగునా అన్న శంక మమ్ములను పీదించుచున్నది. అవినీతి, అధర్మము రాజ్యములు ఈ కలియుగమునందు మీరు చెప్పునది సాధ్యమగునా."
చిత్రగుప్తుడు: "ప్రభూ! మీరన్నది ఒక విధముగా నిజమె. కానీ ఇక్కడ పరిస్థితి వేరు. ఇప్పుడు అక్కడ నాయకత్వం వహిస్తున్నది, ఆ విధంగా ముందుకు నడిపిస్తున్నది సామాన్యుడు కాదు - అపర చాణక్యుడిగా కీర్తింపబడే వాడు, నిజాయితీకి నిలువెత్తు రూపం, అవినీతి మకిలి అంటని పద్మము లాంటి వాడు, నిప్పులాంటి మనిషి, సచ్చీలుడు అయినటువంటి మహా దార్శనికుడు."
యముడు: "ఔరా, ఔరౌర. ఏమీ ఎమీమీ గుప్తా ఒక మానవుడి గురించి నీవింత గొప్పగా మాట్లాడుటయా అదియును మా ముందు. ఈతని గురించిన తెలుసుకోనిన పిమ్మట మీ అభిప్రాయమును సరి చెయుదుము. ముందుగా అక్కడ జరుగు ఆ శంఖుస్థాపన కార్యక్రమమును చూచెదము."
*                *                 *
ఆ సమయానికి అక్కడ ప్రతిపాదిత అమరావతి ప్రాంతంలో ...
అది మామూలుగా పదాలతో, ఏదో ఒక భాషలో వర్ణిస్తే సరితూగే సంఘటనా? ఆధునిక చరిత్రలో ఎవరూ ఎరుగనటువంటి, ఇకమీదట ఇలాంటి సంఘటన మళ్ళీ జరుగుతుందని ఎవరూ కనీసం కలలో కూడా ఊహించలేనటువంటి 'అమరావతి నగర నిర్మాణానికి శంఖుస్థాపన' జరుగుచున్నది. అతిరథమహారథులు, అవతార పురుషులు అనదగ్గ వారి సమక్షంలో జరుతున్న ఆ చరిత్రాత్మక దృశ్యాన్ని కనులారా ప్రత్యక్షంగా వీక్షించాలని లక్షలాది మంది జనులు అక్కడకు వచ్చారు. 'ఇటువంటిది ఈ కాలంలో, ఇక్కడ సంభవమా?' అని ప్రపంచం మొత్తం సంధిస్తున్న ప్రశ్నకు ఏకైక సమాధానంగా నిలబడి తన దార్సనికతతో ఆ విధంగా ప్రజలను ముందుకు నడిపిస్తున్న నాయకుడు ఈ సంరంభాన్ని చూసి మేఘాలలో తెలిపోసాగాడు ... కాదు కాదు మేఘాలే ఆయన పాదముల కిందకు వచ్చినవి అనటం సబబేమో. రాబోవు కాలంలో ప్రపంచంలో ఈ అమరావతికి సరితూగే నగరం ప్రపంచం మొత్తంలో ఇటువంటి నగరం ఉండదు, ఉండబోదు.
ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి విచ్చేసిన ప్రధాన మంత్రి ఇవ్వబోయే కానుకలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించటానికి కూడా వలను కావటంలేదు. ఏదో అత్యంత విలువైన కానుకే ఇస్తాడని తెలిసినా అది ఏమిటో తెలుసుకోవాలని ఆత్రుతగా ఉంది. ఆ తరుణం రానే వచ్చింది. సంఖుస్థాపన కార్యక్రమం జరుతున్న సమయంలో ప్రధానమంత్రి తాను తెచ్చిన బహుమతులను బయటకు తీసారు. ఢిల్లీ నగరంలోని పార్లమెంట్ భవనం ఆవరణలోంచి పిడికెడు మట్టి, యమునా నదిలోంచి చెంబుడు నీళ్ళు. ప్రధాన మంత్రి తెచ్చిన ఆ బహుమతులను చూడగానే నాయకుడితో పాటు సకల జనులకు నోటమాటరాలేదు, ఆనంద భాష్పాలతో కనులు నిండిపోవడం వలన కొంతమంది తరువాతి దృశ్యాలను చూడలేకపోయారు. ప్రజాస్వామ్యానికి ఆలయం లాంటి పార్లమెంట్ ప్రాంగణం లోంచి మట్టి, పవిత్రమైన యమునా జలాలు అందునా 'అవతార పురుషుడి' లాంటి ఆయన చేతుల మీదుగా అంటే ఇక ఆ పవిత్రతకు విలువ కట్టడం ఎవరితరం? ఎన్ని లక్షల కోట్లు ఆ పవిత్రతకు సమానం కాగలవు? ఆయన ఆలోచనకు, అందులోని పవిత్రతకు అందరూ తాదాత్మ్యులయ్యారు.
కార్యక్రమలో భాగంగా అందరి ఉపన్యాసాలు అవుతున్నాయి. ప్రజలందరితో పాటు యమధర్మరాజు కూడా ఏంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. దార్శనికుడు, అపర చాణక్యుడు అయినటువంటి నాయకుడు తన ఉపన్యాసాన్ని ప్రారంభించాడు. కానీ, జన సందోహపు గందరగోలంలో యమధర్మరాజు ఆ ప్రసంగాన్ని సరిగా, పూర్తిగా వినలేకపోయినప్పటికీ కొంత భాగాన్ని ఎలాగోలాగా వినగాలిగాడు. "... ఇంతకీ నేను ఏమి చెబుతున్నానంటే, సర్! పక్క రాష్ట్రాలైనటువంటి తమిళనాడుకు చెన్నై ఉంది, కర్ణాటకకు బెంగళూరు ఉంది, తెలంగాణాకు హైదరాబాద్ ఉంది సర్. కానీ మాకు ఆదాయం తెచ్చి పెట్టే రాజధాని నగరం లేదని మీకు తెలియజేసుకుంటున్నాను సర్. సర్, నేను చేతులు జోడించి వేడుకుంటున్నాను, దయచేసి మాకు సహాయం చేయండి ... " అంటూ సాగిన నాయకుడి ప్రసంగాన్ని స్పష్టంగా వినే అవకాశాన్ని లేకుండా చేసిన జన సందోహంపై ఒకింత ఆగ్రహం కలిగినా వారి ఆనందాన్ని అర్థం చేసుకున్న యమధర్మరాజు శాంతించాడు.
యముడు: "అహో గుప్తా! ఏమి ఈ మానవుని గొప్పతనం! అంతటి గొప్పవాడై ఉండియును ఈ విధముగా అణిగి ఉండుట, తానే రాజకీయాలను చిటికెనవెలి మీద ఆడించగలిగే స్థోమత ఉన్నప్పటికీ ఈ తీరున సాధారణముగా ఉండుట ఈ మానవుడికే చెల్లినది. ఈతని గురించి నీవు చెప్పినది ఇంకను తక్కువయే అని మాకు అనిపించుచున్నది. ఏమేమీ ఆ దార్శనికత, ఈ కాలమునందు ఇటువంటి అద్భుత నగర నిర్మాణమునకు పూనుకోనుటయే అతి గొప్ప సాహసము. ఈ చారిత్రాత్మక క్షణములో మనము ఇక్కడ ఉండుట బహుశా మన పనితీరునకు మెచ్చి ఆ బ్రహ్మ దేవుడు కల్పించిన అదృష్టమేమో అని భావించుచున్నాను. ఈతనిని కలిసి మా శుభాకాంక్షలు అందించవలేనని ఉన్నది."
ఆ విధముగా యమధర్మరాజు, చిత్రగుప్తుడు ఆ చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించి తాదాత్మ్యతను పొందారు. అలాగే నాయకుడిని కలిసి అతడికి తమ ఆశీర్వాదం, శుభాకాంక్షలుఅందించవలేనని నిర్ణయించుకుని నాయకుడి బసవైపు బయల్దేరారు.
*                *                 *
ప్రపంచం అంతా (అదేలెండి రాత్రి ఉన్న ప్రాంతం) విశ్రాంతి తీసుకుంటూ, నిద్దుర మత్తులో జోగుతున్న వేళ - అతడు మాత్రం ఇంకా తనగదిలో దీపపు వెలుగులో భవిష్యత్తు తరాల కోసం నాయకుడు శ్రమిస్తున్నాడు. ప్రజలందరూ నిద్దురపోతూ కళలు కంటూంటే, ఆతడు మాత్రం మేల్కొని శ్రమిస్తున్నాడు. ప్రత్యర్థుల మాటలు, సృష్టించే అడ్డంకులు ఎదుర్కొని కలలుగన్న తీరానికి చేరాలని, అభివృద్ధిని సాధించాలని అతడు శ్రమిస్తూన్నాడు. అంతలో ఏదో చిన్న అలికిడి అతడి ఏకాగ్రతను దెబ్బ తీసింది. పక్కకు తిరిగి చూడగానే దివ్యత్వం ఉత్తి పడుతూన్న ఇరువురు దేవతా మూర్తులు కనబడ్డారు. అచ్చు మన సినిమాలలో చూపించేలాంటి వస్త్రధారణకు కాస్త ఇటూగా ఉన్న వారిరువురు యమధర్మరాజు, చిత్రగుప్తుడు అని గుర్తించటానికి అతడికి ఎక్కువ సమయం పట్టలేదు.
నాయకుడు: "యమధర్మరాజు మరియు చిత్రగుప్తుల వారికి నమస్సులు తెలియజేసుకుంటున్నాను. తమరి రాకకు కారణమేమిటి స్వామీ?"
యముడు: "అహో చిరంజీవి, నీ సూక్షదృష్టికి జోహార్లు. శుభం భూయాత్"
చిత్రగుప్తుడు: "దార్సనికుడా, నీకు విజయం కలుగుగాక. మేము భూలోకమును తిరిగి వెళ్లేదమని సందర్సనార్థం వచ్చితిమి. మీ నగరం శంఖుస్థాపన కార్యక్రమము చూచితిమి. ప్రభువులవారు బహు సంతోషమును పొంది నిన్ను కలువనిశ్చయించుకొనినారు. కేవలం నిన్ను కలిసి, ఆశీస్సులు అందించవలేనని వచ్చితిమి చిరంజీవి."
నాయకుడు: "ధన్యోస్మి స్వాములవారు. కానీ చిరంజీవి అని మాత్రం అనవద్దు అని విన్నవించుకుంటున్నాను. నాకు నచ్చని పేర్లలో అదీ ఒకటి. ఆ పేరు నన్ను అయిదు సంవత్సరాలు కుర్చీకి దూరంగా ఉంచిందని భావిస్తున్నాను. అయినా అదంతా గతం, వదిలెయ్యండి స్వామీ. మీ ఆశీస్సులు మాకు ఎంతో అవసరమని తెలియజేసుకుంటున్నాను. ఇంతకీ నేను ఏమి చెబుతున్నానంటే మీ రాక నిజంగా నాకు ఏంతో సంతోషం కలిగించింది."
చిత్రగుప్తుడు: "అటులనే కానిమ్ము నాయనా! అది సరే కాని, ఇంతటి భారీ శంఖుస్థాపన కార్యక్రమము చేయుటకు దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయినవని గుసగుసలు వినబడినవి. నిజమేమిటి నాయనా?"
నాయకుడు: "అది అంతా ప్రతిపక్షాల వారి కుట్ర, ఆరోపణలు స్వామీ. మేము ఖర్చు చేసినది అంటా కలిపితే బహుశా ఒక పది కోట్లు ఉంటుందేమో."
యముడు: "అహో, గుప్తా. చూచితివా ఈ మానవుడి నిపుణత, కార్యదక్షత. ఇంతటి భారీ ఎత్తున జరిగిన ఈ కార్యక్రమునకు అంతటి తక్కువ ఖర్చు అనిన మరొకరు చెప్పినచో నేను నమ్మేడివాడను కాను. కానీ ఈతని దార్శనికత, ఒదిగి ఉండే తత్త్వం చూచినతరువాత నమ్మాలనిపిస్తోంది. అది అలా ఉండనిమ్ము నాయనా! ఆ జనసందోహము గోలయందు మేము అమరావతి నగర నిర్మాణము ఏ విధముగా ఉండునో చూపునట్టి సాంకేతిక దృశ్య చిత్రములను సరిగా చూడలేకపోయితిమి. వీలైనచో మరియోకమారు మాకు చూపగలవా?"
నాయకుడు: "దానిదేముంది స్వామీ, నిమిషంలో సిద్ధం చేస్తాను చూడండి." అని నాయకుడు తన లాప్టాప్, ప్రొజెక్టర్ అన్నీ సిద్దం చేసి అమరావతి నగరం ఎలా ఉండబోతోంది అన్న ప్రేసేంటేషన్ మొదలుపెట్టాడు. "స్వామీ, చోదన్ది. నిర్మాణం పూర్తయిన పిదప అమరావతి ఇలా ఉండబోతోంది. యమధర్మరాజా అటు చూడండి అటు వైపు నుంచి మా నగరం ప్రపంచ ప్రసిద్ది చెందిన సింగపూర్ లాగా కనిపిస్తుంది; ఇటువైపు నుండి జపాన్ రాజధాని టోక్యో లాగా కనిపిస్తుంది; అదిగో ఆ వైపు నుండి చైనా రాజధాని షాంఘై లాగా ఉంటుంది ... ప్రపంచం మొత్తం తల తిప్పి చూసేలా, ఇక్కడి ప్రతి పౌరుడు తల ఎత్తి చూసేలా ఉండబోతోంది మా నగరం. ఇంతకీ నేనేమి చెబుతున్నానంటే మా నగరం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే న భూతో న భవిష్యతి." అంటూ నాయకుడు ముగించాడు.
అటు యమధర్మరాజు మరియు చిత్రగుప్తుడు ఆశ్చర్యంతో వచ్చిన ఆనందం వల్ల కలిగిన తాదాత్మ్యత నుంచి తేరుకోవటానికి కాస్త సమయం పట్టింది. తేరుకున్న తరువాత, వారికి మొదటగా గుర్తు వచ్చినది వారు భూలోకమునకు వచ్చి అప్పటికే మొదటిరోజు దాదాపు పూర్తి కావస్తున్నది అని. దానితో ఇక తప్పనిసరిగా వీడ్కోలు పలకాలి కాబట్టి, యమధర్మరాజు నాయకుడితో
యముడు: "నాయనా, ఈ నగరము పరమాద్బుతముగా ఉండబోవుచున్నాడని అనిపించుచున్నది. ఆ మయుడికైనను ఇటువంటి నగర నిర్మాణము కష్టసాధ్యమే. మాకు సమయము మించిపోవుచున్నది. ఇంకా చాలా ప్రదేశములు తిరుగవలె, అతి కష్టము మీద దొరికిన ఈ విరామ సమయమును ఉపయోగించుకొనవలె. కావున వెళ్లక తప్పదు. నీకు శుభాభినందనలు చెపుతూ ఒక చిన్న బహుమతి ఇవ్వవలెనని భావించుచున్నాను." అంటూ గాలిలో చేతులు అలా అలా అదే మన సినిమాల్లో చూపినట్టు తిప్పాడు, అంతే కన్ను మూసి తెరిచేలోపు ఆయన చేతిలో ఒక పేటిక/పెట్టె (బాక్స్) ప్రత్యక్ష్యమయ్యింది.
యమధర్మరాజు బహుమతి అనగానే అటు నాయకుడు ఇటు చిత్రగుప్తుడు ఉత్సుకతతో ఎదురు చూడసాగారు. ఏ వజ్రవైడూర్యాల మూట ఇస్తాడో లేక లెక్కకు మిక్కిలి ధనము ఇస్తాడో అదీ కాకపొతే ఇంకే విలువైన కానుకనిస్తాడో అని ఎదురు చూస్తున్నవారికి యమధర్మరాజు చేతిలో ప్రత్యక్షమైన చిన్న పేటిక ఆశ్చర్యం కలిగించింది.
యముడు: "నాయనా, ఇదిగో ఇందులో రెండు అమూల్యమైన కానుకలు ఉన్నాయి. నేను వీటినే ఎంచుకొనుటకు కారణం నీ మాటలే. 'మన నీరు, మన మట్టి, మన అమరావతి' అంటూ నీవు చెప్పిన మాటలు నాలో ఉత్సాహాన్ని నింపాయి నాయనా. అసలు అలాంటి ఆలోచన రావటమే అద్భుతం, నీ మేధస్సుకు జోహార్లు. ఇదిగో నాయనా ఈ చెంబులో మాలోకమునందు ప్రవహించు అతి పవిత్ర నదీ జలమున్నది, ఇదిగో ఈ చిన్న సంచిలో శూన్యం ఉన్నది, అనగా మా లోకమునందు మట్టి ఉండదు కదా మా లోకము శూన్యముపై నిర్మితమైనది కాబట్టి ఈ సంచినందు ఆ శూన్యమునే నింపితిని. ఇదిగో నాయనా చెంబేడు నీళ్ళు, పిడికెడు శూన్యము మా తరఫు నుండి మీ అమరావతి నిర్మాణమునకు కానుకగా స్వీకరింపుము."
ఆ విధంగా తన అమూల్యమైన కానుకలు నాయకుడికి ఇచ్చిన పిమ్మట యమధర్మరాజు, చిత్రగుప్తుడు భూలోకమునందు మరియొక ప్రదేశమునకు బయలుదేరి వెళ్ళారు. (అది రెండవ కథలో వివరిస్తాను). ఆ అమూల్యమైన కానుకలు చూసిన నాయకుడికి సంభ్రమాశ్చర్యాలతో నోట మాట రాలేదు.
*                *                 *

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన