మనలో ఒకడు - 4: శ్రీ జె.యెస్.అర్.కె. శర్మ గారు

మనలో ఒకడు - 4: శ్రీ జె.యెస్.అర్.కె. శర్మ గారు
*************************************************

'మనలో ఒకడు' లో నాల్గవ భాగంగా నేను చూసిన వారిలో శ్రీ జె.యెస్.అర్.కె. శర్మ గారు గురించి వివరిస్తాను ... 
     అప్పుడెప్పుడో శ్రీశ్రీ గారు 'ఎముకలు కుళ్ళిన, వయస్సు మళ్ళిన సోమరులారా చావండి' అన్నది ఈనాటి ఆధునికుల గురించేనేమో అనిపిస్తుంది. ముప్పై/ముప్పై అయిదు సంవత్సరాలు రాగానే పోరాడే ఓపిక తగ్గిపోతుంది. శరీరం సహకరించదు - లేదా సహకరించాలన్నా మనసొప్పదు. ఆఫీసులో పనెక్కువయ్యింది - విశ్రాంతి కావాలి; ఇంట్లో పిల్లల గోల ఎక్కువయ్యింది - విశ్రాంతి కావాలి; వారాంతంలో బయటకెళితే అనవసర ప్రయాణం, అలసట - విశ్రాంతి కావాలి; సినిమాకెళ్ళొచ్చినా అలసట - విశ్రాంతి కావాలి; ఇలా ప్రతి చోటా అలసిపోయే మనం విశ్రాంతి కోరుకుంటాం. లేదంటే కొంతమందికి శారీరక సమస్యలు మొదలవుతాయి. ఒకరకంగా చెప్పాలంటే నడిమి వయసులోనే శారీరకంగా, మానసికంగా ముసలితనం మొదలవుతుంది. కానీ ఈ గుంపులో కూడా కొందరు మానసిక యవ్వనులు, సంకల్పమే బలంగా సాగేవారు ఉంటారు. అటువంటి ఒక నిత్య యవ్వనుడు, పోరాటశీలి అయిన శ్రీ జగర్లపూడి సీతారామకృష్ణ శర్మ (జె.యెస్.అర్.కె. శర్మ) గారి గురించి 'మనలో ఒకడు' శీర్షికన పరిచయం చేస్తున్నాను. శారీరక వయసురీత్యా డెబ్బై సంవత్సరాలు దాటినా కూడా పైన చెప్పుకున్న కారణాలు వల్ల విశ్రాంతి అన్నది జె.యెస్.అర్.కె. శర్మ గారి ఇంటికి ఆమడదూరంలోనే ఆగిపోతుంది. 'సంకల్పం ఉంటే వయసుతో పని లేకుండా శరీరం సహకరిస్తుంది' అని చెప్పటానికి శర్మగారిని చూపితే సరిపోతుంది.
     మన తెలుగు భాష పతనమవుతోంది, దీన దశలో ఉంది, మాతృభాషను కాపాడుకోవాలి అంటూ ఆంగ్లంలోనో, హిందీలోనో బహు చక్కగా మాట్లాడుకుంటాం మనం. కానీ అది మాటల వరకే, సాటి తెలుగు మిత్రులు కలిసినా సరే మాట్లాడే మాటల్లో సగానికి పైగా ఆంగ్లమే దొర్లుతుంది. ఆచరణలో ఆమడ దూరం ఉండే మనలాంటి వారికి శర్మ గారు ఒక పాఠ్య పుస్తకం లాంటి వారు. మన మాతృభాష అయినటువంటి తెలుగు భాష పరిరక్షణ మరియు అభివృద్ధికై ఆయన చేస్తోన్న అవిరళ కృషి అభినందనీయం. 2000 వ సంవత్సరంలో 'తెలుగు భాషా వికాస ఉద్యమ సమితి' ని స్థాపించి పలు సాంస్కృతిక కార్యక్రమాలు, సదస్సులు నిర్వహించారు. 60 కి పైగా మండల కేంద్రాలలో తెలుగు భాషా రథ యాత్ర జరిపి విద్యార్థులకు, ఇతరులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టారు. ఇవి కాకుండా విద్యార్థులకు, సాహితీ వేత్తలకు, కవులు-రచయితలకు ప్రోత్సాహక బహుమతులు అందిస్తూన్నారు. అందరూ మరచిపోతున్న, తెలుగు భాషకు పట్టుకొమ్మలైనటువంటి కొన్ని సాహితీ ప్రక్రియలకు ఊతమిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు - అందులో భాగంగా శ్రీ సాయికృష్ణ యాచేంద్ర గారిచే సంగీత అవధానం, డా. శంకరనారాయణ గారిచే హాస్యావధానం, శ్రీ గండ్లూరి దత్తాత్రేయశర్మ గారిచే అష్టావధానం నిర్వహించారు. అలాగే ప్రతి సంవత్సరం శ్రీ కృష్ణదేవరాయ పట్టాభిషేక మహోత్సవాలు జరపటం, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన తెలుగు కళా సమితికి కార్యదర్సకత్వం వహిస్తూ పలు కార్యక్రమాలు, కళాకారులకు ప్రోత్సాహక సన్మాన కార్యక్రమాలు వంటివి నిర్వహించటం;
ప్రాచీన సాహిత్య పరిషత్ సంస్థ ద్వారా వారానికి ఒక చోట ఒక సాహిత్య ప్రసంగం చొప్పున భారత, భాగవత, రామాయణ కావ్యాల పై మూడుసంవత్సరాల పాటు సాహిత్య సదస్సుల నిర్వహణ; 2010 వ సంవత్సరంలో భారతీయ మాతృభాషా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏడు రాష్ట్రాల సదస్సు నిర్వహణ - ఇవి మాతృభాషా  పరిరక్షణ, సాహితీ రంగానికి ఊతమివ్వటానికి శర్మగారు ఉద్యమకారుడుగా నడిపిస్తున్న, పాలు పంచుకుంటున్న అనేకానేక కార్యక్రమాలలో ముఖ్యమైనవి. అంతేకాక తెలుగు భాషావికాస ఉద్యమం పక్షాన రాష్ట్రంలో అనేక జిల్లాలలో పర్యటించి , తెలుగు భాషా , సాహిత్య, పరిరక్షణ సంస్థలను కలిసి తెలుగు భాషోద్యమ సమాఖ్య ఏర్పాటు కావడానికి దోహదం చేశారు.
     వృత్తి పరంగా చెప్పాలంటే శర్మ గారు 1963 లో ప్రాధమిక పాఠశాల తెలుగు ఉపాధ్యాయులుగా ప్రారంభించి, ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులుగా, డిపెప్ లో జిల్లా కమ్యూనిటీ మోబిలైజేషన్ అధికారిగా, కర్నూలు జిల్లా బాలికల అభివృద్ది అధికారిగా పనిచేసి పదవీ విరమణ అనంతరం తెలుగు భాష పరిరక్షణ, సాహిత్య రంగాలకు పూర్తిగా అంకితమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చేత ఉత్తమ ఉపాధ్యాయునిగా (1983), ఉత్తమ ప్రదానోపాద్యాయునిగా (1998) బహుమతులు అందుకున్నారు. ఇవి కాక ప్రభుత్వేతర సంస్థలచే పలు సన్మానాలు, బహుమతులు స్వీకరించారు. జిల్లా విద్యాశాఖకు చెందిన 'అక్షరం' పత్రికకు సంపాదకులుగా 2 సంవత్సరాలు పని చేసిన తరువాత, 1994 వ సంవత్సరం నుండి 'స్త్రీ స్ఫూర్తి' మాస పత్రిక సంపాదకులుగా ఉన్నారు. ఒకవైపు వృత్తి పరంగా ఉన్నతిని పొందుతూనే తన ప్రవుత్తి అయిన రచనా వ్యాసంగాన్ని సాగించారు. వందేభారతమాతరం, దేశం కోసం కృతి స్వీకరణ, సహృదయ గీతికలు, కర్నూలు జిల్లా సంస్కృతీ విశేషాలు, శిశువికాస గీతాలు, హృద్యపద్య గేయ త్రిశతి సంకలనం, వ్యక్తిత్వ వికాస శతక సంకలనం, కథల సంపుటి, భువనవిజయ ప్రబంధ సంక్షిప్త సంకలనం; ఇవి కాక వ్యాసాలు, రేడియో ప్రసంగాలు అనేకం. కానీ, తను రాయడం కంటే అనేకమంది రచయితలు, కవులకు అండగా నిలబడి ప్రోత్సాహమందించటానికే శర్మ గారు ప్రాముఖ్యతనిచ్చారు.
     శర్మగారు తనను తాను కేవలం అధ్యాపక, సాహితీ రంగాలకు పరిమితం చేసుకోలేదు. బాధ్యతగల పౌరుడిగా తనవంతు సేవా కార్యక్రమాలు చేపట్టారు. భారతమాత వైద్యశాల ద్వారా 1987 - 96 మధ్యకాలంలో కర్నూలు జిల్లాలోని కొన్ని గ్రామాలలో ఉచిత వైద్య సేవలు అందేలా చేశారు, అలాగే 1993 లో అభయ హస్తం సామాజిక సేవా సంస్థను స్థాపించి పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు;
జగర్లపూడి ట్రస్ట్ తరపున పదవ తరగతిలో,  ఇంటర్మీడియట్ లో, డిగ్రీలలో, పోస్ట్గగ్రాడ్యుయెట్ లలో తెలుగులో అధికంగా మార్కులు సాధించిన వారికి స్వర్ణ పతకాలు ప్రదానం వంటి పలు సేవా కార్యక్రమాలు, కళాకారులకు సన్మానాలు, ప్రోత్సాహక చర్యలు చేపడుతున్నారు.
     ఇతరులకు 'నువ్వు ఇలా ఉండు, పిల్లలను ఇలా పెంచు' అని చెప్పడం చాలా సులువు, కానీ మనం ఆచరించడం కష్టం. కానీ శర్మ గారు కేవలం చేతలలో కాక తను చెప్పేవి ఆచరించి చూపారు. శర్మగారి తనయుడు శ్యామ్ నానాటికి ఎదిగి, తెలుగు భాష, సాహిత్యం పరిరక్షణ, అభివృద్ది కై చేస్తున్న కృషి కి గుర్తింపుగా ఈ మన్మధనామ సంవత్సర ఉగాది (2015) నాడు ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వ సన్మానం అందుకున్నారు. అంతకు మునుపే కీ.శే. శ్రీ కలుగోట్ల విజయాత్రేయ కవిత్వం, రచనలపై చేసిన పరిశోధనకు శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుండి పిహెచ్.డి డాక్టరేట్ పొందారు. (శ్యాం గారి గురించి ప్రత్యేకంగా వివరిస్తాను, ఆయన కూడా 'మనలో ఒకడు'లో ఒక భాగమవుతారు ). ఏ విషయమైనా చెప్పటం చాలా సులువు, ఆచరణలో చూపటమే కష్టం. అలా ఆచరించి చూపి, ఆదర్శంగా నిలిచారు శర్మ గారు.
     భాష అంటే కేవలం కొన్ని మాటలను మోసుకెళ్ళేది కాదు, ఒక సంస్కృతిని తరం నుంచి తరానికి మోసుకెళ్ళేది. అటువంటిని భాషను కోల్పోవటం అంటే సంస్కృతిని కోల్పోవటమే. ఆ పరిస్థితి దాపురించకుండా ఉండటానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్న శ్రీ జె.యెస్.అర్.కె. శర్మ గారికి మన తరం తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటూ, వారు అందిస్తున్న పోరాట స్ఫూర్తి కలకాలం నిలిచి మాతృభాషను, సంస్కృతిని పరిరక్షించాలని అభిలషిస్తున్నాను. మీరు మానసిక వృద్ధులా లేక శర్మగారిలాగా నిత్య యవ్వనులుగా ఉంటారా అన్నది మీ చేతుల్లోనే ఉంది. స్వామి వివేకానంద చెప్పినట్టు 'ఒక మహోన్నతమైన ఆదర్శాన్ని నీ జీవిత ధ్యేయంగా చేసుకో. దాన్ని గురించే ఆలోచించు. దానికి అనుగుణంగా జీవించు. నీ మెదడు, నరాలు, కండరాలు, నీ శరీరమంతా నీ ఆదర్శంతో/ఆలోచనతో నిండాలి.'

Comments

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన