పోరాటం ఆపవద్దు
పోరాటం ఆపవద్దు
********************
ఈ ప్రపంచం మొత్తం మీద 'ప్రయత్నం' ఒక్కటే నిజం, మిగిలినదంతా 'అబద్ధం' - గౌతమ బుద్ధుడు
గ్రీకు పురాణాల్లో 'ఫీనిక్స్' అని ఒక పక్షి ప్రస్తావన ఉంది. దాని విశిష్టత ఏమిటంటే - దాన్ని చంపి, కాల్చి, బూడిద చేసిన తరువాత కూడా అది ఆ బూడిద నుండి కూడా పునరుజ్జీవం పొందుతుంది. అది నిజమా, కాదా అన్నది అటుంచితే మనవాళ్ళు ఈ మొత్తం చర్యను ఒక అందమైన పదంతో నిర్వచించారు - 'పునరుత్థానం'.
అంతా అయిపోయిందని అనుకున్న తరువాత కూడా నేలకేసి కొట్టిన బంతిలా ఉవ్వెత్తున ఎగసి ఎదిగే వాళ్ళను చూసే ఉంటారు. సముద్రాన్ని ఎప్పుడైనా చూశారా? ఆకాశాన్ని చుంబించాలని ప్రయత్నించే ఆ అలల్ని గమనించారా? అవి కింద పడుతూనే ఉంటాయి కానీ, ప్రయత్నాన్ని మాత్రం ఎప్పటికీ మానవు, ఆశ వదులుకోవు. మళ్ళీ అంబరాన్ని చుంబించాలనే ప్రయత్నాన్ని మాత్రం మానవు. విజయమంటే ముందు ప్రయతించటం, సాధించేవరకు ఆ ప్రయత్నాన్ని వదలకపోవటం. చిన్న చిన్న ఆటంకాలకు, అవరోదాలకు నీరుగారిపోయి నీరసించి ఉంటే ఈనాడు మనం చూస్తున్న నాగరికత ఉండేది కాదు. ఎక్కడో చదివాను 'థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనుగొనే ప్రక్రియలో వెయ్యికి పైగా విఫల ప్రయత్నాలు చేసాడు' అని. ఎవరో ఆయన్ని అదే అడిగారట, దానికి ఆయన సమాధానం 'బల్బును ఎలా తయారు చేయకూడదో అని వెయ్యికి పైగా సార్లు నిరూపించాను' అని అన్నాడట ఆయన. ఆయన కాకపొతే మరొకరు కనుగొనేవారేమో బల్బును. కానీ, అక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే అన్ని సార్లు విఫలమైనా ఎడిసన్ తన ప్రయత్నాన్ని మాత్రం వదల్లేదు, దాని ఫలితం మనం ఇవ్వాళ చూస్తున్నాం.
'కాలం కలిసిరానపుడు తాడే పామై కాటేస్తుంది' అని పెద్దలు చెబుతుంటారు. సమయం మనది కానపుడు, ఎదుర్కునే శక్తి తగ్గినపుడు అణిగి ఉండాలి. ప్రతికూల పరిస్థితుల్ని గౌరవించాలి. అలాగని వెన్ను చూపమని కాదు, విశ్రాంతి తీసుకోవాలి. కొత్త శక్తిని సమీకరించుకుని మళ్ళీ పోరాడాలి. కాలం ఎప్పుడూ పోరాడేవాడి పక్షమే. చివరకు గెలిచేది పోరాడేవాడే. ఇవ్వాళ ఓటమి ఎదురైతే కుంగిపొవద్దు, పోరాటం ఆపవద్దు.
నైపుణ్యం, ఆశయం, స్ఫూర్తి
ఆలోచనా ధారన తడిసి ఆరనివ్వండి
దౌర్బల్యం బలంగా మారేదాకా
చీకటి వెలుతరయ్యేదాకా
అపసవ్యం సవ్యమయ్యేదాకా
దిగులుపడకు, చిర్రుబుర్రులాడకు, నిస్పృహ చెందకు
మన అవకాశాలిప్పుడే మొదలయ్యాయి
గుర్తుంచుకో గొప్పపనులింకా మొదలవలేదు
గొప్ప ఉద్యమం ఇంకా పూర్తవలేదు
(కలాం గారి కవిత అనువాదం - వాడ్రేవు చినవీరభద్రుడు గారు)
Comments
Post a Comment