కలల బేహారీల ఊహాసౌధాలు మళ్ళీ కూలిపోయాయా... ?

కలల బేహారీల ఊహాసౌధాలు మళ్ళీ కూలిపోయాయా... ?
************************************************
బీహార్ ఎన్నికల ఫలితాలపై నా దృక్కోణం ... 
      బీహార్ ఎన్నికల ఫలితాలు అయిపోయాయి. ఇక విశ్లేషణలు మొదలు, త్వరలో రాబోయే మరికొన్ని రాష్ట్రాల ఎన్నికల వరకూ 'ఈ ఎన్నికల ప్రభావం వాటిపై ఎంత' అన్న అంశం చుట్టూతా తిరుగుతూ, వేరే సమస్యలేమీ లేనట్టు తాము భ్రమిస్తూ ప్రజలను కూడా భ్రమింపజేస్తూ ఆ విధంగా ముందుకు పోతాయి.
    భాజపా పెద్దలు, కొత్త (మరీ కొత్త కాదనుకోండి, సంవత్సరమున్నర వయస్సున్న అనుకోండి) దేవుడు గమనించవలసినది లేదా నేర్చుకోవలసినది ఏమైనా ఉన్నదా? ఉందని అనుకుంటున్నారా? గత సార్వత్రిక ఎన్నికలలో అద్భుత విజయం సాధించిన తరువాత ఆకాశం వైపు చూపు నిలిపిన భాజపా ను నేలవైపు లాగిన రెండో ఫలితం ఇది, అందునా ఇది ఢిల్లీ కంటే ఎక్కువగా చింతించవలసిన, ఖంగారుపడవలసిన, విశ్లేషించుకోవాల్సిన ఓటమి. అందరూ లేదా అధికశాతం విశ్లేషకులు చెబుతున్నది ఏమిటంటే - భాజపా దారుణ ఓటమికి కారణాలుగా 'మత పరమైన కొన్ని సున్నిత అంశాలను ఎగదోసి లాభపడదామని చూడటం, వీలు కల్పించుకుని మరీ శత్రు దేశం గురించిన ప్రస్తావనలు తీసుకురావటం, అతివాద హిందుత్వ పోకడలు' అతి ముఖ్యమైనవిగా చెప్పబడుతున్నవి. ఇవన్నీ మీలాంటి, నాలాంటి చదువరులను; మాటకు తప్ప చేతలకు పనికిరాని వారిని ఆకట్టుకుని ప్రభావితం చేశాయేమో. ఒక పౌరుడిగా, ప్రజాస్వామ్యంలో భాగంగా ఉంటూ ఓటును హక్కుగా, బాధ్యతగా ప్రతి ఎన్నికలప్పుడు తప్పనిసరిగా నిర్వర్తించే సామాన్య పౌరుడిని ప్రభావితం చేసింది పై అంశాలు కాదేమోనని నా అభిప్రాయం.
    రాజకీయ నాయకులకు గెలుపే ప్రధానం, అందుకే ఎన్నికల ప్రచార సభలలో నోటికోచ్చినదంతా వాగటానికి వారికి సరికొత్త అనధికారిక 'రాజకీయ వాక్ స్వాతంత్ర్యం' అనబడు కొత్త హక్కు ఈ తరం రాజకీయాలలో ప్రాప్తించటం జరిగింది. ఒకానొక ఉదాహరణ మన వెంకయ్య నాయుడుగారు - నాడు విభజన బిల్లు గురించి రాజ్యసభలో, ఆ తరువాతి ఎన్నికల ప్రచార సభలో ఆయనతో పాటు మన కొత్త దేవుడు అదే ఒకటిన్నర సంవత్సరం వయసున్న కొత్త దేవుడు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా గురించి కానీ, సహాయం గురించి కానీ తెగ మాట్లాడారు. ఈనాడు దాటవేస్తున్నారు. (ఉదాహరణే కాబట్టి ఇంతకంటే ఎక్కువ విశ్లేషించటం లేదు, దీని గురించి ప్రత్యేకంగా మళ్ళీ రాసుకుందాంలే). ఎక్కడో చదివాను 'కొద్దికాలం పాటు అందరినీ మోసం చేయవచ్చు, కొంతమందిని ఎల్లకాలం మోసం చేయవచ్చు, కానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయలేరు' అని. ఈ రాజకీయ వాక్ స్వాతంత్ర్య హక్కుదారులు తెలుసుకోవలసిన అతి ముఖ్యమైన విషయం అదే. అది మరచిపోతే బీహార్ లాంటి దెబ్బలు తగులుతుంటాయి. 1.25 లక్షల కోట్ల ప్యాకేజీ, ఇంకా మరెన్నో తాయిలాలు, ఎన్నడూ లేనిది ఒక ప్రధాన మంత్రి స్థాయి వ్యక్తి ఒక రాష్ట్ర ఎన్నికలలో 20 కి పైగా సభల్లో పాల్గొని విపరీతమైన హామీల వర్షం కురిపించటం, మోడీ మేనియా లేదా మాజిక్ ఇవేవీ పని చేయలేదేమిటబ్బా? మమ్మల్ని ఓడిస్తే శత్రు దేశంలో సంబరాలు చేసుకుంటారని భయపెట్టినా, మతపరమైన అంశాలు దృశ్యంలోకి తెచ్చినా ఉపయోగం లేకపోవడం ఏమిటి?
    రాజకీయ నాయకులకు 'రాజకీయ వాక్ స్వాతంత్ర్యం' ఉన్నట్టే ఓటు వేసేవాడికి కూడా ఆలోచించుకునే, బేరీజు వేసుకునే స్వాతంత్ర్యం ఉంది. మీడియా అంతా మాకు వ్యతిరేకం, మా గురించి తప్పుడు కూతలు ప్రచారం చేసి సామాన్య ప్రజల్లో అనవసర భయాందోళనలు కలిగించి మా ఓటమికి కారణమయ్యారు అంటే మాత్రం అంతకంటే మూర్ఖత్వం ఉన్దదు. సరిగ్గా సమ్వత్సరమున్నర క్రితం తమరు గెలిచినప్పుడు కూడా అనుకూల మీడియా ఏమీ లేదు, ఇదే మీడియా ఇంతకంటే వ్యతిరేక విద్వేషపూరిత కథనాలు ప్రచారం చేసింది. అయినా కూడా చరిత్ర సృష్టించే విజయాన్ని సాధించగలిగారు. మరి అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటి అంటే తమరి ఒకటిన్నర సంవత్సరపు వయసు. ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో తమరు చేసిన కార్యాలు.
    ఈ ఓటమికి ముఖ్యంగా అంటే అదే నా అభిప్రాయంలో మూడు కారణాలు. అందులో మొదటిది 'అహంభావం'. 'ఈ ఎన్నికలలో మీరు మమ్మల్ని గెలిపిస్తే అది మీ అదృష్టం, కారణజన్ముడైన మోడీ లాంటి మహానుభావుడి దార్సనికత్వంలో మీరు వెలిగిపోవాలంటే మమ్మల్ని గెలిపించాలి. ఓడిస్తే అది మీ ఖర్మమే తప్ప మరోటి కాదు, ఒకవేళ ఓడిపోతే అది మీ ఖర్మ కాలడమే తప్ప మాకు పోయేదేమీ లేదు' అనేటటువంటి మాటలు, ప్రవర్తన దెబ్బ తీసాయి. ప్రజలకు భరోసా కలిగించే తీరులో ఒక్క నాయకుడి తీరు కూడా లేదు, నితీష్ కుమార్ రెండు పర్యాయాలుగా (మధ్యలో జితన్ రామ్ మాంఝీ ముఖ్యమంత్రిగా నియమితుడైన కొద్ది కాలం తప్ప) ఎన్నిక కావడమేమిటి అన్నది వదిలేసి, వ్యతిరేకత ఉండి తీరుతుందిలే అన్న గుడ్డి ఆలోచనా ధోరణి కూడా ఈ అహంభావపు పైత్య ప్రకోప లక్షణాలలో ఒకటి. ఈ అహంభావపు పొరలు వాస్తవాన్ని చూడగలిగే దృష్టి కోణాన్ని కమ్మేసి గుడ్డివారిని చేసాయి.
     రెండో అతి ముఖ్య కారణం - వ్యక్తి పూజ. నరేంద్ర మోడీ తప్ప మరెవరో బీహార్ పరిస్థితిని మార్చలేరు. బీహార్ తలరాత మార్చాలంటే అది కేవలం నరేంద్ర మోడీ వల్లనే సాధ్యం అన్న ధోరణిలో ప్రచారం సాగటం. మోడీ తన ప్రధాన మంత్రిత్వాన్ని వదిలేసుకుని వచ్చి ఇక్కడ (అంటే అదేలెండి గెలిస్తేనే) ముఖ్యమంత్రిత్వం వెలగబెడతారా? స్థానికంగా ఒక నాయకుడు ఉన్నారా ఉంటె ఎవరు? ఒకవేళ బీహార్ లో ప్రజల గుర్తింపు, రాజకీయంగా కూడా కాస్త శక్తి మంతుడు, తమ పార్టీ వాడే అయిన శత్రుఘన్ సిన్హా ఉన్నాడు కదా అంటే ఆయన ఎక్కడ ఎదిగిపోయి పక్కలో బల్లెం అవుతాడో అని భయం. ఇవి 'ఇందిరా గాంధీ' పోకడలు అబ్బుతున్న సూచనలు. ఇందిరా గాంధీ హయాంలో వ్యక్తిగా ఇందిరా గాంధీ బలపడి, స్థానిక నాయకత్వాన్ని ఎదగనివ్వకుండా పార్టీగా కాంగ్రెస్ ని బలహీన పరచింది అనేది అపప్రధ కాదు కాదనలేని నిజమ్. ఇప్పుడు భాజపా వారు కూడా అదే చేస్తున్నారు - మోడీని దైవ సమానుడిగా చిత్రిస్తూ చివరకి ఎక్కడైనా మున్సిపాలిటీ ఎన్నికలలో గెలిచినా కూడా అది కేవలం మోడీ మొహం (అదేలెండి పోస్టర్) వల్లనే అని కీర్తిస్తూ స్థానిక నాయకత్వానికి ఒక గుర్తింపు కానీ, ఎదిగే అవకాశం కానీ లేకుండా చేస్తున్నారు. ఇలాంటి పోకడలే పొతే కాంగ్రెస్ క్షీణించటానికి పట్టిన సమయంలో సగం కూడా పట్టదు భాజపా మళ్ళీ మొదటికెళ్లటానికి.
     మూడవది - నిజానికి ఇదే మొదటిది అనుకోవాలి నేను కావాలనే ఇది ఆరోహణ క్రమంలో చెప్పుకుంటూ వచ్చాను. 'విశ్వాసాన్ని కోల్పోవటం' - ఈ పదాలు చదవగానే వెంటనే ఒక అభిప్రాయానికి వచ్చెయ్యద్దు. అభివృద్ది గట్రా వాటి గురించి నేను ఇక్కడ మాట్లాడటం లేదు. గత సార్వత్రిక ఎన్నికలలో భాజపా అద్భుత విజయానికి కారణమైన వాటిలో ముందు వరుసలో ఉండే కారణాలలో 'కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని పరి పూర్ణంగా కోల్పోవటం' అన్నది ఒకటి. అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కూడా కాకుండానే కాంగ్రెస్ కి తమకి ఎటువంటి తేడా లేదని అనుకునే స్థాయికి వచ్చారంటే అదే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారంటే ఏమని చెప్పుకోవాలి. కేజ్రివాల్ యో లేక మరొకరో చెప్పారు యుపియే ప్రభుత్వానికి కళ్ళు నెత్తికెక్కటానికి (అదే గర్వం తలకేక్కటానికి) ఒక ప్రభుత్వ కాలం పడితే భాజపాకి ఒక సంవత్సరానికే కళ్ళు నెత్తికెక్కాయి అని, నిజమనిపించేలానే ఉంది వారి చర్యలు చూస్తుంటే. మూఢ భక్తులు ఒప్పుకోకపోవచ్చు గాక - కానీ అది నిజమని నిరూపితమవుతూనే ఉంది, మళ్ళీ నిరూపితమవుతే కానీ నమ్మం అంటే నష్టమేమీ లేదు త్వరలో మరికొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నాయి కదా. కాంగ్రెస్ పార్టీ/ప్రభుత్వ వ్యవహార శైలి ఎలా ఉంటుందంటే పార్టీ నాయకులు తమ అధినేత/అధినేత్రి దగ్గరకు వెళ్లి విషయం/వినతులు చెబుతారు. లోపల ఏమి  జరిగిందో మనకు తెలీదు కానీ వాళ్ళు బయటకు వచ్చి 'మేడం/సారు మేము చెప్పింది సావధానంగా విన్నారు, సానుకూలంగా స్పందించారు, పరిశీలిస్తామన్నారు, సమస్య పరిష్కరణకు ఒక కమిటీ వేస్తామన్నారు ఇలా చెవుల్లో పూలు పెట్టె కబుర్లు చాలా చెప్పేవారు. రాష్ట్ర విభజనకు ముందు జరిగిన తంతులో ఇరుప్రాంతాల కాంగ్రెస్ నాయకులు ఇలాంటి కబుర్లు చాలా చెప్పారు కానీ సోనియా/కాంగ్రెస్ ఏమి చెయ్యాలనుకున్నదో అది చేసింది. ఇప్పుడు బిజెపి వంతు - ఎవరికి వారు వారు మోడీ దగ్గరకు వెళ్లి తాము చెప్పాం, ఆయన చూస్తామన్నారు, చూస్తానన్నాడంటే అయినట్టే, చేస్తానన్నారు, అంతా విని నవ్వారు, మాట ఇచ్చినట్టే, రాముడు తర్వాత మోడీయే అన్న తరహాలో మాట్లాడతారు. మోడీ ఏమనుకుంటున్నాడో, ఏమివ్వాలనుకుంటున్నాడో తెలీదు. ఏ రాష్ట్రంలో ఎన్నికలొస్తే అక్కడికెళ్ళి 'మీకు అభివృద్ది కావాలంటే బిజెపికి వోటెయ్యండి. కేంద్రంలో మేమే అధికారంలో ఉన్నాం, రాష్ట్రంలో కూడా అధికారమిస్తే అభివృద్ది చెయ్యగలం." అంటాడు - బెదిరిస్తున్నాడో వోట్లు అడుగుతున్నాడో తెలీదు. 'అయినవారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో' పద్ధతిలో ఈయన కాంగ్రెస్ ని మించిపోయారు. తందానా గాళ్ళు, తప్పనిసరి వాయిద్యగాళ్ళు, కీర్తన కారులు ఎక్కువయ్యారు. ఒక్కటంటే ఒక్కసారి తమరు కాంగ్రెస్ ని ఏయే అంశాలలో ఎలా విమర్శించారో వెనక్కి తిరిగి చూసుకోండి - ఇప్పుడు వీరు చేతున్నదేమిటో చూడండి ఏమైనా తేడా ఉందా? ప్రచార ప్రర్వంలో భాగంగా తిరుపతిలో మాట్లాడిన దృశ్యాలు అధికారపు మబ్బులు కమ్మిన వారు మరచిపోయారేమో కానీ ప్రజలు కాదు. తిరుపతిలో ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించి చెప్పిన/ఇచ్చిన హామీలు అని మాత్రమే కాదు ఉదాహరణకు 'వందరోజులలో నల్ల ధనాన్ని వెనక్కి తెస్తాం' లాంటివి మచ్చుకు ఒకటి.
     నేను గతంలో ఒకసారి రాసాను 'కాంగ్రెస్ అన్నది ఒక పార్టీ ఎంతమాత్రమూ కాదు నేడు అది ఒక రాజకీయ బ్లడ్ గ్రూప్. అన్ని పార్టీలలో ఆ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు ఉన్నారు.' అని. పేరుకు పార్టీ పేరు మారినా తీరు చూస్తుంటే వీళ్ళ బ్లడ్ గ్రూప్ కూడా అదేనని నమ్మకం కుదిరింది. భూసేకరణ బిల్లు, ఆంధ్రకు ప్రత్యెక హోదా హామీకి తూట్లు మరియు వ్యవహరిస్తున్న తీరు, మహారాష్ట్రలో శివసేనతో వ్యవహరించిన తీరు, ఢిల్లీలో ఆప్ తో వ్యవహరించిన తీరు, వసుంధర రాజే-సుష్మ-లలిత్ మోడీ వివాదంలో మౌనం - ఒకటిన్నర సంవత్సర కాలంలో ఇలాంటివి ఎన్నని? కాంగ్రెస్ హయాంలో తమకు ఎవరైనా ఎదురు తిరిగితే నేర పరిశోధక సంస్థలను రంగంలోకి దించి అదుపులోకి తెచ్చుకునేవి, ఇప్పుడు ఎవరైనా మోడీకి కాని భాజపాకి కాని వ్యతిరేకంగా మాట్లాడితే ఒకటి రెండు రోజులలో ఏవో కొన్ని ఫోటోలు బయటకి వస్తాయి అవి నిజమా కాదా అనేది ఎప్పటికి తెలిసేను ఈ కేసుల లాగా? ఇటువంటి వ్యవహార శైలి ప్రజలలో 'వీరు కాంగ్రెస్ లాగా కాదు' అని ఏర్పడిన భ్రమలు తొలగిపోతున్నాయి. ప్రజలు అని నేను ఇక్కడ ఉదహరించింది మోడీ యొక్క మూఢ భక్తులను మినహాయించి మిగతా వారిని.
    ఒక చిన్న సామెత - పెద్దలు చెబుతుంటారు 'తెలియని దేవుడికంటే తెలిసిన దయ్యమే నయంరా' అని. దయచేసి అటువంటి పరిస్థితి ఏర్పడే స్థాయికి తీసుకు వచ్చి మళ్ళీ కాంగ్రెస్ కి ఊపిరులూదవద్దని కోరుకోవడం, ఆశించడం తప్ప భాజపా పెద్దలకు చెప్పగల స్థాయిలో ఎవరున్నారు? చెప్పినా వినిపించుకుంటారా? ఢిల్లీ, బీహార్ లాంటి గూబ గుయ్యి మనే దెబ్బలు మరి కొన్ని తగిలితే అయినా నేలమీదకు దిగొచ్చి వింటారేమో మరి.
    నాది కేవలం అభిప్రాయం మాత్రమే, విశ్లేషణ కాదు. ఎందుకంటే విశ్లేషించాలంటే ఏదో ఒక మీడియా సంస్థ గుర్తింపు అయినా పొంది ఉండాలి, లేదా ఏదో ఒక రాజకీయ సంస్థలో సభ్యుడనో లేక మాజీనో అయి ఉండాలి. నేను ఇవేవీ కాను, మామూలోడిని. గతంలో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క పార్టీని లేదా వ్యక్తిని విశ్వసించి - ఇప్పటికి జ్ఞానోదయం (???) అయ్యి వీరంతా కాంగ్రెస్ బ్లడ్ గ్రూప్ పెద్దలే అని తెలుసుకుని కూడా నిరాశపడకుండా ఏదో నాకు తోచిన పద్ధతిలో ఆ విధంగా ముందుకుపోతున్నాను. అంతకు మించి మరేమీ లేదు. ప్రతిసారి ఎవరో ఒకరు వచ్చి ఏదో ఊడబోడుస్తారు అని ఆశించే సామన్యుడు, ఆ ఆశల మీద సౌధం నిర్మించుకునే నాయకుడు - వీరిద్దరి కలలకు ఎప్పుడుతూట్లు పడుతూనే ఉంటాయి. అటు నాయకుడు, ఇటు సామాన్యుడు ఇరువురూ వాస్తవం వైపు చూడనంతవరకూ ఊహా సౌధాలు ప్రతిసారి కూలుతూనే ఉంటాయి - ఆనందం, విజయం తాత్కాలికమే అవుతాయి.

Comments

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన