నువ్వూ ... నేనూ ... ఒక విమర్శ
వంశీ కలుగోట్ల // నువ్వూ ... నేనూ ... ఒక విమర్శ //
****************************** ***************
ఎప్పుడు అంటిందో ఎలా అంటిందో తెలీదు కాని మనందరికీ ఒక జబ్బు అంటింది. దీని
మూలాలు ఏమిటో ఎలా తెలుసుకోవాలో కూడా అర్థం కానంతగా ముదిరిపోయింది. సమస్య
ఏంటంటే మనం దాన్ని జబ్బుగా గుర్తించే స్థాయిని కూడా దాటిపోయెంతగా అది మన
జీవితాలలో భాగంగా ఇమిడిపోయింది. వ్యక్తిని, వస్తువును వేరు చేసి
చూడలేకపోవడమే ఆ జబ్బు. ఈ మధ్యనే ఎక్కడో చదివాను 'విమర్శ అనేది వస్తువు మీద
ఉండాలి కాని వ్యక్తి మీద కాదు' అని. (రంగనాయకమ్మ గారి 'రామాయణ విషవృక్షం'
పుస్తకం గురించిన చర్చలో పుస్తకంలోని వస్తువు మీద కాకుండా రంగనాయకమ్మ గారి
మీద వ్యక్తిగత విమర్శలు మొదలెట్టాడు ఒక ప్రబుద్దుడెవరో. దానిని సున్నితంగా
తిప్పికొడుతూ ఇంకొకాయన పైవిధంగా చెప్పారు.) కానీ అది ఎంతమంది
పాటిస్తున్నారు ఈ రోజుల్లో ... పత్రికలు, న్యూస్ చానెల్స్ అంటే రాజకీయ
పార్టీలకు బాకా ఊదే మాధ్యమాలుగా తయారయ్యాయి కాబట్టి వాటి గురించి
మాట్లాడుకోవడం శుద్ధ దండగ. కానీ, ఈ సోషల్ మీడియాలో కొందరు అంతకు మించి
తయారయ్యారు - విషాన్ని వెలిగక్కె రాతలతో.
అటువంటి వారి విమర్శలు వస్తువు మీద ఉండవు, వ్యక్తి మీద ఉంటాయి. అలానే వారి
సమర్థనలు కూడా. ఉదాహరణకు చెప్పాలంటే కాంగ్రెస్ ని చాలామంది తిట్టేది
'వ్యక్తి పూజ విషయంగా', కాంగ్రెస్ ఒక రాజకీయ పార్టీగా దిగాజారిపోవడమే కాక
దేశాన్ని కూడా సర్వ భ్రష్టత్వం పట్టించటానికి ప్రధానంగా ఆ పార్టీ నాయకులలో,
దానిని అభిమానించే వారిలో పేరుకుపోయిన 'వ్యక్తి పూజ' లేదా ఒక వ్యక్తిని
విపరీతంగా అభిమానించడం కారణం. కాంగ్రెస్ విధానాలేమిటో చాలామందికి తెలియదు
లేదా తెలిసిన వారెందరున్నారో నాకైతే తెలీదు. కానీ నెహ్రు, ఇందిరా, రాజీవ్,
సోనియా, రాహుల్, ప్రియాంక వీరి గురించి ఆమూలాగ్రం చెప్పమంటే వెంటనే
చెబుతారు. నెహ్రు, ఇందిర, రాజీవ్ గట్రా వారు పాలనలో అనుసరించిన విధానాలను
విమర్శించే తెలివి ఉండదు చాలామందికి. ఎందుకంటే విధానాలను విమర్సించాలంటే
అవి తెలుసుకునే ఓపిక ఉండాలి. 'అప్పట్లో వారి విధానాల వల్లనే దేశం
నాశనమైపోయింది' అంటారు - అవేమిటో చెప్పు అంటే 'ఏంటి నువ్వు కాంగ్రేస్సోడివా
లేక నెహ్రు/గాంధి కుటుంబాలను పూజించేవాడివా' అంటూ పక్కదారి పట్టిస్తారు.
అలానే సమర్థకులు కూడా అప్పట్లో ఆయన అనుసరించిన ఆర్ధిక సరళీకరణ విధానాల
వల్లనే ఈరోజు ఇలా ఉన్నాం లేదంటే ఎలా ఉండేవారమో అంటారు. ఆ ఆర్ధిక సరళీకరణ
విధానాలు అంటే అదేదో ఈనాడులో తెలుగు చక్కగా వచ్చినాయన వాడిన పదమే తప్ప
అంతకు మించి మరేమీ వీరిలో చాలామందికి తెలీదు. ఇప్పటి రొజులకు వస్తే నరేంద్ర
మోడీపై ఈగ వాలినా సరే కత్తులు పుచ్చుకుని బయల్దేరే వీరాధివీరులు ఉన్నారు.
వారు గమనించనిది, బహుశా గమనించలేనిది మరియు ఒప్పుకోలేనిది ఏమిటంటే ఇలాంటి
వారు 'కాంగ్రెస్ జబ్బు'తో బాధ పడుతున్నారని. ఒక వ్యక్తిగా మోడిని పొగడటం
మాని, 'పద్దెనిమిది నెలలోనే అన్నీ చేయాలా? ఒక్కడే ఎన్ని చేయగలడు?' అంటూ
బయల్దేరుతారు. ఆయన ముందుకు తీసుకెళ్ళటానికి ఎటువంటి విధానాలు
తీసుకుంటున్నాడు, తీసుకువస్తున్నాడు ఇవన్నీ చెప్పరు ఎందుకంటే తెలీదు
కాబట్టి. 'నువ్వు మోడీని విమర్శిస్తావా, అంతటి వాడివా?' అంటూ నోరేసుకు
పడిపోవడం తప్ప వీరికి చేతనైంది ఏమీ ఉండదు. మహా అంటే మరెవరో పోస్ట్ చేసిన
దాన్ని షేర్ చేస్తారు. (కొద్ది శాతం మంది ఇందుకు మినహాయింపు)
ఇప్పుడు మరో ఉపద్రవం వచ్చి పడింది. ఇది దేనికో తెలీదు. అమీర్ ఖాన్ ఏదో
వాగాడు, మనమూ తిరిగి నాలుగు అన్నాం. మళ్ళీ మళ్ళీ అంటూంటాం కూడా. ఇక్కడ
మళ్ళీ వస్తువును వదిలేసి వ్యక్తి మీద పడ్డారు. అమీర్ ఖాన్ అన్నదానికి
అనుపమ్ ఖేర్, పరేష్ రావెల్, ఉపేంద్ర, రవీనా లాంటి సహ నటులే సుతిమెత్తగానే
అయినా సరి అయిన సమాధానమే ఇచ్చారు. అంతేకాక మనలాంటి సోషల్ మీడియా మేధావులు
వివరణాత్మక సమాధానాలు కూడా ఇచ్చారు. ఇప్పుడు వస్తువును వదిలేసి వ్యక్తి మీద
పడ్డారు - వారు ప్రచారం చేసిన వస్తువులు కొనద్దండి, వారి సినిమాలు
చూడకండి అంటూ. మొదట వస్తువుల విషయానికి వద్దాం - అంటే కోలా గట్రాల్లాంటివి
అన్నమాట. ఆయా కంపెనీలలో లక్షలాదిమంది సాటి భారతీయులు పని చేస్తున్నారు
(దేశం లోపలి బ్రాంచ్ ల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను), పరోక్షంగా
మరికొన్ని లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఈతని మీద కోపం వారి మీద
చూపడమెందుకు? వీరు చెప్పే 'బోడిగుండుకు మోకాలికి సంబంధం' ఏంటంటే ఈ కంపెనీల
వారు వాళ్లకి కోట్లు ఇస్తున్నారు, మనం కొనడం మానేస్తే వారు అప్పుడు అమీర్
ఖాన్ ని మార్చి సల్మాన్ ఖాన్ ని తీసుకుంటారు లేకపోతె మరో ఖాన్ నో మరెవరినో
తీసుకుంటారు అన్నది. అప్పుడేమవుతుంది ఆ కొత్త వ్యక్తి ఎప్పుడో మళ్ళీ ఏదైనా
వివాదాస్పద కూత కూసాడనుకోండి మళ్ళీ అవి కొనడం మానేస్తాం ఇంకోడిని
తీసుకునేదాకా. అంటే మనకి ఆ వస్తువుల నాణ్యత విషయంలో ఒక స్పష్టత లేదన్నమాట,
కనీసం ఆ వస్తువుల నాణ్యత తెలుసుకోవాలన్న జిజ్ఞాస కూడా లేకుండా ఎవడో
చెప్పాడని కొనేసే తెలివితక్కువ దద్దమ్మలుగా తయారయ్యారన్నమాట.
వస్తువును వదిలేసి వ్యక్తి మీద పడితే వ్యవహారం పక్కదారి పడుతుంది. ఇవ్వాళ
అమీర్ ఖాన్ వివరణ చూడండి - తానూ దేశాన్ని ప్రేమిస్తున్నాను, ఎక్కడికీ
వెళ్ళను అంటూనే 'నా మాటలు నిజమనిపించేలా చేస్తున్నారు' అన్నాడు.
అతికొద్దిమంది మాత్రమే అమీర్ ఖాన్ మాటలకు వివరణాత్మక సమాధానాలు ఇచ్చారు.
చాలామంది అమీర్ ఖాన్ మాటల్లోని విషయం వదిలేసి అతని మీద పడ్డారు 'నీ
సినిమాలు హిట్ చేశాం' అంటూ. యే అమీర్ ఖాన్ కి ప్లాప్ సినిమాలు లేవా? అంటే
అర్థం ఏంటి సినిమా బాగుంటేనే చూసాం తప్ప అమీర్ ఖాన్ సినిమా అయినా 'మంగళ్
పాండే' ని ఎలా తిప్పి కొట్టామో గుర్తు లేదా? సినిమా అన్నది కథానాయక
పాత్రదారికి అధిక లాభం చేకూర్చేది కావచ్చు. కానీ అది అతడి ఒక్కడిదీ కాదు.
ఒళ్ళు దాచుకోకుండా కష్టపడే కథానాయికదీ, క్రూరత్వాన్ని పలికించే ప్రతినాయక
పాత్రధారిదీ, హాస్యాన్ని పండించే చిన్న నటుడిదీ, వీరందరినీ ఒక్కతాటిపై
నడుపుతూ తీసే దర్సకుడిదీ అంతేకాక పెట్టే ఖర్చు చూసుకుంటూ 'సినిమా హిట్' అనే
మాట వినేవరకు నిద్రలేని రాత్రులు గడిపే నిర్మాతదీను. ఇవన్నీ వదిలేసి 'ఆ
సినిమాను చూడకుండా మన ప్రతాపం చూపండి' అంటే నష్టపోయేది ఏ షారుఖ్ ఖాన్ నో
లేక అమీర్ ఖాన్ నో కాదు. నిర్మాతలు, సినీ పరిశ్రమలో పనిచేసే వేలాది మంది
కార్మికులు. ఉదాహరణకి అమీర్ ఖాన్ ఆ మాట అనలేదు అనుకుందాం మరి మీరందరూ
'మంగళ్ పాండే' సినిమాని (మరికొన్ని కూడా) ఎందుకు ఫ్లాప్ చేసారు అంటే
సమాధానం ఉందా; ఉంది 'సినిమా బాలేదు' అని అంతే కదా. 'మేము ఎంతో కష్టపడ్డాము,
మా సినిమా చూసి మమ్మల్ని ఆదుకోండి' అంటే మీరు వింటారా 'మీరు కష్టపడ్డారని
మేము ఇబ్బంది పడి తలనెప్పి తెచ్చుకోవాలా? పో పోవయ్యా.' అంటాం కదా.
అమీర్ ఖాన్ లేదా మరింకొకరు వాస్తవాలు తెలుసుకోకుండా, తెలివి లేకుండా
మాట్లాడుతున్నారు అంటూ బయల్దేరే ముందు మనం ఎటువంటి మాటలు మాట్లాడుతున్నామో
కూడా చూసుకోండి. మన దేశం గతంలోనూ మరియు ఇప్పుడు కూడా గొప్పదిగా
కొనియాడబడుతోంది అంటే అది దేశంలోని గొప్ప వ్యక్తుల వల్ల, ప్రజల యొక్క గొప్ప
ప్రవర్తన వల్ల. ఆ ప్రవర్తనను కోల్పోతే గొప్పదిగా కొనియాడబడే అర్హతను కూడా
కోల్పోతాం. దీని అర్థం అలాంటి వారి మాటలకు సమాధానం ఇవ్వకుండా అన్నీ
మూసుకుని ఉండండి అని చెబుతున్నాను అంటే అంతకంటే మూర్ఖత్వం ఉండదు. ప్రశ్నకు
సమాధానం చెప్పాలి, సందేహాన్ని నివృత్తి చెయ్యాలి, అపోహలను తొలగించాలి
అంతేకానీ వ్యక్తిగతమైన ఆరోపణలు చెయ్యడం వలన లాభం కంటే నష్టం ఎక్కువ
జరుగుతుంది. ఇటివంటి తీరు వలన సరిగ్గా అవతలివైపు వారు ఏమి కోరుకుంటున్నారో
అది సాధించగలుగుతున్నారు. ఆ విషయం అర్థం చేసుకుని దేశ సమగ్రతను కాపాడేలా
వ్యవహరించగలగాలి. వ్యక్తిగత విమర్శలు వద్దు, వాస్తవిక దృక్ఫథంతో, కాస్త
సహనంతో (సహనానికి చేతకానితనానికి తేడా తెలుసుకుని) వ్యవహరించాలి అన్నదే
నేను చెప్పాలనుకున్నది. ఒక వ్యక్తి మీద కోపం లేదా అసహనంతో
చేసే చర్యలు వేలాది మంది ఇతరుల కడుపు మీద కొట్టే చర్యలుగా ఉండకూడదు.
సరిగ్గా ఎదుటివారు ఎటువంటి తప్పు చేస్తున్నారని ఆరోపిస్తున్నామో మనమూ
అటువంటి తప్పే చేస్తే వారు చేసే తప్పుడు ఆరోపణలకు బలం చేకూరుతుంది. అలా
జరగకూడదు. భారతదేశం సహనానికి, శాంతికి, సామరస్యానికి, పౌరుషానికి,
వీరత్వానికి, మిత్రత్వానికి ప్రతీక. ఆ విలువను కాపాడుదాం.
Comments
Post a Comment