గిరీశం కథలు - చిరంజీవి సినిమా, గిరిగాడి ఏడుపు ... (పార్ట్ 1)
వంశీ కలుగోట్ల// గిరీశం కథలు - చిరంజీవి సినిమా, గిరిగాడి ఏడుపు ... (పార్ట్ 1)//
*****************************************************************************************
మా గిరిగాడు దాదాపు రెండు నెలల నుంచి కనిపించట్లేదు, వినపడట్లేదు. మామూలుగా అయితే వాడు ఎక్కడున్నా ఫేస్ బుక్ లో మహా చురుగ్గా ఉంటాడు., ఈ మధ్యన అదీ లేదు. వీడికి ఏమయ్యింది, ఉన్నట్టుండి ఇలా గాయబ్ అయ్యాడు అనుకుంటూ, గిరి గాడి గురించి తలచుకుంటూ ఉండగానే తలుపు కొట్టిన శబ్దం అయింది. శుక్రవారం కదా, ఇక మందుపార్టీకి సరంజామా తీసుకుని అందరూ వచ్చుంటారు అనుకుంటూ తలుపు తీసి చూస్తె గిరి, 'నామ్ లియా సైతాన్ హాజర్' అనుకుంటూ ... "ఒరేయ్ గిరిగా యాడికి బోయినావురా ఇన్నిరోజులు? అడ్రస్ లేవు ... "
"అరేయ్ రెన్నెల్లు కావోస్తోందే ఈడు యాడున్నాడు, యాడికి బోయినాడు అని ఒక్క నా డాష్ గాడన్నా ఫోన్ అన్నా సేసినారారా? బలిసి కొట్టుకుంటున్నారు దొంగ నా డాష్ ల్లారా ... "
"ఒరేయ్ ఒరేయ్ ఆపరా కాస్త కంట్రోల్ సేసుకోరొరెయ్ ... అయినా ఏమైందిరా మాంచి ఫైర్ మీదున్నవ్?"
"అరె అది కాదురా మామా, రెన్నెల్ల నుంచి ఊర్లోనే ఉన్నానా, సీప్ లిక్కర్ తాగి తాగి సిరాకు దొబ్బింది. నాలుక పిడచ కట్టుకుపోతాన్దిరా మాంచి సరుకు ఏదన్నా ఉంటే పోసి పున్నెం కట్టుకోండి మా సాములూ ... దండేసి దండం పెట్టుకుంటా కావాలంటే."
"సీప్ లిక్కర్ తాగాల్సిన ఖర్మ నీకేం పట్టిందిరా ..."
"అట్టా కాదురా మామా... మనమా ఊర్లో అందరికీ కావాల్సిన బాపతు. ఆడ ఇప్పుడు ఏదో ఫ్యాక్టరీ, గీక్టరి అని ఏదో పెడతన్నారు కదా. దాని కోసం అదేందదీ ... భూముల సమీకరానో సేకరనో ఏదో ఒకటి అని అధికార పక్షం వాళ్ళు, వద్దు అని నిరసన అని ప్రతిపక్షం వాళ్ళు రోజు మార్చి రోజు వస్తానే ఉన్నారు. ఎవడోచ్చినా నన్ను పిలుచుకుపొతారా ... ఊర్లోనేమో లిక్కర్ షాప్ లేకపాయే దొంగ నా డాష్ గాళ్ళు సిటీ నుండి పట్టుకురారు, ఆళ్ళ మనుషులకని సీప్ లిక్కర్ తెప్పించి మనల్ని కూడా ఓ సుక్కేసుకోమని తెగ ఇది సేత్తారు తప్పదు కదా నీకు తెలీనిదేముంది ... దీనమ్మా జీవితం సిరాకు దొబ్బింది మామా"
"వార్నీ ... అయినా నువ్వు కరెక్ట్ టైం కి వచ్చినావురా గిరిగా. నిన్ననే మన సూరి గాదు ఒమెరికా నుండి దిగిండురోయ్ ... ఆడు మనకోసం జానీ వాకర్ గాడిని తీసుకొచ్చాడు."
"అరె వహ్ వహ్ సూరిగా యాడున్నావురా, నీకు దండాలురా. యాడున్నా నువ్వు సల్లంగుండాలే. సీప్ లిక్కర్ తాగి సిరాకు దొబ్బిన పానానికి ఫారిన్ సరుకుతో పండగ సేయిత్తన్నావ్ జీతే రహో మేరె లాల్ ... "
గిరి గాని గుండె కోత విన్నాక (సీప్ లిక్కర్ తాగి సిరాకు దొబ్బిన వ్యధాభరిత గాధ) తప్పనిసరి పరిస్థితుల్లో అందరం జానీ వాకర్ గాన్ని పలకరించాం.
"అరె గిరిగా ఎన్నైనా సెప్పురా ... నువ్వు లేక రెన్నెల్ల నుంచి ఏ బ్రాండ్ తాగినా కూడా తాగుడులో మజా లేదురా ..."
"అంతే అంటావారా మామా ... అయితే తెలుగు సినెమాకి మా బాసు లెక్క అంటవ్ నేను మీకందరికీ. ఏమైనా గానీ మామా మా బాసు లేక నాలుగైదేళ్ళ నుంచి తెలుగు సినిమాలు సిరాకు దొబ్బుతున్నాయిరా ... బాసు రావాల్సిందే, ఇరగదీయాల్సిందే."
"అదేన్దిరా గిరిగా పుసుక్కున అంత మాట అనేసినావ్. మిగతా బాసులు, ఆళ్ళ అభిమానులు ఇంటే ఫీలయిపోతారు కదరా ... అయినా మీ బాసు లేకపోతేనేమిరా, ఆ బాసు కాంపౌండ్ నుంచే అయిదారు మంది ఉన్నట్టున్నారు ఇక మిగతా బాబులు కూడా ఇరగదీస్తనే ఉన్నారు కదరా"
ఇక అప్పుడు మా గిరి అర్ధ నిమీలిత నేత్రాలతో అంటే అదే సగం మూసిన కళ్ళతో "అరేయ్ మామా సుక్కలు ఎన్నైనా ఉండొచ్చురా, అవి ఎంత వెలుగు అయినా ఇవ్వొచ్చు కానీ సెందురుడు ఒక్కడే, ఆ వెలుగు వేరే. తెలుగు సినిమా అనేడిది ఆకాశం లేక్కటిదైతే మా బాసు సెందురుడు లెక్కటోడురా మామా ... "
"యాడికిలే మామా, నీకు ఒక పెగ్గేసి వదిలేస్తే ఇట్టాంటివి ఎన్నైనా సెప్తావు. మీ బాసు సినిమాలు మానేసి అయిదారేల్లయింది కాదురా ఇంకా జనాలు ఏమి సూత్తారు సెప్పు? అయినా సినిమా తియ్యడం విషయంలో మీ బాసు కూడా వెనుకడుగు వేస్తున్నాడని అనుకుంటున్నారు కదురా ..."
"అరేయ్ ఆల్లేదో తెలీక అట్టా వాగేసినారో అనుకో నువ్వేట్టా నమ్మినావురా? అయినా అప్పుడెప్పుడో ఏదో పాటల వేడుక సభలో పెద్దాయన సేప్పినట్టు ... మా బాసు"
"ఒరేయ్ ఒక్క నిమిషం ఆగురా ... పెద్దాయన ఎవరు? పాటల వేడుక ఏందిరా?"
"నీకు తెలీదా అయితే ఇవరంగా సెప్తా ఇనుకో ... పెద్దాయన అంటే మన దర్శక రత్న దాసరినారాయణరావుగారు, పాటల వేడుక అంటే నీలెక్కటి ఇంగిలిపీసు మీడియం కాయలకు అదేరా పిల్లకాయలకు ఎట్టా సేప్పేడిది ఆ అదీ అదేరా ఆడియో ఫంక్షన్ అంటారు గదా అదన్నమాట ... "
"వార్నీ నీ తెలుగు ప్రేమ సంతకెళ్ళ ... జర మాకందరికీ అర్థమయ్యేటట్టు ఏడ్సి సావురా మామో."
"సర్లేరా ... ఇంతకీ నేను ఎం సెప్తావున్నా ఆ పెద్దాయన ఏమి సేప్పినాడంటే 'సింహం నాలుగడుగులు వెనక్కి వేస్తోందంటే దానర్థం అది వెనక్కి తగ్గుతోందని కాదు, అది పది అడుగులు ముందుకు దూకి పంజా విసరడానికి సిద్ధం అవుతోందని లెక్క' అని సెప్పినాడురా. అయినా పెద్దాయనకి ఎట్టా తోసిందో కాని ఎంత కరేస్ట్ గా సెప్పినాడో కదురా. నిజంగా మా బాసు సింహం లేక్కటివోడేరా. భయపడే రకం కాదురా భయపెట్టే రకం."
"ఎందిరోయ్ ఉన్నట్టుండి మీ బాసు పురాణం మొదలెట్టావ్ ఏందీ కత?"
"ఎం లేదురా మొన్నామధ్యనే బ్రూస్ లీ సినిమా సివర్లో బాసు కనిపించాడు కదా ... ఇరగదీసాడనుకో, నా సామిరంగా ఉన్నది నాలుగు నిమిషాలే అయినా ఇన్నాళ్ళ తరువాత బాసును తెరపై సూసేసరికి కడుపు నిండిపోయినాదిరా"
"కానీ సినిమా పోయిందంట కదరా ..."
"సినేమాదేముందిలేరా వస్తాయి పోతాయి, బాసు సిరకాలం ఉండేరకం. ముందే సెప్పినా కదా సెందురుడు లెక్క అని ... "
"ఒరేయ్ ఇంతకీ 150 దో లేక 151 దో మొత్తానికి సినిమా తీస్తాడంటావా లేకపోతే ఈ సినిమా పోయిందని ఆగిపోతాడా, అదేదో తమిళ సినిమా 'కత్తి' రీమేక్ సేస్తాడంటున్నారు కదరా ..."
"కత్తి కాకపోతే దానమ్మలెక్కటిదిరా, సినిమా తీసుడు మాత్రం ఖాయం, రాసి పెట్టుకోరోరేయ్ బాక్సులు బద్దలవ్వాల్సిందే."
అలా మా గిరిగాడు వాళ్ళ బాసు అంటే అదే చిరంజీవి 150 దో లేక 151 దో లెక్క ఏదైతేనేం ఆ సినిమా గురించి మాట్లాడుతూ ఉన్నట్టుండి ఏడుపు లంకించుకున్నాడు. "మామా భయమైతాందిరా, ఫ్యూచర్ తల్సుకుంటంటే పాంట్లు తడుస్తున్నాయిరా మామో ... ఎట్టా సేసేదిరా మామో." అంటూ వాడు ఏడుపు లంకించులునేసరికి మాకందరికీ ఎక్కినా కిక్కు దిగిపోయింది. గిరిగాడు అప్పుడప్పుడు ఇలా బర్స్ట్ అవ్వడం మామూలే కాకపొతే ఒక ఫుల్ బాటిల్ అయిపోయాక కానీ ఇట్టాంటివి సేయ్యనోడు ఇయ్యాల ఒకటో పెగ్గు పూర్తీ కాకముందే లంకిన్చుకున్నాడంటే ఏదో జెన్యూన్ రీజనింగ్ ఉండాల్సిందే ... అనుకుంటూ వాడిని ఓదార్చి; వాడి ఏడుపుకు, భయానికి కారణం అడిగాం.
అలా కాసేపు ఏడ్చాక గిరి తనను తాను తమాయించుకుని రెండో పెగ్గు నింపుకుని సెప్పడం మొదలెట్టాడు ...
(గిరి గాడి గోల వాడిది మాత్రమేనా లేక అందరికీ సంబందించిందా అనేది మరో రెండు/మూడు రోజుల్లో ... )
Comments
Post a Comment