గిరీశం కథలు - చిరంజీవి సినిమా, గిరిగాడి ఏడుపు ...(పార్ట్ 2)

వంశీ కలుగోట్ల// గిరీశం కథలు - చిరంజీవి సినిమా, గిరిగాడి ఏడుపు ... (పార్ట్ 2)//
******************************
*********************************************
... కాసేపు ఏడ్చాక గిరి తనను తాను తమాయించుకుని రెండో పెగ్గు నింపుకుని సెప్పడం మొదలెడతాడు అనుకున్నాం గానీ వాడు కథ మొదలెట్టతానికి ఒక ఫుల్ బాటిల్ పూర్తయ్యింది.
"మామా ... పక్క రాష్ట్రం దోస్తు తీవ్రంగా అవమానించాడు మామా, ఇజ్జత్ మొత్తం పోయింది, తలకాయ యాడ బెట్టుకోవాల్నో అర్థం కావట్లేదురా."
"ఎవడురా మామా నిన్ను అంత తీవ్రంగా అవమానించినోడు, అసలు ఇంతకూ ఎందుకు అవమానించాడు? కాస్త ఇవరంగా సెప్పు మామా ... సస్పెన్స్ లో పెట్టి సంపమాక."
"మామా ఇవరంగా సెప్పాలంటే ముందు నీకు మా వేంకటేశులు గాడి గురించి సెప్పాలిరా మామా."
మా రాంబాబు గాడు ఈ సస్పెన్స్ తట్టుకోలేక "ఒరేయ్ ఏందిరా మామా ... థూ దీనమ్మాజీవితం ఇయ్యాల మందులో ఉన్న కిక్కు మొత్తం నీ ఎదవగోలతో ....పోతాంది. చిరంజీవి సినిమా అన్నావ్, తరువాత ఎవడో పక్క రాష్ట్రం దోస్తు ఇజ్జత్ తీసినాడన్నావ్, ఇప్పుడు జూస్తే ఇంకోడి గురించి చెప్పడం మొదలెట్టినావ్ - నీ డాష్ డాష్" అంటూ బూతులు లంకించుకున్నాడు.
"అరేయ్ రాంబాబుగా నీకు ఎక్కువైంది గాని ఊరుకో, గిరిగా నువ్వు సెప్పురా వెంకటేశులుకు ఏమైందిరా?"
"మామా నువ్వు దేవుని లేక్కటోనివిరా, నీలేక్కటోడు ఒక్కడుంటే గొడవలు అసలు జరగవు మామా ... నువ్వు దేవుడివి సామీ, నువ్వు ఖలేజా సినిమాలో మహేష్ బాబు లేక్కటోడివిరా మామా ... "
"మామా నీ డాష్ కు దండంరా నీ స్తోత్రాలు ఆపి అసలు మేటర్ ఏందో సేప్పురా నాయనా ... "
"అట్టా కాదురా మామా ... నీకు మా వేంకటేశులు తెలుసు కదా, నా సిన్నప్పటి దోస్తు. వాడు ఊర్లో ఇల్లు కట్టుకుంటున్నాడురా, సాయం సేయ్యమని అడిగినాడురా. నాకాడ ఏముందని సేయ్యనీకి ఉద్యోగమా లేకపాయే,ఆస్తి లేకాపాయే. అయినా ఊరుకునే రకం కాదు కదా, మనమంతా గాలికిబోయే కంపను ఎక్కడనో తగిలించుకునే రకం కదా మస్తు సాయం సేస్తనని సెప్పినా. నా దమ్ము ఏందంటే ఆడ హైదరాబాద్ ల నాదోస్తు శ్రీనివాసులు ఉన్నాడుగదా ఆడు మంచిగా బిజినెస్ అదీ సేస్త మస్తు సెటిల్ అయినాడు, ఆడికి మా వేంకటేశులుకూడా బాగా తెలుసు మామా... వాడు అప్పు ఇస్తాడులే అనుకున్నా. అరేయ్ ఈడ చిప్స్ అయిపోయినాయ్ రీఫిల్ సెయ్యుండ్రి ఎవడన్నా ..."
"ఒరేయ్ అది కాదురా మామా ... యీడి దగ్గరకు నేను బోయింది ఆడి కోసమేరా."
"సరే సరే ... ఇంతకీ మీ శ్రీనివాసులు ఏమన్నాడు?"
"వాడు ఒక వాటర్ బాటిల్, ఒక ప్యాకెట్ ఇసుక, ఒక ప్యాకెట్ సిమెంట్ సేతిలో పెట్టి వేంకటేశులకు ఇమ్మన్నాడురా."
"అదేందిరా వాటితో ఏం సేసుకోవాలంటా?"
"నేనూ అదే అడిగిన వాదిని. దానికి వాడు ఏమన్నాడో తెలుసా?"
"ఏమన్నాడురా?"
"అదివ్వడమే శానా ఎక్కువ, ఇంకా ఎక్కువ ఇస్తే వేంకటేశులుగాడికి ఎం సేసుకోవాల్నో అర్థం కాక తికమకపడతాడు అని సేప్పినాడురా. అంటే కాదురా మామా మన పెదానమంత్రి కంటే తానె గొప్ప అన్నాడురా."
"ఎట్టెట్టా ప్రధాన మంత్రి కంటే వాడు గొప్పనా ఎట్టానో సేప్పినాడా?"
"ఆ సెప్పినాడు, పెదానమంత్రి అమరావతికి పిడికెడు మట్టి, చెంబెడు నీళ్ళు ఇచ్చినాడు; వీడు అంతకంటే గొప్పోడు కాబట్టి మినరల్ వాటర్ ఇచ్చాడంట, పిడికెడు కాకుండా ప్యాకెట్ మట్టి ఇచ్చాడట దాంతో పాటు సిమెంట్ అదనంగా ఇచ్చాడంట."
"అదేన్దిరా మీ వేంకటేశులు వాడికి కూడా ఫ్రెండ్ అన్నావు కదరా, పైసాకు పనికిరాని నీ మొగం సూసి కాకపోయినా వేంకటేశులుకు సాయం సేయ్యచ్చు గదా ... "
"అదీ అయిందిరా అడిగితే ఇప్పటిదాకా వేంకటేశులుకు శానా సేసినా అని పెద్ద చిట్టా సదివినాడురా ... "
"వార్నీ ... ఏమిచ్చినాడంటరా?"
"వేంకటేశులుకు శానా సార్లు సిగరెట్ కొనిచ్చినాడంట, వాని పిల్లలకు సాకిలేట్లు కొనుక్కోమని పది రూపాయలు ఇచ్చినాడంట ... ఇట్టాంటివి శానా సేప్పినాడురా."
"వార్నీ దొంగ నాయాల ... "
"అక్కడితో ఆపి ఉంటె నాకింత మంట ఉండేది కాదు మామా 'అరేయ్ పాగల్ గా, అమరావతి లేక్కటి మహానగరం కట్టుకోనీకి సాయం సెయ్యి సారూ అని మీ ముఖ్యమంత్రి అందరిముందూ తెగ బతిమలాడితే అడిగితే ప్రధాన మంత్రి అంతటోడు పిడికెడు మట్టి, చెంబెడు నీళ్ళు ఇచ్చిపోతే ఏం సేసినారు ఆయన ఇంద్రుడు, సంద్రుడు అంటూ పొగిడి కాళ్ళు మొక్కి పంపినారు, సప్పట్లు గొట్టి సంతోషపడినారు; నేను అంతకంటే ఎక్కువిస్తా ఉంటే ఇప్పుడెందుకు నోరు లేగుస్తందిరా. ఆయన సేస్తే ఒకమాట, నేను సేస్తే ఒకమాటనా. ఇయి దీస్కపోయి మీ దోస్తుకివ్వు, ఆడి ఇంటికి వాడుకోమను, పండగ సేసుకోమను మామా' అన్నాడురా ... "
"అదేన్దిరా మామా పుసుక్కున అంత మాట అనేసినాడురా ..."
"నాకైతే తలకాయ యాడ బెట్టుకోవాల్నో అర్థం కాలేదురా మామా ... ఇజ్జత్ మొత్తం పోయింది."
"నీకా కాదురా నాక్కూడా అలానే ఉంది ... సర్లే, ఇప్పటికైతే నేను నా తలకాయ దీస్కపోయి దిండు మీద పెట్టుకుంటా." అంటూ నేనెళ్ళి పడుకున్నా, మొదటిసారి గిరిగాడికంటే ముందే మేమందరం పడుకున్నాం, గిరి ఎప్పుడు పడుకున్నాడో అసలు పడుకున్నాడో లేక అవమానంతో తాగుతూనే ఉన్నాడో కూడా తెలీదు.
--- మళ్ళీ త్వరలో ఇంకో గిరీశం కథతో అదే గిరిగాడి తాగుడు గోలతో కలుద్దాం.

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన