జపమో ధ్యానమో ... ఏదో ఒకటి ఆచరించి చూడండి

జపమో ధ్యానమో ... ఏదో ఒకటి ఆచరించి చూడండి
************************************************

 'జ'కారశ్చ జన్మవిచ్చేదః 'ప'కారః పాపనాశనః 
తస్మాజ్జప ఇతిప్రోక్తో జన్మపాప వినాశకః ॥ 

--- 'జ' అనగా రాహిత్యం జన్మరాహిత్యం, 'ప' అనగా పాపనాశనం. కావున 'జప'మనగా జన్మరాహిత్యం, పాప వినాశనం కలుగజేసేది అని అర్థం. 

    మనిషి పుట్టుకతో మానసింకంగా ఎంతో బలవంతుడు. కానీ, పెరుగుతూ వస్తూ ప్రపంచం లోని అనేకమైనటువంటి, తనకు అనవసరమైన విషయాలను పట్టించుకుంటూ, కల్మషాలను అంటించుకుంటూ దుర్బలుడుగా తయారవుతున్నారు. పుట్టుకతో అత్యంత శక్తివంతంగా ఉండే ఇంద్రియాల శక్తి వివిధ ఆకర్షణలకు, మోహాలకు లోనై శక్తిని కోల్పోతూ బలహీనమవుతున్నాయి. ఇంద్రియాలను అదుపులో ఉంచవలసిన మనసే ప్రాపంచిక సుఖాలకు, భోగలాలసతకు లోనై అదుపు పక్కదారులు పడుతోంది. మనవ పరిణామ క్రమంలో  నాగరికుడుగా ఎదుగుతూ వస్తూన్న సమయంలోనే కొందరు మేధో వంతులు ఈ విషయాన్ని గమనించారు. ఆ దశలో ఏదైనా సమస్య వస్తే దాని మూలాలు వెతికి, పరిష్కార మార్గం కనుగొనే సహనం, ఓపిక ఉండేవి. ఇప్పటిలా తాత్కాలిక ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టి, మళ్ళీ మళ్ళీ సమస్యలు కొని తెచ్చుకునేవాడు కాదు. అందుకే సమస్యకు మూల కారణమైన మనసును అదుపులో పెట్టటానికి ధ్యానం, జపం అనే పరిష్కార మార్గాలను కనుగొనటానికి ప్రయత్నించారు. మానసికంగా ధృడత్వాన్ని సంతరించుకోవటానికి తగిన మార్గాలను అన్వేషించి కొన్ని పరిష్కార మార్గాలు కనుక్కున్నారు. అందులో ధ్యానం, జపం అతి ముఖ్యమైనవి.
     జపం - భగవంతుని ప్రార్థించటానికి, స్మరించుకోవటానికి ఉన్న అతి ముఖ్యమైన మార్గాలలో జపం ఒకటి. ఇది పైకి చూస్తె భగవంతుని ప్రార్థించటానికి ఒక మార్గంగా కనిపించినప్పటికీ ఈ జపం అన్నది మనసును ఒకే మార్గం లేదా అంశం వైపు కేంద్రీకరించి ఏకాగ్రతగా ఉండేలా చెయ్యటానికి ఉద్దేశించబడింది. ఈ జపం (శ్లోకమో, నామమో, సంకీర్తనమో మరొకటో) లేదా స్మరణం వలన రెండు విధాలైన లాభాలున్నాయి. శ్లోకాలు, నామాలు, సంకీర్తనలు వగైరాలన్నీ శబ్ద ప్రాధాన్యత ఉన్నవి. వాటిని సరియైన ఉచ్ఛారణతో చదవగలిగితే అవి శరీరంలోని కొన్ని అవయవభాగాలను, కొన్ని నాదీ కేంద్ర ప్రాంతాలను ఉత్తేజితం చేస్తాయి - ఇవే కాకుండా శాస్త్రీయంగా రుజువు కాబడిన ఎన్నో ప్రయోజనాలు సిద్ధిస్తాయి. (వ్యాస పరిమితి వల్ల అన్నీ ఇక్కడ ప్రస్తావించటం కుదరట్లేదు, గూగుల్ లో వెతికినా దొరుకుతాయి. వీలయితే అవి మళ్ళీ పోస్ట్ చేస్తాను) జర్మనీ, ఫ్రాన్స్ తదితర యూరోప్ దేశాలు ఎన్నో ఈ విషయంగా పరిశోధన చేసి అవి ఈ 'జపం' (సరియైన ఉచ్ఛారణతో) వల్ల కలిగే ఫలితాలను నిరూపించి, ప్రకటించారు. ఎంతైనా మనకు పరాయి వారు చెప్పేదే పవిత్రమైననది కదా అందుకే వారు కూడా చెప్పారు అని ఉదహరించాను. మరొక విషయం ఏంటంటే ఈ జపం అన్నది నిశ్శబ్దంగా చేస్తే కలిగే ఫలితం తక్కువ, నిశ్సబ్దంగా కూడా చేస్తూ తగిన ఫలితాలు సాధించాలంటే ముందు చాలాకాలం సాధన చెయ్యాలి. పెద్దగా లేదా బయటకి చదువుతూ జపం చెయ్యటం వల్ల మనసు, బుద్ధి రెండూ ఒకే అంశం మీద దృష్టి కేంద్రీకరించే అవకాశం ఏర్పడుతుంది. అలా ఏకాగ్రత పెంపొందించుకోవచ్చు. తద్వారా సాధన వల్ల నెమ్మదిగా ఇంద్రియ నిగ్రహం సాధించే అవకాశం ఉంటుంది. వ్యాపార ప్రకటనలకు చిన్న అక్షరాలలో 'నిబంధనలకు లోబడి' అని చెప్పినట్టు ఇక్కడ కూడా నిబంధనలు ఉన్నాయి. కేవలం జపం చేస్తే ఫలితం సిద్ధించదు, ముందే చెప్పినట్టు బయటకి/పెద్దగా చదవటం, ఉచ్ఛారణ తదితర నిబంధనలు ఉన్నాయి. అవి పాటించగలిగితే ఫలితం దక్కుతుంది. నమ్మినవారు భగవత్ కృప అనుకుంటారు, అది కాదన్నవారికి విదేశీయుల పరిశోధన ఫలితాలు నప్పవచ్చు.
    ధ్యానం - మానసిక బలాన్ని పొందటానికి, ఇంద్రియ నిగ్రహం సాధించటానికి తెలిసిన మార్గాలలో ఇది ఉన్నతమైనది అయినప్పటికీ ఇది కాస్త కష్టతరమైనది. చెప్పుకోవటానికి 'ఆ ధ్యానమంటే ఏముందిరా కళ్ళు మూసుకుని, ఊపిరి నెమ్మదిగా తీసుకుంటూ కాసేపు గడిపెయ్యడమే' కావొచ్చు. కానీ, ఈ స్థితిలో నిగ్రహం సాధించటానికి చాలా సమయం పడుతుంది. చిత్తానికి ప్రయాణించే మనసును అన్ని దారులు మూసేసి తీసుకొచ్చి హృదయమందిరంలోనే తిష్ట వేసుకుని కూచొని శక్తి సమీకరించుకోవటానికి పురిగోల్పటం ఈ ధ్యానం ముఖ్య ఉద్దేశం. పలువురు పలు విధాల ధ్యాన రీతులు బోధిస్తున్నప్పటికీ అన్ని రీతులలో 'శ్వాస మీద దృష్టి' లేదా శ్వాసను నియంత్రించటం ద్వారా ఏకాగ్రతను సాధించటం ముఖ్యంగా బోధించబడుతుంది. ఇందుకు తొలిమెట్టుగా ప్రాణాయామం కూడా సహకరిస్తుంది. ధ్యానం వల్ల ఒకవైపు మనసును అదుపులోకి తెచ్చుకుని ఇంద్రియ నిగ్రహం సాధించటం అన్నది ఒక ఫలితం కాగా, శ్వాస నియంత్రణ వల్ల ప్రాణ వాయువు (ఆక్సిజన్) తగిన ప్రమాణంలో, ప్రతి శరీర భాగానికి అంది ఆరోగ్యవంతంగా ఉండేలా చేసుకోవడం మరొక ఫలితం. శాస్త్రీయంగా కూడా ఈ ధ్యానం వల్ల సిద్ధించే ఉపయోగాలు నిరూపించాబడ్డాయి. (విదేశస్థులద్వారా :))
     జపం అయినా, ధ్యానం అయినా మనకు తోచిన రీతిలో చేసి ఏదో చేశామే కానీ ఏమీ జరగలేదు అనటం సబబు కాదు. ఎందుకంటే అవి రెండూ గురు ముఖంగా నేర్చుకోవలసినవి. జపంలో ఉచ్ఛారణ, ధ్యానంలో శ్వాస నియంత్రణ అన్నవి గురువుల శిక్షణ ద్వారా సరియైన పద్ధతిలో అభ్యసించి, నేర్చుకొని చెయ్యగలిగితే ఖచ్చితంగా ఫలితాలు సాధించవచ్చు. జపం, ధ్యానం అన్నవి కేవలం ఆధ్యాత్మిక సంబంధితమైనవి అని పక్కన పెట్టటం సబబు కాదు. అవి మానసిక బలం సంతరించుకోవటానికి, వ్యక్తిత్వ వికాసం పొందటానికి ఉపకరించేవి. వీలయితే కొన్ని రోజులు - ఒక నెల లేదా రెండు నెల్లు అనుకుందాం; ఈ రెండిట్లో ఏదో ఒక పధ్ధతి ఎన్నుకుని ప్రయత్నించి చూడండి. మార్పును మీరే గమనించగలుగుతారు. శిక్షణాశిబిరాలు ఏవైనా లేదా ఎవరైనా గురువులు అందుబాటులో ఉంటే శిక్షణ పొందటానికి ప్రయత్నిస్తే ఇంకా మంచిది. శుభం భూయాత్ ...

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన