దేవుడు - భక్తులు - మూర్ఖులు

వంశీ కలుగోట్ల // దేవుడు - భక్తులు - మూర్ఖులు //
*******************************************
     మనలో చాలామందిమి మహేష్ బాబు చిత్రం 'ఖలేజా' చూసి ఉంటాము. అందులో రావు రమేష్ (గ్రామ పెద్ద) మరియు షఫీ పాత్రలు బహుశా గుర్తుండే ఉంటాయనుకుంటా. నటన పరంగా ఇద్దరూ అద్భుతంగా చేశారు. ఆ పాత్రలు ఇప్పుడు సమాజంలో మనకు కనిపించే రెండు అతి ముఖ్యమైన రకాల వ్యక్తులకు ప్రతీకలుగా నిలుస్తాయి. ఒకటి భక్తుడు రెండు మూర్ఖుడు. బహుశా త్రివిక్రమ్ సమాజంలోని ఈ ధోరణులను చూసిన తరువాతే ఆ పాత్రలు రూపు దిద్దాడేమో.
     'భక్తుడు' తరహా వ్యక్తులు - ఖలేజా సినిమా గుర్తుంటే అందులో రావు రమేష్ పాత్రధారి గ్రామస్తులందరికీ తమను కాపాడేవాడు ఒకడొస్తాడు, అతడోచ్చాక అంతా మంచే జరుగుతుంది అని చెబుతూ గ్రామస్తులను ఊరిస్తాడు. ఏవేవో పూజలు గట్రా చేస్తుంటాడు. షఫీ పాత్రధారిని దేవుడిని వెతికి తీసుకురమ్మని పంపుతాడు. మహేష్ బాబు వచ్చాక అంటే అదే దేవుడు వచ్చాక 'నువ్వు దేవుడివి సామీ' అంటూ ఆ దేవుడి దైవత్వాన్ని (???) ప్రోమోట్ చేస్తూ ఉంటాడు. సినిమా నుంచి బయటకోచ్చేద్దాం - మీ పరిస్థితి బాగుపడాలంటే, అవినీతి అంతమవ్వాలంటే, నల్లధనం విదేశాలనుంచి మనదేశానికి రావాలంటే, అభివృద్ది జరగాలంటే, అందరూ బాగుండాలంటే అసలు ఇలాంటివన్నీ జరగాలంటే కేవలం ఒక్కడి వల్లనే సాధ్యం. ఆ ఒక్కడే దేవుడు. ఆ దేవుడే మానవ రూపమెత్తి ఇదిగిదిగో ఈ నాయకుడి రూపంలో వచ్చాడు. మా నాయకుడు నడిచే నిజాయితీ, కనబడే ఆదర్శం, అభివృద్ది సాధించే ఏకైక శక్తి - అసలు ఆయన నాయకుడిగా మారడం మనం ఎన్నో జన్మలనుండి చేసుకున్న అదృష్టం అంటూ స్తోత్ర పాఠాలు వల్లించే భక్తాగ్రేసరులను కొత్తగా పరిచయం చేయనక్కరలేదు. ప్రతిరోజూ వార్తా పత్రికలు, న్యూస్ ఛానెల్స్ చూసేవారికి టక్కున కొన్ని పేర్లు గుర్తొస్తే (???) తప్పు నాది కాదు. ఇలాంటి భక్తులు అసలు ఏమీ చేయరు - వీరు చేసేదేమిటంటే దేవుడి పరిణామక్రమాన్ని జాగ్రత్తగా గమనించుకోవడం. ఒక వ్యక్తి బాగా శక్తిమంతుడుగా ఎదుగుతున్నాడంటే ఇలాంటి భక్తులు వెంటనే వారి వద్ద వాలిపోతారు. ఇక ఆ శక్తిమంతుడిని దేవుడిని చేసేదాకా వీళ్ళు వదలరు. ఇంకా సరిగ్గా చెప్పాలంటే దేవుడికంటే ముందే ఇలాంటి భక్తులు పుడతారు, 'ఎవరో ఒక దేవుడు రావాలి' అనే భావనను వ్యాప్తం చేస్తూ ఉంటారు. ఇప్పటి సమాజంలో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులు ఎవరూ అంటే ఇలాంటి భక్తులే. గత ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వం, రేపటి ప్రభుత్వం, ఆ తరువాతి ప్రభుత్వం - ప్రభుత్వాలు మారినా ఇటువంటి భక్తులది అత్యంత కీలకపాత్ర. ఉన్న దేవుడిలో దైవత్వం (ప్రజాకర్షక శక్తి) తగ్గిపోయే సూచనలు అందరికంటే ముందే పసిగట్టేది వీరే - ఎందుకంటే కొత్త దేవుడి అన్వేషణ మొదలు పెట్టాలి కాబట్టి. ప్రజాక్షేత్రంలో (ప్రత్యక్ష ఎన్నికలు) ఏనాడూ గెలవకపోయినా కూడా ఇలాంటి దేవుడి ప్రాపక చర్యల వలన ఇటువంటి భక్తాగ్రేసరుల స్థానానికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. దీనికి పెద్దగా ఉదాహరణలు అక్కరలేదనే నా అభిప్రాయం, రోజూ కాకపోయినా అప్పుడప్పుడూ వార్తలు చూసేవారికైనా చటుక్కున గుర్తొస్తాయి ఇలాంటి వారి పేర్లు.
     ఇక 'మూర్ఖులు' - ఖలేజా సినిమాలో షఫీపాత్ర ఉంటుంది కదా , అందులో ఒక సన్నివేశంలో మహేష్ బాబు పాత్ర చిరాకుతో 'నేనే దేవుడినైతే ఆ గోడ పడిపోవాలి' అనగానే షఫీపాత్ర వెళ్లి తనకాలికి దెబ్బ తగిలినా సరే ఆ గోడను పడగొట్టి వచ్చి నిలబడతాడు; అలాగే మరో సన్నివేశంలో మహేష్ పాత్ర రౌడిలను కొడుతూ ఉంటే మాంచి ఊపోచ్చేలా 'కొట్టు సామీ, చంపు సామీ' అంటూ హిస్టీరిక్ గా అరుస్తూ ఉంటాడు. అత్యంత బలహీన మనస్కులు ఇలాంటి వారు, వీరిని లొంగదీసుకోవడమంత సులువైన పని మరోటి ఉండదు. ఉదాహరణకి కులం, మతం, ప్రాంతం గట్రా చెప్పి వచ్చేవారిని నాయకులుగా అంగీకరించే వారు ఇలాంటి మూర్ఖుల కోవకే చెందుతారు. వీరిలో మూర్ఖాగ్రేసరులు ఉంటారు ఎలా అంటే షఫీపాత్రలాగా. ముందే చెప్పుకున్నాం కదా గోడ పడగొట్టడం గురించి. సినిమా కాకుండా బయట అయితే నాయకుడి (???) కోసం ఒంటిమీద కిరోసిన్ పోసుకుని అంటించుకోవటం గట్రా చేసేవారు ఈ కోవకు చెందుతారు. ఇలాంటివారికి అవతలి వారు చెప్పే రెండో మాట వినే ఓపిక ఉండదు, అసలు మొదటి వాక్యం కూడా పూర్తి కాకుండానే ఒక అంచనాకు వచ్చేస్తారు. ఇటువంటి పైత్య ప్రకోప చర్యలకు ఒకానొక ఉదాహరణ - 'వేలాది పంట పొలాలు నాశన ...' అంటూ మొదలెడితే ఆ వాక్యం పూర్తి కాకముందే 'అంటే మీకు రాజధాని వద్దా? అభివృద్ది వద్దా? ప్రతిపక్షానికి మద్దతుదారుడివా?' లాంటి ఆరోపణలతో పాటు బూతులు అదనం. 'అయ్యా చక్కగా పంటలు పండే పొలాలలో కాక ప్రభుత్వ భూములు ధారాళంగా ఉన్న, అంతగా పంటలకు అనువుకాని ప్రాంతాలు ఉన్నాయి కదా అటువంటి ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తే ఖర్చు తగ్గుతుంది, ఆహార ధాన్యాల ఉత్పత్తికి దెబ్బ ఉండదు కదా' అనే విశ్లేషణ వినే ఓపికను ఈ మూర్ఖత్వపు పైత్య ప్రకోప లక్షణం కప్పివేస్తుంది.
     ఇప్పుడు ఈ భక్తుడు, మూర్ఖుడు గురించి ఎందుకు? అంటే గత కొద్దికాలంగా ఈ రెండు కోవలకు చెందిన వ్యక్తులు చాలా ఎక్కువవుతున్నారు. మరీ ఎక్కువగా భక్తులకంటే మూర్ఖులు అందునా మూర్ఖాగ్రేసరులు పెరిగిపోతున్నారు. ఈ భక్తత్వం, మూర్ఖత్వం పెరిగిపోవటం వలన ఎటువంటి పరిణామాలు సంభావిస్తున్నాయో చూస్తూనే ఉన్నాము. మనం కేవలం చూస్తాం అంతేనేమో, కానీ ఈ మూర్ఖత్వపు చర్యల ఫలితాలు భవిష్యత్ తరాలు అనుభవిస్తున్నపుడు ప్రతి క్షణంలో మన తరాన్ని తిట్టుకుంటూనే ఉంటారు.
     ముక్తాయింపు: ఇప్పటి సమాజంలో ఉన్నది అతి ముఖ్యంగా మూడు రకాల వ్యక్తులు - దేవుడు, భక్తుడు, మూర్ఖుడు. ఈ కోవలో మీరు దేనికి చెందుతారో, ఎలా రూపాంతరం చెందాలనుకుంటున్నారో అన్నది మీ ఆలోచనా స్థాయి, శక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఇంకో రకం వ్యక్తులు కూడా ఉన్నారు - అది పోరాడే రకం. వీరు మిగతా తరహా వ్యక్తుల తీరుకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటారు. ఇవేవీ కాక ఇంకో రకం వ్యక్తులు ఉన్నారు - వీరు ఎండుటాకు లాంటివారు, గాలి ఎటు తీసుకువెళ్తే అటు వెళ్ళే రకం అన్నమాట. పై మూడు తరహాలు నచ్చకపోతేనో, అలా ఉండటం చేతకాకపోతేనో లేదా మరే ఇతర కారణాలవలననైతేనేమి ఇటువంటి కోవలో ఉండిపోవటానికి ఇష్టపడితే మీ ఇష్టం. స్వామి వివేకానంద చెప్పినట్టు 'మిమ్మల్ని మీరు ఏమని భావిన్చుకుంటారో అదే అవుతారు'.

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన