... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన

వంశీ వ్యూ పాయింట్ // ... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన // 
*******************************************************************
            రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఎవరెవరి అవకాశాలు ఎలా ఉండబోతున్నాయో నా వ్యూ పాయింట్ లో నేను రాస్తున్న సిరీస్ లో ఇది మూడవది - ఇందులో జనసేన అవకాశాల గురించి. జనసేన పేరు అందరికీ తెలిసినా ఇప్పటికీ చాలామందికి అర్థం కానీ విషయం - ఎన్నికల్లో పోటీ చేస్తుందా? లేదా? అన్నది. పోటీ చేస్తుందనే అభిప్రాయంతోనే మనం ఈ వ్యూ పాయింట్ లో చర్చిద్దాం. పవన్ కళ్యాణ్ 'జనసేన' విషయానికి వస్తే, 2014 ప్రాంతంలో 'ఇల్లేమో దూరం, దారంతా చీకటి...' అంటూ మొదలుపెట్టిన ఈ 'జనసేన'ను ఇన్నాళ్ళూ సరైన దారిలోకి తీసుకుపోలేకపోయారు. ఇప్పటికీ తెదేపా పక్క వాయిద్యంగా మాత్రమే గుర్తించబడి, తన అస్థిత్వాన్ని చూపుకోవటానికి నానాపాట్లూ పడుతున్నారు. 
            జనసేన అవకాశాల గురించి చర్చించుకునే ముందుగా కొన్ని ముఖ్యమైన అంశాల గురించి ప్రస్తావించాలి. అవి ... 

-> పవన్ కళ్యాణ్ తీరు: జనసేన వరకూ అన్నీ పవన్ కళ్యాణ్ మాత్రమే కాబట్టి, జనసేన అవకాశాలు మొత్తం కేవలం పవన్ కళ్యాణ్ తీరుపైనే ఆధారపడి ఉంటాయి. మధ్యలో కొన్నాళ్ళు తెదేపాపై నానా విమర్శలూ మాట్లాడినా జనసేనాధినేత తెదేపా పట్ల మెతకవైఖరి అవలంబిస్తున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అధికారంలో ఉన్న తెదేపాను కాక, వైఫల్యాలకు ప్రతిపక్ష వైఎస్సార్సీపీని తప్పు పట్టటంతోనే పవన్ పూర్తి క్లారిటీ ఇచ్చారు. అంతేకాక, ఇటీవల 'జగన్ సీఎం కావడం ఇష్టం లేదు, కానివ్వను' అని చెప్పి, తప్పిదం చేశారు. ఆ పని చేయటానికి తెదేపా ఉంది కదా, ఇక నీవెందుకు అనే ప్రశ్నకు సమాధానం లేదు. పవన్ తీరు, తెదేపా అనుకూలమే అనేది స్పష్టం. ఇపుడు పోటీ చేసినా కూడా - తెదేపా బలహీనంగా ఉండి, వైఎస్సార్సీపీ బలంగా ఉన్నచోట మాత్రమే జనసేన బలమైన అభ్యర్థులను నిలబెడుతుంది - మిగతా చోట్ల పోటీ నామమాత్రమే, కేవలం ఓట్లు చీల్చటానికే అని విశ్లేషకుల అభిప్రాయం. పవన్ తీరు దీనిని బలపరుస్తోంది. 

-> విధానాలు: జనసేన విధానాలు ఏమిటో ఎవరికీ తెలీదు. పవన్ ఒక్కోసారి ఒక్కోతీరున మాట్లాడే దానిని విధానమనుకుంటే హతోస్మి అనుకోవలసిందే. ఇక ప్రతిపక్షనేత జగన్ ను ఏ విషయంలోనైతే విమర్శిస్తున్నారో (ముఖ్యమంత్రి అయితే సమస్యలు తీరుస్తా అనటం) అదే తీరున తను ముఖ్యమంత్రి అయితే అది చేస్తా, ఇది చేస్తా అనటం వంటివి విమర్శలకు తావిచ్చేవిగా ఉన్నాయి. ఒక స్పష్టమైన విధానం లేకుండా అప్పట్లో చిరంజీవి 'నేను తెల్లకాగితం లాంటివాడిని, మీకేం కావాలో రాసుకోండి' అన్న చిరంజీవికి జరిగిన సత్కారమే ఇపుడు పవన్ కూ జరుగగలదు. 

-> అభ్యర్థులు: జనసేన తరఫున దాదాపు 170 స్థానాల్లో పవన్ పోటీ చేయాలేమో! తెదేపా, వైకాపాల నుండి నాయకులు వస్తారని ఆశలు పెట్టుకున్నట్టున్నారు కానీ తెదేపా నుండి వైఎస్సార్సీపీ వైపు అధికంగా, అటునుండి తెదేపా వైపు స్వల్పంగా వలసలు ఉన్నాయి తప్పించి జనసేనను ఎవరూ పట్టించుకోవటం లేదు. అలా అని కొత్త అభ్యర్థులను ఏమైనా తయారు చేస్తున్నారా అంటే, ఏదో అభ్యర్థుల ఎంపికకు పరీక్ష అంటూ తలతిక్క చర్యలు చేస్తున్నారు. అభ్యర్థికి స్థానికంగా ఉన్న బలాబలాలు ప్రాతిపదికన కాక, ఇంకేరీతిన టికెట్స్ ఇస్తారో మరి. 

            పై అంశాలను పరిశీలిస్తే, జనసేన రాజకీయ ప్రస్తానం, ప్రజారాజ్యం కంటే దిగువ స్థాయిలో ఉండేలా ఉంది. ప్రజారాజ్యం 2009 ఎన్నికల్లో దాదాపు 19.3% ఓట్లు తెచ్చుకోగలిగింది. ఇపుడు జనసేన అందులో సగం తెచ్చుకోవడం కూడా గొప్పే అన్నట్టుంది పరిస్థితి. ప్రాంతాల వారీగా చూసుకుంటే జనసేన ఉభయగోదావరి జిల్లాలతో పాటు, రాయలసీమలో చిత్తూరు ప్రాంతంలో కాస్త ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలలో తెదేపాను భారీగా దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి అని మనం అనుకోవచ్చు కానీ, అదే వారి గేమ్ ప్లాన్ అనుకోవచ్చు. తెదేపా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఆ ప్రాంతాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు గంపగుత్తగా ప్రతిపక్షం వైపు మళ్ళకుండా ఉండేలా చెయ్యటమే పవన్ బాధ్యత ఈ ఆటలో. మరి పవన్ ఆటగాడిగా నిలబడతారా లేక ఆటలో అరటిపండు అవుతారా? వాస్తవిక (పచ్చ మీడియా మరియు సాక్షి కాకుండా) కోణంలో చూస్తే సరైన అభ్యర్థులు కూడా లేని పవన్ పార్టీ ఉభయగోదావరి జిల్లాలలో చూపే ప్రభావం కూడా ప్రశ్నర్థకంగానే ఉన్నది. మరీ ముఖ్యంగా ఇప్పటికైనా తెదేపా పట్ల సానుకూలత, జగన్ పట్ల వ్యతిరేకత అన్నది ప్రధానంగా కాకుండా తన ఎజెండా ఏమిటి అన్నది చెప్పుకోగలిగితే కొంత మార్పు ఉండవచ్చు. మరొక విషయం - పవన్ ఉత్సాహానికి, అతి ఆవేశానికి కారణం కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం ఏర్పడిన తీరు అంటున్నారు. కుమారస్వామి రాజకీయ ఉద్ధండుడు, కాబట్టి తన ఎమ్మెల్యేలను కాపాడుకుంటూ, కాంగ్రెస్ వంటి మిత్రపక్షంతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు. అదే పరిస్థితి ఇక్కడ వస్తే, జనసేన తరఫున గెలిచిన అభ్యర్థులు పార్టీ ఫిరాయింపులు చేయటమే తప్పించి, పవన్ ఆశిస్తున్నది జరిగే అవకాశాలు లేవు. 
            పైన పేర్కొన్న అన్ని అంశాలను పరిశీలిస్తే, ఈ ఎన్నికలలో జనసేన పోటీ చెయ్యడమంటూ జరిగితే, ఎన్ని స్థానాలకు పోటీ చేస్తుందో కానీ - ఒంటరిగా లేదా వామపక్షాలతో కలిసి పోటీ చేస్తే బహుశా 3 నుండి 5 సీట్లు గెలవవచ్చేమో. ఇపుడు మనం చేయవలసింది పవన్ రాజకీయ ప్రస్తానం గురించి ఆసక్తిగా ఎదురు చూడటం కాదు, పవన్ కొత్త సినిమా ప్రకటన ఎపుడా అని ఎదురు చూడాలి ... 

Comments

  1. మీ విశ్లేషణ బాగుంది.

    పవన్ కళ్యాణ్ బాబుకు కుడి భుజంగా ఎదగలేకపోయాడు. అదే సమయంలో బాబు కీ ఇస్తే ఆడే కీలుబొమ్మ ఇమేజీ నుండి కూడా బయటకు రాలేకపోయాడు. నాలుగేళ్ల కాలాన్ని చేజేతులా వృధా చేసుకొని రెంటికి చెడ్డ రేవడి పరిస్థితి!

    ReplyDelete
  2. "ప్రజారాజ్యం 2009 ఎన్నికల్లో దాదాపు 18% ఓట్లు తెచ్చుకోగలిగింది"

    చిన్న సవరణ. ఆంధ్ర ప్రాంతంలోని 175 నియోజకవర్గాలు తీసుకుంటే ప్రరాపా *19.3%* ఓట్లు సాధించింది.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి