దేవుడికి, మనిషికి తేడా కేవలం గుణం మాత్రమే ...


దేవుడికి, మనిషికి తేడా కేవలం గుణం మాత్రమే ...
******************************
******************

"అవును! రాముడు, కృష్ణుడు, జీసస్, ప్రవక్త ... అందరూ గొప్పవారే! అయితే నీకేమిటి, నీవేమిటి? నీవెప్పుడు ఉన్నతిని సాధిస్తావు? గుర్తుంచుకోండి ... ఈ భూమి మహాత్ముల, నాయకుల చేత పునీతం కాబదినది. ఈ క్షణాన్నే నీవు ఏమి చేయదలచుకుంటున్నావో, ఏమి కాదలచుకుంటున్నావో నిర్ణయించుకో. ప్రయాణాన్ని ప్రారంభించు." 

     మనిషి అశాశ్వతమైనవాడు, గుణం శాశ్వతమైనది. మనిషిని, గుణాన్ని వేరు చేసి చూడగలగాలి. మనిషి కేవలం ఒక వాహకం లాంటి వాడు మాత్రమే. ప్రవహించే నది లాంటిది గుణం; అది వచ్చిన వారిని తనలో కలుపుకుంటుంది, పోయేవారిని పోనిస్తుంది. మనిషిని, గుణాన్ని వేరు చేసి చూడలేకపోవడం అన్న రుగ్మత వల్లనే ఇవ్వాళ 'వారసత్వం' అన్నది రాజ్యమేలుతోంది. గుణం వాహకంగా ఉపయోగించుకున్న కొంతమంది మనుషులని అభిమానిస్తూ, ఆరాధిస్తూ, పూజిస్తూ వారిని దేవుళ్ళను చేస్తున్నాం. గతంలో (ప్రాచీన కాలంలో) ఈ పైత్య ప్రకోప ధోరణులు ఇంతగా ఉండేవి కావు. ఉదాహరణకి రాముడి పిల్లలు దేవుళ్ళుగా పూజింపబడలేదు, కృష్ణుడి పిల్లలు దేవుళ్ళుగా కీర్తింపబడలేదు. వారికి వారసత్వంగా రాజ్యం లభించి ఉండవచ్చు. కానీ ఇక్కడ చెబుతున్నది గుణాల గురించి, అధికారం గురించి కాదు. అలాగని వారి పిల్లలు చెడ్డవారని చెప్పట్లేదు, వారు గుణసంపద పరంగా వీరి స్థాయికి ఎదగలేక మామూలువారిగానే మిగిలిపోయారు అని చెప్పడమే ఇక్కడ ప్రధాన ఉద్దేశ్యం.
     రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, క్రీస్తు, ప్రవక్త మరియు అలాంటివారు కూడా ఆ గుణాల వల్ల కీర్తింపబడ్డారే తప్ప, వారి వల్ల ఆ గుణాలు కీర్తింపబడలేదు. 'రామో విగ్రహవాన్ ధర్మః' అని చెప్పబడింది. అంటే రాముడు అకార రూపంలో ఉన్న ధర్మము వంటివాడు అని అంతేకాని 'ధర్మో విగ్రహవాన్ రామః' అని చెప్పబడలేదు.ఆ సత్యాన్ని గ్రహించలేక దేవుడిగా రాముడిని (అలాంటివారిని) పూజిస్తూ, వారు ఆచరించి చూపిన ధర్మాన్ని, విలువలను మాత్రం పక్కన పెట్టారు. మనిషికి, గుణానికి ఉన్న ఈ తేడాను గ్రహించలేకపోవడం అన్నది కాలక్రమేణా పరిణామం చెంది వ్యక్తి పూజగా రూపాంతరం చెందింది. గుణం ప్రధానం కాకుండా వ్యక్తి ప్రధానం కావడం ఎప్పుడు మొదలైందో అప్పటినుంచే సమాజంలో విపరీత ధోరణులు ప్రారంభమయ్యాయి. మితిమీరిన వ్యక్తి పూజ మతాలను, వర్గాలను తయారు చేసింది. వ్యక్తి ద్వారా ఆచరించి చూపబడ్డ గుణం, వ్యక్తి చెప్పిన మాట/బోధన మరుగున పడిపోయి; ధర్మానికి, గుణానికి వాహకంగా ఉపయోగపడిన మనిషి/వ్యక్తిని ఆరాధించడం, పూజించటం, అతడికి దైవత్వాన్ని ఆపాదించటం ఇవ్వాళ్టి అలవాటుగా మారిపోయాయి.
     గుణ ప్రధానమైన దైవత్వాన్ని వ్యక్తికి ఆపాదించి, వ్యక్తిని దేవుడిని చేసి ఆ దేవుడిని గుడిలో బంధించేశాం. దేవుడున్నది గుడిలోనో, ప్రా ర్థనాలయాలలోనో, పుణ్యక్షేత్రాలలోనో కాదు అన్న విషయం తెలిసినప్పటికీ; ఆ దేవుడి పేరును చెప్పి కొంత మంది మానసిక బలహీనులను తమ అధీనంలో ఉంచుకోవటానికి, విధ్వంసానికి ప్రేరేపించటానికి కొంతమంది మేధావులు వాడుకుంటున్నారు. మనలో ఉన్న దేవుడనే మంచి గుణాలు అన్నింటిని తొక్కిపెట్టి, ఎవరో ఒక వ్యక్తిని దేవుడిని చేసి ఆ మంచిని ఆచరణసాధ్యం కాని దైవ కార్యంగా చేసేశాం. దేవుడంటే వ్యక్తి కాదు - దేవుడంటే ధర్మ, గుణం, మంచి అనే విషయాన్ని గ్రహించగలగాలి. మనిషిగా మనం ఎదుగుతున్న కొద్దీ గీతలో కృష్ణుడు  చెప్పిన విషయాలను ఆకళింపు చేసుకోవాలి (లేదా ఎవరికి చెందిన/నచ్చిన గ్రంధాలలో చెప్పిన విషయాలను). అంటే మన ఆలోచనా పరిధిని, అర్థం చేసుకునే స్థాయిని విస్తృతపరచుకుంటూ ఎదగడం నేర్చుకోవాలి. చివరగా ఒక్క విషయం - దేవుడిని మాత్రమే నమ్మినవాడు భక్తుడు అవుతాడు ... కాని తనను తాను నమ్మిన వాడు మహాత్ముడవుతాడు, కనీసం అవటానికి అవకాశం ఉంది. ప్రయత్నించి చూడండి ... 

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన