చెన్నై విషాదం ... ఓ అస్తిత్వపు బలి


చెన్నై విషాదం ... అస్తిత్వపు బలి
********************************
    గత వంద సంవత్సరాలలో ఎన్నడూ ఎరుగని భీభత్సం; ఉప్పెన కంటే ఎక్కువగా వర్షం సృష్టించిన వినాశనం; దిక్కుతోచని సాధారణ ప్రజలు, నగరాన్ని వదిలి బయటకు పోవాలన్నా ఎలా పోవాలో అర్థం కాక వారు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ఇదీ భారీ వర్షాలకు అతలాకుతలమవుతున్న నేటి చెన్నై పరిస్థితి. అక్కడి దృశ్యాలు చిత్రాలలో చూస్తుంటేనే భయం వేస్తోంటే ఇక అక్కడ ఉండి కళ్ళారా చూస్తూ స్వయంగా అనుభవిస్తున్న వారి పరిస్థితి ఏంటి? సైన్యం, పోలీసులు, డిజాస్టర్ రికవరీ బృందంలతో పాటు పలు స్వచ్చంద సేవా సంస్థలు, వ్యక్తులు సాధ్యమైనంత వరకు సహాయక చర్యలు చేపడుతున్నారు. కానీ కొనసాగుతున్న వర్షంతో ఎక్కడికక్కడ నిలిచిపోయిన నీటి మట్టం రోజు రోజుకూ పెరుగుతూ పరిస్థితిని మరింత దిగాజారుస్తోంది. చెన్నై పరిస్థితికి చలించిన పలువురు తమకు తోచిన రీతిలో స్పందిస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న దాని గురించి పెద్దగా వివరించనక్కరలేదు. అలానే అక్కడ జరిగినట్టు ఇక్కడ జరగలేదు, మనం ప్రస్తుతానికి భద్రంగానే ఉన్నాం అని సంతోషపడటం కంటే అక్కడ ఎందుకు అలా జరిగింది అన్నది అత్యంత ముఖ్యంగా గమనించాల్సిన విషయం.
    ఇవ్వాళే ఒక పత్రికలో చదివాను 'భారీ వర్షాల కారణంగా వస్తోన్న నీరు భూమి లోపలకి ఇంకిపోయే మార్గం లేకపోవడంతో అలానే నిలువ ఉంటోంది. దానికి ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాల కారణంగా మరింత నీరు వచ్చి చేరి, నీటి మట్టం పెరిగి నగరాన్ని ముంచేస్తోంది' అని. ఒక్క చెన్నై అని కాదు దాదాపు ఏ నగరం తీసుకున్నా కూడా వలస వస్తోన్న జనాభా నానాటికీ పెరిగిపోతోంది. దానికి తోడు కనీస సదుపాయాల ఏర్పాటులో పాలకుల నిర్లక్ష్యం విపరీత పరిస్థితులకు దారి తీస్తున్నాయి. ఏ నగరమైనా తీసుకోండి హైదరాబాద్, విశాఖ, ముంబై ... వర్షం వచ్చిందంటే ఏమి జరుగుతుందో అని బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఉంది. సరియైన డ్రైనేజీ సదుపాయాలూ ఉండవు. ఉన్న చెరువులను ఆక్రమించుకుని అపార్ట్మెంట్ లు, వ్యాపార సముదాయాలు నిర్మించేస్తున్నారు. సహజంగా నీరు నేలలోకి ఇంకిపోయి భూగర్భజలవనరుగా మారే అవకాశం ఉన్న ప్రతి ఒక్క దారినీ మూసేస్తూ అటు భవిష్యత్తులో నీటికి ముప్పును సృష్టించుకుంటూ ఇటు వర్తమానాన్ని కూడా ప్రమాదంలోకి జారవిడుచుకుంటున్నారు.
    ఇటువంటి సంఘటనలు సంభవించిన ప్రతిసారి ప్రభుత్వాల స్పందన దాదాపుగా ఒకే రకంగా ఉంటోంది. 'సకాలంలో స్పందించి సహాయక చర్యలు చేపట్టాం', 'బాధితులను ఆదుకుంటాం', '... కోట్లు సహాయక నిధులు విడుదల చేసాం', 'భవిష్యత్తులో ఇటువంటి తుఫానులను గుర్తించటానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తాం' ఇలా. వర్షం రాకడను, ఉప్పెన ముంచుకురావడాన్ని. ప్రకృతి భీభత్సాన్ని మనం ఆపలేకపొవచ్చు; ముందుగా గమనించటం కాస్త కష్టం కావచ్చు. ప్రకృతి వైపరీత్యానికి కూడా పాలకులను తప్పు పడితే ఎలా అంటారేమో ఆ పాలకుల అడుగులకు మడుగులోత్తే భక్తులు. కానీ, ఆ పాలకులు ఇటువంటి ప్రకృతి భీభత్సం వల్ల జరిగే నష్టాన్ని తగ్గించటానికి ఏమి చర్యలు తీసుకుంటున్నారు అన్నది అత్యంత ముఖ్యమైన విషయం. అడవులు నిర్మూలిస్తూ, చెట్లను కొట్టివేస్తూ ప్రకృతి సమతౌల్యత దెబ్బ తీస్తున్నారు. నగరాల విస్తరణ పేరుతో, అభివృద్ది అనే నెపంతో పంటపొలాలను రియల్ ఎస్టేట్ వ్యాపారుల బారిన పడేసి ఆహార ధాన్యాల కొరతను, అడవులను కొట్టివేస్తూ వర్షాభావ పరిస్థితులను కొని తెచ్చుకుంటున్నారు. బి.బి.సి. వారి నివేదిక/వార్త ప్రకారం ప్రతిపాదిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం దాదాపు కొతిగి పైగా వృక్షాలను నరికివేయబోతున్నారు అని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. అది తప్పు అని ఎవరు చెప్పినా వెంటనే అవతలి వారిని ప్రతిపక్షంగా ముద్ర వేస్తె చాలు (ఇది అమరావతికి సంబంధించి అధికార పక్షం ధోరణి మాత్రమే కాదు, అన్ని ప్రాంతాలకు ప్రభుత్వాలకు సంబంధించినది) అనే విధంగానే పాలకులు వ్యవహరిస్తున్నారు తప్ప ఇప్పటికే జరిగిన నష్టనివారణకు సంబంధించి చర్యలు తీసుకోవట్లేదు.
    అడవుల నరికివేత, పంట పొలాలను ప్లాట్లుగా మార్చడం, అడ్డగోలుగా నదీతీరాలలో ఇసుక తీసివేత, సరియైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు లేకపోవటం (పట్టణాలలో) వంటి పలు చర్యలు ప్రకృతి సమతౌల్యతను దెబ్బ తీస్తూ మనిషి మనుగడకు పెను ముప్పుగా మారుతున్నాయి. పారిశ్రామీకీకరణకు అనువుగా కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోయి ఆగిపోయిన 'భూ సేకరణ' బిల్లు వల్ల జరగబోయే అనర్థం మరింత అధికం. ఇప్పటికే జరిగిన నష్టాన్ని అది రెట్టింపు చేయటానికి ఎంతో సమయం పట్టదు. ఎవరన్నా ఇలాంటి విషయాలు మాట్లాడితే 'ఎన్నడూ వ్యవసాయం చేయనివాడు వ్యవసాయ భూములు పోతున్నాయని కన్నీరు కార్చడమేంటి?' అంటూ ప్రస్తుత ప్రభుత్వాధినేత నచ్చకపోబట్టే అలా అంటున్నారు అనో లేకపోతే ప్రతిపక్షాల భావజాలానికి చెందినవాడిగానో వెంటనే ముద్ర పడిపోతుంది. జరుగుతున్న అస్తిత్వపు బలి కళ్ళకు గంతలు కట్టుకున్న ఈ మేధావులకు ఎవరు వివరించగలరు. ఇవాళ చెన్నై, రేపు మరింకో నగరం - ఇలా పూర్తిగా నాశనమయ్యేవరకు మేలుకోరా? ఇంకెన్నాళ్ళు ఇలా?

ఏదో సాధిద్దామనే ఆత్రంలో
పంచభూతాలని, ప్రకృతిని మరచిన
ఆధునిక ఆదిమ మానవుడు
ఆస్థిత్వాన్ని బలి ఇచ్చుకుంటున్నాడు

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన