గాలి మేడలు (ఓ చిన్న కథలాంటిది ☺)

వంశీ కలుగోట్ల //గాలి మేడలు (ఓ చిన్న కథలాంటిది ☺) //
***************************************************
     ఈ మధ్యన పోతురాజుకు మనసు ఏమీ బావుండట్లేదు, అంతా ఏదోలా ఉంటోంది. అలవాటైపోయిన ప్రాణానికి నాటకం వేయక చాలా రోజులయ్యేసరికి సిరాకు దొబ్బుతోంది. అలాగని ఏదో ఒకటిలే అని ఏది పడితే ఆ నాటకం ఒప్పెసుకునే తత్త్వం కాదాయె పోతురాజుది. నచ్చకపోతే చివరకి దేవుడు చెప్పినా వినే రకం కాదు, మహా మొండి రకం. సరే, సొంతంగా రాసుకుందామా అంటే మనసు కుదురుగా ఉండట్లేదు. అందుకే ముందు మనసును అదుపులోకి తెచ్చుకోవడానికి ధ్యానం మొదలెట్టాడు. పోతురాజు ధ్యానం మొదలెట్టాడు అంటే, అప్పుడు పోతురాజును కదిలించే దమ్ము ఒక్క సాంబడికి తప్ప మరెవరికీ లేదని అందరూ అనుకుంటారు.
     ఆ రోజు సాంబడికి మహా ఉత్సాహంగా ఉంది. కారణం ఏంటంటే పొద్దున్నే సాంబడికి సారా చుక్క కూడా పడకుండానే బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. సాంబడికి తనవారంటూ ఎవరూ లేరు. మంచైనా, చెడైనా పంచుకునేది ఒక్క పోతురాజే. అందుకే వెంటనే పోతురాజు దగ్గరకు బయల్దేరాడు ...
సాంబడు: "సామీ ఎట్టున్నావ్ సామీ! ఈ మద్దెన మరీ నల్లపూస లెక్క అయిపోతివి, అసలు జనాలకి కనబడటమే మానేస్తివి. ఏంది సామీ ఇసయం ..." అంటూ సాంబడు పోతురాజును పలకరించేసరికి అంతవరకూ ధ్యానముద్రలో ఉన్న పోతురాజు కళ్ళు తెరిచాడు.
పోతురాజు: "అదేమీ లేదురా సాంబడు, కొత్త నాటకానికి కథ రాసుకుంటున్నాను. అదీ కాక ఈ మధ్యన ఆ నడుము నొప్పి మళ్ళీ తిరగబెట్టింది."
సాంబడు: "అదీ సంగతి అన్నమాట. ఆ యెదవలకి నేను సెప్తే ఇంటారా? ఏదో కారణం లేకుండా సామి అట్టా బయటకి రాకుండా ఉండడు అని నేను సెప్పినా. అక్కడికీ నేను సెప్పినా సామీ నువ్వు జనాల్లోకి రావాలనుకుంటే గడ్డం పెంచుకుంటావు, సామి గడ్డం తీసేస్తాన్నాడంటే జనాల్లోకి ఇప్పుడే రాడు అని."
పోతురాజు: "నువ్వు అర్థం చేసుకున్నట్టు అందరూ అర్థం చేసుకోరురా సాంబడు. అయినా ఏమిరా సాంబడు ఇలా చెప్పా పెట్టకుండా ఊడి పడ్డావు? ఏదో విశేషం లేకుండా రావు కదా, అదేదో చెప్పు" అంటూ సాంబడి రాకకి కారణాన్ని పోతురాజు అడిగాడు.
సాంబడు: "ఆ! ఏమీ లేదు సామీ ... సారా కొట్టు కాడ పడి సిరాకు దొబ్బుతాంది, అందుకే నేను ఇల్లు కట్టుకుందామనుకుంటున్నాను."
ఆశ్చర్యపోవడం పోతురాజు వంతైంది "అరె వో సాంబా, మంచి వార్త చెప్పావురా. ఇన్నాళ్ళకి నీకు కనీసం ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన అయినా వచ్చింది. మంచిది, ఏమన్నా సాయం కావాలంటే అడుగురోయ్ ఎట్టాగూ నువ్వు చిల్లిగవ్వ కూడా దగ్గర పెట్టుకోవు కదా, ఎప్పుడొచ్చింది అప్పుడు తాగటానికో, దానధర్మాలకో వాడేస్తావు." అంటూ సాంబడికి తనవంతు సహాయం చెయ్యటానికి ముందుకొచ్చాడు పోతురాజు.
సాంబడు: "అబ్బే అసలక్కర్లేదు సామీ. అదేందదీ ... ఆ స్వచ్చందంగా నువ్వు ఏదన్నా సేత్తానంటే వాకే కాని మనం సిల్లిగవ్వ కర్సు పెట్టాల్సిన పనిలేకుండా ఇల్లు కట్టేసే అలోసన సేసినా సామీ"
పోతురాజు: "ఏంటిరా పైసా ఖర్చు పెట్టకుండా ఇల్లు కట్టే ఆలోచన చేశావా! అంటే ఏంటీ, ఆ సారా కొట్టు పక్కనే తాటాకులతో కొట్టం వేసుకుంటున్నావా?"
సాంబడు: "ఏందీ సామీ అట్టా అంటన్నావ్. సాంబడి ఇల్లంటే అసామాసీగా ఉండదు. పదంతస్తుల భవనం, ఒక్కో అంతస్తులో పది గదులు, ప్రతి గదికి ఎసి, అదేందదీ ఈత గోట్టనీకి పెట్టుకుంటారే అదీ - ఇట్టా ప్రతి ఒక్కటి ఉంటాయి అందులో సామీ. అంతే కాదు సామీ, ఇంటికి ఈ పక్క ఆ పక్క ముందూ ఎనకా పెద్ద తోట కూడా ఉంటాది. ఇంకా ఇంటి సుట్టూతా కరెంట్ వైర్లతో పెడతారే అదేందో అది కూడా ... మన ఇల్లంటే ఊరు మాత్రమే కాదు సామీ దేశం మొత్తం మాట్టాడుకోవాల."
పోతురాజు: "ఒరేయ్ సాంబడు నీకు చిన్న మెదడేమన్నా చితికిపోయిందా లేక కల గంటున్నావా? అంత పెద్ద భవంతి నువ్వు కట్టిస్తావా అది కూడా పైసా చేతిలో లేకుండా? నీకేదో పిచ్చి పట్టిందిరోయ్ ..."
సాంబడు: "అదేం లేదు సామీ! ఇవరంగా సెప్తా ఇనుకో. ఇప్పుడూ సారా కొట్టుకాడికోచ్చే నా దోస్తులున్నారు గదా నల్లిగాడు, పుల్లిగాడు, రాజిగాడు, ఎల్లిగాడు, రాంబంటు, మద్దిలేటి - ఆల్లందరికీ మన పెద్ద రెడ్డి ఇంటికి కోత ఏటు దూరంలో ఓ అయిదు ఎకరాల స్థలం ఉంది. అందులో ఇల్లు గడదామని అందరం కలిసి అనుకున్నాం."
పోతురాజు: "సరి సరి, వాళ్ళను నమ్ముకుని మొదలెట్టావా? ఒక్కడి దగ్గరా దమ్మిడీ లేదు గాని పదంతస్తుల భవనం కడతారట."
సాంబడు: "అది కాదు సామీ, మా దూరబ్బందువు ఒకడు హైదరాబాద్ ల గౌండ గ పని జేస్తన్నాడు. వాడో మాట సెప్పినాడు. వాళ్ళ సావుకారి మా పెతిపాదనకు సై అన్నాడట. అంటే ఏం లేదు సామీ. మేము స్థలం ఇస్తాం. అందులో వాడు పదన్తస్తుల బవనం కడతాడు. అది కట్టినందుకు గాను మొత్తం ఇంటి మీద వాడికి ఓ ఇరవై అయిదు సంవత్సరాలు అదేందదీ ఆ ఏందో లీజో బూజో ఏదో అన్నాడు అది వాడికి హక్కు ఉంటాది సామీ. ఆ తరువాత మొత్తం మనదే. మనూరు మొత్తం గర్వంగా సేప్పుకున్నే లెక్క ఉంటాది, ఓ లెక్కన రాజమహల్ అనుకో సామీ. అప్పుడు నేనే రాజు సామీ, ఆ ఇల్లు పూర్తయ్యిందా ఇగ పెద్దరెడ్డి దుకాణం మూసుకోవాల్సిందే, నేను నా తరువాత నా పిల్లలు ఆల్ల పిల్లలు ఇట్టా ఇగ సర్పంచ్ గిరీ మా ఇంటిలోనే ఉండిపోతాది."
పోతురాజు: "ఏందిరా అంతా అరచేతిలో స్వర్గం చూపిస్తా ఉన్నావు? అనుకోవడానికి, సినిమాల్లో సూపించుకోవటానికి, కథల్లో రాసుకోవటానికి బావుంటాయి ఇటువంటివి. నువ్వేందిరా నాకు ఇలా చెబుతున్నావు - నువ్వు పిచ్చోడివా లేక నన్ను పిచ్చోడిననుకుంటున్నావా? గాల్లో మేడలు కడుతున్నావురా సాంబడు."
సాంబడు: "అంతేలే సామీ, మేము సెపితే ఎందుకు నమ్ముతారు? ఎవరో సేప్పెటోల్లు సెపితే నమ్ముతారు కానీ. లేకపోతె ఏదో ఒకటో రెండో పేపర్లోల్లు రాస్తే నమ్ముతారు. మా మాటలెందుకు నమ్ముతారు. ఆయనెవరు ఆ త్రివిక్రమ్ సెప్పినట్టు జనాలకు మాజిక్కులే కావాలి, లాజిక్కులు కాదు. నేను సెప్పినాను కాబట్టి లాజిక్కులు అడుగుతా ఉన్నావు గాని సామీ, ఇంకెవరో ఆయన సెప్తే సంకలు గుద్దుకుని సై అంటివే. అంతేలే నాలెక్కటోల్లు అంటే లోకువ నీకు. ఇట్టా కాదులే తొందర్లోనే శంకుస్థాపన పెట్టి, అది నీతోనే సెయిస్త, అప్పుడు కానీ తెలిసి రాదు నీకు సాంబడి సత్తా ఏందో." అంటూ సాంబడు సారా కొట్టు వైపు నడక మొదలెట్టాడు.
పోతురాజు: "ఒరేయ్ సాంబో, కోప్పడితే పడినావు గానీ కాస్త తాగడం మానుకోరా. అసలే ఈ మధ్యన కల్తీ సారా ఎక్కువైనాదట ... జాగర్తరోయ్"
--- ఇంకేముంది సాంబడి కథ సారా కొట్టుకు, మనం మన ఇంటికి.

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన