... చివరి పేజీ


వంశీ కలుగోట్ల// ... చివరి పేజీ//
***************************

"నుదుటినుండి స్వేదం చిందకుండా చేసేపనికి విలువ లేదు. భారతీయ మేధ ఏ ఒక్కరికీ తీసిపోదు. కానీ, మనకు ధైర్యం పాళ్ళు తక్కువ. దేశంలో యువతకు కావలసింది అపజయాన్ని చవిచూస్తామన్న భయాన్ని శాశ్వతంగా నిర్మూలించటం. విజయాభిలాషను పెంపొందించుకోవటం" - సి.వి. రామన్ 
*                *                 *
      అతని పేరు 'కె'. ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. ఆర్థికంగా కుటుంబ పరిస్థితి అంతంతమాత్రం. ఆ వయసులో తను పేపర్ బాయ్ గా పనిచేస్తూ, వచ్చిన డబ్బుతో చదువును కొనసాగించాడు. ఆ పేపర్స్ లో వచ్చే విమానాల బొమ్మలను చూసి తనూ విమానాలను నడిపే పైలట్ గానో, లేదా సంబంధిత శాఖలో ఏదో ఒక ఉద్యోగమో సంపాదించాలనుకున్నాడు. అప్పుడు అతని వద్దనున్న ఆయుధాలు ఆత్మ విశ్వాసం, కష్టించే గుణం, పట్టుదల అంతే. తన లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించాడు. తన లక్ష్యసాధనలో ఆతను ఎంత ఎత్తుకు ఎదిగాడో అతనికి తెలుసో లేదో తెలియదు కానీ - నేడు అతడిని, అతడందించిన స్ఫూర్తిని గుండెల నిండా నింపుకున్న ఈ దేశం మొత్తానికి తెలుసు. అతడి పేరు 'అబ్దుల్ కలాం'. అతని కలల సాధనకు పెట్టుబడి 'నమ్మకం'. తాను సాధించగలనని నమ్మాడు, సాధించి చూపాడు. 'అతడు వచ్చాడు, చూసాడు, గెలిచాడు మనుషులని మరియు మనసులని'. అతడు పాటించిన మంత్రం, అందించిన సందేశం - 'కలలు కనండి. ఆ కలలు సాకారం చేసుకోవటానికి కృషి చేయండి.'
*                *                 *
     అతని పేరు 'వి'. కొండ/గిరిజన ప్రాంతాలకు చెందినవాడు. అల్లరి చిల్లరగా తిరిగేవాడు. దొరికిన పని చేసుకుంటూ రోజులు గడిపేస్తున్న అతడిని కాలం అటు తిప్పి, ఇటు తిప్పి చందనం అక్రమ రవాణా చేసే నేరస్థుల సమూహానికి దగ్గర చేసింది. తగిలిన ఎదురు దెబ్బలు కాసిని పెంచాయి. అడుగు పెట్టిన నేర సామ్రాజ్యం అవకాశాలు అందించింది. చిల్లిగవ్వ చేతిలో లేని అతని దగ్గర ఆరోజు ఉన్న ఆయుధాలు చావును కూడా ఎదిరించే మొండి ధైర్యం, తెగువ, ఏదైనా చేయగలనన్న నమ్మకం, విశ్వాసం. అంతే, అతను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఎంచుకున్న రంగంలో తిరుగులేని స్థాయికి చేరాడు. రెండు రాష్ట్రాలను గడగడలాడించిన అతని పేరు తెలీని వారు ఉండరు - అతడే గంధపు చెక్కల స్మగ్లర్ 'వీరప్పన్. 
*                *                 *
     చాలామంది తాము గొప్పవారిగా అవడానికి తమ కృషి, పట్టుదల కారణాలని చెబుతుంటారు. తన కలలను సాకారం చేసుకోవడానికి అబ్దుల్ కలాం గారు ఎంత కష్టపడ్డారో, నేర సామ్రాజ్యాధినేత కావడానికి దావూద్ ఇబ్రహీం కూడా అంతే కష్టపడ్డాడు. టీ అమ్మిన వ్యక్తిని దేశ ప్రధాని కావడానికి ఉపకరించిన అంశాలే, కట్టెలు కొట్టిన వ్యక్తిని రెండు రాష్ట్రాలను వణికించిన గంధపు చెక్కల స్మగ్లర్ గా మార్చాయి. అయితే మరి తప్పెవరిది? కృషి, పట్టుదల, ఏకాగ్రత, నమ్మకం అనే అంశాలదా లేక వ్యక్తులదా? వారు ఎదుర్కున్న సంఘటనలదా? ఒక వ్యక్తి గొప్పవాడుగా మారడానికి ఎంత కష్టపడాలో నేరస్థుడు కావడానికి అంతకన్నా ఎక్కువగా కష్టపడాలి. ప్రపంచమంతా గొప్ప విజేతలుగా కీర్తించే మహామహులందరూ తమ విజయాలకు ఆయుధాలుగా పెర్కొనేవే, ప్రభుత్వాలు వెతుకుకుతున్న ఘరానా నేరస్థులు ఆ స్థాయికి చేరుకోవడానికి ఉపకరించాయి. 
    చాలామంది అంటూంటారు నాయకులు జనంలోంచి పుట్టుకొస్తారు అని, నాయకులే కాదు నేరస్థులు కూడా మనమున్న సమాజంలోంచే పుట్టుకొస్తారు. ఏ గొప్ప వ్యక్తి జీవిత చరిత్ర చూసినా/చదివినా చివరి పేజీకి వచ్చేసరికి సారాంశం ఒకటే - తాము కేవలం కృషి, ఏకాగ్రత, పట్టుదలల వల్ల మాత్రమే విజయం సాధించగలిగామని. అవే అంశాలు ఒక సామాన్య వ్యక్తి ముఠా నాయకుడిగా, నేర సామ్రాజ్యాధినేతగా రూపొందడానికి ఉపకరిస్తున్నాయి. తేడా అంతా వారి ఆలోచనా దృక్పథంలో ఉంది. ఒక్క క్షణం ప్రశాంతంగా అలోచించి ఉంటే, మొదటి నేరం చేయకపోయి ఉంటే - ఏమో వీరప్పన్ తనకున్న కష్టపడే గుణం, విశ్వాసం, పట్టుదల వంటి లక్షణాల వల్ల ఈరోజు మహాత్ముల జాబితాలో ఉండేవాడేమో ఎవరికీ తెలుసు. ఆలోచనా దృక్పథంలో ఉన్న తేడా మనిషిని అటువైపుకో, ఇటువైపుకో నెడుతుంది. ఈరోజు అంతమూ కాదు ఆరంభమూ కాదు. ఆదిమధ్యాంతరహితలమనుకునే వారికైనా, అనుభవశూన్యులకైనా, అనామకులకైనా రేపు అన్నది ఉంటుంది. వేచి చూడగలిగే ఓపిక, ఎదురుదెబ్బలు తట్టుకునే దమ్ము, శత్రువును ఎదుర్కునే ధైర్యం ఉన్నవాడిదే రేపటిరోజు. సమస్యలు వచ్చినపుడు ఎలా స్పందిస్తాడు అనే దాన్ని బట్టి ఒక వ్యక్తి మహాత్ముల జాబితాలోకో, నీచుల జాబితాలోకో చేరతాడు. మీ జీవితపు చివరి పేజీ ఎలా ఉండాలో అన్నది మీ చేతుల్లోనే ఉంది.

ఇది అనంతయాత్ర, ఇక నిదుర విడువోయి
పయనించుటే నీదు పరమాశంబోయి
పయనించు పయనించు బాట ఏది అనక
పదిమంది దారితో పనియేమి నీకోయి

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన