దేశమంటే మనుషులోయ్ ..

వంశీ కలుగోట్ల // దేశమంటే మనుషులోయ్ ...  //
*************************************************
    
దేశం లేదా సమాజం అంటే అదేమీ ఒక పదార్ధం కాదు లేదా ఎక్కడినుండో ఊడి పడేదీ కాదు. మనమంతా కలిస్తేనే సమాజం. రాష్ట్రమైనా, దేశమైనా లేక మరోటైనా మనుషులతోనే. అందుకే గురజాడగారు అన్నది 'దేశమంటే మట్టి కాదోయ్ ... దేశమంటే మనుషులోయ్' అని. ఎవరో చెప్పినట్టు ఇది ఒక అద్దం లాంటిది ... అద్దంలో నువ్వు ఎలా ఉంటావో అలా కనిపిస్తావు అలానే సమాజం లేదా ఎదుటివారితో నువ్వు ఎలా ప్రవర్తిస్తావో దాదాపుగా వారు నీతో అలానే ఉంటారు. సమానత్వం కావాలి, సమస్థాయి ఇవ్వాలి, ఇంకేదో కావాలి ... గట్రా ఇలాంటివన్నీ ఎదుటివారి నుంచి ఆశించే ముందు మనం ఇస్తున్నామా అనేది అతి ముఖ్యంగా గమనించవలసిన విషయం. అవన్నీ భౌతికమైనవి కావు ఎక్కడో అక్కడ దొరుకుతాయి అంటే వెళ్లి కొనుక్కోవడానికి, అలానే అవేమీ ఎవరో ఒకరి అధీనంలో ఉండేవి కూడా కావు పోరాడితే సాధించుకోవచ్చులే అనుకోవటానికి. ఈ సమానత్వం, సమస్థాయి గట్రా ఇలాంటి వాటి మాటున ప్రతి ఒక్కరు కోరుకునేది, ఆశించేది ఎదుటివారి నుంచి 'కనీస గౌరవం/విలువ'.
    ఈరోజుల్లో మనం ఒక వ్యక్తికి ఇచ్చే విలువ అనేది కేవలం ఆ వ్యక్తి యొక్క ఆర్ధిక స్థాయిని బట్టి ఉంటోందే తప్ప ఆ వ్యక్తి నిజంగా మంచోడా లేదా అనే దాన్ని బట్టి కాదు. అలానే సమానత్వం అనేది (అలాంటి భావనలు) ఒక గౌరవ భావమే తప్ప మరేమీ కాదు. అది ఎదుటి వ్యక్తి యొక్క సంస్కారాన్ని బట్టి ఉంటుంది. సంస్కారం అన్నది ఆ వ్యక్తి ఎదిగిన తీరును బట్టి ఉంటుంది. వ్యక్తి ఎలా ఎదిగాడు అనేది అతడి తల్లిదండ్రులు, చుట్టూ ఉన్నవారిని బట్టి ఉంటుంది. పిల్లలకు సంస్కారాన్ని ఇవ్వకుండా వాళ్ళు పెద్దవాళ్ళయి మంచి వాళ్ళుగా ఉండాలంటే ఎలా ఉంటారు? వారికి సంస్కారం ఇవ్వటం అన్నది మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. మన ప్రతి చర్య వారికి ఒక దృశ్య రూప పాఠం లాంటిది. వారి మనసుమీద ఒక ముద్ర వేస్తుంది. జాన్ లెన్నన్ రాసిన ఆంగ్ల కవిత ఒకటి ఉంది 'లిటిల్ అయిస్ అపాన్ యు' అని. అందులో చెబుతాడు '... నీలాగే ఎదగాలనుకునే ఆ చిన్నారికి నువ్వొక ఆదర్శం' అని. ఒక పురుషుడు స్త్రీని ఎలా చూస్తున్నాడు, డబ్బున్నవాడు డబ్బులేనివాడిని ఎలా చూస్తున్నాడు, పెద్దవాళ్ళతో ఎలా వ్యవహరిస్తున్నారు, ఆహార వ్యవహారాల తీరు ఏమిటి, ఎలా ప్రవర్తిస్తున్నారు - ఇలా పెద్దవారు చేసేవన్నీ పిల్లల మనసుపై ఒక ముద్ర వేస్తాయి. ఆ ముద్ర ఒక మనిషిని తయారు చేస్తుంది. ఆ మనిషి తనకు తెలీకుండానే దాదాపుగా అలానే ప్రవర్తిస్తాడు. అలా కాకుండా వేరేగా ప్రవర్తించాడు అంటే అతడిపై వేరే ఏదన్నా పుస్తకమో, వేరే గొప్ప వ్యక్తియో - ఇలా ఏదన్నా ప్రభావం చూపి ఉండాలి. లేదా మరెవరైనా మేధావి తన బోధనలతో ప్రభావితం చేసి ఉండాలి. గత కాలంలో ఈ పని గురువులు చేసేవారు. ఇప్పుడు మేధావులుగా ముద్ర పడిన వారు చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు. కాకపొతే, గతకాలంలో (గతానికి గతం - ఒకరకంగా ప్రాచీన కాలం అనుకోండి) గురువులలో చాలామంది నిష్పక్షపాతంగా ఉండేవారు. ఇప్పుడు ఆ శాతం తిరగబడింది.
     ఉదాహరణకు సమానత్వం సాధించటమంటే ఇంతవరకూ అణచివేతకు గురైన వర్గం, ఇప్పుడు రెండో వర్గాన్ని అణచివేయటం కాదు. అలా అయితే అది సమానత్వం సాధించడం ఎలా అవుతుంది. ఈ చిన్నపాటి తేడా తెలుసుకోలేని మేధావిత్వపు ముద్ర వేసుకున్నవారు రెండో వర్గాన్ని అణగదొక్కి మొదటివర్గాన్ని పైకి తెస్తే సమానత్వం సాధించొచ్చు అంటూ బోధిస్తున్నారు. అవి విద్వేషాలకు దారి తీస్తున్నాయి కాని లక్ష్యం దిశగా నడిపించట్లేదు. ముందే చెప్పినట్టు సమానత్వం అనేది కేవలం ఒక మానసిక లక్షణమే తప్ప భౌతికమైన అంశమే కాదు. ఆ విషయం తెలిసినప్పటికీ లేదా అనుభవంలోకి వచ్చినప్పటికీ ఈ మేధావులు దాన్ని విశదీకరించరు, తెలుపరు.  ఎందుకంటే వేరే రకంగా చెబితే వెనక ఉండే జనాలెవరూ వినరు, ఇంకో మేధావిని వెతుక్కుంటారు. అసలు ఈ మేధావిత్వంతో ఉన్న సమస్యే ఇది. ఒకసారి మేధావి అని ముద్ర పడిందే అనుకోండి అంతే ఇక ఖేల్ ఖతమ్. ఒకవేళ ఏదైనా విషయంలో నిజమేదో తెలిసినా వెనకుండే జనాలకు అది నచ్చదు అంటే దానికి వ్యతిరేకంగా పోరాడాల్సిందే లేకపోతే మేదావిత్వపు ముద్ర పోతుంది, ఒకసారి అది పోయిందా ఇక దుకాణం మూసేసుకోవాల్సిందే.
     మనం ఎదుటివారి నుండి ఆశించేది మనం ఎదుటివారికి ఇవ్వగలిగే స్థాయికి ఎదగగలిగిన నాడు ఈ సమానత్వం, సమస్థాయి గట్రా (దాంతో పాటు మిగతా భావనలు కూడా) గోడవే ఉండదు. అలానే మనం ఎలా ఉంటామో మన పిల్లలు అలానే తయారవ్వటానికి అవకాశం ఉందనే విషయాన్ని గ్రహించగలిగితే సమస్యకి మూలాన్ని దొరికించుకున్నట్టే, సరిదిద్దుకోగలిగితే సమస్య నిర్మూలనకు అడుగు వేసినట్టే. ప్రయత్నించండి ముందుగా మిమ్మల్ని మీరు సంస్కరించుకోవటానికి - ఒకరొకరుగా మనం సంస్కరించుకుంటే సమాజం దానంతట అదే సంస్కరింపబడుతుంది. గురజాడ గారు చెప్పినట్టు 'దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్'.    
--- ఎలాగూ  సందర్భం వచ్చింది, సందర్భానికి తగ్గట్టుగా కూడా ఉంటుంది కాబట్టి జాన్ లెన్నన్ 'లిటిల్ అయిస్ అపాన్ యు' కు నా తెలుగు స్వేచ్చానువాదం చదవండి.
చిన్నారి లోకం ...  
అమాయకమైన ఆ కళ్ళు   
నిర్మలమైన ఆ చిరునవ్వు   
ఆ చిన్నారి చెవులు   
నీ ప్రతిమాటను వేదంలా స్వీకరిస్తాయి 

తన కలల ప్రపంచంలో   
ఆ చిన్నారికి   
నువ్వే ఒక ఆదర్శం   
నువ్వే సర్వస్వం 

ఆ చిన్నారికి ...   
నీ గురించి   
అనుమానాలుండవు   
అపోహలుండవు 
ప్రతిదీ నీలాగే చెయ్యాలని తపన   
నీ మెప్పు పొందాలని చిన్న కోరిక 

పగలు   
రాత్రి   
ప్రతి నిమిషం   
ఆ కళ్ళు 
నిన్ను వెంటాడుతుంటాయి   
నీ ప్రతిచర్యను గమనిస్తుంటాయి 
  
గుర్తుంచుకో ...   
నీలాగా ఎదగాలనుకునే   
ఆ చిన్నారికి ... 
నువ్వొక ఆదర్శం

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన