అన్వేషణకు అన్నీ అందుతాయి ...

అన్వేషణకు అన్నీ అందుతాయి ... 
*********************************
కంటికి కనిపించేదంతా నిజం కాదు. మన ముందే మనిషి ఉంటాడు, కంటికి కనిపిస్తూ ఉంటాడు, కానీ అర్థం కాడు! అతని గుణగణాలు, మనసు కోసం లోతుగా చూడాలి, అన్వేషించాలి, పరిశీలించాలి. అర్థం అవుతాడా? కాడు. అన్వేషణకు అన్నీ అందుతాయి ... ఒక్క తాను తప్ప. (దాశరథి రంగాచార్య)

    "లోకంలో అత్యంత విచిత్రమైన విషయమేది?" అని యక్షుడు ధర్మరాజును ప్రశ్నిస్తే, "ప్రతిదినమూ జనులు మన చుట్టూ మరణిస్తూనే ఉన్నారు. కానీ, తాము మరణించమని మిగిలిన వాళ్ళు అనుకుంటూ ఉంటారు" అని బదులిచ్చాడట. దీన్నే 'మాయ' అంటారు. ఈ మాయే మనుష్యులని అనేక రకాల ఆకర్షణల వైపు పరుగులు తీయిస్తుంది. కళ్ళముందే ఉన్నా కూడా వాస్తవాన్ని అర్థం చేసుకోలేనంతగా కళ్ళకు పొరలు కప్పేస్తుంది. ఈ మాయను వదిలించుకుని వాస్తవాన్ని గ్రహించగలిగిన వారు మహాత్ములయ్యారు, మాయలో పడి కొట్టుకున్నవారు 'గానుగెద్దు'లా అలానే తిరుగుతూనే ఉన్నారు.
     ఆధునికత పేరుతో యాంత్రిక జీవనం గడుపుతూ ప్రేమలను, అనుబంధాలను, ఆప్యాయతలను ... చివరకు మనల్ని మనమే కోల్పోతున్నాం. డబ్బు, ఆస్తులు ఇలా ఇంకేవో వాటి చుట్టూ తిరుగుతూ కోల్పోయిన మనల్ని మనం కాని వాటిలో వెతుక్కుంటున్నాం. విషాదం అంటే నీకోసం ఎవరూ లేకపోవడం కాదు, నీకు నువ్వే లేకపోవడం. ఇప్పుడు అలాంటి విషాద పరిస్థితినే ఆధునిక మానవుడు ఎదుర్కొంటున్నాడు. వినోదం అందించటానికి, మరిపించటానికి కావలసినవన్నీ ఉన్నాయి, సాంకేతికత అందించిన సౌలభ్యాలు చాలా ఉన్నాయి. కానీ ఏదో తెలియని వెలితి. తినే తిండి దగ్గరనుంచి ప్రతీ దాంట్లో ఏదో అసహజత్వం. పచ్చదనం కావాలంటే ప్లాస్టిక్ చెట్లు పెట్టుకోవాల్సినట్టుంది. ఒక్కొక్కటిగా అన్నీ కోల్పోతున్న మనిషి అస్థిత్వాన్ని ప్రశ్నార్థకం చేసుకుంటున్నాడు.
     అన్వేషణ మనిషిని అణువునుంచి ఆకాశం దాకా ఎదిగేలా చేసింది. ఆశ అదే మనిషిని ఆకాశం నుంచి అస్థిత్వం కోల్పోయే ప్రమాదపు అంచుల దాకా తీసుకొచ్చింది. ఇప్పుడు మనిషి తనను తాను వెతుక్కోవాలి ... పోయిన మనిషితనాన్ని, మానవత్వాన్ని తిరిగిపొందాలి. అన్వేషించుకుంటే అది అసాధ్యమేమీ కాదు. ఇప్పుడు కావలసింది బాహ్యాన్వేషణ కాదు, అంతర్ అన్వేషణ.
అన్వేషిస్తేనే దొరికేది - మరిచిపోయిన మనిషితనమైనా, కనిపించని దైవత్వమైనా. ఎప్పుడో జీవితంలో అన్నీ ముగిసాక చేసేది కాదు అన్వేషణ అంటే. దీనికి సందర్భోచితంగా ఉండే ఒక చిన్న ఉదాహరణ్ చెపుతాను - రామ-రావణ యుద్ధం ముగిసాక అంటే అదే రావణ సంహారం ముగిసాక ఇక రావణుడు చివరి దశలో ఉన్నప్పుడు, రాముడు లక్షనుడిని పిలిచి ఇలా అన్నాడట "లక్షణా! రావణుడి వంటి రాజ నీతిజ్ఞుడు లేడు. అతని రాజ నీతిజ్ఞత, మేధో సంపద అసామాన్యం. నీవు వెళ్లి రావణుడి దగ్గర నుండి విషయాలను గ్రహించుకో". అన్న ఆదేశం ప్రకారం రావణుడి దగ్గరికి వెళ్ళినప్పటికీ లక్షణుడు రావణుడి తల వైపు నిలబడి (ఈ నీచుడి పాదాల వైపు వెళ్ళడమా అన్న అహంభావంతో) రావణుడిని ప్రశ్నించాడట. ముందుగా తనకు కనిపించేలా రమ్మని పిలిచినా రావణుడు, పిదప లక్షణుడి ప్రశ్నకు నవ్వి -"స్వర్గానికి నిచ్చెనలు వేయగలను, ఎన్నో మంచి పనులు చేయగలను. కానీ, వాయిదా వేశాను, చివరకు ఇలా వెళ్లిపోతున్నాను. నా నుంచి నువ్వు నేర్చుకోవలసింది ఇదే ... " అని సమాధానమిచ్చాడట. అదే విధంగా మనం చేయగలిగిన మంచిని/అంతర్ అన్వేషణను వాయిదా వేస్తూ ఉంటే ఇక ఏమీ చేయలేనప్పుడు చివరి దశలో రావణాసురుడిలాగా 'అప్పుడు చెయ్యలేకపోయామే' అని దిగులు చెందడం తప్ప చేసేదేమీ ఉండదు. వాయిదా వేస్తారో, ప్రారభిస్తారో - ఎవరిష్టం వారిది. మొదటే చెప్పుకున్నట్టు మాయను వదిలించుకుని అన్వేషించుకుంటారో లేక గానుగెద్దులా అలానే తిరుగుతూ ఉంటారో ...

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన