నోటాకు వోట్ వేయాలనుకునే ముందు ...

వంశీ వ్యూ పాయింట్  // నోటాకు వోట్ వేయాలనుకునే ముందు ... //
********************************************************************
            ప్రస్తుత రాజకీయ పార్టీలు, అభ్యర్థుల తీరుతో విసిగిపోయినవారికి; అలాగే సరైన లేదా బలమైన స్వతంత్ర అభ్యర్థి లేనివారికి 'నోటా' ఒక సదావకాశంగా కనబడవచ్చు ... కానీ, 'నోటా'కి వోట్ వెయ్యడం ద్వారా ప్రస్తుత రాజకీయాలను తిరస్కరించామని బలంగా చెప్పగలిగాం అని తృప్తి పడవచ్చనుకునే అల్పసంతోషులకు, అసలు నోటా కి వోట్ వెయ్యడం వలన ఏం జరుగుతుందో అవగాహన ఉందా అన్నది ప్రధానమైన ప్రశ్న. 
            నోటా విధి విధానాలు సరియైన రీతిలో లేనంతవరకూ అది ఒక అనవసర ఖర్చు కాగల అంశంగా మిగిలిపోగలదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఒకవేళ ఏదైనా ఒక నియోజకవర్గంలో నోటా అధికంగా వచ్చి, మళ్ళీ ఎన్నికలు పెట్టాల్సి వచ్చిన పరిస్థితుల్లో ఏమి చేస్తారు? నోటా అధికంగా వచ్చాయి అంటే అక్కడ అన్ని పార్టీలను నిరాకరించారని కదా. 

-> మరి తదుపరి జరుపబోయే ఎన్నికలలో ఆయా పార్టీల తరఫున అభ్యర్థులు పోటీ చెయ్యకుండా నిబంధనలు విధించగలరా?
-> తిరస్కరించబడిన ప్రధాన పార్టీల అభ్యాతులు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చెయ్యకుండా చూడగలరా? 
-> ఉపఎన్నికలలో గెలిచిన కొత్త పార్టీ లేదా స్వతంత్ర అభ్యర్థి, వారి సభ్యత్వం ముగిసేవరకూ ఏదైనా ఒక రాజకీయ పార్టీలో చేరడమో లేక మద్దతివ్వడమో చెయ్యకుండా ఉండేలా నిబంధన చెయ్యగలరా? 
-> తిరస్కరించబడిన అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యలు పోటీ చెయ్యకుండా ఉండేలా (కనీసం ఉపఎన్నికల్లో) నిబంధనలు విధించగలరా? 

            ఇలా నోటాకు సంబంధించి చాలా అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయి. అటువంటి సరియైన విధివిధానాలు లేకుండా ఊరికే నోటా అంటే మళ్ళీ ఎన్నికల ఖర్చు భారం తప్పించి మరేమీ కాదు ... నోటాకు వేసేందుకు కాదు, వెయ్యాలనుకుందుకు ఆలోచించండి. ఎందుకంటే, మీరు నోటా కు వోట్ వేస్తున్నారు అంటే, అనవసరంగా మళ్ళీ ప్రభుత్వం నెత్తిన ఉప ఎన్నిక ఖర్చు భారాన్ని మోపబోతున్నారు అని అర్థం. సరైన విధివిధానాలు లేకుండా నోటా వంటి అత్యంత శక్తివంతమైన మార్గాలు నిరుపయోగం కాగలవు. కాబట్టి, ప్రస్తుత పరిస్థితుల్లో, నోటా కంటే ఏదొక రాజకీయ పక్షానికి వోట్ వెయ్యడమే మంచిదేమోనన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. వోట్ శక్తిమంతమైనది - దాన్ని ఉపయోగించుకోండి, నిరుపయోగం చెయ్యవద్దు, నిర్లక్ష్యం చెయ్యవద్దు. 

Comments

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన