... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - భాజపా మరియు ఇతరులు

వంశీ వ్యూ పాయింట్ // ... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - భాజపా మరియు ఇతరులు //
**************************************************************************************
            రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో రాజకీయ పార్టీల అవకాశాల గురించి నేను రాస్తున్న నా వ్యూ పాయింట్ వ్యాసాలలో ఇది నాలుగవది. ఇంతకుముందు వామపక్షాలు, కాంగ్రెస్ మరియు జనసేన అవకాశాల గురించి విశ్లేషించాను. ఇందులో భాజపా మరియు ఇతరుల అవకాశాల గురించి, తరువాత తెదేపా మరియు వైకాపా అవకాశాల గురించి విశ్లేషిస్తాను. ముందుగా కేంద్రంలో  ఉండటమే కాకుండా, దేశంలోనే అతిపెద్ద పార్టీగా (పార్లమెంట్ సభ్యుల సంఖ్యాపరంగా) ఉన్న భాజపా స్థాయి దక్షిణాదిన (ఒక్క కర్ణాటకను మినహాయిస్తే) ఏమిటన్నది ప్రత్యేకించి చెప్పవలసిన పనిలేదన్నది నా అభిప్రాయం. గతంలో (సమైక్యాంధ్రలో) చెప్పుకోదగిన స్థాయిలో ఎమ్మెల్యే మరియు ఎంపీ స్థానాలున్నప్పటికీ సొంతంగా ఎదిగే ప్రయత్నం చేయకుండా, తెలుగుదేశానికి తోకలా ఉండిపోవటమన్నది భాజపా ఆంధ్రప్రదేశ్ లో చేసిన చారిత్రక తప్పిదం. దానికి కారణం వెంకయ్య నాయుడు లేదా మరొకరు కావచ్చు, కానీ ఇపుడు దాదాపు ఉనికి కోల్పోయే పరిస్థితికి వచ్చిందన్నది సత్యం. 
            గత 2014 ఎన్నికలలో తెదేపాతో కలిసి వెళ్లిన భాజపా, ఇపుడు ఒంటరిగానే ఎన్నికలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఒక సామెత చెబుతారు 'రాజకీయాల్లో హత్యలుండవు, స్వీయమరణాలే' అని - అలాగ  చూస్తే భాజపా ప్రస్తుత పరిస్థితికి కారణం భాజపా స్వీయ తప్పిదాలే. గతం గురించి ముందే చెప్పుకున్నాం కాబట్టి, 2014 తదనంతర పరిస్థితుల గురించి మాత్రమే ప్రస్తావించుకుందాం. 2014 తరువాత రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఎంతో విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ, లెక్కలు చూపకున్నా ఊరుకుంది - ఇపుడు నిధులు ఇవ్వకపోవడానికి కారణం లెక్కలు చూపకపోవడం అంటే ఎలా? నాలుగున్నరేళ్ళు చంద్రబాబును ఎంటర్టైన్ చెయ్యడం భాజపా తప్పిదమే కదా. అందునా వెంకయ్య నాయుడును ఉప రాష్ట్రపతిని చేశాక, రాష్ట్రంలో భాజపా పరిస్థితి ఏమైనా మెరుగుపడుతుందేమో అని భాజపా మద్దతుదారులు ఆశించారు. కానీ, మునుపటికంటే దిగువకు దిగజారింది. 2004 లో చంద్రబాబు గారు తాను నష్టపోవడంతో పాటు, భాజపాను కూడా పదేళ్ళపాటు కోలుకోలేని దెబ్బ తీశారు. ఇపుడూ అంతకుమించి వేరేగా జరిగే అవకాశాలు లేవు. (కానీ కేంద్రస్థాయిలో ప్రతిపక్షాల బలహీనతలవల్ల భాజపా అధికారం నిలబెట్టుకునే అవకాశాలు అధికం) ఉన్న ఒకరిద్దరు  ఇప్పటికే సర్దేసుకున్నారు.  మిగిలినవారిలో కృష్ణంరాజు మాత్రమే కంటికి ఆనుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో భాజపా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల విషయంలో ఆశలు పెట్టుకోవడం అనవసరం. ఎన్నికలయ్యాక ఎవరిని మద్దతుకోరాలి (అప్పటి పరిస్థితిని బట్టి) అన్న అంచనాలు  వేసుకుని, తమ విధానాన్ని కాస్త సవరించుకోవడం తప్పించి చేయగలిగిందేమీ లేదు. ప్రస్తుతానికి వైఎస్సార్సీపీ మరియు తెదేపాలతో సమదూరం పాటించడం తప్పించి  లేదు. ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళినా, వెళ్ళకపోయినా పెద్ద తేడా కూడా ఉండదు. అదృష్టం బాగుంటే ఒకటో, రెండో సీట్లు గెలవవచ్చు. 
            ఇక ఇతరుల విషయానికి వస్తే, వీరి పాత్ర ఈసారి కాస్త ఎక్కువగానే ఉండేట్టుంది - ప్రత్యేకించి జనసేన కాస్త గట్టి అభ్యర్థులను నిలబెట్టబోయే ప్రాంతాల్లో ఈ ఇతరులు అనబడే స్వతంత్ర అభ్యర్థుల పాత్ర ఉండవచ్చు. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం - తెదేపా అత్యంత బలహీనంగా ఉన్న స్థానాల్లో జనసేన తరఫున బలమైన అభ్యర్థులు నిలబడే అవకాశం ఉంది, ఆ ప్రాంతాల్లో లోపాయికారి ఒప్పందాల ప్రకారం తెదేపా వోట్, జనసేన వైపు మళ్ళించే అవకాశాలున్నాయి. అలా ఇష్టం లేని వారు, వైఎస్సార్సీపీకి వోట్ వెయ్యటం నచ్చనివారు - ఒకవేళ అక్కడ కాస్త బలమైన అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడితే గట్టి పోటీ ఇవ్వడంతో పాటు, గెలిచే అవకాశాలు ఉండవచ్చు. ప్రస్తుతానికి అంచనాల ప్రకారం జనసేన పోటీ ప్రధానంగా ఉభయగోదావరి జిల్లాలతో పాటు అనంతపురం మరియు చిత్తూరులలో ఉండవచ్చు. రాయలసీమలో పెద్దగా ప్రభావం చూపలేకపోయినా, ఉభయగోదావరి జిల్లాలలో స్వతంత్రులు ప్రభావం చూపవచ్చు. అలా చూస్తే స్వతంత్రులు 1 నుండి 5 స్థానాల వరకూ గెలిచే అవకాశాలు ఉన్నాయి. 

Comments

 1. 1998 లోక్సభ ఎన్నికలలో బీజేపీ ఆంధ్రాలో 13.3% ఓట్లు దక్కించుకోవడమే కాక కాకినాడ & రాజమండ్రి సీట్లు గెలిచింది. తొమ్మిది (బొబ్బిలి, విశాఖ, అనకాపల్లి, అమలాపురం, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు & హిందూపురం) సీట్లలో బీజేపీ బలపరిచిన లక్ష్మీ పార్వతి అభ్యర్థులు & రెండు (శ్రీకాకుళం & భద్రాచలం) సీట్లలో బీజేపీ బలపరిచిన లక్ష్మీ పార్వతి అభ్యర్థులు లక్ష ఓట్లు దాటారు.

  షుమారు ముప్పై లక్షల ఓట్లతో స్పష్టమయిన మూడో స్థానం (తెలంగాణాలో రెండో స్థానం) ఆక్రమించిన బీజేపీ ఏడాది తిరిగేసరికి అనూహ్యంగా బాబు ముందు దాసోహం అయిపోయి తోకపార్టీ అవతారం ఎత్తింది. వాజపేయి వేవు & కార్గిల్ యుద్ధ నేపథ్యంలో చంద్రబాబు మళ్ళీ అందలం ఎక్కాడు. ఈ చారిత్రిక తప్పిదం (కుమ్ముక్కు?) వెంకయ్య నాయుడి బాగోతమే.

  ReplyDelete
  Replies
  1. మీరన్నది నిజమే, భాజపా ఆంధ్రప్రదేశ్ లో నిలదొక్కుకోలేకపోవటానికి ప్రధాన కారణం వెంకయ్య నాయుడు గారే.

   Delete

Post a Comment

Popular posts from this blog

వంశీ వ్యూ పాయింట్ - రంగస్థలం

వంశీ వ్యూ పాయింట్ - 'భరత్ అనే నేను'

వంశీ వ్యూ పాయింట్ - 'మహానటి'