... సర్వేలు - వ్యూహాలు

వంశీ వ్యూ పాయింట్ // ... సర్వేలు - వ్యూహాలు //
*************************************************
            ఇప్పటిదాకా వెలుగు చూసిన సర్వేలన్నీ పార్టీలు, పార్టీ అధినేతల ఇమేజ్ ఆధారంగా జరిగినవే తప్ప స్థానిక నేతలను అనగా పోటీ చేయబోయే అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోలేదన్నది నా అభిప్రాయం. పార్టీలకు అతీతంగా ప్రభావం చూపగల, గెలవగల నేతలు అనేకులు ఉన్నారు. ఇప్పటివరకూ వెలుగు చూసిన సర్వేలలో దాదాపు 90% ఒకవైపే మొగ్గు అని తెలుపుతున్నాయి. ఆ అంచనాలలో పెద్దగా తేడా ఉండకపోయినా, ఆధిక్యత విషయంలో ఒక పది లేదా పదిహేను అటూఇటుగా ఉండవచ్చు అని నా అంచనా. ఇక అంచనాల విషయానికి వచ్చాం కాబట్టి, ఇటీవలే ముగిసిన తెలంగాణ ఎన్నికలలో తెరాస అధినేత కెసిఆర్ అనుసరించిన వ్యూహం గురించి ప్రస్తావించుకుందాం. 
            తెలంగాణ ఎన్నికలలో తెరాస అధినేత కెసిఆర్ కాసింత భిన్న వ్యూహం అనుసరించారని చెప్పవచ్చు. ఆయన అనుసరించిన వ్యూహాలతో ప్రధానమైనవి - తెరాస ఇమేజ్ తెరాస ఎమ్మెల్యేలకన్నా/నాయకులకన్నా గొప్పగా ఉందని అర్థం చేసుకొని టికెట్స్ ఇవ్వడం, తెదేపా - కాంగ్రెస్ పొత్తును హైలైట్ చెయ్యడం (ఇది ఆ రెండు పక్షాలను దారుణంగా దెబ్బతీసిందన్నది పరిశీలకుల అభిప్రాయం, క్షేత్రస్థాయి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోకుండా అధినేతల స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటే ఫలితాలు ఎలా ఉంటాయన్నదానికి ఇదొక ఉదాహరణ), ఇక మరొక ముఖ్యమైనది ప్రత్యర్థి పార్టీల కంటే ఎక్కువగా ప్రత్యర్థులుగా గుర్తించిన వ్యక్తుల మీద ప్రత్యేక దృష్టి పెట్టడం. ఈ చివరి వ్యూహం అత్యంత ప్రభావం చూపగలిగింది. మరీ ముఖ్యంగా కొందరు అతి ముఖ్య నాయకులనదగ్గవారు తమ నియోజకవర్గం దాటి బయటకు రాలేని పరిస్థితులు కల్పించారు. అంతేకాక, దాదాపు తను దృష్టి పెట్టిన అందరు ప్రత్యర్థులనూ ఓడించారు. 
            ఇపుడు ఆంధ్రప్రదేశ్ లో గెలుపు గుఱ్ఱంగా ఉన్న వైఎస్సార్సీపీ కానీ, ప్రస్తుతం అధికారంలో ఉన్న తెదేపా కానీ, అదృష్టం కలిసొస్తే అనుకుంటున్న జనసేన కానీ కెసిఆర్ గెలుపును గుర్తించినంతగా ఆయన అనుసరించిన వ్యూహాలను గుర్తించలేదో లేక గుర్తించటానికి/అనుసరించటానికి అహంభావం అడ్డొస్తోందో మరి. తెదేపా విషయానికి వస్తే వ్యతిరేకతను తగ్గించుకోవటానికి చివరి నిమిషంలో ప్రకటించిన కొత్త పథకాలు, పాత పథకాలకు చేసిన సవరింపులను నమ్ముకోవడం కుక్కతోక పట్టుకుని గోదాటిని ఈదటం వంటిదే. ప్రభుత్వం మీద, పార్టీ మీద చంద్రబాబు గారు మునుపటిస్థాయిలో పట్టు చూపలేకపోవడం ప్రధాన సమస్యగా ఉంది వారికి. అంతేకాక, ఆయన అనుసరిస్తున్న వ్యూహాలు ఇపుడు వస్తూన్న మన అగ్రహీరోల సినిమాల లాగా అంటే ముందే ఊహించేట్టుగా ఉన్నాయి తప్పించి, ప్రత్యర్థిని గందరగోళంలోకి నెట్టేసే ఆనాటి చాతుర్యం ఇపుడు లేదు. అందునా సోషల్ మీడియా ప్రాబల్యం ఉన్న ఈ రోజుల్లో కూడా ఎల్లో మీడియా ఇంకా తిమ్మిని బమ్మి చేయగలదనుకుని ముందుకుసాగడం లాభించకపోగా, నష్టపరచగలదు. 
            ఇక గెలుపు ఈసారి తథ్యం అని అందరూ అంచనా వేస్తున్న వైఎస్సార్సీపీ మొండి ధైర్యం, వైఎస్/జగన్ ఇమేజ్ లు ప్రధానంగా ఉంది. వ్యూహాలకంటే ఎక్కువగా ప్రభుత్వ వ్యతిరేకత, జగన్ ఇమేజ్, పాదయాత్రలను నమ్ముకున్నట్టు కనిపిస్తోంది. చివరి వరకూ గుంభనంగా వ్యవహరించినా - నోటిఫికేషన్ వచ్చిన తరువాత ఫిరాయింపుల విషయంలో తెదేపాకు మింగుడుపడకుండా చేయడం బావున్నా, అందులో కోవర్ట్ రాజకీయంలో ఆరితేరిన చంద్రబాబు వ్యూహాన్ని అంచనా వేసుకోకపోతే నష్టపోయే అవకాశాలున్నాయి. తెదేపా ఎంతగా రెచ్చగొట్టినా, ఇబ్బంది పెట్టినా సంయమనం కోల్పోని జగన్ శైలి/తీరు; చాలా అంశాలలో మాట మార్చకుండా ఒకే మాట మీద నిలబడటం వంటివి  తటస్థులలో ఆయనకు మంచి ఇమేజ్ ను సాధించిపెట్టాయనడంలో ఎటువంటి సందేహం లేదు - అటువంటి వారిని వోట్ వేసే వైపుగా మళ్లించగలిగే దిశగా స్థానిక నాయకత్వం పని చేయగలిగేలా చూసుకోవాలి. 
            ఇక జనసేన అధినేత పవన్ వ్యూహాలు, ఆయన అన్నయ్య చిరంజీవిని గుర్తు తెస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆయన ప్రచారం ప్రభుత్వాన్ని లక్ష్యం చేసుకుని కాకుండా ప్రతిపక్షనేత జగన్ లక్ష్యంగా సాగడం విమర్శలకు, అనుమానాలకు తావిచ్చేదిగా ఉంది. ఆ అనుమానాలను నివృత్తి చేయకపోగా జనసేన - తెదేపా బంధం ఉండదు (ఎన్నికలకు ముందో లేక తరువాతో) అనే నమ్మకాన్ని కల్పించడంలో జనసేనాధిపతి పూర్తిగా విఫలమయ్యారు. 'జగన్ ముఖ్యమంత్రి కావడం ఇష్టం లేదు' అంటూ వ్యాఖ్యానించడం ఒకానొక ప్రభావం చూపగల తప్పిదం. చంద్రబాబుకు అనుకూలంగా ఉండే తీరున ఉండటం, తమను తాము దెబ్బతీసుకోవడమే అన్నది గుర్తించుకపోతే రాజకీయ భవిష్యత్తు కూడా అగమ్యగోచరమే కాగలదు. 
            సర్వే ఫలితాలను నమ్ముకోవడం లేదా దిగాలుపడటం కాకుండా - కెసిఆర్ లాగా భిన్న వ్యూహాలు అనుసరించగలిగితే సర్వే ఫలితాలు తారుమారు కావడం పెద్దపని కాదు. కానీ, తెదేపా భిన్నవ్యూహాలను అనుసరించకపోగా - పోలీసు వ్యవస్థను అదుపులో ఉంచుకుని అక్రమాలకు పాల్పడటం, బెదిరింపులు/నిర్బంధాలు వంటి చర్యలకు పాల్పడటం దెబ్బతీయగలిగే అంశమే. అదే సమయంలో ఎదురుదెబ్బలు తింటున్న కార్యకర్తలకు, చిన్నస్థాయి నేతలకు అండగా నిలబడటం (గతంలోలా పత్రిక ప్రకటనలు./ఖండనలు వంటివి కాక) ద్వారా వైఎస్సార్సీపీ తమ పార్టీ అనుకూలురలలో నమ్మకాన్ని పెంచుకోగలుగుతోంది. ఒకవైపు దాదాపు సర్వేలన్నీ ఫలితం ఏకపక్షమే అని తీర్మానించేస్తున్నా - ఎవరూ తగ్గకుండా వ్యూహాలకు పదును పెట్టుకుంటూ సాగుతున్నారు. చూద్దాం ... ఎలా ఉంటుందో 

Comments

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన