ద్వంద్య నీతి

యుద్ధం చేయబోయేముందు నాయకుడు ప్రధానంగా, అత్యంత ముఖ్యంగా అంచనావేయాల్సింది తను/తన సేన వేయబోయే మొదటి అడుగునుండి తన రాజ్యంలోని సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేలా చేపట్టవలసిన చర్యలేమిటి అని. అటువంటి చర్యలు చేపట్టారు, సామాన్య జనాల గురించి ఆలోచించారు కాబట్టే గతకాలంలో సామాన్య జనాలు ఆపత్సమయంలో, అవసరమైనపుడు అండగా నిలిచారు. జనాలు లొంగిపోయేది ఒకటి ప్రేమకు రెండు భయానికి. బాహుబలి చిత్రం చూసినవారికి అందులో కాలకేయ సైన్యంతో జరిగే మహా యుద్ధంలో బాహుబలి, భల్లాలదేవ పాత్రలకి నాయకత్వ/ఉన్నత లక్షణాలలో తేడా చూపే ఒక సన్నివేశం బహుశా గుర్తుండే ఉంటుంది. సినిమాలో కథాపరంగా అత్యంత కీలకమైన, బలమైన సన్నివేశాలలో అది ఒకటి. మాహిష్మతి ప్రజలను (అనగా సామాన్యులను అని గమనించగలరు) బందీలుగా ముందుంచుకున్న కాలకేయుని సైన్యంవైపు భల్లాలదేవుడు తన ప్రజలనే తేడా చూపకుండా వారిని కూడా చంపుకుంటూ వెళ్లిపోతాడు ఎందుకంటే భల్లాలదేవుడికి శత్రువును దెబ్బ కొట్టటం, తద్వారా తాను పేరు తెచ్చుకోవడం మాత్రమే ముఖ్యం. కానీ, బాహుబలి మాత్రం ముందుగా తన ప్రజలను రక్షించుకునే ఉపాయం ఆలోచించి ఆ తరువాత ముందడుగు వేస్తాడు. తన ప్రజలను రక్షించి శత్రువు పని పడతాడు ఎందుకంటే బాహుబలికి రాజ్యమంటే ప్రజలతో కూడినదే కానీ అధికార పీఠం కాదు. సినిమాలో ఆ సన్నివేశం చూసినపుడు మన గుండెలు ఉప్పొంగుతాయి, శరీరం గగుర్పొడుస్తుంది, వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి, చేతులు చప్పట్లు కొడతాయి, నోళ్లు ఈలలు వేస్తాయి. అలాగే ఆ సినిమాలో కూడా శివగామి పాత్రధారి (రమ్యకృష్ణ) అదే పోలికను చెప్పి 'యుద్ధంలో వందమందిని చంపేవాడు కాదు, తనవారినిరక్షించుకునేవాడు నిజమైన నాయకుడు. అలా ఒకవైపు తనవారిని రక్షించుకుంటూ మరోవైపు విజయం కోసం ప్రయత్నించిన బాహుబలే మీ నాయకుడు, కాబోయే రాజు' అంటూ ముక్తాయింపు కూడా ఇస్తుంది. కానీ బయట మాత్రం మనకు అలా నచ్చదు లేదా వీలవదు అంటూ రకరకాల కారణాలు తయారుగా ఉంటాయి. మామూలు జనాలు ఏమైపోయినా పర్లేదు, భల్లాలదేవుడిలాగా లక్ష్యం వైపు మాత్రమే అడుగులు పడాలి ఎందుకంటే సామాన్య జనాల గురించి ఆలోచిస్తే కుదరదు; పని నడుస్తే చాలు. జనాలు (అనగా సామాన్యులు అని చదువుకోగలరు) త్యాగాలు చెయ్యాల్సిందే. అవును - యుద్ధంలో శత్రువును బట్టి యుద్ధనీతి, వ్యూహం మారాలి. కానీ ఎలాగైనా లక్ష్యం సాధించాలి అనే భల్లాలదేవుడి తీరు కంటే, తనవారిని కాపాడుకుంటూ విజయం సాధించడానికి ప్రయత్నించడమనే బాహుబలి తీరు మిన్న. ఒక్కొక్కసారి తనవారిని కాపాడుకోవడానికి తలవంచి సంధి కోసం తెల్ల జెండా ఎగురవేయాల్సి రావచ్చు. తనవారికోసం తలొంచే నాయకుడిని సినిమాలలో చూసి చప్పట్లు కొడతాం. అంటే చూడటానికి మనకు నచ్చేది వేరు, చెయ్యటానికి ఎంచుకునేది వేరు - ద్వంద్య నీతి. అనగా చెప్పునదొకటి, చేయునదొకటి. 

Comments

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన