విదేశీ వస్తుబహిష్కరణ

వంశీ కలుగోట్ల// విదేశీ వస్తుబహిష్కరణ //
**********************************************
ఉపోద్ఘాతం: ఈ మధ్యన చైనా వస్తువులు కొనడం మానితేనే దేశభక్తి ఉన్నట్టు అనే ఒక భావాన్ని వ్యాప్తి చెయ్యటం ఒక అంటువ్యాధిలా వ్యాపిస్తోంది. ఈ వ్యాధి మంచిదే కానీ, రోగం ఉన్నది తలలో అయితే మందు మోకాలికి వేస్తున్న చందాన ఉన్నాయి చర్యలు. కొన్ని వాస్తవాలు గమనించగలిగితే ... 

- మన దేశపు కంపెనీ పేరుతో అమ్ముడయ్యే వస్తువుల్లో దాదాపు 75% కి పైగా వస్తువులు చైనా కంపెనీ తయారీ వస్తువులు కాగా వాటిని మన దేశీయ కంపెనీలు తమ పేర్లు ముద్రించి అమ్ముతారు. ఇటీవలే చదివాను, ఎవరో చైనా వస్తువులు వద్దు మన దేశీయ కంపెనీ వస్తువులు కొనండి అని చెబితే బజాజ్ కంపెనీ ఎలక్ట్రికల్ వస్తువులు కొన్నారట. తీరా కొన్నాక చూస్తే 'మేడ్ ఇన్ చైనా' అని ఉందట. కంపెనీ మాత్రం మనదే. 

- చైనా కంపెనీ వస్తువులు ఒక పది రూపాయలకు కొన్నామనుకుందాం; దాని తయారీకి ఒకటిన్నర రూపాయి అవుతుందనుకుంటే అన్ని రకాల ఖర్చులు పోగా ఆ కంపెనీకి మన దేశం నుండి వెళ్ళేది ఒక్కో వస్తువుపై మూడున్నర రూపాయలు అనుకుందాం. అదే వస్తువును చైనా కంపనీ నుండి ఒక దేశీయ కంపెనీ కొని ఇక్కడ పదిహేను రూపాయలకు అమ్ముతుంది, వస్తువు తయారు చేసి ఇచ్చినందుకు చైనా కంపెనీకి నాలుగున్నర రూపాయలో లేక అయిదు రూపాయలో ఇస్తాయి. (ఇవి అంచనా లెక్కలు, దయచేసి ఆ అయిదు రూపాయలకు లేదా నాలుగున్నర రూపాయలకు గూగుల్ లింక్ సాక్ష్యంగా చూపమని అడగవద్దు. నేను రోజులో పుస్తకాలు, వార్తలు, వ్యాసాలూ అనేకం చదువుతుంటాను. అందులో కొన్ని నోట్స్ రూపంలో రాసుకుంటాను) యే మార్గం ద్వారా చైనా కంపెనీలు ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయో అర్థమవుతుందా? ఉదాహరణకు అమెరికాకు చెందిన అనేక పాపులర్ కంపెనీల ప్రొడక్ట్స్ తయారయ్యేది చైనాలోనే.

- మనపట్ల, మన దేశం పట్ల చైనా శత్రుత్వ ధోరణి అన్నది ఈనాటిది కాదు. అసలు ఈనాడు మనం 'పాక్ ఆక్రమిత కాశ్మీర్' అనే ప్రాంతం చైనా ఆక్రమించి పాక్ కు ధారాదత్తం చేసినది కాదా? అంతెందుకు, సరిహద్దులో కవ్వింపు చర్యలు చైనాకు కొత్తనా? ఇవన్నీ తెలిసీ, ఈ మార్కెటింగ్ ద్వారా డబ్బు యే దేశానికి ఎలా ఎంత స్థాయిలో వెళుతోందా మన దేశాధినేతలకు తెలియదా? ఈవేళ కొన్ని నెలల పాటు చైనా వస్తువుల విక్రయం ఆపేస్తే ఇది ఆగిపోతుందా? అమెరికా నుండో,యూరోప్ దేశాల నుండో మనం దిగుమతి చేసుకునే వస్తువులు ఆయా దేశాలలో తయారవుతున్నాయా లేక చైనాలోనా?

- విదేశీ వస్తు బహిష్కరణ అన్నది స్వాతంత్య్ర పోరాట సమయంలో చాలా రకాలుగా ఉపయోగపడింది. దేశీయ వస్తువుల వినియోగం వాళ్ళ ద్రవ్య వినిమయం, పంపిణీ అన్నది దేశంలోపలే జరిగింది. ఈనాడు అలా జరుగగలదా? ఎందుకంటే దేశీయ ఉత్పత్తి రంగాన్ని దార్శనిక నేతలు ఎప్పుడో నేల నాకించేశారు. ఒకానొక ఉదాహరణ చేనేత రంగం. అలాగే వ్యవసాయ భూములన్నిటినీ నగరాల నిర్మాణానికి ఆక్రమిస్తూ పోతుంటే వ్యవసాయ ఉత్పత్తులు తగ్గి దిగుమతుల మీద ఆధారపడవలసి ఉంటుంది. 

- 'మేక్ ఇన్ ఇండియా' గురించి విన్నపుడు నేననుకున్నది (బహుశా అది తప్పు కావచ్చు లేక నా అజ్ఞానమో లేక అత్యాశో కావచ్చు) మన దేశంలో, మన దేశపు పనివారు, స్వంత పరిజ్ఞానంతో తయారు చేసేలా ప్రోత్సాహం అందించటం అనుకున్నా; కానీ విదేశీ కంపెనీలు ఇక్కడి పనివాళ్లను ఉపయోగించుకుని తక్కువ ధరలో తయారు చేసి ఎక్కువకు అమ్ముకుని అందులో కాసింత ఇక్కడ పడేసి మిగతాది పట్టుకుని వెళ్ళేలా వారికి అవకాశాలు కల్పించటం అని ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది. 

ముక్తాయింపు: ఇవన్నీ పక్కనపెడితే, అవును ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు ఒక అడుగు వేయాలి. కానీ, ఆ మొదటి అడుగు ప్రభుత్వం/అధికార వ్యవస్థది కావాలి. ముందుగా 'విదేశీ/చైనా పరిజ్ఞానం, సేవలను వినియోగించుకోరాదు; ఒకవేళ వినియోగించుకుంటే అధికశాతం పన్నులు విధించేలా ...' ఒక చట్టం తీసుకురావాలి, దాన్ని దేశీయ కంపెనీలకు వర్తించేలా చేయాలి. ఇది కాకుండా ప్రజలు చైనా వస్తువులు కొనడం మానేస్తేనే దేశభక్తి ఉన్నట్టు అని అనడం మానితే మంచిది. 

Comments

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన