ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే ... 'గౌతమీపుత్ర శాతకర్ణి' గురించి

ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే ... 'గౌతమీపుత్ర శాతకర్ణి' గురించి 
******************************************************************************
          ముందుగా ఇది చారిత్రిక చిత్రం అన్న విషయం పక్కనబెట్టి చూస్తే, ఈ మధ్య కాలంలో వచ్చిన చిత్రాలలో కొంత వైవిధ్యాన్ని అందించిన చిత్రంగా నిలవడమే కాక 'బాగుంది' అనిపించేలా ఉంది. దీన్ని చారిత్రిక చిత్రంగా మాత్రం చూడకూడదేమో. చారిత్రిక చిత్రం తీయాలంటే ఎప్పటి చరిత్ర తీస్తున్నామో ఆ చరిత్రను అధ్యయనం చెయ్యాలి. చరిత్ర అంటే యుద్దాలు, జయాపజయాలు మాత్రమే కాదు సంస్కృతీ కూడా. ఆనాటి సంస్కృతిని, యుద్ధవ్యూహాలను, నీతులను పట్టించుకోకుండా చిత్రం తీసి పడేసి 'సరియైన ఆధారాలు లేవు, ఉన్న కాస్త చరిత్రకు ఊహను జోడించి తీసాం' అంటే లెక్క సరికాదు. సరే, ఆ అంశాల గురించి మాట్లాడుకునేముందుగా ...           
          'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం గురించి మాట్లాడుకోవాలంటే ఇద్దరి గురించి మాట్లాడుకోవాలి. ఒకరు క్రిష్, రెండు బాలకృష్ణ. దర్శకుడిగా ప్రతి చిత్రానికి ఒక విభిన్నమైన కథను, కథాంశం ఎన్నుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న దర్శకుడు క్రిష్. ఈ చిత్రంతో మరొక విభిన్న చిత్రాన్ని, కొంత చరిత్రకు చాలా ఊహను జోడించి ఈ చిత్రాన్ని అతి తక్కువసమయంలో తెరకెక్కించి 'ఔరా' అనిపించాడు. ఇక బాలకృష్ణ తన వందవ చిత్రంగా ఇటువంటి చిత్రాన్ని ఎన్నుకోవడంలో విజ్ఞత చూపాడు. నటుడిగా కూడా రాణిస్తూ, శాతకర్ణి పాత్రకు తన స్టార్డమ్ ని కూడా రుచి చూపించాడు. ఇక మిగతా పాత్రల గురించి చెప్పుకోవాలంటే ముందుగా గౌతమి బాలశ్రీ పాత్ర. సరిగ్గా తీర్చిదిద్దగలిగి ఉంటే బాహుబలిలోని శివగామి పాత్రను తలదన్నే పాత్ర ఇది. కానీ, పాత్రను సరిగ్గా తీర్చిదిద్దకపోవటం ఒక లోపం కాగా ఆ పాత్రకు హేమమాలినికి ఎంచుకోవడం మరొక లోపంగా మిగిలిపోయింది. అడుగడుగునా ఆ పాత్రను రమ్యకృష్ణలాంటి నటి పోషించి ఉంటే ఎంత బావుండు అనిపిస్తూనే ఉంటుంది. ఇక శ్రేయ గురించి, వాళ్లు అడిగారో లేక శ్రేయ స్వతంత్రించిందో కానీ చారిత్రిక చిత్రం అంటున్నారు కదా గ్లామర్ కి లోటు ఉంటుందేమో  అనుకునే వారి అనుమానాలను పటాపంచలు చేసింది. నటన విషయంలో ఎంత కావాలో అంత చేసింది, ఒళ్ళు దాచుకోకుండా నటించింది కూడా. నహపాణుడి పాత్ర పోషించిన కబీర్ బేడీ కూడా అసలేం చేశాడో అర్థం కానట్టుగా చేశాడు. అందరూ అత్యంత సమర్థవంతమైన నటులే, దర్శకుడు కూడా వారినుండి కావాల్సినంత/అవసరమైన మేరకు నటనను రాబట్టుకోగలిగే శక్తి ఉన్నవాడే. కానీ, ఎట్టి పరిస్థితులలో సంక్రాంతికి చిత్రాన్ని తీసుకురావలసిందే అన్న ఒత్తిడిలో చాలా విషయాలను గాలికి వదిలేశారు. భావోద్వేగాలు ప్రధానంగా బిగుతైన దృశ్యానువాదం (స్క్రీన్ ప్లే) మీద దృష్టి పెట్టే దర్శకుడు క్రిష్ పెద్ద నటుడితో సినిమా తీస్తున్నానన్న జాగరూకతో లేక భయమో కానీ తడబడ్డాడు. అసలు ఏ పాత్రకు కూడా పాత్రౌచిత్యం అంటూ ఏమీ లేదు. ఫోటోగ్రఫీ కూడా సరిగా లేదు, అప్పటి మూడ్ క్రియేషన్ అన్నది లేదు. కాకపొతే ఈ విషయంగా బహుశా తగినంత సమయం దొరకలేదేమో. ఇక చిరంతన్ భట్ సంగీతం గురించి, పర్వాలేదు బానే ఉంది. కానీ, పాటలు వాటి చిత్రీకరణ మాత్రం చిరాకెత్తించేలా ఉంది. కేవలం తలపాగా మార్చుకుంటే శాతకర్ణిని ఎవరూ గుర్తుపట్టకపోవటం బహుశా సినిమాటిక్ లిబర్టీ కింద వదిలెయ్యాలేమో. అసలు ఈ సినిమా మొత్తం సినిమాటిక్ లిబర్టీ కింద ఒక గొప్ప ఉదాహరణగా చూపాలి కానీ చారిత్రిక చిత్రం అంటూ గుండెలు గుద్దుకోకూడదు. అలాగే ఈ చిత్రపు చారిత్రిక ప్రాశస్త్యత గురించి ప్రశ్నిస్తే వెంటనే మిగతా సినిమాలకు లింకెట్టి ప్రతిదాడికి దిగటం కాదు ఈ చిత్రంలో వారు తెరకెక్కించిన అంశాలలో నేను ప్రశ్నించిన వాటికి ఆధారాలు ఉంటే అవి ప్రస్తావిస్తూ మాట్లాడండి. 
          ముందే చెప్పుకున్నట్టు చరిత్ర అంటే యుద్దాలు, జయాపజయాలు మాత్రమే కాదు ఆనాటి సంస్కృతీ కూడా. వస్త్రధారణలో, ఇతరత్రా వ్యవహారాలలో మాత్రమే కాదు యుద్ధ విషయాలలో కూడా చరిత్ర అంటే ఎంత చులకనగా తీసుకున్నారో తెలుస్తూనే ఉంది. సినిమాలో దాదాపు 80% యుద్ధాలే, కానీ అవన్నీ ఇప్పటి సినిమాలలో వచ్చే సాధారణ పోరాట సన్నివేశాలలానే ఉన్నాయి కాకపొతే ఆయుధాలు, మాటలు మాత్రం తేడా అంతే. అసలు అప్పటి కాలపు యుద్ధం, యుద్ధవ్యూహాలు ఎలా ఉంటాయి అన్న కనీసపాటి విజ్ఞత కూడా లేకుండా చిత్తానికి వచ్చినట్టు తీసి పడేశారు అంతే. మధ్యలో పాటలు కూడా అదనం. ఒక కాల్పనిక కథ తీస్తూ కూడా ఎంతో అధ్యయనం చేస్తూ, యుద్ధవ్యూహం అన్న అంశానికి తగిన గౌరవం ఇస్తూ తెరకెక్కించే రాజమౌళిని చూస్తే ఇప్పుడు గౌరవం మరింత పెరుగుతోంది. ఇటువంటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న చిత్రం ఆదరాబాదరాగా తెరకెక్కించాల్సిన అవసరమేమిటి? తగిన అధ్యయనము చేసి, సమయం తీసుకుని తీసి ఉండాల్సింది. శాతకర్ణి పాత్రను కూడా ఒక సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి పాత్రలుగా తీర్చి దిద్ది వాణిజ్య విజయం అందుకోవాలన్న తపనే తప్పించి చారిత్రిక చిత్రంగా తీర్చిదిద్దాలన్న ఆలోచన కూడా చేసినట్టు లేదు. అతి తక్కువ కాలంలో ఇటువంటి చిత్రాన్ని తీశాం అనిపించుకోవాలనే ఆతృత ఎందుకు? దీన్ని కనుక మార్గదర్శకంగా తీసుకున్నట్లయితే ఇక కనీస ఆధారాలు ఉన్న చరిత్రను కూడా ఇలా సమరసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, నరసింహనాయుడు లాంటి పాత్రలలాగా తీర్చిదిద్దుతారేమో. ఏమో చంద్రగుప్తమౌర్యుడు సమరసింహారెడ్డిలా, పురుషోత్తముడు ఇంద్రసేనారెడ్డిలా మారినా మారొచ్చు. మళ్ళీ దీనికి తెలుగువాడు గర్వంగా చెప్పుకోవాలి అనే టాగ్ ఎందుకంటా? ఒక మామూలు సినిమాగా చెప్పండి - అవును బాగా తీశారు, తక్కువపాటి వనరులతో, తక్కువ సమయంలో బాగా తీశారు. కానీ, ఇవ్వాళ అందుబాటులో ఉన్న సాంకేతికత స్థాయిలో చూస్తే మాత్రం ఈచిత్రం తక్కువగానే కనబడుతుంది. 
          ఈ చారిత్రకత అన్న అంశం పక్కనబెడితే ఈ చిత్రం తియ్యటానికి ముందుకొచ్చినందుకు దర్శకుడు క్రిష్, నటుడిగా బాలకృష్ణ ప్రశంసనీయులు. అలాగే సంభాషణల పరంగా సాయిమాధవ్ బుర్రా చప్పట్లు కొట్టించే మాటలు చాలా రాశాడు. ఎడిటింగ్ పర్వాలేదు. ఒక మంచి ప్రయత్నం ఈ సినిమా. చూడటానికి కానీ, చూసిన తరువాత గానీ పెద్దగా ఇబ్బంది పెట్టని ఈ సినిమా చూడవచ్చు. కానీ, ఇది మనం గర్వంగా చెప్పుకోదగిన చారిత్రిక చిత్రం అయితే కాదు. దయచేసి దీన్ని చారిత్రిక చిత్రంగా చెప్పడం మానేసి చరిత్ర ఆధారంగా నిర్మించిన చిత్రం అని చెపితే బావుంటుంది. 

శాతకర్ణి గురించిన మరికొన్ని వివరాలు కావాలంటే క్రింద ఇవ్వబడిన మిత్రుడు తిరుమల ప్రసాద్ గారి బ్లాగ్ లో చూడండి. ఈ విషయంగా నాకు శ్రమను తగ్గించినందుకు మిత్రుడు తిరుమల ప్రసాద్ గారికి కృతజ్ఞతలు. 

ఎవరీ-గౌతమీపుత్ర-శాతకర్ణి -> https://thirumalpatil.wordpress.com/2017/01/10/%E0%B0%8E%E0%B0%B5%E0%B0%B0%E0%B1%80-%E0%B0%97%E0%B1%8C%E0%B0%A4%E0%B0%AE%E0%B1%80%E0%B0%AA%E0%B1%81%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0-%E0%B0%B6%E0%B0%BE%E0%B0%A4%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A3/

చరిత్ర లెక్కలు సరిపోలేదు మిత్రమా -> 
https://thirumalpatil.wordpress.com/2017/01/10/%E0%B0%8E%E0%B0%B5%E0%B0%B0%E0%B1%80-%E0%B0%97%E0%B1%8C%E0%B0%A4%E0%B0%AE%E0%B1%80%E0%B0%AA%E0%B1%81%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0-%E0%B0%B6%E0%B0%BE%E0%B0%A4%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A3/

Comments

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన