ఇంతకీ నేను సెప్పొచ్చేదేంటంటే ... 'ఖైదీ నెంబర్ 150' గురించి

వంశీ కలుగోట్ల // ఇంతకీ నేను సెప్పొచ్చేదేంటంటే ... 'ఖైదీ నెంబర్ 150' గురించి //
*******************************************************************
            గమనిక: సినిమాల పరంగా నేను చిరంజీవికి వీరాభిమానిని. కాబట్టి, ఖైదీ నెంబర్ 150 గురించి నా వ్యూని చదవాలా వద్దా అన్నది మీరు నిర్ణయించుకోండి. కేవలం సినిమా గురించే మాట్లాడాలి అని నిర్ణయించుకున్నాను కాబట్టి ఇక్కడ రాజకీయాలు అప్రస్తుతం. సందేశాత్మక సినిమాలు సమాజాన్ని మారుస్తాయి అని భ్రమించడం ఎంత తప్పో ఆ సినిమాల్లో నటించే నటీనటులు ఆ విలువలను పాటిస్తారని అనుకోవడం కూడా అంతే తప్పు. రాజకీయంగా చిరంజీవిని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తాను, కానీ సినిమాల పరంగా విపరీతంగా అభిమానిస్తాను. మీరు ఆ రెండింటిని వేరు చేసి చూడలేకపోతే దీన్ని చదవకుండా మానెయ్యొచ్చు, లేదా చదివినా స్పందించకుండా వదిలెయ్యొచ్చు. ఇది కేవలం నా 'వ్యూ' కాబట్టి 'వాడింతే' అనుకుని ఊరికే ఉండొచ్చు కూడా.                                 
                                         *                *                *
            'ఖైదీ నెంబర్ 150' - దాదాపు దశాబ్ద కాలం తరువాత చిరంజీవి పునరాగమనం చేస్తున్న చిత్రంగా విపరీతమైన ప్రచారం, ఆశలు కల్పించిన ఈ చిత్రం ఎలా వుంది అన్న విషయం పెద్దగా పట్టించుకోవట్లేదు. ఈ సినిమాకి సంబంధించి మిగతా అన్ని విషయాలు పక్కనబెట్టి కేవలం చిరంజీవి అన్నది మాత్రమే ఏకైక అంశంగా నిలిచింది. సినిమాల పరంగా చిరంజీవి రేంజ్, క్రేజ్ మరోసారి చూపించిన చిత్రంగా నిలబడింది. తెలుగు సినిమాను వాణిజ్యపరంగా కొత్తపుంతలు తొక్కించిన ట్రెండ్ సెట్టర్ హీరో, రెండున్నర దశాబ్దాల పాటు అగ్రస్థానంలో ఉన్న హీరో, రాజకీయాలలో విఫలమై తిరిగొస్తున్న హీరో అన్నవి ముఖ్య ప్రచార అంశాలుగా అయ్యాయి. మూడో అంశం అత్యంత ప్రాధాన్యతను సంపాదించుకుంది. ముందుగా సినిమా గురించి మాట్లాడుకుందాం.
            సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ఇందులో ఉన్న ఏకైక ఆకట్టుకునే అంశం, సినిమాను నిలబెట్టి అన్నీ తానై నడిపించిన అంశం ఒక్కటే 'చిరంజీవి'. పునరాగమనం అన్న అంశం పక్కనబెట్టిన కూడా 'చిరంజీవి' మాత్రమే అన్నీ తానై ఈ సినిమాను నిలబెట్టాడు. వేగం కాస్త తాగినప్పటికీ తన మార్క్ చూపించడంలో ఎక్కడా తగ్గలేదు. రౌద్రం, కరుణ, బాధ, ప్రేమ, వెటకారం/హాస్యం ... ఒకటేమిటి పాత్రకు అవసరమైన అన్ని హావభావాలకు తనదైన శైలిని జోడించి ఆకట్టుకునేలా మలచడంలో తనకు తానే సాటి అని మరోసారు చూపించాడు. ఎటువంటి ఆసక్తి కలిగినచని కథ, కథనంలోని లోపాలు తదితరాలను కప్పిపుచ్చి సినిమాను భుజాన మోసి విజయతీరాలు చేర్చాడు. పదేళ్ళతరువాత కూడా తాను ఇవి చేయగలను, సినిమాను అన్నీతానై భుజాన మోయగలను అని చూపటానికే ఈ కథను (రీమేక్ కథ అనుకోండి, అందుకే సేఫ్ బెట్ లా ఈ కథను తీసుకున్నారేమో) ఎన్నుకున్నట్టుగా అనిపిస్తుంది. పదేళ్ల విరామం, వయసు అనే అంశాలు వేగాన్ని కాస్త తగ్గించినప్పటికీ ఆ గ్రేస్, ఛార్మ్, మార్క్ ఎక్కడా కోల్పోలేదు. అందుకే 'బాస్ ఈస్ బ్యాక్', Yes, Boss is back by all means.
            ఇక సినిమా గురించి చెప్పాలంటే కథ పరంగా కానీ, కథనం పరంగా కానీ పెద్దగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. ఒక సాధారణ ఫార్ములా/టెంప్లేట్ ఆధారంగా తయారుచేసుకున్న కథ ఇది. అంటే 'ఆవుకథ' లాగా అన్నమాట. దీన్ని పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ వద్దనుకోవడంలో ఎటువంటి తప్పు లేదనిపించింది. చిరంజీవి పునరాగమన చిత్రం కాకపొతే దీని ఫలితం మరోలా ఉండేది అన్నదానిలో ఎటువంటి అనుమానం లేదు. ఒక మామూలు కమర్షియల్ కథకు తనదయిన శైలిలో హంగులు జోడించే వినాయక్ గత కొద్దికాలంగా తడబడుతున్నాడు. ఆ తడబాటు ఈ సినిమాలో కూడా కొనసాగింది. వినాయక్ అంటేనే బిగుతైన స్క్రీన్ ప్లే, కానీ ఆ స్క్రీన్ ప్లే లోనే తడబడుతున్నాడు. వినాయక్ కొంత విరామం తీసుకుని తనను తను సమీక్షించుకుంటే మేలేమో. కాజల్ పాటల కోసం ఉంది అంటే ఉంది అంతే, ఉన్నంతలో కూడా ఏమంత పెద్దగా ఆకట్టుకునేలా కూడా లేదు. ప్రతినాయక పాత్రధారి కూడా అంతే, ఎదో పాత్ర పరంగా ఉన్నాననిపించాడు. బ్రహ్మానందం నవ్వించకపోగా విసిగిస్తాడు, అనవసరంగా నిడివి పెరిగిందేమో ఆ పాత్రవల్ల అనిపిస్తుంది. అలీ కూడా అంతే. పాత్రల పరంగా చెప్పుకోవడానికి అంతగా గుర్తుండే పాత్రలు కానీ, గుర్తు పెట్టుకోవాల్సిన పాత్రలు కానీ ఏవీ లేవు. 
            ఇక సాంకేతిక అంశాల పరంగా చెప్పుకోవాలంటే ముందుగా ఫొటోగ్రఫీ గురించే చెప్పుకోవాలి. చిరంజీవిని వయసు తక్కువగా అనిపించేలా అందంగా చూపడంతో పాటు లైటింగ్ పరంగా ఇతరత్రా చాలా బావుంది. ఇక సంగీతం - దేవిశ్రీ స్థాయికి తగ్గట్టుగా లేకపోయినా 'బాలేదు' అనేలా కూడా లేదు. పరవాలేదు. కానీ నేపథ్య సంగీతం విషయంగా మాత్రం మణిశర్మ అయితే ఎలా ఉండేది అని అనిపించేలా లోటు తెలిసొచ్చింది. నేపథ్య సంగీతం ఎక్కడా అనుభూతి చెందేలా (ఫీల్ అయ్యేలా) లేదు (బాక్గ్రౌండ్ స్కోర్). చాలా సన్నివేశాలలో చిరంజీవి నటన నిలబెట్టింది కానీ మిగతా అంశాలన్నీ దిగువ స్థాయిలోనే ఉన్నాయి. నిర్మాణ విలువలు బావున్నాయి. ఎడిటింగ్/కూర్పు పర్వాలేదు. తరువాతి సినిమాకు మాత్రం చిరంజీవి సాంకేతిక అంశాల విషయంలోనైనా కొత్త తరం వైపు చూస్తే బావుంటుంది. చూడాలి ఎందుకంటే ప్రతి సినిమాని 'బాస్ ఈస్ బ్యాక్' అన్న కాన్సెప్ట్ లో చూడరు కాబట్టి. మళ్ళీ సినిమాలు తియ్యటం మొదలెట్టాడు కాబట్టి ఇక ఇప్పుడు చిరంజీవి కూడా రెగ్యులర్ గా వచ్చే హీరో అయిపోతాడు. కాబట్టి వైవిధ్యాన్ని చూపాలి లేకపోతే మానుకోవాలి. విలువ (అన్ని రకాలుగా, మరీ ముఖ్యంగా వాణిజ్య పరంగా) తగ్గించే చిత్రాలు చెయ్యకూడదు.
            'బాస్ ఈస్ బ్యాక్' అన్న ఏకైక అంశమే లేకపోతే ఒక విఫల ప్రయత్నంగానో లేకపోతే ఒక మామూలు సినిమాగానో మిగిలిపోవాల్సిన 'ఖైదీ నెంబర్ 150' నిర్మాతగా రామ్ చరణ్ తరువాతి చిత్రాల పరంగా ఒక పాఠంగా తీసుకోవాలి. తాను నిర్మించబోయే తరువాతి సినిమాలకు కథను నమ్ముకుంటే బావుంటుంది. ఇక, ఇప్పటికే ప్రకటించినట్టు రెండవ సినిమాగా 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' నిర్మించేటట్టయితే, అందులో కథనం పరంగా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే నిర్మాణ సంస్థ విలువను పెంచేదిగానే కాక అజరామరంగా నిలిచిపోయే చిత్రం కాగలదు.

Comments

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన