వంశీ కలుగోట్ల // చదువు'కొనడం' గురించి ... //
****************************************
'దేశమును ప్రేమించుమన్న, మంచియన్నది పెంచుమన్న'
కొద్ది రోజులుగా చూస్తున్నాను చాలామంది మిత్రులు, ఇతర సోషల్ మీడియా
మేధావులు కొందరు 'విదేశాలలో విద్య ఉచితం, భారతదేశంలో మాత్రం లక్షల కొద్దీ
డబ్బు పోసి కొనాల్సివస్తోంది' అంటూ తెగ పోస్టులు పెడుతున్నారు. ముందుగా ఒక
విషయం నేను వారిని వ్యక్తిగతంగానో, మరే విధంగానో విమర్శించాలన్న
ఉద్దేశ్యంతో ఈ వ్యాసం రాయట్లేదు. కానీ, ఆపోహలను నివృత్తి చెయ్యటానికి; మన
దేశం గురించి తప్పుడు సమాచారం ప్రచారం చెయ్యటం మంచిది కాదు అన్న
ఉద్దేశ్యంతో మాత్రమే. సోషల్
మీడియా ప్రాచుర్యం పెరిగాక మిడి మిడి జ్ఞానంతో తెలిసీ తెలియని విషయాలను
ప్రచారం చెయ్యటం చాలా సులువు అయింది. పత్రికలలో లేదా ఛానెల్స్ లో అయితే
సంపాదక సిబ్బంది పరిశీలించే అవకాశం ఉంది, అదే ఫేస్ బుక్ లాంటి సోషల్
మీడియాలోనైతే వర్మ లాగా 'నేను ... నా ఇష్టం' తరహాలో ఎవరికీ తోచింది వారు
రాసుకోవచ్చు. కానీ ఆ రాసుకోవటంలో వ్యక్తులను విమర్సించటానికి, వ్యవస్థలను
విమర్సించటానికి తేడా లేకుండా రాసేస్తున్నారు.
భారతదేశంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్య ఉచితం అన్నది తెలిసిన విషయమే. కాకపొతే చాలా పాఠశాలల్లో
ప్రమాణాలు అత్యంత దీనదశలో ఉన్నాయి అంటే అది వేరే సమస్య. కాకపోతే చాలామంది ఫేస్ బుక్ తదితర సామాజిక మాధ్యమాల (సోషల్ మీడియా) ద్వారా ప్రచారం చేస్తున్నదేమిటంటే 'విదేశాలలో
విద్య ఉచితం, ప్రైవేటు విద్య అన్నదే లేదు. కానీ, మన దేశంలో వేలు, లక్షలు
పోసి విద్య కొనవలసి వస్తోంది' అని. ఈ విషయం ప్రచారం చేసినవారు, వారికి తెలియని
దాన్ని ఊహించుకుని రాసారని అనుకుంటున్నాను. అందుకే, నేను ఇక్కడ నాకు
తెలిసింది, నేను స్వయంగా చూసినది వివరిస్తాను. నేను ఇంగ్లాండ్ దేశానికి
వచ్చి దాదాపు ఎనిమిది సంవత్సరాలు కావస్తోంది. ఇక్కడ నేను చూసినంతవరకూ
ప్రభుత్వ పాఠశాలల్లోవిద్య ఉచితం. ప్రైవేటు పాఠశాలల్లోమాత్రం మన దేశంలోని ప్రైవేటు పాఠశాలల
కంటే ఎక్కువగా ఫీజులు ఉంటాయి. ఒకవేళ మీ మిత్రులు ఎవరేనా ఇక్కడ ఉంటే
వాళ్ళతో మాట్లాడి మరీ నిర్ధారించుకోండి అనుమానముంటే. మరొక అపోహ - ఇక్కడ
అన్ని ప్రభుత్వ పాఠశాలలలూ అత్యున్నత ప్రమాణాలతో ఏమీ ఉండవు, అలాగని చెత్తగా కూడా ఉండవు. ప్రభుత్వ పాఠశాలల గ్రేడింగ్ చూసుకుని మరీ ఇల్లు కొనుక్కునో లేకపోతే అద్దెకు తీసుకునో ఆ ప్రాంతానికి మారుతున్న వారిని చాలామందిని చూశాను. వారు ఇంతకు ముందు ఉన్న ప్రాంతాలలోనూ ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, అయినా కానీ ఇక్కడకే ఎందుకు అంటే 'ఇక్కడి ప్రభుత్వ పాఠశాల బావుంటుంది అని గ్రేడింగ్ ద్వారానో లేక అక్కడ చదివే వారి ద్వారానో తెలిసినందువల్ల'.
ఇక ఇక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాల గురించి - నేను చూసిన కొద్ది ప్రాంతాల వరకూ చూసుకుంటే వాటిలో ప్రమాణాలు బావున్నాయి. అలాగని ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలలో
ప్రమాణాలు అలానే ఉంటాయా అంటే నా నుంచి సమాధానం ప్రశ్నార్థకమే, ఎందుకంటే
కొన్నిటి గురించి విన్నాను కాబట్టి. అలాగే ఇక్కడి ప్రైవేటు పాఠశాలలగురించి చెప్పాలంటే వాటి ఫీజులు చాలా ఎక్కువగా ఉంటాయి. మన దగ్గరి ప్రైవేటు పాఠశాలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో వాటి ఫీజులు ఉంటాయి. ఇక్కడ కూడా నేను కొద్దిమందిని చూసాను - ప్రభుత్వ పాఠశాలలో చెప్పేది సరిగా ఉండదు కాబట్టి డబ్బులు పొతే పోయాయి ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్నాం, పోటీని తట్టుకోవాలంటే ప్రభుత్వ పాఠశాలలో చదివితే అసలు పనికిరారు అనే కారణాల వల్ల, ఆర్ధికస్థోమత ఉండటం వల్ల వారు ప్రైవేటు పాఠశాలల్లో
తమ పిల్లలను చదివించగలుగుతున్నారు. ఇది మన దగ్గరికన్నా ఏమన్నా విరుద్ధంగా
ఉందా? అక్కడ కూడా అంతే కదా ఆర్థికంగా కలిగినవారు ప్రైవేటుగా
చదువు'కొంటున్నారు' లేని వారు ప్రభుత్వ పాఠశాలల్లో సర్దుకుంటున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాల గురించి - అవును, చాలావరకు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు అట్టడుగున ఉంటాయి. నేను చదువుకున్నది కూడా అలాంటి ఒక ప్రభుత్వ పాఠశాలలోనే. అప్పట్లో భారీ వర్షం వచ్చిందంటే మాకు సెలవే. 8 వ తరగతి నుండి పదవ తరగతి వరకు సైన్స్, ఇంగ్లీష్ సబ్జక్ట్స్ బోధించటానికి ఒకే ఉపాధ్యాయుడు; ఆయనే ప్రధానోపాధ్యాయుడు, క్లర్క్, రికార్డు అసిస్టెంట్ గట్రా. 6 వ తరగతికి గది ఒక పాడుబడిన దేవాలయం లోని గది/హాలు; 7,8,9 వ తరగతి గదులుగా ఉపయోగించినవి కూడా అలాంటివే; పదవ తరగతికి, ఆఫీసు/స్టాఫ్ రూమ్ కు మాత్రమే పక్కా గదులు ఉండేవి. [ఇపుడు జీవితంలో ఉన్నతస్థాయిలో ఉన్న చాలామంది (40 పైబడిన వయసు ఉన్నవారు అనుకుందాం) అలాంటి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నవారే.] మేము పదవ తరగతికి వచ్చే సరికి పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ఇంకా చాలా నయం. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మన ప్రభుత్వ పాఠశాలల్లోప్రమాణాలు ఎలా ఉంటాయి, ప్రత్యేకించి పల్లెటూర్లలో అని చెప్పటానికి. అంత మాత్రాన మన ప్రభుత్వ పాఠశాలలన్నీ పనికి మాలినవని కాదు. ఈ మధ్య కాలంలో ఉత్తీర్ణత శాతం పరంగా, అధిక మార్కుల పరంగా మా మండలంలోని ప్రైవేటు పాఠశాలలకన్నా ప్రతిసారి మా ఊరి ప్రభుత్వ పాఠశాల ముందు ఉంటోంది. అలాగే చాలా ప్రదేశాలలో ప్రభుత్వ పాఠశాలలలో మెరుగుపడిన ప్రమాణాల ఫలితాలు చూశాను. ప్రజలలో ఆంగ్ల మాధ్యమంలో విద్యార్జన పట్ల ఏర్పడిన మోజును ప్రైవేటు పాఠశాలలు వాడుకుంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో మాతృభాషా మాధ్యమంలో చదివితే ఇవ్వాళ్టి పోటీ ప్రపంచంలో ఎక్కడ వెనకబడిపోతామో అనే భయం ప్రైవేటు పాఠశాలల వైపు చూపు తిప్పుతోంది.
మీడియా ఛానెల్స్ తరహాలో తెలిసీ, తెలియని విషయాలను నిజమని నమ్మి దేశం విలువ తగ్గించే ఇటువంటి వార్తలు ప్రచారం చెయ్యవద్దు. ఇటువంటి వార్తలు ప్రచారం/వ్యాప్తి చేస్తున్నది కూడా విదేశాలలోని పరిస్థితిని చూసినవారు; స్థానిక మేధావులు కావడం విచారకరం. (ఈ మేధావులు అనగా తమకు తాము మేధావులు అనుకునేవారు అని గమనించవలసిందిగా అభ్యర్థన.) ఇటువంటి వారందరూ మొసలి కన్నీరు కార్చటమే తప్పించి పరిస్థితిని మెరుగు పరచటానికి తమ జేబులోంచి కనీసం ఒక్క రూపాయి కూడా తియ్యరు. సరే, డబ్బు వదిలేద్దాం - గ్రామీణ ప్రాంతాలలో ఉన్న విద్యార్థులకు అవగాహన పెంచే సదస్సులాంటివి ఏర్పాటు చెయ్యవచ్చు కానీ వీరు అలాంటివాటికి ముందుకురారు, పరిస్థితి బాలేదు అంటూ విచారం వ్యక్తం చెయ్యటానికి మాత్రం తయారు. విదేశాలలో ఉన్న పరిస్థితికి ప్రభుత్వాలే కాదు ప్రజలు కూడా కారణం అన్న సంగతి మాత్రం గమనించరు. మార్పు అనేది విహంగంలాగా ఎగురుకుంటూ వచ్చేది కాదు, ఎవరో తెచ్చేది కాదు. అది అర్థం చేసుకుని, మార్పు కోసం పని చేసిననాడే తరువాతి తరాలు మార్పును చూడగలుగుతాయి.
చదువది యెంత కల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా
చదువు నిరర్థకంబు గుణసంయుతు లెవ్వరు మెచ్చ, రెచ్చటం
బదనుగ మంచికూర నలపాకము జేసిననైన నందు నిం
పొడవెడు నుప్పు లేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కరా ॥
Comments
Post a Comment