మళ్ళీ 'ఒకే ఒక్కడు' చూపాల్సిందే ...


మళ్ళీ 'ఒకే ఒక్కడు' చూపాల్సిందే ... 
************************************

        ఆ మధ్యన ఎప్పుడో మనం పైసా ఇవ్వక్కరలేదు, స్థలం సేకరిస్తే సింగపూర్ కంపెనీలే మొత్తం కట్టి మనకు ఇస్తాయి - రాజధాని మనది, నిర్మాణం వాళ్ళది అన్నారు. అసలు 'నా అమరావతి, నా ఇటుక' అన్నప్పుడే ఏదో తేడా అని అనుమానం వచ్చింది. ఆ పేరు కింద ఎంత సేకరించారు అది దేనికి ఖర్చు పెట్టారు లేదా పెట్టబోతున్నారు తదితర వివరాలేవీ ఎవరికీ తెలియదు. అలవాటు ప్రకారం దానిపై కూడా ఒక శ్వేత పత్రం విడుదల చేసి పడేస్తే పోలా. ఒకసారి భారీగా భూమి పూజ, మరొకసారి అత్యంత భారీగా శంఖుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. చివరకి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, బడుగు విద్యార్థుల నుండి కూడా ఒక్కొక్కరి నుండి రూ. 10/- కి తక్కువ కాకుండా విరాళాలు సేకరించాలని సర్కులర్ జారీ చేయడమేంటి? ఇప్పటికి హై కోర్ట్ వద్దన్నదని మానేస్తారని నమ్మకాలు లేవు. అలవాటేగా ఎవరికీ తెలీకుండా రహస్య జీవోలో లేకపోతే 'నా అమరావతి, నా పుస్తకం' అనో లేదో ఇంకో పేరో పెట్టి పీల్చేస్తారు, అనుమానం లేదు. 
       ముందుగా రాజధాని నిర్మాణానికి సంబంధించి ఏయే సింగపూర్ కంపెనీలు లేదా వేరే దేశాల కంపెనీలు ఆయా నిర్మాణాలు చేస్తున్నాయి; వాటికి ఖర్చు ఎవరు భరిస్తున్నారు; అందులో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వాటా ఎంత తదితర వివరాలన్నీ శ్వేత పత్రాలు విడుదల చేస్తే మంచిదేమో. సంపాదించే ప్రతి ఒక్కరి నుంచి విరాళాలు సేకరించటానికి ప్రయత్నించండి, తప్పు లేదు. ఇబ్బంది అయినా ఏదోలే అనుకుంటారు కానీ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల నుంచి నిర్బంధంగా విరాళాలు వసూలు చేయడమేంటి. ఇవన్నీ చూస్తుంటే చరిత్ర పుస్తకాలలో చదువుకున్న రక రకాల పన్నులు గుర్తుకు వస్తున్నాయి. బహుశా త్వరలో "పసుపు రంగు కాకుండా వేరే రంగు జెండా పట్టుకుంటే పన్ను, ఆ రెండు పత్రికలూ కాకుండా వేరేవి చదివితే పన్ను ..." ఇలా రకరకాల కొత్త పన్నులు లేదా నిర్బంధ విరాళాలు చూస్తామేమో. అయినా విద్యార్థుల మీద పడ్డారెంటండీ బాబూ - ప్రభుత్వ పాఠశాలల్లో చదివేది ఎవరు? ఇప్పటిరోజుల్లో చెప్పాలంటే ప్రైవేటు పాఠశాలల్లో చదివు'కొనే' స్థోమత లేనివారు, అవి అందుబాటులో లేనివారు, ఆర్ధిక స్థోమత లేనివారు. మరి మళ్ళీ వారినుండి నిర్బంధంగా వసూళ్లు చేయాలని నిర్ణయించడమేంటి?
       అధికారంలో ఉన్న పార్టీ సభ్యులలో చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారు. వారు అలాంటి, ఇలాంటి వారు కాదు కోటానుకోట్లకు అధిపతులు, స్వయానా ముఖ్యమంత్రి గారి కుటుంబానికి కూడా వ్యాపారాలు ఉన్నవి. అలానే ప్రతిపక్ష నాయకుడికి కూడా భారీ వ్యాపారాలున్నాయి, అయినా ప్రతిపక్షం వారు దీనిని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి పక్కనబెడదాం. (ఇరువురి గురించిన లేదా రాజకీయ నాయకుల గురించిన అక్రమ ఆస్తుల గురించిన ఆరోపణల గురించి ఇక్కడ ప్రస్తావించదలచుకొలేదు, ఆధారాలతో సహా న్యాయస్థానాలలో నిరోపించబడినపుడు చెప్పుకుందాం వాటి గురించి) అధికార పక్షంలో ఉన్న వ్యాపారస్తులందరినీ అధికారికంగా వారు/వారి వ్యాపార సంస్థలు ప్రకటించిన లాభాలలో 30% నుంచి 50% రాజధాని నిర్మాణానికి ఇమ్మనమని ఒక సర్కులర్ జారీ చెయ్యండి; అలాగే ప్రతి ఎమ్మెల్యె. ఎంపి ల జీతాలలో 25% ఒక సంవత్సరం పాటు; అలాగే ఎమ్మెల్యే, ఎంపిలకు పలు రాయితీలను ఒక సంవత్సరం పాటు రద్దు చేసి ఆ డబ్బును రాజధాని నిర్మాణానికి సంబంధించిన ప్రభుత్వ నిధికి జమ అయ్యేలా జీవో జారీ చెయ్యండి. అప్పుడు ఇలా ప్రభుత్వ పాఠశాలల్లోచదువుకునే చిన్న పిల్లలనుండి డబ్బు లాక్కునే అవసరం ఉండదు. కానీ అది ఎందుకు చెయ్యరు?
       అలాగే అప్పటి అవిభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐ.టి రంగానికి కర్త, కర్మ, క్రియ తమరే అని చెప్పుకుంటారు కదా తమరి హయాంలో హైదరాబాద్ లో స్థాపించబడిన ఐ.టి కంపెనీలను ఒక రెండు నెలల లాభాన్ని ఇవ్వమని అడగండి; తమరి దయవల్లే దేశం దాటి ఐ.టి ఉద్యోగం సంపాదించి అలా బతికేస్తున్నామని భ్రమపడే మేధావులను ఒక్కోకరినీ ఒక పదివేల రూపాయలు ఇమ్మనండి. మరో అతి ముఖ్యమైన విషయం, బహుశా తమరు మరచితిరేమో తెలియదు కానీ ఒక ఇరభై నెలల క్రితం వరకు ఇప్పటి ప్రతిపక్ష నేత గురించి తమరు బహు విధములైన ఆరోపణలు చేసియుండిరి లక్షలాది కోట్లు బొక్కెనని. ఇప్పుడు అధికారం తమరి చేతిలో ఉన్నది, బొక్కిన దానిలో కాస్తైనా కక్కించటానికి ప్రయత్నించండి, రాజధాని నిర్మాణానికి పనికొస్తుందేమో. అంతెందుకు మొన్నటికి మొన్న 'వోటుకు నోటు' పథకంలో మిగిలిన డబ్బును కూడా రాజధాని నిర్మాణానికి మళ్ళించండి. ఇవన్నీ కూడా కాదు, పైన పేర్కొన్న వాటిలో సగానికి కాస్త తక్కువ చేసినా చిన్న పిల్లల దగ్గరనుండి బలవంతంగా లాక్కునే దానికన్నా ఎక్కువే వస్తుంది.
       కంప్యూటర్ ముందర కూచుని ఎన్నైనా చెప్పొచ్చు అంటారా? అయితే చాలెంజ్ - ఒక నెల పాటు ఆ కుర్చీ నాకిచ్చి, ఈ కుర్చీ మీరు తీసుకుని చూడండి. నేను పని చేస్తాను, మీరు విమర్శించవచ్చు. చూద్దాం ... 'ఒకే ఒక్కడు' సినిమా గుర్తొస్తోందా? పర్లేదులే తమరు చేస్తున్న తుగ్లక్ పనుల ముందు, నా పగటి కలలు ఏపాటి చెప్పండి?

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన