అందరూ రాయాలి ...
వంశీ కలుగోట్ల // అందరూ రాయాలి ... //
**********************************
"ఎప్పుడూ వెనక్కు తిరిగి గతాన్ని చూసేవారిని నిందించడం నేడు పరిపాటి అయింది. ...
ఈ గతం నుండే భవిష్యత్తు రూపొందించవలసి ఉంది. ఈ ప్రాచీనతే భవిష్యత్తు కాగలదు."
వేదాల గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు వేద పండితులు కానీ,
విద్వాంసులు కానీ, వాటిని నమ్మేవారు కానీ చెప్పే మొదటి మాట 'వేదాలు
అపౌరుషేయాలు'; వేదజ్ఞానం నిర్లక్ష్యం చేయబడింది అని. వేదాలు ఎవరి చేత
చెప్పబడినవి కావు, దేవుళ్ళ దగ్గరనుంచి అందరూ వీటిని తెలుసుకుని తదనంతర తరాల
వారికి అందించినవారే కానీ సృష్టించిన వారు కాదు. మొట్ట మొదట వేదాలను
తెలుసుకున్న వారు వారికి ఎంత తెలుసో అంత అక్షరబద్ధం చెయ్యలేదు. అప్పట్లో
ఆచారం లేదా పధ్ధతి ఎలా ఉండేది అంటే - తమకు తెలిసిన విషయాలను గురువులు
శిష్యులకు బోధించేవారు. గురువులు చెప్పే మొత్తం విషయంలో శిష్యుల శక్తి
మేరకు గ్రహించగలిగినంత వరకు గ్రహించగలిగే వారు. ఇప్పుడు చూస్తున్నాం కదా
గురువులు చెప్పే విషయంలో శిష్యులు ఎంత నేర్చుకోగలుగుతున్నారో ... అప్పట్లో
కూడా అంతే పెద్ద తేడా ఏమీ ఉండేది కాదనే అనుకుంటున్నాను. అంటే
గురువులు చెప్పిన 100% విషయంలో శిష్యుల మేధోపరిజ్ఞానం బట్టి 10% నుండి 90%
వరకు గుర్తుంచుకునే వారు. 90% గుర్తుంచుకున్న శిష్యులు గురువులుగా మారి
తరువాతి తరాలకు అందించిన జ్ఞానం అంత అయితే అందులోనుంచి వారు గ్రహించినది
కాస్త వదిలేసి. ఆ విధంగా వేద జ్ఞానం మరియు ఇతర విషయ జ్ఞానం కూడా పలుచన
అవుతూ అవుతూ వచ్చింది.
ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే 'రాయటం' గురించిన ప్రాముఖ్యత గురించి చెప్పాలని;
జ్ఞానాన్ని, తెలుసుకున్న/తెలిసిన విషయాన్ని అక్షరరూపంలో సంక్షిప్తం చేయటం
ద్వారా తరువాతి తరాలకు జ్ఞానాన్ని, మంచిని వారసత్వంగా అందిచాలని. ఇప్పుడు
చాలా మంది చెపుతూ ఉంటారు - వేదాలలో అది ఉంది, ఇది ఉంది, ఇంకేదో ఉంది
అని. వాటిలో కొన్నిటికి సంబంధించిన ఆధారాలుగా ఉండినటువంటి తాళపత్ర గ్రంథాలు
ఏనాడో కాల్చబడ్డాయి లేదా విదేశీయుల తస్కరణకు గురయ్యాయి. తాళపత్రాల వాడకం
మొదలైన తరువాత కూడా జ్ఞానం అక్షరబద్ధం చేయబడలేదు లేదా చేయటానికి ప్రాధాన్యత
ఇవ్వబడలేదు. తొలిగా అక్షరీకరించబడినది కూడా చనిపోయిన పక్షిని చూసిన ఒక
వ్యక్తి బాధే కానీ జ్ఞానం/విషయం కాదు. ఆది కాలం నుండీ మనిషి భావాలకి ఇచ్చిన
విలువ జ్ఞానానికి ఇవ్వలేదనే అనిపిస్తుంది. తత్కారణంగా జ్ఞానం కంటే భావాలు,
అభిప్రాయాలు ఎక్కువగా అక్షరబద్ధం చేయబడ్డాయి. ఇక్కడ
గమనించవలసినది ఏమిటంటే ఈ అక్షరబద్ధం చేయడం అన్నది కేవలం వేదాల గురించి
మాత్రమే కాదు ఎటువంటి విషయం గురించి అయినా. అలెక్స్ హేలీ అనే పేరు చాలా
మంది వినే ఉంటారు అనుకుంటాను - అత్యంత ప్రాచుర్యం పొందిన 'ది రూట్స్'
పుస్తక రచయిత. తన వంశపు మూలాల గురించి అన్వేషిస్తూ అమెరికా నుంచి ఆఫ్రికా
దాకా సాగిన అలెక్స్ హేలీ పయనమే 'ది రూట్స్' పుస్తకం. మరొక
విషయం ఏంటంటే చరిత్రను, వాస్తవాలను అక్షరబద్ధం చేసి తరువాతి తరాలకు
అందించటంలో ఉన్న అనాసక్తి చాలా వాస్తవాలను మరుగున పడేలా చేసింది. ఉదాహరణకు ఇంతవరకు
తెలుగు భాషకు సంబంధించినంత వరకు తొలి పదంగా 'నాగబు' అనే పదం ప్రాచుర్యం
పొందింది. కానీ, కర్నూలు జిల్లాలోని కన్నమడకల గ్రామంలో దొరికిన శాసనం
ఆధారంగా తోలి తెలుగు పదం 'ఆంధ్ర దేశము' అని తెలుస్తోంది, కానీ జనాల, అధికార
వర్గాల అనాసక్తి కారణంగా అది పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. (దానికి
సంబంధించిన వివరాలతో కూడిన శ్యాం గారి పోస్ట్ ను నేను ఇటీవలే నా ఫేస్ బుక్ లో షేర్ చేసాను కూడా)
రాయటం అనగానే ప్రతి ఒక్కరు మొదటగా అనుకునేది కవిత్వం లేదా
కథలు/నవలలు. కానీ రాయటం యొక్క ముఖ్య ఉద్దేశం తెలిసిన విషయాన్ని పదిమందికీ
చేర్చటమే అది యే రూపంలోనైనా సరే. కవిత్వం, కథలు, వ్యాసాలు, పరిశోధన
పత్రాలు, బుర్రకథ రూపకాలు, పాటలు, జానపద గేయాలు - ఇలా ఎన్నో విధమైన రాత
ప్రక్రియలు ఉన్నాయి. ఎవరికీ తోచిన, వచ్చిన రీతిలో వారు రాయచ్చు,
రాసుకోవచ్చు. కానీ రాయటమే ముఖ్యం. ఏం రాస్తారు, ఎవరు చదువుతారు అన్నది
ముఖ్యం కాదు. ముందు రాయటం మొదలెట్టండి. ఎలా రాయాలన్నది తరువాత అలవడుతుంది.
చిన్నప్పుడు నడక నేర్చుకున్న తీరు గుర్తుకు తెచ్చుకోండి, పడిపోయినా ఎన్ని
తప్పటడుగులు పడినా వదలకుండా నడక నేర్చుకున్న ఆనాటి పట్టుదల ఏమైంది? మనిషి
జంతువులా కాదు బుద్దిజీవి అని చెప్పుకోవటానికి ఉన్న లక్షణాలలో జ్ఞానం
సంపాదించటం, తెలుసుకున్న జనాన్ని పంచటం అన్నవి అతి ముఖ్యమైనవి.
తెలుసుకుంటూనే పొతే మీరు మరో వంద జన్మలెత్తినా (పునర్జన్మలపై నమ్మకముంటే)
మొత్తం జ్ఞానం గురించి తెలుసుకోవటానికి సరిపోదు. తెలుసుకున్న జ్ఞానాన్ని
ఒకవేళ అది జ్ఞానం గురించిన అభిప్రాయమే అయినా అక్షరబద్ధం చేయాలి. మీకు
తెలిసింది, రాయాలనుకున్నది కవిత్వమో, కథనో, వ్యాసమో, సమాజం గురించో,
సన్నాసుల గురించో; జావా, ఒరాకిల్, డాట్ నెట్, టెస్టింగ్ లాంటి సాంకేతిక
అంశాల గురించో - ఏదైనా పర్లేదు. మీకు తెలిసినంత తెలిసిన వారు, మీకంటే
ఎక్కువ తెలిసిన వారే కాదు, మీకంటే చాలా తక్కువ తెలిసిన వారు, అసలు
తెలీనివారు కూడా చాలామంది ఉంటారు. మీ రాతల గురించి వ్యంగ్య వ్యాఖ్యలు చేసే
వారి గురించి కాదు తెలుసుకోవాలన్న జిజ్ఞాస, చదవాలనే ఆసక్తి ఉండే
వారిగురించి ఆలోచించండి. రాయండి. మనిషై పుట్టిన జీవి ఆచరించవలసిన ధర్మాలలో
జ్ఞానం పొందటం/సంపాదించటం, ఆ పొందిన/తెలుసుకున్న జ్ఞానాన్ని తరువాతి తరాలకు
వారసత్వంగా ఇవ్వటం అన్నవి అతి ముఖ్యమైనవి. అందుకే అక్షరజ్ఞానం ఉన్న ప్రతివారూ రాయాలి, రాసి తీరాలి.
Comments
Post a Comment