'ఎక్స్ ప్రెస్ రాజా' సినిమా గురించి నా రాత ...

'ఎక్స్ ప్రెస్ రాజా'  సినిమా గురించి నా రాత ... 
*******************************************
       'ఎక్స్ ప్రెస్ రాజా' సినిమా గురించి చెప్పే ముందు ఒక చిన్న ప్రస్తావన. ఈ సినిమా దర్శకుడు మేర్లపాక గాంధీ, ప్రముఖ రచయిత మేర్లపాక మురళిగారి తనయుడని మొన్ననే ఎక్కడో చదివాను. స్వాతి వారపత్రికలో మేర్లపాక మురళిగారి ధారావాహికలు చాలా ప్రాచుర్యం పొందాయి. ముఖ్యంగా ఆ రచనల్లో ఉండే 'పెద్దలకు మాత్రమే' తరహా అంశాలు బాగా ఆకట్టుకునేవి. మేర్లపాక గాంధీ చిత్రానువాదం తీరు (స్క్రీన్ ప్లే) చూస్తుంటే నాకైతే ముఖ్యంగా మేర్లపాక మురళిగారి 'శృంగారపురం ఒక కిలోమీటర్' అనే ధారావాహిక/నవల గుర్తుకువస్తోంది. చిన్న చిన్న కథల గొలుసులా ఉంటుంది ఆ నవల. అందులో 'పెద్దలకు మాత్రమే' అంశాలు పక్కనబెడితే ఆ కథావస్తువును చిన్న చిన్న ఉపకథలతొ నడిపిన తీరు అప్పట్లో నాకు తెగ నచ్చేది. కథలోని ప్రధాన వస్తువు నడక దెబ్బ తినకుండా, దానికి ఉపకరించే విధంగా ఉండే ఉపకథలు ఎన్నుకోవడం బావుండేది. ఇప్పుడు 'ఎక్స్ ప్రెస్ రాజా' సినిమా చూస్తుంటే అదే గుర్తుకు వచ్చింది. తండ్రి రచనలో అవలంబించే తీరును గాంధీ చిత్రానువాదంలో అవలంబించాడు. 'నాన్నకు ప్రేమతో' సినిమాలో సుకుమార్ అవలంబించిన గొలుసుకట్టు స్క్రీన్ ప్లే తో దీనికి పోలిక లేదు ఎందుకంటే అది ఒకే కథలో ఉండే సన్నివేశాలు. ఇక్కడ కొన్ని కొన్ని ఉపకథలను లేదా చిన్న కథలను కలుపుతూ అల్లుకుపోవడం అన్నది ఈ తరహాలో ప్రత్యేకత. 
       ఇక 'ఎక్స్ ప్రెస్ రాజా' సినిమా గురించి - కథావస్తువు పరంగా చాలా చిన్నది, రెగ్యులర్ గా మన సినిమాల్లో ఉండే తరహా కథే. జులాయి కొడుకు, ఆ కొడుకును తిట్టే తండ్రి, ఆ జులాయి పిల్లాడి ప్రేమలో పడే అందమైన అమ్మాయి, ఆయుధాలు శరీరం తప్ప మెదడు వాడని ప్రతినాయకుడు, మధ్యలో కొందరు భజనగాళ్ళు, విదూషకులు, కొన్ని మంచి పాటలు - అంతకుమించి చెప్పుకోవడానికి ఏముంది కథ గురించి. కానీ, ఆ కథను నడిపే తీరులో ప్రేక్షకులను ఆకట్టుకోవాలి. ఎప్పుడో ఒకసారి రాజమౌళి తన ఇంటర్వ్యూలో చెప్పగా విన్నాను - 'నేను కొత్త కథలు ఏమీ తియ్యట్లేదు, నాకు తెలిసిన కథలను కొత్తగా ఎలా చెప్పాలి అనే ప్రయత్నం చేస్తుంటాను' అని చెప్పాడు ఆయన. ఈ 'ఎక్స్ ప్రెస్ రాజా' సినిమాలో ప్రత్యేకత అదే. గొప్ప సినిమా కాదు, గొప్ప తరహా ఏమీ కాదు. కానీ ఎక్కడా విసుగు కలిగించదు, తలనెప్పి రాదు, చిరాకు అనిపించదు, ధియేటర్ లోంచి లేచి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, కుటుంబంతో కలిసి హాయిగా చూడవచ్చు. పేరుకు తగ్గట్టే వడివడిగా సినిమా దూసుకెళ్తుంది ... ఎక్కడా నెమ్మదించినట్టు అనిపించదు. కుక్క, వజ్రం చుట్టూ కథను నడిపిన తీరు కూడా సరదాగా కొత్తగా అనిపించేలా చాలా బాగా తీశారు.
       ఇక కథానాయకుడు శర్వానంద్ గురించి - తను పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసే తీరు గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నేను దాదాపుగా తన సినిమాలన్నీ చూసాను. హాలీవుడ్ లో నటుల నటన గురించి ఒక మాట వాడతారు 'క్యారెక్టర్ అండర్ ప్లే' చెయ్యటం అని. శర్వానంద్ పాత్రను తనదిగా చేసుకోడు, తనే పాత్రగా మారతాడు. అదే నటుడి మొదటి లక్షణం.  సినిమాలకు సంబంధించి కమర్షియల్ పోకడలు ఉన్న ఈ పాత్రను సమర్థంగా పోషించి తాను కమర్షియల్ చిత్రాలను కూడా తన భుజాలమీద మొయగలనని నిరూపించుకున్నాడు. కథానాయిక సురభి గురించి చెప్పాలంటే తనకు చేతనైనంత వరకు నటన చెయ్యటానికి ప్రయత్నించింది. ప్రేక్షకులకు చిరాకు కలిగే తీరులో ఎక్కడా తన హావభావాలు లేవు అంటే తను నటించినట్టే లెక్క ... అదీ కాక చాలా అందంగా కనిపించింది. తెరపై తను కనిపించినపుడు ఆహ్లాదంగా అనిపించేలా ఉంది. ప్రభాస్ శ్రీను లేదా ఫిష్ శ్రీను ఈ సినిమాలో దాదాపు మొత్తం సినిమా అంతా ఉండే పాత్రను పోషించి ఆకట్టుకున్నాడు. సప్తగిరి విదూషక పాత్ర మళ్ళీ బాగా పేలింది. చిరాకు పుట్టించకుండా ఆకట్టుకుంటాడు. షకలక శంకర్ పర్లేదు. ఇక ప్రధాన ప్రతినాయక పాత్రధారి హరీష్ ఉత్తమన్ తన మామూలు పంథాలోనే ప్రతినాయకుడిగా ఆకట్టుకున్నాడు. సుప్రీత్, నాగినీడు, దువ్వాసి మోహన్, ధన్ రాజ్ తదితరులు తమవంతు పాత్రలను చూసేవారికి ఎవరికీ ఇబ్బంది కలగని రీతిలో పోషించి ఆకట్టుకున్నారు. సినిమా మొత్తం మీదకి మరీ ఎక్కువగా కాకపోయినా కాస్తంత అయినా చిరాకు కలిగించిన పాత్ర ఏదైనా ఉందీ అంటే అది ఊర్వశి పోషించిన పాత్ర.
       ప్రవీణ్ లక్కరాజు అందించిన నేపథ్య సంగీతం కూడా సరిగ్గా కుదిరి చాలా బావుంది అనిపించేలా ఉంది, పాటలు కూడా సీట్ లోంచి లేచి వెళ్లిపోయేలా కాక బావున్నాయి. కార్తీక్ ఘట్టమనేని చాయాగ్రహణం చాలా బావుంది. కథాగమనానికి తగ్గ మూడ్ క్రియేట్ చేసి, ప్రేక్షకుడిని అందులో లీనమయ్యేలా చెయ్యటంలో ప్రవీణ్ సంగీతం, కార్తీక్ చాయా గ్రహణం ఏంతో దోహదం చేశాయి. మేర్లపాక గాంధీ దర్సకత్వం గురించి ముందే చెప్పాను. ఉన్న అందరిలో తను కూడా హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ తరాహాలను అనుకరించకుండా తన తండ్రి రచనల శైలిని తను చిత్రానువాదంలో ఉపయోగించి ఆకట్టుకుంటున్నాడు. ఇలా మామూలు కథలను ఈ శైలిలో ఆకట్టుకునేలా తీయగలిగితే అగ్ర స్థానానికి చేరటానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు. యువి క్రియేషన్స్ వారి నిర్మాణ విలువల గురించి - మొదటి సినిమా మిర్చి నుంచి వారు తీసే సినిమాలు ఎక్కడా రాజీ పడకుండా తీస్తున్నారు. 
       చివరగా - ఇది గొప్ప సినిమా కాదు, సందేశాత్మక చిత్రం కాదు, సాంకేతిక మాయాజాలాలు చూపే చిత్రం కాదు, కథానాయకుడిని వందలమందిని ఎదిరించే మహాబలుడిగా చూపే సినెమా కాదు. కానీ సినిమాని సినిమాగా, సరదాగా, కుటుంబ సమేతంగా ఇబ్బంది లేకుండా చూడాలనుకునేవారికి ఇది ఎటువంటి నిరాశ కలిగించదు. చూసి ఆనందించవచ్చు. 

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన