మేధావుల భయం సమాజానికి మంచిది కాదు ...

వంశీ కలుగోట్ల// మేధావుల భయం సమాజానికి మంచిది కాదు ... //
***************************************************************************
       'అతడు' సినిమాలో ప్రారంభంలో ఒక సన్నివేశం ఉంటుంది. సాయాజీ షిండే పాత్రధారి ఎన్నికల ప్రచార పర్వంలో తనమీద కాల్పులు జరిపించి సానుభూతి సంపాదించి తద్వారా ఎన్నికల్లో గెలిచి 'వీల్ చైర్ టు సిఎం చైర్' ప్రయాణం చెయ్యాలనుకుని పథకం రచిస్తాడు. సినిమాలో ఏమి జరిగిందనేది వేరే కథ. అలాగే బహుశా 'విజయానికి అయిదుమెట్లు' లో అనుకుంటాను యండమూరి వీరేంద్రనాథ్ గారు మరొక చక్కని ఉదాహరణ చెప్తారు. "ఒక పిల్లాడు పదవతరగతి పరీక్షలు తప్పిపోయాడనుకుందాం. వెంటనే అతడు ఇంటికి వస్తే తండ్రి చేతిలో తన్నులు, తిట్లు గట్రా. అదే ఆ పిల్లాడు దారి మధ్యలో ఏదో బావిలో దూకాడనుకుందాం. దారిన పోయేవారెవరో చూసి, రక్షించి, ఇంటికి తీసుకువస్తే అప్పుడు పరీక్ష తప్పాడన్న కోపం కన్నా కొడుకు దక్కాడన్న ఆనందం ఉంటుంది. అంతేకాక, పరీక్షలదేముందిలేరా మళ్ళీ రాయచ్చు అంటే ధైర్యం చెప్తారు. మొదటి అంశంలో అయితే కోపం ఉంటుంది అదే రెండో అంశంలో అయితే సానుభూతి ఉంటుంది." ఈ సానుభూతి అనేది ఉందే అది ఒక్కోసారి జనాల, అయినా ఒక్క జనాల ఏంటి కొన్నిసార్లు దేశాల తలరాతనే మార్చెయ్యగలదు. సానుభూతి అనేది ఒక పూనకం లాంటిది, మాస్ హిస్టీరియా అంటారే అలాంటిదే. పూనకం వచ్చిన వారికి ఒళ్ళూ, పై తెలీదు. సానుభూతి మైకం కమ్మిన మేధావులూ అంతే; నిజాలు తెలుసుకోవాలన్న తపన కానీ, తెలుసుకునే ఓపిక కానీ ఉండదు. 
       'బిజినెస్ మాన్' సినిమాలో పూరి జగన్నాథ్ ఒక డైలాగు రాసాడు, "డిస్కవరీ ఛానల్ లో పులి జింకని వేటాడటం చూస్తూ జింక బతకాలని ప్రార్థన చేస్తాం. జింక తప్పించుకోగానే టీవీ కట్టేసి మనం మాత్రం వెళ్లి కోడిని కోసి బిర్యాని వండుకు తినేస్తాం. మనకి జింక మీద జాలి కాదు, పులి మీద కోపం. దాన్ని ఏమీ పీకలేక అది ఓడిపోతే చూడాలనుకుంటాం". ఈ సానుభూతి అనేది కూడా దాదాపు అలాంటిదే. చచ్చినోడి మీద కోపం కంటే, ఆ చచ్చినోడి శత్రువుగా చెప్పబడే వాడిమీద లేదా వాడికి మద్దతిచ్చేవాడి మీద మనకు కోపం. వీడి చావుకు ఆ శత్రువు కారణమో కాదో శోధించి తెలుసుకునే ఓపిక ఉండదు, ఎవడో ఒకడు తెలపాలన్నా ఒప్పుకోం. ఎందుకంటే ఒప్పుకుంటే మనం ఓడిపోతామేమో అని భయం. ఒక్కసారి మన వాదన ఓడిపోయిందా ఇక జనాలు మనల్ని, మన వాదనల్ని నమ్మరేమో అనే విపరీతమైన భయం. ఇక అప్పటి నుండి అబద్ధాల మీద కోట నిర్మాణం మొదలవుతుంది. ఇక ఆ అబద్ధమే ఒక వాదమవుతుంది. తటస్థం అని చెప్పుకునే మరో మేధావి వర్గం ఉంటుంది. వీరు ఎలాంటి వారు అంటే మనకు ఒక సామెత చెపుతారు చూడండి 'మేకతోలు కప్పుకున్న పులులు' అని సరిగ్గా వీరు అలాంటివారు అన్నమాట. 'తటస్థం' అనే ముసుగు కప్పుకున్న ఒక వర్గపు వాదానికి రహస్య కాపలాకారులు ఈ మేధావులు. కావాలంటే తార్కాణాలు బోలెడు. ఎందుకంటే వీరికి 'దారుణం' అంటే ఒక వర్గం వారిపై జరిగే దాడులు మాత్రమే, కానీ దాడులకు మూల కారణం వీరు సమర్థించే మొదటి రెండో వర్గం వారు చేసిన మొదటి దాడి అంటే వీరు ఒప్పుకోరు. అది సమర్థనీయం అని ఇక్కడ అనట్లేదు. ఉదాహరణకి ఒక వ్యక్తికి ఒక కురుపు/పుండు అయిందనుకోండి. అది బాగా దురద వేసి గీరి/గోకి అది పెద్దది అయ్యాక వైద్యుడి వద్దకి వెళ్లాడనుకుందాం. వైద్యుడు 'నీకు గోళ్ళు ఉన్నాయి కాబట్టి గీక్కున్నావు, ఇదిగో గోళ్ళు పెరక్కుండా మందు ఇస్తున్నాను తీసుకో' అంటే ఎలా ఉంటుంది; ఆ పుండు అలానే ఉంటుంది. మందు ఇవ్వాల్సింది పుండు/కురుపుకు గోళ్ళకు కాదు. మూల కారణాన్ని గుర్తించకపోవడం వల్ల సమస్య కొనసాగుతూనే ఉంటుంది. తెలంగాణా ఉద్యమాన్ని కేవలం ఒక రాజకీయ ఉద్యమంగానే చూసిన ఇందిరా గాంధీ తదితరుల ధోరణి వల్ల కొన్ని వర్గాల ప్రజల మధ్య శాశ్వత విభేదాలు ఏర్పడ్డాయి. ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ముందుగా స్పందించాలి, తరువాత మూలాలను శోధించాలి. అటు పాలకులకు కానీ, ఇటు మేధావులకు కానీ అసలు సమస్యను విశ్లేషించే ఓపిక ఉండదు. మన రాజకీయ ఆటకి పనికి వస్తుందా రాదా అనే ఆతృత తప్ప. 
       ఒకప్పుడు చెప్పేవారు 'మేధావుల మౌనం సమాజానికి మంచిది కాదు' అని. కానీ ఈనాటి మేధావులు ఎంపిక చేసుకున్న అంశాల మీద మాత్రమే స్పందిస్తున్న తీరు ఈ సమాజానికి అసలు మేధావులే మంచిది కాదేమో అనిపించేలా చేస్తోంది. జల్లికట్టు జీవహింస అయితే మాంసాహారం తినటం జీవహింస కాదా? చనిపోయిన జంతువును తినటం వేరు, చంపి తినటం వేరు కదా. మరి అందులో జీవహింస కనిపించదా? అలాగే ప్రభుత్వ రక్షణ వ్యవస్థకు (పోలీసులు, హోం గార్డులు, సైన్యం గట్రా) ఏవైనా అసాంఘిక శక్తులకు జరిగే ఎదురుకాల్పులలో మరణించిన ప్రభుత్వ రక్షణవ్యవస్థ సభ్యులు జీవితాలు వీరు వల్లించే మానవ హక్కుల పరిధిలోకి రావు, జీతం మీద బతికే పదిమంది రక్షక భటులను చంపిన అవతలి వ్యక్తి మాత్రం ఆ మానవహక్కుల పరిధిలోకి వస్తాడు. వాడు కాలిస్తే ఆత్మరక్షణ కోసం, వీడు కాలిస్తే హత్య. ఇదీ ఈ మేధావుల తీరు. ఇదేనా మేదావిత్వం అంటే. ఎందుకో ఈ మధ్యకాలంలో మేధావులుగా చెప్పబడే కొంతమందిని చూస్తోంటే కొంత జాలి వేస్తోంది. అబద్ధం పునాదులు మీద నిర్మించబడ్డ కోట గోడలపై నిలబడ్డ ఈ కుహనా మేధావులు తమ వాదన ఓడిపోతే ఇక తన/తమ వెనకున్న జనాలు ఇక ఎప్పటికీ తమ వాదనలను నమ్మరేమో అన్న భయం, మేధావులుగా గుర్తించరేమో అనే దిగులు. మేధావుల మౌనం కాదు, భయం సమాజానికి మంచిది కాదు. అబద్ధపు గోడలమీది నుండి కిందకి దూకితే మీ కాళ్లేమీ విరగవు. ఇంతకాలం అబద్ధం అనే చీకటి కప్పివేసిన నిజం వెలుతురూ, నిజాయితీ గోడలూ కనిపిస్తాయి. నిజం తెలుసుకోవాలంటే ఆ రెండు వర్గాలలో ఒకడిగా ఉండకు - బయటకు వచ్చి చూడు. అణగారిన వర్గం అనేది కులమో, మతమో కాదు. ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా బలహీనులైన ప్రజల సమూహమే అణగారిన వర్గం. కులానికి, మతానికి మద్దతుగా నిలబడతారో లేక అణగారిన వర్గాల ప్రజలకు మద్దతుగా నిలబడతారో మేధావి అనే ముసుగేసుకున్న మనుషులు నిర్ణయించుకోవాలి. మీ భయం సమాజానికి మంచిది కాదు. సమస్య మూలాలు అన్వేషించాబడి, పరిష్కారం జరగాలంటే అది మీ వల్లే సాధ్యం. మేధావులూ భయం వద్దు, నిర్భయత్వానికి ప్రతీకలుగా నిలబడండి. నిజం కోసం పోరాడండి, భావోద్వేగాల కోసం కాదు. 

Comments

Popular posts from this blog

వంశీ వ్యూ పాయింట్ - అరవింద సమేత వీర రాఘవ

... తెలుగోడి శతృవు

... వోటింగ్ అయ్యాక