'... ట' వార్తలు


వంశీ కలుగోట్ల // '... ట' వార్తలు //
*****************************
       వార్తలందు '... ట' లేదా '... భోగట్టా' వార్తలు వేరయా మతిలేని చదువరి సొంబేరయ్యా. 'నిజం దేవుడెరుగు, నీరు పల్లమెరుగు' అన్న సామెత పుట్టుకకు కారణభూతం ఈ '... ట' లేదా '... భోగట్టా' వార్తలే. ఇవ్వాళ్టి రాజకీయాలలో అంటే అదేనండీ మీడియా రాజకీయాలలో ఈ భోగట్టా వార్తలకు, '... ట' వార్తలకు ఉన్నంతటి ప్రాధాన్యత మరి వేటికీ లేదు. వీళ్ళు తమకు ఉన్న ముసుగులో చిత్తానికి వచ్చినట్టు, ఏది పడితే ఆది రాసేసి చివర్లో ఒక '...ట' తగిలించేసి బతుకులను బజారున పడేసి వినోదం తిలకిస్తారు. ఉదాహరణకి ఎవరేనా రాజకీయ నాయకుడు ఏదో ఒక కేసులో విచారణ ఎదుర్కుంటూ అరెస్ట్ అయ్యాడనుకుందాం. జైల్లో, విచారణ పర్వంలో వారికి జరిగే మర్యాదలు ఎటువంటివో లోకవిదితమే. కానీ, వ్యతిరేక వర్గానికి చెందినా మీడియాలో 'కొట్టబోతే ఆయన ఏడ్చాడట', 'నిజం ఒప్పుకోకపోతే కొడతామన్నారని భోగట్టా', 'పాతికేళ్ళు శిక్ష పడొచ్చని న్యాయనిపుణులు అనుకుంటున్నట్టు భోగట్టా', 'శిక్ష పడాల్సిందేనని ప్రజలు కోరుకుంటున్నారట' ... గట్రా. ఇక సినిమా వారి విషయానికొస్తే, ఎన్నో నీతి పాఠాలు వల్లించే ఈ మీడియా మేధావుల సభ్యతా సంస్కారాలు ఎక్కడికెళతాయో కాని సభ్యతకు, సంస్కారానికి ఆమడదూరం ఉండే రీతిలో పదాలు వాడి మరి '...ట' వార్తలు రాస్తారు. 
       పత్రికా విలువలు అనే బ్రహ్మ పదార్ధం ఇప్పుడు ఉందని ఎవరూ అనుకోవడం లేదు. ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాలలో (అవిభాజితరాష్ట్రంగా ఉన్నపుడే) కొన్ని పత్రికలు, ఛానెల్స్ ఆ విలువలను ఏనాడో పతనం చెందించాయి. కానీ, గత కొద్ది కాలంగా ఆంధ్రజ్యోతి ఆ విలువలను మరింతగా దిగజారుస్తున్న తీరు చూస్తుంటే అసహ్యానికే అసహ్యం వేసే తీరున, జుగుప్స కూడా జుగుప్సపడే తీరున హేయంగా ఉంది. ఇటీవల ప్రతిపక్షనేత జగన్ ఢీల్లీ పర్యటనలో ప్రధానితో భేటీ మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా పర్యటన నుండి తిరిగి వస్తూ ఢీల్లిలో దాదాపు ఏడు గంటలపాటు రహస్యపర్యటన గురించిన అంశాలపై వారి కథనాలు చూస్తే ఎవరికైనా (మూర్ఖాభిమానులకు తప్పించి) అసహ్యం వేస్తుంది. ఇంతకుమించి దిగజారడానికి లోతులు లేవు అనేరీతిన వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఉద్దేశం వారు ప్రతిపక్షనేత జగన్ ను పొగడాలనో లేకపోతే వారి ప్రియతమనేత చంద్రబాబును విమర్శించాలనో అని కాదు. వారి తీరును చూడండి - జగన్ - మోడీ భేటీపై మొదట అసలు అపాయింట్మెంట్ ఎలా దొరికిందీ అని పలు కథనాలు వండి వార్చారు, ఇప్పుడు 'అమ్మ జగనా' అంటూ వారి భేటీలో ఏమి మాట్లాడుకున్నారో అని వివరణాత్మక కథనం అంటూ కొత్త కథ. దానిని ప్రధాని కార్యాలయం కానీ, జగన్ కానీ ధృవీకరించాలి కదా ఎందుకంటే అది వారిద్దరి మధ్య సమావేశం. ఇక చంద్రబాబు రహస్య పర్యటన గురించి కూడా - కేవలం పెట్టుబడుల కోసమే ఆ రహస్యపర్యటన, ప్రతి క్షణం పెట్టుబడుల కోసమే తపిస్తున్న బాబుగారు అంటూ భట్రాజు పొగడ్తలు. అటు ఆ విషయాలను కూడా ముఖ్యమంత్రి కార్యాలయం ధ్రువీకరించలేదు. ఇలా ఆ రెండు విషయాలను వారు ఇచ్చానుసారం కథానీకరించిన తీరు జుగుప్సాకరంగా ఉంది.
       ఇందిరా గాంధీ 'అత్యవసర పరిస్థితి' విధించినపుడు ప్రసార మాధ్యమాలను బెదిరించి, భయపెట్టి, దండించి ఎలా దారిలోకి తెచ్చుకోవాలో, తెచ్చుకోవచ్చో చూపించింది. (గోయెంకా లాంటి కొందరు లొంగలేదనుకోండి) కానీ, అది సాధ్యం కాదని త్వరితగతినే స్వయంగా ఇందిరాగాంధీకే అవగతమయింది. ఆ తరువాత మరెవరూ మీడియాను అదుపులోకి తెచ్చుకోవాలని, నియంత్రించాలని ప్రయత్నించిన దాఖలాలు పెద్దగా లేవు. అలానే మీడియా కూడా ఒక పార్టీ జెండా మోయడం అరుదుగా ఉండేది. నిజంగానే ప్రజావాణి వినిపించే సాధనాలుగా ఉండేవి. కానీ తొంభయ్యవ దశకం ద్వితీయార్ధంలో ఈ ధోరణి మారింది. అంతవరకూ ఉపయోగపడటమే ప్రధాన ఉద్దేశంగా ఉన్నది ఆ తరువాత ఉపయోగించుకోవటం ప్రధానంగా మారింది. అది ప్రజా ఉద్యమాలనైనా, ప్రభుత్వాలనైనా. నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మద్య నిషేధ ఉద్యమానికి అన్నిరకాలుగా అండగా నిలిచిన మీడియా, ఆ తరువాత చంద్రబాబు ప్రభుత్వం నిషేధం ఎత్తి వేసినపుడు ఆ నిర్ణయాన్ని ఆర్థికంగా అవసరమైన నిర్ణయంగా పేర్కొంటూ సమర్థిస్తూ ఆ విధంగా ముందుకు పోయిన తీరు దీనికి ఒకానొక చక్కటి ఉదాహరణ.
       ఆ తరువాత కొన్ని కొత్తగా వచ్చిన మీడియా సంస్థలు ప్రత్యేకించి కొన్ని రాజకీయ పార్టీలలో అప్పటికే పదవులను అనుభవిస్తూన్న వారు స్థాపించినవి లేదా వారు తరువాతి రోజులలో ఆయా సంస్థల అధిపతులు వివిధ పార్టీలలో చేరటం వంటి కారణాలతో గొంతు సవరించుకుని, బాణీ మార్చాయి. ఇది ఎంతదాకా వచ్చిందంటే దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి గారు 'ఆ రెండు పత్రికలు ...' అంటూ ఉటంకించడం, ఇటీవల ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు '... పత్రికను చదవద్దండి' అనటం దాకా వచ్చింది. ఇపుడు తాజా పరిణామాలతో వైకాపా వారు ఆంధ్రజ్యోతిని బహిష్కరిస్తున్నామనడం, కొద్దికాలం క్రితం నుండి ముఖ్యమంత్రి అనధికారికంగా సాక్షి మీడియా బహిష్కరణ అన్నవి కూడా పరిస్థితికి అద్దం పట్టేలా ఉన్నాయి. జరిగింది జరిగినట్టుగా చెప్పటం అన్నది ఈ మీడియా సంస్థలు మర్చిపోయి దశాబ్దాలు కావస్తోంది. చివర్లో ఒక '... ట' తగిలించేస్తే చాలు అది పత్రికా స్వాతంత్ర్యం అయిపోతుంది. మనం కూడా అంతే నాణేనికి ఒకవైపు మాత్రమే చూడటానికి అలవాటుపడ్డాం. నేను నువ్వు అనే తేడా లేదు మనకి నచ్చిన వైపు మాత్రమె చూడగలుగుతున్నాం. అవకాశం ఉన్నప్పటికీ లేదా వచ్చినా ఆ రెండో వైపు ఏముందో తెలుసుకునే ప్రయత్నం చెయ్యటం లేదు, ఒకవేళ తెలిసినా అది మనకు నచ్చని కోణం కాబట్టి ఒప్పుకోవట్లేదు. ఆ మధ్య రాంగోపాల్ వర్మ ఒక ట్విట్టర్లో ఒక వ్యాఖ్య చేసారు - "అన్నా హజారే జనాన్ని మర్చిపోయాడా లేక జనం అన్నా హజారేని మర్చిపోయారా?" అని. ఇప్పుడు అధికారంలో ఉన్నవారికి అన్నా హజారే అనే వ్యక్తి, ఆయన సిద్ధాంతాలు అనేవి అవసరం తీరిపోయిన వస్తువులు; మీడియాకు అన్నా హజారే ప్రస్తుత ప్రభుత్వాన్ని గద్దె దించగల సమర్థుడిగా అనిపించట్లేదు. '... ట' వార్తలు, భోగట్టా వార్తలు చదివి నమ్మే జనాలకు పత్రికలలో కనిపించని వ్యక్తులతో పని ఏముంటుంది?
       ఆధునిక సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ గా పేరు పొందిన మీడియా తాను స్వతంత్ర వ్యవస్థనని మరచిపోయి రాజకీయం మీద పడి బతికే పరాన్నజీవిగా మారిపోయింది. ప్రజావాణిని వినిపిస్తూ; ప్రజలకు అండగా నిలబడాల్సిన తీరు మార్చుకుని అధికార స్వరం వినిపిస్తూ, ప్రభుత్వాలకు, పార్టీలకు బాకా ఊదే మాధ్యమంగా మారిపోయింది. వినేవాడు ఏదో అయితే ఐతే ఇంగ్లీష్ లో హరికథ చెపుతానన్నాడట ఎవడో ... అలా ఉంది వీటి తీరు. ఎన్నో చట్టాలు చేస్తున్నారు, పనిలో పనిగా ఈ '... ట', భోగట్టా, అనుకుంటున్నారు అనే పదాల వాడకంతో ఇష్టం వచ్చిన వార్తలు రాయటాన్ని నిషేధించాలని ఒక చట్టం చేస్తే బావుణ్ణు.

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన