... శ్రీరంగనీతులు

... శ్రీరంగనీతులు
*****************
       యండమూరి వీరేంద్రనాథ్ గారి గురించి కొత్తగా ఎవరికీ పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదనుకుంటాను. నవలా, కథా, వ్యక్తిత్వ వికాస పుస్తకాల రచయితగా; వ్యక్తిత్వ వికాస శిక్షకుడిగా ఆయన సుపరిచితులు. మొదటగా - యండమూరి వీరేంద్రనాథ్ గారు తన పలు వ్యక్తిత్వ వికాస రచనలలో ప్రస్తావించిన ఒక విషయం ప్రస్తావిస్తాను. 'ఏదైనా ఒక రంగంలో అత్యున్నత స్థానాన్ని పొందిన వారు, కొద్ది కాలానికి కొత్త నీరు వచ్చిన తరువాత పాతబడిపోతారు. అపుడు వారు అస్థిత్వ సమస్యను ఎదుర్కుంటారు. దీన్నే ఆంగ్లంలో ఐడెంటిటీ క్రైసిస్' అంటారు. సినిమా నటులు కానివ్వండి, రచయితలూ, కవులు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, పారిశ్రామిక వేత్తలు - ఇలా ఎవరైనా, యే రంగం వారైనా కావచ్చు; అత్యున్నత స్థాయిని అనుభవించాక కొత్త వారు ఉన్నత స్థానానికి చేరినపుడు వారికి అస్థిత్వ సమస్య మొదలవుతుంది. కొందరు మార్పును అంగీకరించి హుందాగా పెద్దరికం పాత్ర ధరిస్తారు, విలువ నిలుపుకుంటారు. ఇక మిగతావారు నోటికోచ్చినదల్లా మాట్లాడుతూ, ఎదుటివారిపై ప్రత్యేకించి ఉన్నతస్థానంలో ఉన్నవారిపై ఏవో ఒక విమర్శలు చేస్తూ, తమ గతకాలపు నీడలోనే బతకాలని ప్రయత్నిస్తారు, అభాసుపాలవుతారు." తన రచనలలో ఆయన ప్రస్తావించిన మరొక విషయం "ఒకరిని పొగడాలంటే మరొకరితో పోల్చి విమర్శించాల్సిన అవసరం లేదు, అది మూర్ఖులు చేసే పని" అని. మక్కీకి మక్కీ కాకపోయినా ఇదే భావం/అర్థం వచ్చే వాక్యాలు పలుమార్లు తన రచనలలో ఆయన ప్రస్తావించారు.
       ఇప్పుడిదంతా ఎందుకంటే, ఇటీవల యండమూరి గారు ఒక కాలేజీలో ఉపన్యసిస్తూ దేవిశ్రీ ప్రసాద్ ని పొగడటానికి చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ని విమర్శించిన తీరు చూస్తే 'శకునం చెప్పే బల్లి కుడితిలో పడింది' అనే సామెత గుర్తుకువస్తోంది. ఆ విమర్శలు కూడా జుగుప్సాకరమైన రీతిలో, ఆయన స్థాయికి తగని విధంగా శారీరక లోపాలను ఎత్తి చూపుతూ విమర్శించటం ఆయన యే వ్యక్తిత్వ వికాస పధ్ధతి చూసి నేర్చుకున్నారో తెలీదు మరి. ఈ అంశం తీసుకున్నది రామ్ చరణ్ నో లేక చిరంజీవినో సమర్థించటానికి కాదు. యండమూరి గారు కూడా తాను తన రచనలలో పేర్కొన్న అస్థిత్వ సమస్యతో బాధపడుతున్నట్టు ఉన్నారు అనిపించి. ఆ సందర్భంలో దేవిశ్రీ ప్రసాద్ ని పొగడాలంటే రామ్ చరణ్ నో లేక మరోకరినో విమర్శించాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఆయన చెప్పిన వాక్యాలే ఉదహరిస్తాను 'సృష్టిలో ప్రతి జీవి ప్రత్యేకమే. ఎవరి సొంతతనం, అస్థిత్వం, వ్యక్తిత్వం వారికి ఉంటాయి. ఒకరిని మరొకరితో పోల్చాలనుకోవడం చాలా తప్పు' అని ఆయనే పలు రచనలలో సోదాహరణంగా వివరించి మరీ చెప్పారు. అటువంటిది తాను పలుమార్లు చెప్పిన నీతులను, ఆచరిస్తానని చెప్పుకున్న విలువలను తుంగలో తొక్కే రీతిలో మాట్లాడిన తీరు ఒక రచయితగా ఆయనను విపరీతంగా అభిమానించే నన్ను, నాలాంటివారిని బాధించింది. మరి యండమూరి గారు అస్థిత్వ సమస్యతో బాధపడుతున్నారా లేక మరేదైనా కారణముందో తెలీదు. చిరంజీవితోనో, ఆయన కుటుంబ సభ్యులతోనో ఏవైనా విభేదాలు ఉంటే అది వ్యక్తీకరించాల్సిన పధ్ధతి ఇదేనా అని ఒక వ్యక్తిత్వ వికాస శిక్షణ నిపుణుడిగా తనకు తాను ఆయన ప్రశ్నించుకోవాలి.
       ఈ విషయంలో ఎటువంటి వ్యక్తిత్వ వికాస పుస్తకాలు రాయకపోయినప్పటికీ ఆచరించి చూపిన అక్కినేని నాగేశ్వరరావు గారి తీరు చూసి నేర్చుకోవాలి. ఒక ప్రముఖమైన స్థానం, స్థాయిలో ఉన్నప్పుడు మన మాట ప్రభావం చూపగలదని తెలినపుడు ఎలా మాట్లాడుతున్నామో, ఎలా ప్రవర్తిస్తున్నామో పరిశీలించుకోవాలి. తొమ్మిది పదుల వయసులో కూడా ఎటువంటి సందర్భంలోనూ సంయమనం కోల్పోకుండా వ్యవహరించిన అక్కినేని గారి తీరు అధ్బుతం. ఒకసారి ఆయనకు జరుగుతున్న సన్మాన కార్యక్రమంలో ఆయన అనుభవమంత వయసు ఉంటుందో ఉండదో తెలీని ఒక నటుడు అక్కినేని గారికంటే తానే గొప్ప అని సొంతడబ్బా కొట్టుకుని అక్కినేని గారిని కించపరిచే తీరున మాట్లాడితే ఆయన సమాధానమిచ్చిన తీరు అద్భుతం. (ఆ మరో నటుడి పేరు ఇక్కడ ప్రస్తావించడం బావుండదు.) అటువంటివారిని చూసి నేర్చుకోవాలి. యండమూరి గారికి చెప్పే టంతటి వాడిని కాదు, కాని అభిమానిగా ఆయన దిగజారుతుంటే చూడలేక ఈ బాధంతా. కనీసం తాను అంతగా వ్యతిరేకించే, విమర్శించే చిరంజీవిని చూసి అయినా నేర్చుకోగలిగితే బావుంటుంది. లోపల ఏమనుకుంటాడో తెలీదు కాని జనాల మధ్యలో ఉన్నపుడు చిరంజీవి ప్రవర్తన, భాష హుందాగా ఉంటుంది. చివరగా - ఈ బాధ అంతా రామ్ చరణ్ ను లేదా చిరంజీవి కుటుంబాన్ని విమర్శించినందుకు కాదు, విమర్శించిన వ్యక్తి యండమూరి వీరేంద్రనాథ్ గారు అయినందుకు ఈ బాధ. 'చెప్పేవి శ్రీరంగనీతులు, దూరేవి ... కొంపలు'  గుంపులో ఆయన కూడా ఒకడవుతున్నాడని బాధ.

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన