... రెండు ప్రశ్నలు
వంశీ కలుగోట్ల // ... రెండు ప్రశ్నలు //
********************************
ఇవాళ రెండు ప్రశ్నలు ఎదురయ్యాయి - రెండు విభిన్న పోస్ట్ లలో. మొదటిది నిజానికి ప్రశ్న కాదు, దాదాపు 98% మంది మీడియా పట్ల కలిగి ఉండే స్థిరాభిప్రాయం. రెండవది అమాయకత్వం అనిపించింది. నాకు తెలిసిన/అనిపించిన వివరణ ఇస్తున్నాను.
*
ఒక పత్రికలో లేదా మీడియా గ్రూప్ లో వచ్చేవన్నీ అబద్ధాలే అవుతాయా?
మన దగ్గర ఒక్కో మీడియా గ్రూప్ కు సంబంధించిన యాజమాన్యానికి ఒక పార్టీ లేదా సిద్ధాంతం పట్ల అభిమానం ఉంటుంది. ఆ మీడియా గ్రూప్ లో పనిచేసే సిబ్బందికి, వారి వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, పత్రికా విలువలు కంటే యాజమాన్యం అభీష్టానికి అనుగుణంగా పనిచేయడమే రావాలి. అలాంటివారే ఉంటారు. అయితే ఇదంతా మాక్సిమం స్థానిక రాజకీయాల వరకే పరిమితమై ఉంటుంది, కొన్నిసార్లు స్థానికంగా ప్రభావితం చేయగల జాతీయ రాజకీయ అంశాలు/పార్టీల పట్ల కూడా అది కనబడుతుంది. అవి కాక మిగతా అంశాలు అవి తాము అభిమానించే పార్టీలను ప్రభావితం చేస్తాయని అనుమానపడనంతవరకూవాటిపట్ల ఒక ప్రత్యేకధోరణి కనబడదు - వార్తల్లాగానే అందిస్తారు - అంతర్జాతీయ అంశాలు, క్రీడలు, సాహిత్యం, ఆరోగ్యం, ఆర్థికం వంటివాటిలో ఈ ధోరణి కనబడదు (సాధారణంగా). అయితే స్థానికమైన వార్తలు మాత్రమే ఎక్కువగా ఫాలో అయ్యే జనాలు ఆయా పత్రికలపట్ల ఒక ఫిక్స్డ్ అభిప్రాయం ఏర్పరచుకుంటారు. అంటే ఆ పత్రిక భావజాలానికి వ్యతిరేక అభిప్రాయం కలవాళ్ళు ఆ పత్రికలో వచ్చేవన్నీ అబద్ధాలే అనుకుంటారు. ఉదాహరణకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు అని రాస్తే, వాడు ట్రంప్ కు మద్దతుదారు అండీ, ఇక్కడ వాళ్ళకు (వారికి నచ్చని పార్టీ/వ్యక్తి) మద్దతు ఇచ్చేవాడు అక్కడ అంతే అంటూ అక్కసు చూపుతారు. వీరికి నిజం లేదా విషయం కంటే ముఖ్యం ఆ నిజం/విషయం ఎందులో అంటే ఏ మీడియాలో వచ్చింది అన్నది ముఖ్యం, శంఖులో పోస్తే కానీ తీర్థం కాదంటారు కదా అలా అన్నమాట. యెల్లో జర్నలిజానికి ఇలాంటివారే ఆధారం, బలం కూడానేమో.
*
జర్నలిజంలో సొంత పత్రికలూ ఉంటాయా?
ఈ ప్రశ్నలో సహేతుకత కనిపించలేదు నాకు లేదా అమాయకత్వం అనుకోవాలి. ఎందుకంటే సొంత పత్రికలను కలిగి ఉండటం అన్నది ఇవాళ్టిది కాదు. నాకు తెలిసినంతవరకూ ఈ సొంత పత్రికలను కలిగి ఉండటం అన్నది కమ్యూనిజంతో మొదలైంది అనుకుంటాను (ఒకవేళ తప్పని తేలితే సవరించుకుంటాను), ఆ తరువాత మన దగ్గర చెప్పాలంటే ఆర్ఎస్ఎస్, వి.హెచ్.పి వంటి సంస్థలు తమ భావజాలాన్ని చాటుకోవటానికి వార, పక్ష, మాస పత్రికలు కలిగి ఉండేవి/ఉన్నాయి. ఇక జనబాహుళ్యానికి సమాచారం అందజేసే దిన పత్రికలూ, చానెళ్ళు విషయంలో - మీడియా వెర్సస్ ఇందిరా అనుభవంతో, మీడియా ధోరణి మారిపోయింది. మీడియాను మేనేజ్ చేసే వ్యక్తులు పుట్టుకొచ్చారు. దాంతో ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలవాల్సిన మీడియా రాజకీయానికి కొమ్ముకాసే స్థితికి దిగజారింది. ఇపుడు ప్రత్యేకించి మనం చెప్పక్కర్లేకుండా ఏ మీడియా ఎవరికి కొమ్ము కాస్తుంది అనేది సామాన్యజనాలు కూడా చెప్పగలరు. దాదాపు 95% మీడియా అంతా ఒకేవైపు ఉంది. నిజానికి ఆ 5% మీడియా పుట్టుకకు కారణం కూడా ఆ మిగతా మీడియా ధోరణి మాత్రమే కారణం అని చెప్పవచ్చు. కొందరికి బయటకు కనబడేలా సొంతపత్రికలు ఉండకపోవచ్చు కానీ, రకరకాల కారణాల వల్ల ఒక వర్గానికి బానిసగా పడుండే మీడియా ఉంది ఇక్కడ. గత పదేళ్ళకాలం నుండి జర్నలిజంలో నీచత్వాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్న మీడియా గ్రూప్ మన దగ్గర ఉన్నదే కావడం మన దౌర్భాగ్యం. ఈ రోజుల్లో సొంత/పర పత్రికలంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు అని నా ఉద్దేశం.
Comments
Post a Comment