... ట్రైటర్ (2008)

వంశీ వ్యూ పాయింట్ // ... ట్రైటర్ (2008) //
*************************************
            ఇటీవలి కాలంలో అంటే గత రెండు మూడు దశాబ్దాల కాలం నుండి టెర్రరిజం మీద వచ్చినన్ని సినిమాలు బహుశా ప్రేమ మీద కూడా వచ్చి ఉండవేమో అనిపిస్తుంది. అలా తామరతంపరగా వచ్చిన సినిమాల్లో ఒక హాలీవుడ్ ఫిలిం ట్రైటర్ (Traitor), 2008 లో వచ్చిన ఈ సినిమా యూఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఫలితాన్నే రాబట్టినట్టుంది.  ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేని మరొక అంశం ఏంటంటే ఈ టెర్రరిజం బేస్డ్ మూవీస్ లో 99% సినిమాల్లో ఇస్లామిక్ టెర్రరిజం అన్నది ప్రధాన అంశం. ట్రైటర్ సినిమా అందుకు భిన్నం కాదు. అయితే ఇందులో ఇస్లాంను రెండు విధాలుగా అర్థం చేసుకున్న రెండు గ్రూప్స్ (లేదా వ్యక్తులు) మధ్య సంఘర్షణగా చెప్పవచ్చు. Steve Martin అందించిన కథలోని ఆ సంఘర్షణను చాలా చక్కగా, జాగ్రత్తగా, ఆకట్టుకునేలా తెరకెక్కించటంలో దర్శకుడు Jeffrey Nachmanoff విజయం సాధించాడు అని చెప్పవచ్చు.
            సమీర్ సుడానీస్ - అమెరికన్ మరియు ఇస్లాం సిద్ధాంతాలను పవిత్రంగా ఆచరించే నిఖార్సైన ముస్లిం వ్యక్తి. అయితే కొన్ని అనుకోని పరిస్థితుల్లో అతడు ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజషన్లో భాగమవుతాడు. అదే సమయంలో సుడాన్, నైస్ (ఫ్రాన్స్) లలో జరిగిన పేలుళ్ళకు సమీర్ ను బాధ్యుడిగా అనుమానిస్తూ ఎఫ్.బి.ఐ స్పెషల్ ఏజెంట్ రాయ్ క్లేటన్, అతడి కోసం వెతుకుతుంటాడు. ఈ క్రమంలో సమీర్ పట్టుబడతాడా? నిఖార్సైన ఇస్లాం ఆధ్యాత్మిక వాదిగా తెలిసిన సమీర్ ఎందుకు టెర్రరిజం వైపు వెళ్ళాడు? చివరకు సమీర్ ఏమవుతాడు? అనేవిఅమెజాన్ ప్రైమ్ వీడియోలో (అంటే ఇపుడు థియేటర్స్ లేవు అండ్ ఇది ఎపుడో 2008 లో వచ్చిన సినిమా కాబట్టి) చూసి తెలుసుకుంటే బావుంటుంది. సినిమా ఆధ్యంతం బిగుతైన స్క్రీన్ ప్లే, అర్థవంతమైన సంభాషణలు, మంచి సన్నివేశాలు, అద్భుతమైన నటన (లీడ్ ఆక్టర్స్) లతో ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాలో నటీనటుల గురించి చెప్పుకోవాలంటే ముఖ్యంగా సమీర్ పాత్ర పోషించిన Don Cheadle ఈ సినిమాను తన భుజాలపై మోశాడు. అద్భుతమైన నటనతో కట్టి పడేస్తాడు. ముఖ్యంగా ఆ పాత్రలోని సంఘర్షణను చూసే ప్రేక్షకులు ఫీలయ్యేలా చేస్తాడు. రెండు భిన్న భావాల మధ్య అతడు పడే ఆవేదన మనల్ని కదిలించేస్తుంది. ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించే ఒమర్ పాత్రధారి Saïd Taghmaoui,  ఎఫ్.బి.ఐ స్పెషల్ ఏజెంట్ రాయ్ క్లేటన్ గా కనిపించే Guy Pearce లు కూడా పాత్రలకు తగ్గట్టుగా, చక్కగా నటించారు. ముఖ్యంగా ఒమర్ గా నటించిన  Saïd Taghmaoui ఆకట్టుకుంటాడు.
            చాలావరకూ ఇంగ్లీష్/హాలీవుడ్ సినిమాలు చూసేపుడు డైలాగ్స్ అర్థం కావడం కోసం సబ్ టైటిల్స్ మీద ఆధారపడటమో లేక సన్నివేశాల ఆధారంగా అర్థం చేసుకోవడానికో ప్రయత్నిస్తుంటాం. ఈ సినిమాలో డైలాగ్స్ ఎంత బావుంటాయి అంటే చెప్పడం కష్టం. మామూలుగా చెప్తే, అత్యంత సాధారణంగా అనిపించే చిన్న చిన్న మాటలు కూడా సన్నివేశంలో ఎంతటి భావగాఢతను కలుగజేస్తాయంటే, అది సినిమాలో చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా ప్రధాన పాత్రధారి సమీర్ అపుడపుడూ చెప్పే ఖురాన్ కోట్స్, కొన్ని మోరల్ సెంటెన్సెస్ లాంటివి జస్ట్ అలా ఒక ముద్ర వేస్తాయి అంతే. సమీర్ - ఒమర్ మధ్య జరిగే సంభాషణలన్నీ ఇస్లాం రెండు రకాలుగా అర్థం చేసుకున్న ఇద్దరు మేధావుల మాటలుగా అనిపిస్తాయి. ఆ డైలాగ్స్ తో పాటుగా వాటికి తగ్గ హావభావాలను, సంఘర్షణను అద్భుతంగా పలికించిన Don Cheadle మరియు Saïd Taghmaoui లు సినిమా చూసాక కూడా గుర్తుండిపోతారు. ఫోటోగ్రఫీ, మ్యూజిక్ తో పాటు మిగతా అన్ని అంశాలు కూడా సినిమా థీమ్ ని ఎలివేట్ చేసేలా ఉన్నాయి. దర్శకుడు Jeffrey Nachmanoff కథను చాలా సమర్థంగా తెరకెక్కించాడు. చూడాలనుకుంటే - ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది.

Comments

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన