... మరో యుద్ధానికి సిద్ధంగా ఉండాల్సిందే
వంశీ కలుగోట్ల // ... మరో యుద్ధానికి సిద్ధంగా ఉండాల్సిందే //
****************************** *********************
"రాజు తెలివైనవాడైతే యుద్ధం గెలవడానికి మాత్రమే కాదు, యుద్ధం ఓడిపోతే ఏం చేయాలో కూడా వ్యూహం ఆలోచిస్తాడు. యుద్ధంలో జయాపజయాలను ఊహించలేం, కాబట్టి ఓడిపోతే మనముందు ఉన్న మార్గాలేంటి (యుద్ధంలో ప్రాణాలు కోల్పోకపోతే) అన్నది, యుద్ధానికి ముందుగానే సమీక్షించుకోవాలి." ఇపుడు మనం అలానే ఆలోచించాలి. మనముందు ఉన్న తక్షణ సమస్య, కరోనా మరియు లాక్డౌన్ ని ఎదుర్కోవటమెలా అన్నదే కావచ్చు. కానీ, కరోనా అదుపులోకొచ్చాక ఉండబోయే పరిస్థితులు అత్యంత దారుణంగా ఉండబోతున్నాయన్నది నిజం. గతంలో వచ్చిన ఆర్ధికమాంద్యాలు ప్రత్యేకించి కొన్ని రంగాలకు పరిమితమైనవి. కానీ, ఇపుడు అలా కాదు. ప్రతి రంగం కరోనా దెబ్బకు కుదేలైంది. అది కూడా ఏదో పది దేశాలో లేక ఇరవై దేశాలో కాదు - పెద్దన్న అమెరికా దగ్గరనుండి ప్రతి ఒక్క దేశం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనబోతోంది. కరోనాకు మందు కొనగొనబడనంతవరకూ, దాన్ని అదుపు చేయడానికి చర్యలు చేపట్టడం తప్ప మరేమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు అందరూ. వ్యక్తిగత శుభ్రత పాటించటం, భౌతిక దూరం పాటించటం వంటికి కొంతవరకూ ఉపకరించగలవు. కానీ, అధిక జనసాంద్రత ఉన్న మన దేశంలో ఆచరణలో అది అతి కష్టమైన అంశం. నిత్యావసర వస్తువుల కోసం దుకాణాల వద్ద ఎలా ప్రవర్తిస్తున్నారో చూస్తున్నాము, అలానే ఏదో జరిగిపోతోంది అన్న పానిక్ ఫీలింగ్ తో విద్యావంతులు కూడా సొంతూళ్ళకు వెళ్ళడానికి బారులు తీరుతున్నారు. ఇదంతా ఎక్కడికి దారి తీస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇపుడు మనమంతా ఇంట్లో కూచునే యుద్ధం చేస్తున్నాం, చెయ్యాలి - కనిపించని శతృవుతో. దానితో పాటు, ఈ యుద్ధం ముగిశాక ఉండబోయే పరిస్థితులను ఎదుర్కోవడానికి మానసికంగా, ఆర్థికంగా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే బహుశా మనం ఇంతవరకూ చూడని, వినని తీరున ఉండవచ్చు ఈ రాబోయే ఆర్ధిక మాంద్యం.
మనమంతా ఇపుడు యుద్ధానంతరం మనం ఏం చెయ్యగలమన్నది ఆలోచించుకోవాలి. ముఖ్యంగా ఐటీ రంగంలో సర్వీసెస్ బేస్డ్ కంపెనీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతున్నాయి. పలు కంపెనీలు ఖర్చును తగ్గించుకోవటానికి ఉద్యోగుల సంఖ్యను తగ్గించవచ్చు. అలాగే కొత్త ఉద్యోగాల కల్పన అన్నది కష్టమైనది. ఖాళీలను పూర్తించటానికి కూడా, ఆ పోసిషన్ కు ఇపుడు అవసరమైన దానికంటే ఎక్కువ స్కిల్స్ కావాలని అనవచ్చు. కాబట్టి, రాబోవు నెలల్లో తమ తమ కెరీర్ కు సంబంధించి అడిషనల్ స్కిల్స్ ను నేర్చుకోవాలి. పలు అంచనాల ప్రకారం ఐటీ మరియు ఐటీ ఆధారిత పరిశ్రమలతో పాటు, పలు ఇతర రంగాలలో మొత్తం దాదాపు 2.5 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోవచ్చు అని అంచనాలు వెలువడుతున్నవి. ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు ఉద్యోగుల సంఖ్య తగ్గించడం, వేతనంలో కోత వంటి చర్యలు చేపడుతున్నట్టు వార్తలు వస్తున్నవి. ఇటువంటి పరిస్థితుల్లో సాంకేతిక నైపుణ్యం పెంచుకోవడంతో పాటు, మానసికమైన దృఢత్వాన్ని అలవర్చుకోవడం అతి ముఖ్యమైనది. కరోనా వల్ల ఇపుడు పడుతున్న ఇబ్బందుల కంటే, కరోనా అదుపులోకి వచ్చిన తరువాత పరిస్థితులు మరింత కష్టంగా ఉండబోతున్నాయన్న వాస్తవాన్ని ఎదుర్కోవడానికి మనమంతా సిద్ధంగా ఉండాలి. అది ఎలా అంటే ఇదమిద్ధంగా చెప్పడం కష్టమేమో ... కొన్ని సూచనల్లాంటివి
-> మనం ఇపుడు చేసే పని మాత్రమే కాక మనకు ఇంకా ఏమేం వచ్చు అన్నది ఒకసారి సమీక్షించుకోవాలి.
-> ఇపుడున్న ఉద్యోగం (ఉంటే) మాత్రమే కాక ఆదాయం వచ్చే పనులు ఏమేం చెయ్యగలం అని ఒకసారి ఆలోచించుకోవాలి.
-> ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉండబోయే పరిస్థితుల్లో, ఇపుడు చేస్తున్న ఖర్చుల్లో ఎన్ని నిజంగా అవసరమైనవో సమీక్షించుకుని - ఖర్చుల అదుపు మీద దృష్టి పెట్టాలి.
-> పరిస్థితిని మనమొక్కరమే అర్థం చేసుకుంటే సరిపోదు - ఇతర కుటుంబ సభ్యులు, పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోగలిగేట్టు చెప్పగలగాలి/చెప్పాలి.
-> ముఖ్యంగా శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేందుకు ఏం చెయ్యాలో చూసుకోవాలి. తగినంత వ్యాయామం, శ్వాస సంబంధితమైనవి కూడా చేస్తూ ఉండాలి.
-> ముఖ్యంగా సామాజిక జీవనంలోని మూలసూత్రాలను అనగా సామాజిక బాధ్యతలను కూడా అర్థం చేసుకోగలగాలి. అంటే మొక్కలు నాటడం/పెంచడం, సాటి వారికి వీలైనంత (మన పరిమితులలో) సహాయం చెయ్యడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటం వంటివి అలవాటు చేసుకోవాలి.
-> నిరంతరం మన నైపుణ్యతను పెంచుకునే మార్గాలు అన్వేషించాలి - అది వృత్తి జీవితమైనా లేదా వ్యక్తిగత జీవితమైనా.
... కరోనా ఒక అనూహ్యమైన విపత్తే కావచ్చు, తద్వారా ఉత్పన్నమైన పరిస్థితుల ద్వారా మనం పాఠాలు నేర్చుకోవాలి. కరోనాను ఎదుర్కొనడం ఇపుడు అత్యంత ప్రధాన సమస్య కాగా, తదనంతరం ఉండబోయే ఆర్ధిక మాంద్య పరిస్థితిని తట్టుకుని నిలబడటం అన్నది అంతకంటే పెద్ద సమస్య. మనిషి పరిణామ క్రమంలో దారులు మూసుకుపోయి పరిస్థితి ఏర్పడిన ప్రతిసారీ, ఒక కొత్తదారి కనుగొనబడింది. ఇపుడు మరోసారి కరోనా మనముందున్న మార్గాలన్నింటిని మూసివేసి, ఇంట్లో కూచోబెట్టింది. ఇపుడు ఏమవుతుందో చూడాలి ... మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉందాం. బహుశా ఇటువంటి పరిస్థితులను ఊహించేనేమో 'ఇనుపకండలు, ఉక్కు నరాలు ఉండే మనుషులు కావాలి' అని వివేకానంద గారు అన్నది. ఇపుడు ఉన్న పరిస్థితుల్లో మనల్ని నిలబెట్టేది ఒకటే 'నిరంతరం మనల్ని మనం మెరుగుపరుచుకోవడం' ... ప్రారంభించండి.
Yes Vamshi Garu. We have to brace for testing times ahead. Good suggestions given by you. Elders should guide and support youngsters emotionally. Youngsters in private sector IT sector etc.
ReplyDeletewho are affected can think about alternate career option after the lockdown ends. Youngsters are very intelligent. Only thing is they need support and guidance.
Thank you ... yes, with guidance and support young generation can do wonders. I will do my best
DeleteThinking aloud on retooling.
ReplyDeleteడిమాండ్ పెరిగే స్కిల్స్: contactless tracking (e.g. QR), big data, non-clinical trials & rapid testing, 3D printing, surveillance systems (e.g. IR, heat tracing), BCP, ISMS, HSE (OSHAS), kernel
డిమాండ్ తగ్గే స్కిల్స్: biometrics, leisure & entertainment analytics, ERP, gaming, GUI, waterfall model projects, non-real time applications, large (say > 500 kLoC) products
ఈ వ్యాఖ్య రెండు మూడు నిమిషాలలో రాసింది కనుక ఎన్నో తప్పొప్పులు ఉండవచ్చును. Not backed by research or analysis. Discretion advised.