వంశీ వ్యూ పాయింట్ // ... 'ఆమిర్' (2008) //

క్వారంటైన్ ఫిలిం సజెషన్స్ -  1 (క్వారంటైన్ అనే కాదు, జనరల్ గా కూడా) 

వంశీ వ్యూ పాయింట్ // ... 'ఆమిర్' (2008) //
***************************************
            నిద్దర్లో ఏదైనా పీడకల వస్తే, మెలకువ వచ్చాక తిరిగి నిద్రపోలేం - ఆ కల కలవరపెడుతుంది. జీవితంలో ఏదైనా అనుకోని షాకింగ్ ఘటన జరిగితే, కోలుకోవటానికి చాలాకాలం పడుతుంది. మనమెక్కడో దూరంగా ఉంటాం లేదా దూర ప్రాంతానికి వెళ్లి - తిరిగి మన ఊరు రాగానే - బస్సు స్టాండ్/రైల్వే స్టేషన్/ఎయిర్పోర్ట్ లో ఉండగానే ఎవరైనా ఫోన్ మీ కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేశాం అని చెబితే ఎలా ఉంటుంది - బాధ, కోపం, ఉద్వేగం ఏమో మనం ఎన్ని రాసుకున్నా, అది అనుభవించేవాడికి ఒక తీవ్ర కష్టం. లండన్ నుండి కుటుంబాన్ని కలవడానికి వచ్చిన ఆమిర్ కు ఎయిర్పోర్ట్ లో ఉండగానే అలాంటి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఇక అక్కడి నుండి ఆమిర్ వాళ్ళు ఫోన్ లో చెప్పే రీతిలో చేయక తప్పని పరిస్థితులు కల్పిస్తూ, అతడి చేత తాము అనుకున్నపని చేయించాలని కనిపించని విలన్స్ చేసే ప్రయత్నమే ఆమిర్. 
            ఇవాళ్టి రోజుల్లో మనం అనేక ఆత్మాహుతి దాడుల గురించి వింటున్నాం. అందులో నిజంగా మూర్ఖంగా సిద్ధాంతాల పేరుతోనో లేక మతం పేరుతోనో అలా చేసేవారే కాక; ఇలా రకరకాల కారణాల చేత ప్రేరేపింపబడి, బెదిరింపబడి అసువులు బాసినవారుండవచ్చు అన్న 'నాణేనికి మరోవైపు' భావనను కలిగిస్తుంది ఈ సినిమా. ఆమిర్ ఒక సినిమా కాదు - కొన్ని ఘటనల్లో నాణేనికి రెండోవైపు ఉంటుందన్న భావనను కలిగించే అంశం. కథగా చెప్పుకోవడానికి పెద్ద కథేమీ కాదిది. ఒక ప్రధాన పాత్ర, ఫోన్ లో అతడిని గైడ్ (బెదిరిస్తూ) చేసే ఒక కంఠం, అక్కడక్కడా చిన్న చిన్న పాత్రలు - అంతే. ఈ కథను భుజాన మోయడానికి ఎంతో పరిణితి, సమర్థత, నైపుణ్యం ఉండటం మాత్రమే కాక పాత్రను అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఆషామాషీ పాత్ర కాదిది, కొందరు నటులకు జీవితంలో ఒకేసారి వచ్చే ఛాన్స్. డాక్టర్ ఆమిర్ అలీ పాత్ర పోషించిన రాజీవ్ ఖండేల్వాల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బుల్లితెరపై పాపులర్ నటుడు అయిన రాజీవ్ మొదటి చిత్రం ఇది. పాత్రలో పరకాయ ప్రవేశం చేసాడని చెప్పవచ్చు. ఆమిర్ సినిమా రాజీవ్ ఖండేల్వాల్ తో పాటుగా, సినిమాటోగ్రాఫర్ అల్పోన్స్ రాయ్, సంగీత దర్శకుడు  అమిత్ త్రివేది (సైరా చిత్రానికి ఇతడే సంగీతం) లకు కూడా తొలి చిత్రం. అంతేకాక యూ టీవీ స్పాట్ బాయ్ బ్యానర్ కు కూడా తోలి ప్రయత్నం. కానీ ... ఎక్కడా ఏ ఒక్కరూ ఇది తమ తొలిచిత్రమనే భావనే కలిగించరు. వావ్ అనుకుంటాం వారి పనితనం చూసి. రాజ్ కుమార్ గుప్తా రాత, తీత అద్భుతం. ప్రతి డిపార్ట్మెంట్ నుండి అతడు తగిన రీతిలో, ఎంత కావాలో సరిగా అంతే రాబట్టుకోగలిగాడు. 
            అమిర్ చూస్తున్నంతసేపు ఒక ఉద్విగ్నతకు గురి చేసి, చివర్లో బాధ కలిగిస్తుంది. ఇలా కూడా జరగొచ్చేమో అనిపిస్తుంది, కొంతమంది విషయంలో ఇలా నిజంగానే జరిగి ఉండచ్చేమో. సినిమా చూశాక, మనల్ని కొంతకాలం వెంటాడుతుంది. "ఒక వ్యక్తికి తెలియని విషయంతో మొదలయ్యే సినిమా, ప్రపంచానికి తెలియని విషయంతో ముగుస్తుంది." ఈ వాక్యానికి అర్థం సినిమా చూస్తే తెలుస్తుంది. ఆమిర్ చూడాల్సిన సినిమా ... యూట్యూబ్ లో ఉంది, చూడనివారుంటే చూడండి 

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన