... విషయమా, వ్యక్తా - ఏది ముఖ్యం?

వంశీ కలుగోట్ల // ... విషయమా, వ్యక్తా - ఏది ముఖ్యం? //
************************************************
            చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే వ్యక్తి ముఖ్యమా లేక విషయం ముఖ్యమా? ఆచరించకుండా ఒక వ్యక్తి ఏదైనా చెబితే, దానికివిలువిస్తారా? కేవలం విషయం మాత్రమే ముఖ్యం అనుకుని ఉండే ప్రపంచంలో ఇంతమంది సద్గురువులు, పీఠాచార్యులు, వివిధ శాఖల అధిపతులు ఉండేవారు కాదు. వ్యక్తి ముఖ్యమా, విషయం ముఖ్యమా అన్నదానికి సమాధానం చెప్పడం కష్టం - ఎందుకంటే ఇది మ్యాథమెటిక్స్ లాంటిది కాదు. ఏవేవో సూత్రాల ఆధారంగా ఇది కరెక్ట్ అని చెప్పలేం. అది ఒక సమూహం మీద ఆధారపడి ఉండవచ్చు, ఆ సమూహంలోని జనాల ఆలోచనలను బట్టి ఉండవచ్చు. చాలామంది అటూ ఇటూగా కాకుండా వ్యక్తి ముఖ్యమే మరియు విషయమూ ముఖ్యమే అంటారు; మరికొందరు వ్యక్తి ఎటువంటివాడైతేనేం విషయం ముఖ్యం అంటారు ... ఇలా పలు రకాలుగా చెప్తారు. నా ఉద్దేశంలో అయితే మనం ఆ విషయం సమాజం మీద చూపాల్సిన ప్రభావం ఏమిటి అన్న అంతిమ లక్ష్యం ఆధారంగా దీన్ని చూడాలి. ఎందుకంటే చెప్పే వ్యక్తి మీద ఆధారపడి ఆ విషయం సమాజమే మీద చూపే ప్రభావం ఉంటుంది. కరోనా జాగ్రత్తల గురించి నేనో, నువ్వో చెపితే పట్టించుకోవటానికి - చిరంజీవి, అమితాబ్ చెబితే పట్టించుకోవటానికి తేడా ఉంది.
            మనకు తెలిసి (అంటే అదే పురాణాల ఆధారంగా) రాముడు ఏనాడూ గీత లాంటి నీతిబోధలు చేయలేదు. మరి ఏ గీతా చెప్పకపోయినా రాముడు ఎందుకంత పాపులర్ అయ్యాడు? ప్రతి ఒక్కరూ చదవాలని చెప్పే భగవద్గీత ఉపదేశం చేసినా కూడా కృష్ణుడు ఎందుకు రాముడిని బీట్ చెయ్యలేకపోయాడు (పాపులారిటీలో)? ఎందుకంటే రాముడు తానేం చెప్పాడో అది పాటించాడు, ధర్మం ఏం చెప్పిందో అది ఆచరించాడు. కృష్ణుడు అలా కాదు, రాముడి కంటే ఎక్కువగా జనాలకు మంచి చెప్పాడు - కానీ తనకేది ఇష్టమో అది పాటించాడు. ఆ పురాణాలు నిజమా, అబద్ధమా అన్నవి, ఆ ఇద్దరూ అవతార పురుషులు అని చెప్పబడే విషయం పక్కనబెడదాం. ఇక్కడ ఇద్దరిలో సమాజంపై ఎక్కువ ప్రభావం చూపింది ఎవరు? ఆయన ఆచరించి చూపినవి పాటించారా లేక ఈయన చెప్పినవి పాటించారా - అంటే రెండూ ప్రస్నార్ధకాలే.
            గతంలో ఒకసారి రామకృష్ణ పరమహంస వద్దకు ఒకావిడ తన కొడుకును తీసుకువచ్చిందట. ఆమె 'మా అబ్బాయి నిత్యం స్వీట్స్ తింటూనే ఉంటాడు. మేం చెబితే వినట్లేదు, మీరైనా చెప్పండి' అని అడిగిందట. దానికి ఆయన తరువాతి వారం రమ్మన్నాడట, అలా నాలుగైదు వారాలు తిప్పించుకున్నాక, ఆ బాలుడిని దగ్గరకు పిలిచి 'నాన్నా, స్వీట్స్ ఎక్కువగా తినకు. మంచిది కాదు' అన్నాడట. ఆ బాలుడి తల్లికి కోపం వచ్చి, 'ఇంత చిన్నమాట చెప్పడానికి ఇన్నిరోజులు తిప్పించుకోవాలా?' అన్నదట. దానికి రామకృష్ణ పరమహంస గారు 'అమ్మా, ఆ బాలుడిలాగే నేనూ స్వీట్స్ విపరీతంగా తినేవాడిని. వీడికి చెప్పాలంటే నేను ఆచరించాలి. ఆ అలవాటు మానుకోవడానికి నాకు ఇన్నిరోజులు పట్టించి, వీడూ కొన్నాళ్ళకు మానుకుంటాడులే' అన్నాడట. 
            అంటే విషయంతో పాటు వ్యక్తి ముఖ్యం అని కాదు - మనం అర్థం చేసుకోవలసిందేమిటంటే విషయం యొక్క అసలు లక్ష్యం ఏదైతే ఉంటుందో అది సమూహంపైన ఎపుడు అధికంగా ఉంటుందంటే, అది చెప్పే వ్యక్తి దానిని ఆచరించి చెప్పినపుడు. శంఖంలో పోస్తేనే కానీ తీర్థం  కాదు అని అందుకే అంటారు. విషయం ఎంత గొప్పదైనా సరే, దాన్ని చెప్పేవాడు ఆచరిస్తూ చెపితే దాని ప్రభావం జనాల మీద అధికంగా ఉంటుంది. విషయం గొప్పదనం అంతా అది జనాల మీద చూపే ప్రభావాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి నా దృష్టిలో విషయం మరియు దాన్ని చెప్పే వ్యక్తి అన్నవి సరితూకంగా ఉండాలి - అపుడేవిషయం యొక్క అసలు లక్ష్యం సాధింపబడగలడు. ఇది నా అభిప్రాయం

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన