... తప్పెవరిది?

వంశీ కలుగోట్ల // ... తప్పెవరిది? //
*****************************
            2009/10 ప్రాంతంలో అనుకుంటా ఒకసారి వెహికల్ అవసరమైనపుడు, మంచాలకట్ట శ్రీనివాస రెడ్డి అన్న గడివేముల నుండి ఒక డ్రైవర్ ను వెహికల్ తో పంపారు, అతడి పేరు రసూల్. అప్పటినుండి ఇప్పటి వరకూ ఎపుడు వెహికల్ అవసరమైనా అతడే. మేము పిలిస్తే, అప్పటికప్పుడు మిగతా బుకింగ్స్ ఏవైనా ఉంటే క్యాన్సల్ చేసుకుని వస్తాడు. ఇటీవల ఒకసారి నేను ఊరెళ్ళినపుడు అతడి వెహికల్ లోనే కర్నూలు వచ్చాను. అనుకోకుండా ఒక బంధువుకు ఒక అర్జెంటు/సీరియస్ పని ఉండటంతో రసూల్ వాళ్ళను తీసుకుని బెంగుళూరు వెళ్లాల్సి వచ్చింది. దాంతో అప్పటికపుడు గడివేములలో వేరే వెహికల్ డ్రైవర్ కి ఫోన్ చేసి, రమ్మన్నాడు. ఒక గంటన్నరకు ఆ వెహికల్ వచ్చింది. కర్నూలులో పనులు చూసుకుని, సాయంకాలానికి రిటర్న్ బయలుదేరాం. సాధారణంగా నేను లాంగ్ జర్నీస్ లో కూడా నిద్రపోను. వీలయితే పుస్తకం చదువుతాను లేదంటే మనుషులను (హ హ). సో, ఆ ప్రయాణంలో పుస్తకం చదివే సౌలభ్యం లేకపోవడంతో ఆ డ్రైవర్ తో మాట్లాడటం మొదలుపెట్టాను. అప్పటికింకా ఈ కరోనా/కోవిద్ - 19 హడావుడి మొదలవలేదు. చర్చ రాజకీయాలవైపు మళ్ళింది. చెప్పానుగా అప్పటికింకా కరోనా హడావుడి లేదు కాబట్టి, స్థానిక ఎన్నికల హడావుడి ఉండింది కాస్త. మా ఊరు, గడివేముల ఇలా అక్కడ రాజకీయాల పరిస్థితి ఎలా ఉంది, గెలుపోటములు గురించి చర్చించిన తరువాత - ప్రభుత్వ పథకాల వైపు మళ్ళింది. అప్పటికి హాట్ టాపిక్ ఏంటంటే ఇళ్ళ స్థలాల పంపిణీ. ఉగాదికి ఇళ్ళస్థలాలు ఇవ్వటానికి అంతా సిద్ధం చేస్తున్నారు. ఆ టాపిక్ వచ్చేసరికి, ఆ డ్రైవర్ (పేరు కావాలనే ప్రస్తావించటం లేదు) ఫైర్ అయ్యాడు. 'ఏదో చేస్తారని ఓటేస్తే, వీళ్ళు దెబ్బ కొడతన్నారు సామీ' అన్నాడు కోపంగా. మా ప్రాంతంలో అలాంటి మాట వినడం ఫస్ట్ టైం కావడంతో ఆసక్తి కలిగింది. ఎందుకు అని వివరాలు అడిగాను. ఏవేవో చెప్పాడు, అది చెయ్యలేదు ఇది చెయ్యలేదు - దానికి, 'ఇంకా సంవత్సరం కూడా కాలేదు కదా ఇంకొన్నాళ్ళు చూస్తే మేలేమో' అని అన్నాను. కొంతసేపటికి అతడి కోపానికి అసలు కారణం బయటపడింది. 
            విషయం ఏంటంటే వారిది దిగువ మధ్య తరగతికి, కాస్త దిగువన ఉండే కుటుంబం (బీపీఎల్ కాదన్నమాట), ఉమ్మడి కుటుంబం - అయిదుగురు అన్నదమ్ములు. అందరూ పేరెంట్స్ తో సహా కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు, ఐదుగురికి పెళ్ళిళ్ళు అయి, పిల్లలు కూడా ఉన్నారు. అంతకుముందు వారికి ఎలక్ట్రిసిటీ సబ్సిడీ వచ్చేది, అంటే బిల్ నామ్ కే వాస్తే లాగానో లేక పూర్తిగా కట్టకుండానే ఉండేవారట. (దాదాపు ఇరవై మంది ఉన్న కుటుంబం కరెంట్ వినియోగం ఎంత లేదన్నా ఒక 800 నుండి 1000 యూనిట్ల దాకా ఉండవచ్చన్నది నా అంచనా) ఇపుడు జగన్ వచ్చాక, 300 యూనిట్లకు పైబడి కరెంట్ వినియోగించినవారికి ఆ సబ్సిడీ కట్ చేశారట. అది మొదటి కంప్లైంట్; ఇక రెండవది - అయిదుగురు అన్నదమ్ములున్నప్పటికీ ఒక్కరికే ఇంటి స్థలం మంజూరు అయింది. సో ఆ రెండు కారణాల వల్ల అతడికి/అతడి కుటుంబానికి ప్రస్తుత ప్రభుత్వం మీద కోపం ఉంది. సరే అలాగని అవతలి పార్టీకి వోట్ వేస్తారా అని అడిగాను, అలా వేసేవాళ్ళమైతే ఇంతకుముందే వేసేవాళ్ళం కదా - చూస్తాం ఇంకేం చేస్తాడో అన్నాడు. 
            ఇక్కడ అతడికున్న కంప్లైంట్స్ లో మొదటిది - నిజానికి ఆ నిబంధన ఇప్పటిది కాదనుకుంటా, ఇంతకుముందే ఉన్నప్పటికీ అమల్లో పెద్దగా పట్టించుకోలేదు. ఇపుడు ఉన్న పరిస్థితుల్లో భారం తగ్గించుకోవడానికి, తాను ప్రకటించిన పథకాల అమలుకు వెసులుబాటు కోసం అన్ని మార్గాలను అన్వేషిస్తున్న జగన్ గారి ప్రభుత్వం - ఇటువంటి అక్రమ వినియోగాలపై అదుపు చర్యలు చేపట్టినట్టు ఉంది. ఇక రెండవది - అది కూడా నిబంధనల ప్రకారం 'కుటుంబంలో ఒకరికి ఇంటి స్థలం' ప్రకారం. వారిది ఉమ్మడి కుటుంబం కాబట్టి, ఒక్కరికే వచ్చింది - అది అతడికి కాక, మరొక సోదరుడికి వచ్చింది. అలాగని అన్నిచోట్లా ఆయా నిబంధనలు అంతే కఠినంగా అమలు చేస్తున్నారా అంటే అనుమానమే. ఎన్నికల్లో వోట్స్ కోసమని ఇబ్బడిముబ్బడిగా సంక్షేమపథకాలు ప్రకటించడం, వాటి అమలుకు మల్లగుల్లాలు పడటం ప్రతి ప్రభుత్వానికి అలవాటైపోయింది. అంతేకాదు గత ప్రభుత్వాలు అమలు చేసిన సంక్షేమ పథకాలు కూడా గుదిబండలా వేలాడుతుంటాయి - వాటిని తీసేస్తే జనాల్లో వ్యతిరేకత రావచ్చునని భయం. ఇలా ఆర్థికవ్యవస్థపై భారం పెరుగుతూనే పోతోంది. ఏదైనా ఆపద, విపత్తు వచ్చినపుడు ఆడుకోవలసిందే. కానీ - ఊరకే కూచోబెట్టి మేపే చర్యలు మాత్రం ఖండించవలసిందే. ఉద్దరకొచ్చే డబ్బులు (సౌకర్యాలు) పట్ల మక్కువ చూపడం ప్రజల తప్పా లేక ప్రజలను 'ఉద్దర'ల (అదేలేండి సంక్షేమపథకాలంటారు) మీద బతికేలా చెయ్యడం రాకీనాల తప్పా? అభివృద్ధి పథంలో మన దేశం ఒక అడుగు ముందుకుపడితే, నాలుగు అడుగులు వెనక్కు పడటానికి కారణం మాత్రం ఇలాంటి సంక్షేమపథకాలే కారణమన్నది నా అభిప్రాయం. 

Comments

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన