... చచ్చేవాడిది, బ్రతకలేని భయం

వంశీ కలుగోట్ల // ...  చచ్చేవాడిది, బ్రతకలేని భయం //
**********************************************
అందరికీ భయాలుంటాయి
కానీ ఒక్క క్షణపు ఆలోచన
... కాసింత ధైర్యం
కొందరిని బ్రతుకువైపు నడిపిస్తుంది
మరికొందరిని చావువైపుకు తోస్తుంది

బ్రతికేవాడిది ... చావలేని భయం 
చచ్చేవాడిది ... బ్రతకలేని భయం   

            డిప్రెషన్ - ఇదేమీ కొత్తపదం కాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అనేక జీవితాలను బలితీసుకునే జబ్బు. డిప్రెషన్ కు అనేక రకాల కారణాలు ఉండవచ్చు. కొంతమంది డాక్టర్స్ చెప్పేదానికి ప్రకారం చాలాసార్లు డిప్రెషన్ అనేది బయటి సంఘటనలతో సంబంధం లేకుండా మెదడులో న్యూరో ట్రాన్స్మిషన్ లో జరిగే మార్పుల వల్ల రావచ్చు. అలాగే జీవితంలో జరిగే పలు ఘటనలు కూడా డిప్రెషన్ కు కారణం కావచ్చు. ఏ దశలో లేదా ఎలాంటి వ్యక్తులు డిప్రెషన్ కు లోనవుతారు అన్నదానికి స్పష్టమైన సమాధానం ఇవ్వడం కష్టమేనేమో. డబ్బు, హోదా, ఆనందాలు అన్నీ ఉన్నాయి అని మనం అనుకునే ప్రముఖుల జీవితాలు ఈ డిప్రెషన్ కారణంగా ఒక చిన్న రాయి తగిలి పగిలిపోయిన అద్దాలమేడలా కూలిపోవడం పలు ఘటనల్లో చూశాం. సైకియాట్రిస్ట్ ను కలవగలిగేంతటి పరిజ్ఞానం ఉండీ, అందుకు కావలసినంత ఖర్చు పెట్టుకోగలిగిన స్థోమత ఉండీ కూడా ఆ జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోవడం బాధాకరం. 
            ఈ డిప్రెషన్ అన్నది కేవలం మెదడులో న్యూరో ట్రాన్స్మిటర్ వచ్చే మార్పుల వల్ల వచ్చేది మాత్రమే కాదు అనుకుంటాను; బహుశా అది ఒక రకం డిప్రెషన్ కావచ్చునేమో. శరీరంలో (లేదా మెదడులో) తెలీకుండా జరిగే అనేకానేక మార్పుల వల్ల కూడా డిప్రెషన్ రావచ్చు; అదే సమయంలో జీవితంలో జరిగే అనేకానేక సంఘటనలు కూడా డిప్రెషన్ కు గురయ్యేలా  చేస్తాయి కదా. . నాకు బాగా తెలిసిన ఒక బంధువుల అబ్బాయిని ఇంటర్మీడియట్ లో ఒక ప్రముఖ ప్రైవేట్ కాలేజీలో హాస్టల్ లో చేర్చారు, హైదరాబాద్ లో. ఆ అబ్బాయి చిన్నప్పటినుండి హైపర్ ఆక్టివ్ మరియు చదువులో కూడా బ్రిలియన్ట్. అక్కడ ర్యాగింగ్ లాంటి ఘటన ఏదో జరిగింది - ఆ అబ్బాయి డిప్రెషన్ కు లోనయ్యాడు. ఎంతో ధైర్యశాలి అయిన ఆ అబ్బాయి చిన్న చిన్న శబ్దాలకు, చీకటికి భయపడేంత పిరికివారుగా మారిపోయాడు. పలు చోట్ల వైద్యం తీసుకున్నాక కొంచం బెటర్ అయినప్పటికీ, ఇప్పటికీ అతడిని ఒంటరిగా వదిలెయ్యలేని పరిస్థితి (ఇప్పటికి ఆ ఘటన జరిగి పదేళ్ళు పైగానే అయింది). ఇలానే మరికొన్ని కూడా తెలుసు. నాకు తెలిసిన ఈ వ్యక్తుల ఘటనలన్నీ బయటి సంఘటనల ప్రభావంగా డిప్రెషన్ లోకి నెట్టివేయబడిన జీవితాలే. కొందరు త్వరగా కోలుకున్నారు, కొందరు ఇంకా ఇబ్బంది పడుతున్నారు. బాధాకరమైన విషయం ఏంటంటే తెలిసినవారిలో ఈ డిప్రెషన్ వల్ల బలవన్మరణం పొందిన వారు కూడా ఉన్నారు.  
            చాలా ఘటనల్లో చుట్టూ ఉన్న మనుషుల తీరు డిప్రెషన్ కు కారణం కావడం జరుగుతోంది, అలాగే వారు కోలుకోవాలంటే కూడా చుట్టూ ఉన్న మనుషుల తీరే ముఖ్యం అన్నది నిజం. మాట్లాడితే డిప్రెషన్ పోకపోవచ్చు, మాటలతో పాటు మందులు అవసరం ఉండొచ్చు. డబ్బు, హోదా, గుర్తింపు వంటివి ఉన్నప్పటికీ చిన్న వయసులోనే బలవన్మరణం పొందిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుట్ ఘటన డిప్రెషన్ అన్నదాన్ని ఒక ప్రముఖ చర్చనీయాంశం చేసింది. డిప్రెషన్ ను ఎలా గుర్తించగలగాలి అన్నది అత్యంత ముఖ్యమైన అంశం. శారీరక సంబంధమైన సమస్యల కంటే మానసిక సమస్యలతో బాధపడే వారే ఎక్కువుంటారు. కానీ అవి బయటకు కనబడవు ... వాటిని తగిన సమయంలో గుర్తించి, ట్రీట్ చేయడం అన్నాడు చాలా ముఖ్యం అన్నది సుశాంత్ బలవన్మరణం అన్నది మరోసారి ఎట్టి చూపింది. డిప్రెషన్ లక్షణాలు, గుర్తించడం, ట్రీట్మెంట్ అన్నది ప్రస్తావించడానికి నేను వైద్యుడిని కాదు - ఈ ఆర్టికల్ చదివే మిత్రుల్లో డాక్టర్స్, ప్రత్యేకించి మానసిక వైద్యనిపుణులు ఉంటే తగిన సమాచారం ఇవ్వలసిందిగా అభ్యర్థిస్తున్నాను. మీరందించే సమాచారాన్ని క్రోడీకరించి , నేను దాన్ని మరింతమందికి చేర్చగలను అన్న ఆశతో అభ్యర్థిస్తున్నాను. మనకు సాధారణ డాక్టర్స్ అందుబాటులో ఉన్నంత స్థాయిలో సైకియాట్రిస్ట్ లు అందుబాటులో ఉండరు. (నేను ఇక్కడ ఫీజు గురించి మాట్లాడటం లేదు) ముఖ్యంగా మానసిక ఆరోగ్యాన్ని బాల్యదశ నుండి సమీక్షిస్తూ, మానసికంగా ధృడంగా తయారయ్యేలా విద్యావ్యవస్థలో కూడా మార్పు తీసుకురావాలి అన్నది నా అభిప్రాయం. డిప్రెషన్ కు సంబంధించిన మరింత సాధికారిక సమాచారం తత్సంబంధిత వైద్యనిపుణుల నుండి రావడమే మేలు. సుశాంత్ బలవన్మరణం బాధాకరమైనప్పటికీ, డిప్రెషన్ ను ప్రముఖ చర్చనీయాంశం చేయడం అన్నది భవిష్యత్తులో మరిన్ని ఇటువంటి మరణాలు సంభవించకుండా ఆపగలిగితే మేలు.

Comments

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన